దావోస్ లో చర్చలు.. ఏపీలో పెట్టుబడులు.. చంద్రబాబు విజన్ కు మరో నిలువెత్తు నిదర్శనం
posted on Aug 26, 2025 @ 4:12PM
ప్రతి అడుగూ ఒక యుద్ధం.. ప్రతి మలుపూ ఒక సంక్షోభం.. ప్రతి యుద్ధం ఒక విజయం.. ప్రతి సంక్షోభం ఒక అవకాశం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితం గురించి చెప్పడానికి ఈ రెండు వాక్యాలు చాలు. ఆయన దూరదృష్టి, రాష్ట్రప్రగతి, ప్రజా సంక్షేమం రెండు కళ్లుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ఆరంభించిన పథకాలు... ఆయన నిర్మిం చిన సైబరాబాద్.. ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి ఇలా ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమైనా భవిష్యత్ తరాలకు కూడా ఒక ఆస్తిగా, ఒక అవకాశాల గనిగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆయన ఈ ఏడాది కూడా దావోస్ లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన అనేక మంది పారిశ్రామిక వేత్తలూ, పెట్టుబడి దారులతో బేటీ అయ్యారు. చర్చలు జరిపారు. ఆ ఫలితాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల రూపంలో కనిపిస్తున్నాయి.
చంద్రబాబు తన దావోస్ పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా సంస్థ మెర్స్క్ సీఈవోతో బేటీ అయ్యారు. ఈ కంపెనీ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు. ఆ చర్చల ఫలితం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకువచ్చింది. ఏపీలో వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతాన్ని మెర్స్క్ లాజిస్టిక్ కార్యకలాపాల నిర్వహణ కోసం పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ధృవీకరించింది.
మెర్స్క్ అనుబంధ సంస్థ అయిన ఏపీఎం టెర్మినల్స్ నుండి ఆగస్టు 25, 2025న ప్రకటించిన బిలియన్ డాలర్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డులో ఆ సంస్థ ఇన్వెస్ట్ చేయనున్న తొమ్మిదివేల కోట్ల రూపాయల పెట్టుబడిలో భాగం. కాగా మెర్క్స్ పెట్టుబడులు రాష్ట్రంలో వర్షించడానికి బీజం.. ఈ ఏడాది జనవరిలో దావోస్ లో చంద్రబాబు, మెర్స్క్ సీఈవీల మధ్య జరిగిన చర్చలలో పడింది. ఇప్పుడు ఏపీలో పెట్టుబడుల ద్వారా ఆ బీజం మొలకెత్తింది.