ఉచిత ప్రయాణమే కాదు.. ఆ బస్సుల లైవ్ ట్రాకింగ్ కూడా.. దటీజ్ సీబీఎన్
posted on Aug 26, 2025 @ 3:43PM
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు.. అందుకు సంబంధించిన బస్సుల లైవ్ ట్రాకింగ్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలన్నిటినీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత 15 నెలల వ్యవధిలోనే ఒక్కటొక్కటిగా అమలు చేసి ప్రజల హర్షామోదాలను పొందిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయడంలోనూ అనితర సాధ్యమైన చొరవను, ఆసక్తిని చూపిస్తున్నది.
ఇక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఈ నెల 15 నుంచి అమలులోనికి వచ్చింది. తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఇటువంటి పథకం అమలులో ఉన్నప్పటికీ.. ఆయా రాష్ట్రాలలోలా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం అత్యంత పకడ్డందీగా, ప్రణాళికా బద్ధంగా మొదలైంది. రోజుల వ్యవధిలోనూ ఈ పథకాన్ని ఉపయోగించుకుని కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. మొదటి రోజు గుర్తింపు కార్డుల విషయంలో నెలకొన్న చిన్న గందరగోళం వినా ఈ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. బస్సుల కొరత మాటే వినిపించలేదు. ఓవర్ లోడింగ్, కోట్లాటలు వంటివి కూడా పెద్దగా జరగలేదు.
ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు మందుకు వేసి ఉచిత బస్సుల లైవ్ ట్రాకింగ్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉచిత బస్సు పథకంపై అధికారులతో సమీక్షలో భాగంగా ఆయనీ ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సులన్నినీ టి లైవ్ ట్రాకింగ్ చేయాలనీ, ఇది మహిళల భద్రతకు దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు. అంతే కాదు.. లైవ్ ట్రాకింగ్ మహిళలు ఈ బస్సుల సమయాలను ట్రాక్ చేయడానికి అందుకు అనుగుణంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీలు అవుతుంది.
ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలలో కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా వంద శాతం ఆక్యుపెన్సీ వచ్చిందంటే ఈ పథకం ప్రజాదరణ, ప్రజామోదం పొందిందనడానికి తార్కానంగా చెప్పుకోవచ్చు. అన్నిటి కంటే ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఈ పథకం పై ప్రభుత్వానికి అందిన ఫీడ్ బ్యాక్ ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. వారి అవసరాల నిమిత్తం మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్నారు.