నదుల అనసంధానం కోసం నిర్మాణాత్మకంగా ముందుకు.. ఆనం రామనారాయణ రెడ్డి
posted on Aug 28, 2025 @ 2:54PM
నదుల అనుసంధానం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం (ఆగస్టు 28) మీడియాతో మాట్లాడిన ఆయన నారాచంద్రబాబునాయుడు గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానంపై కసరత్తు చేస్తున్నారనీ, ఇందు కోసం 84 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు కూడా రూపొందించారనీ తెలిపారు. ఉప్పొంగే నదుల జీవ జలాలు ఉప్పు సముద్రం పాలు కాకూడదన్న మహదాశయంతో చంద్రబాబు ముందుకు సాగుతుంటే.. దానిపై కూడా కొందరు రాజకీయ స్వప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇక నదుల అనుసంధానానికి పొరుగురాష్ట్రాల సమ్మతి పొందే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం వివరించారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే రాయలసీమ ప్రాంతానికి రెండో పంటకు కూడా నీరందించగలమని ఆనం అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయన్న ఆనం రామనారాయణ రెడ్డి.. గత ప్రభుత్వం కేవలం 400 కోట్ల రూపాయలు వ్యయం చేయలేక హంద్రీనీవా ప్రాజెక్టును పక్కన పడేసిందని విమర్శించారు. ఆ పనిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేసిందన్నారు.
సోమశిలకి ఎగువ ప్రాంతాల నుంచి 18750 క్యూసెక్కుల నీరు వస్తోందనీ, ప్రస్తుతం సోమశిల, కండలేరులో 150 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామనీ చెప్పారు. సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్ధ్యం 12వేల క్యూసెక్కుల నుంచి 24వేలకి పెంచుతామన్న జగన్ ఆయన హయాంలో ఆలోచన లేకుండా కమిషన్ల కోసం టెండర్లు పిలిచారనీ, వారు పనులు మధ్యలోనే ఆపేసిపోయారు పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు సోమశిల హైలెవెల్ కెనాల్ కోసం నిధులు ఇచ్చారన్నారు.
అలాగే జిల్లాలో 40 పంవాయతీ భవనాల నిర్మాణానికి రూ.12.8కోట్లు, గ్రామాల్లో రోడ్ల కోసం రూ.50కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం, తమ పార్టీ పంచాయతీల నిధులన్నీ మళ్లించింది. ఇప్పుడు కూడా మేము నిధులు ఇస్తామంటే ఒక మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసి రావడం లేదన్న ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలలో ఉన్నవాడిగా తనకు విషయాలూ తెలుసునన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదన్న ఆయన కలిసిరాకుండా నష్టం వాళ్లకేనన్నారు.