వరదలో చిక్కుకున్న హాస్టల్ విద్యార్థులు...వర్ష బీభత్సం
posted on Aug 27, 2025 @ 4:28PM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీరుతో పొంగిపొర్లుతున్నాయి.. ఈ క్రమంలోని మెదక్‌లో ఉన్న హాస్టల్లో వరద నీరు భారీగా చేరుకోవడంతో ఆ హాస్టల్లోని 400 మంది విద్యార్థులు తమను రక్షించాలంటూ అధికారులను వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు హాస్టల్కు చేరుకున్నారు.
ఫైర్ బోట్ల ద్వారా 150 మంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు.ఇంకా మిగిలిపోయిన విద్యార్థులని బయటకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు సహాయంతో ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీరుతో జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రజలను పోలీసులు, ఫైర్స్ డిపార్ట్మెంట్ అధికారులు రెస్క్యూ చేసి వారందరినీ రక్షించి బోట్ల ద్వారా సురక్షిత మైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఈ భారీ వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది.
కామారెడ్డి-భిక్కనూర్ మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. పలుచోట్ల రైలు మార్గంపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా హైదరాబాద్-కామారెడ్డి మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.