బీజేపీ విస్తరణకు విస్తారక్ లు!
posted on Jan 10, 2023 @ 5:10PM
దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవడం కోసం భారీ కసరత్తే జరుగుతోంది. పార్టీకి మరింతగా బలోపేతం చేయడానికి కొత్త చేరికలకు ఆహ్వానం పలుకుతోంది బీజేపీ పార్టీ ఇందుకోసం పార్టీ విస్తరణ లక్ష్యంగా విస్తారక్ ల నియామకానికి నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాదిలో 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలలో పార్టీ విజయం లక్ష్యంగా తొలుత మూడు నుంచి మూడు వేల ఐదోందల మంది విస్తారక్ లను నియమించాలన్న నిర్ణయం తీసుకుంది.
ఆ తరువాత అవసరమైతే మరింత మందిని నియమించి 2024 ఎన్నికలలో విజయం కోసం బాటలు వేసుకోవాలని భావిస్తోంది. ముందుగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, త్రిపుర, కర్నాటక, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లపై దృష్టిసారించింది. ఈ తొమ్మిది రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీయే. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడం, ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ విస్తరణ పనుల్లో జోరు పెంచేందుకు విస్తారక్ ల నియామకానికి శ్రీకారం చుడుతోంది.
ఈ విస్తారక్ లు నేరుగా పార్టీ కేంద్ర నాయకత్వానికే జవాబుదారీగా ఉంటారు. వీరు వారికి అప్పగించిన నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయి వరకూ చొచ్చుకుని వెళ్లి పార్టీ విస్తరణ, బలోపేతానికి కృషి చేస్తారు. వీరు నేరుగా కేంద్ర నాయకత్వానికే జవాబుదారీ అయినా, స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తారు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి, విజయావకాశాలు, అలాగే స్థానిక నేతల పనితీరుీతితర అంశాలపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదిస్తారు.
అంటే కిందిస్థాయిలో ఏం జరుగుతోంది. పరిస్థితులు ఏమిటీ, పార్టీ పరిస్థితి ఎలా ఉంది. స్థానిక నాయకత్వం బలాబలాలేమిటి? వంటి అన్ని అంశాలూ ఎప్పటికప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళతారన్న మాట. కాగా ఇప్పటికే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో విస్తారక్ ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ విస్తారక్ ల నియామకం జరిగి పోయింది. అలాగే దేశ వ్యాప్తంగా పార్టీ ఒకింత బలహీనంగా ఉందని గుర్తించిన 160 వరకూ ఉన్న నియోజకవర్గాలకు కూడా విస్తారక్ ల నియామకం ఇప్పటికే పూర్తయ్యింది.