పులివెందులపై జగన్ పట్టు సడలిందా?
నాలుగున్నర దశాబ్దాలకు పైబడి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు పరస్థితి మారుతోందా? జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? పులివెందుల నాయకులు, స్థానిక ప్రజలకు ఆయన దూరం అవుతున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. జగన్ సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఈ దూరం ప్రారంభమైందంటున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా జగన్ పులివెందుల నియోజకవర్గ వాసులతో మమేకమైన పరిస్థితి లేకపోవడం, అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక, కేవలం నియోజకవర్గ ఎమ్మెల్య స్థాయికే పరిమితమైన సమయంలో కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు దగ్గరకావడానికి ఇసుమంతైనా ప్రయత్నించకపోవడంతో జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆ అసంతృప్తే ఇటీవల పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రతిఫలించిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
వాస్తవానికి పులివెందుల ప్రజలతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న కలివిడి తనమే ఆయన, ఆయన కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో రాణించే అవకాశానికి కారణమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లవేళలా పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పులివెందుల నుంచి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించడమే కాకుండా, వారు ఏ పనిమీద వచ్చారో కనుక్కుని ఆ పని చేసి పంపించేవారు. ఆయన పలకరింపు, ఆయన సహాయం చేసే విధానం పులివెందుల వాసులు ఆయననూ, ఆయన కుటుంబాన్నీ గుండెల్లో పెట్టుకునేలా చేసింది. పులివెందుల ప్రజలకు ఆయన పట్ల ప్రజలలో ఉన్న అభిమానమే.. ఆయన తదననంతరం జగన్ ను కూడా అక్కున చేర్చుకునేలా చేసింది. అయితే జగన్ ఆ ఆదరణను నిలుపుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా జనాలకు కూడా దురమయ్యారని స్థానికులే చెబుతున్నారు. ఆ కారణంగానే జగన్ కు పులివెందులలో మునుపటి స్థాయి ఆదరణ, పట్టు కొరవడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైయస్ ఎంపీగా ఉన్నా, ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నా ఆయన అందుబాటులో లేని లోటు కనిపించకుండా సోదరుడు దివంగత వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే వారు. అటువంటి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ పక్కన పెట్టుకోవడం కూడా పులివెందుల ప్రజలు జగన్ కు దూరం కావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారిందంటున్నారు. అలాగే వైఎస్ కుటుంబ విభేదాల కారణంగా కూడా పులివెందుల జనంలో జగన్ పట్ల విముఖతకు కారణంగా చెబుతున్నారు. పులివెందులలో ఇప్పటివరకు జరిగిన జడ్పిటిసి ఎన్నికల విషయానికి వస్తే 1994, 2001, 2007, 2013, 2021 ఎన్నికల్లో గెలిచినా, ఏకగ్రీవం అయినా వై ఎస్ కుటుంబ మద్దతుతో పోటీ చేసిన వారే . అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 1978 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన 14 ఎన్నికల్లో వై ఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. చివరగా 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గత ఎన్నికల మెజారిటీ తగ్గినా మరో సారి జగన్ మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలవడానికి కారణమయ్యాయి. అయితే 2019 ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన పరిణామాలు పులివెందులలో జగన్ పట్టు జారిపోవడానికి కారణం అని చెప్పాల్సి ఉంటుంది.
2019 ఎన్నికల సమయంలో జగన్ కు వైఎస్ కుటుంబం మొత్తం అండగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, బాబాయ్ వివేకానందరెడ్డి.. ఇలా అందరూ అన్ని విధాలుగా ఆయనకు అండగా నిలబడ్డారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కూడా జగన్ కు ప్రజా సానుభూతి వెల్లువెత్తి వైసీపీ ఘన విజయానికి దోహదం చేసింది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ముందు సోదరి, ఆ తరువాత తల్లి ఆయనకు దూరం కావడం, అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం దర్యాప్తులో ఎస్టాబ్లిష్ కావడం, వివేకా కుమార్తె న్యాయపోరాటం ఇవన్నీ జగన్ కు పులివెందులలో బలం తగ్గడానికి కారణాలయ్యాయి.
అలాగే జగన్ హయాంలో నియోజకవర్గంలో కాంట్రాక్టర్లుగా మారి పలు అభివృద్ధి పనులు చేసిన పార్టీ శ్రేణులకు చెందిన కోట్లాది రూపాయల బిల్లులు చెల్లింపునకు నోచుకోకపోవడం వంటి అంశాలు కూడా నియోజకకర్గంలో జగన్ కు ఆదరణ తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కలిసి పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసేలా చేశాయి. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని నియోజకవర్గ ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుంటే.. ఉన్న కొద్దిపాటి పట్టూ జారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.