రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ లోనే మకాం వేశారు. కీలక నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా బీహార్ లో పర్యటిస్తున్నారు. ఓట్ చోర్ అంటూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం బీహార్ పర్యటనలు చేస్తున్నారు. దీంతో బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ గా మారనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ మీడియాలో మాత్రం రాహుల్ చేస్తున్న ఓటు అధికార్ యాత్రకు విస్తృత కవరేజ్ అయితే లభిస్తోంది. అంతే కాదు, విశ్లేషకులు కాంగ్రెస్ కూటమికి బీహార్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సర్వేల ఫలితాలు సైతం అదే చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలో ఐక్యత కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూపంలో రాహుల్ కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ ఇండియా కూటమిలోనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ తరువాత బయటకు వచ్చేసింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో మరోమారు కాంగ్రెస్ కు, రాహుల్ కు వ్యతిరేకంగా గళమెత్తింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ పై విమర్శలు గుప్పించారు. గురువారం (ఆగస్టు 28) ఆయన మీడియా సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ను ఒకే తాను ముక్కలు, పరిస్థితులను చూస్తుంటే ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉందా అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల పొత్తుకు నేషనల్ హెరాల్డ్ కేసుకు ముడిపెట్టారు.
నేషనల్ హెరాల్డ్ కేసు మూతపడిందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. మద్యం కేసులో తాను అన్యాయంగా జైలుకు వెళ్లాననీ.. కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. దీని వెనుక ఏదో మర్మం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు 2 జి, బొగ్గు కుంభకోణం వంటి స్కాంల కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోందన్న అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ రాజీపడటమే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చేస్తున్న ఆందోళన, యాత్రలూ అన్నీ వ్యక్తిగత రక్షణ కోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలకు జాతీయ స్థాయిలో స్పందన లభించడమే కాకుండా, చర్చకు కూడా కారణమౌతున్నాయి. రాహుల్ విమర్శలతో ఎంత కాదనుకున్నా బీజేపీ డిఫెన్స్ లో పడిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాహుల్ దూకుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా కాంగ్రెస్ వెనుక ర్యాలీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లక్ష్యంగా చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇవి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉందా? అన్న చర్చకు తెరలేచింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న ఆప్.. ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా, రాహుల్ టార్గెట్ గా ఎందుకు గళమెత్తుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.