రాహుల్ బీహార్ పర్యటనలో రేవంత్ కు దక్కిన గౌరవం మామూలుగా లేదుగా?!
posted on Aug 27, 2025 8:22AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానికి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, మధ్య దూరం పెరిగిందని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలవడం, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయటా మాట్లాడడం ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలే ప్రచారం చేశాయి.
ఈ కారణంగానే గత కొద్ది కాలంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పట్ల వ్యతిరేకతతో ఉందని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ప్రైవేటు సంభాషణల్లో గట్టిగానే చెప్పారు. కొందరైతే బాహాటంగానే రేవంత్ వ్యతిరేక వ్యఖ్యలు చేశారు. అయితే అవన్నీ వాస్తవాలు కావనడానికి తాజాగా తేటతెల్లమైపోయింది. ఆయనకు అధిష్ఠానం వద్ద పలుకుబడి తగ్గడం అటుంచి అనూహ్యంగా పెరిగిందనడానికి రాహుల్ గాంధీ బీహార్‌లో నిర్వహించిన తాజా ప్రచారంలో తేలింది.
బీహార్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల నుండి ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. రాహుల్, ప్రియాంకలతో రేవంత్ ప్రజార రధాన్ని పంచుకున్నారు. వారిరువురితో కలిసి ఒకే ప్రచార రథంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇదే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడికి, ప్రతిష్టకు, ప్రాధాన్యతకు తిరుగులేని నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషించారు .రేవంత్ నిస్సందేహంగా కాంగ్రెస్ హైకమాండ్ ధృష్టిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నాయకుడని బీహార్ ప్రచారం ద్వారా రుజువైపోయిందని అంటున్నారు.