చైనాలో ఒక రాష్ట్రం మొత్తం కరోనా బాధితులే?!
posted on Jan 11, 2023 9:27AM
డ్రాగన్ దేశం కరోనా గుప్పిట్లో చిక్కుకుందా? కోట్లాది మంది కరోనా బారిన పడి విలవిలలాడుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తుంది. వ్యాక్సినేషన్, క్యూర్ వంటి వాటిపై శ్రద్ధ పెట్టకుండా జీరో కోవిడ్ విధానాన్ని మాత్రమే నమ్ముకుని పొరపాటు చేసిన చైనా.. ప్రజాగ్రహం కారణంగా అనివార్యంగా కరోనా ఆంక్షలను సడలించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంది.
అంతే కరోనా ఆంక్షలను ఎత్తివేసిన తరువాత ఆ దేశంలో మహమ్మారి విజృంభణ అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ దేశంలో రోజుకు సగటున లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని అంటున్నారు. అయితే కరోనా విజృంభణకు సంబంధించిన వార్తలు బయటకు పొక్కకుండా డ్రాగన్ దేశం గోప్యత పాటిస్తోందన్న విమర్శలూ ప్రపంచ దేశాలలో వెల్లువెత్తుతున్నాయి.
అనధికారిక సమాచారం ప్రకారం చైనాలోని హెనాన్ రాష్ట్ర జనాభాలో 90శాతం మందికి పైగా కరోనా సోకింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 9 కోట్ల మంది మహమ్మారి బాదితులుగా ఉన్నారని చైనా అధికార వర్గాల ద్వారానే లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అదే విధంగా క్రిస్మస్ సమయంలో దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయని తెలుస్తోంది.
కరోనా విజృంభణ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినా, మృత్యుఘంటికలు మోగిస్తున్నా చైనా మాత్రం కరోనా ఆంక్షలు విధించడం లేదు. దీంతో వ్యాధి వ్యాప్తి అదుపులేకుండా పోయింది. ఈ వ్యాప్తి విజృంభణ ఇలాగే కొనసాగితే ప్రపంచం మరో సారి కరోనా ఆంక్షల చట్రంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.