మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు...రెడ్ అలర్ట్ జారీ
posted on Aug 27, 2025 @ 3:00PM
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం కారణంగా రేపు ఉదయం వరకు ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నాది. మరోవైపు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు.
కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లు రద్దు చేశారు. ఈ మార్గంలో భారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే వరద కారణంగా మూసివేశారు. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. రేపు విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డీఈవో ప్రకటించారు