వరద బాధిత జిల్లాల్లో సిఎం ఏరియల్ సర్వే!
posted on Aug 28, 2025 @ 12:42PM
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 28) ఏరియల్ సర్వే చేయనున్నారు. కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వర్షాలపై తన జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, సహాయక చర్యలను వేగవంతం చేయడంలోనూ ఎటువంటి ఉదాశీనతా ఉండకూడదని స్పష్టం చేశారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో బుధవారం (ఆగస్టు 27) రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు.
విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద భాదిత జిల్లాలకు నియమించేంచిన స్పెషల్ అధికారులు కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గురువారం (ఆగస్టు 28) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలన్నారు.