హమ్ తుమ్ ఏక్.. కమలంమే.. బంధ్ హే!
posted on Aug 28, 2025 @ 4:44PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. దీంతో ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా వీరిద్దరు తెలంగాణ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా ఉన్నా విషయం తెలిసిందే.
ఈ లెక్కన బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధం ఎట్టకేలకు ఉన్నట్టే ఎస్టాబ్లిష్ అయ్యిందా!? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేననే బీజేపీ నేత బండి సంజయ్, బీజేపీ కాంగ్రెస్ ఒకటేననే కేటీఆర్.. కామెంట్ల వర్షం అంతా తుస్సేనా? ఈ ఇద్దరు ఎదురు పడ్డప్పుడు ఇలాంటి సన్నివేశం కనీసం ఊహించలేక పోయారు చాలా మంది. ఇంత సరదాగా ఒకరికొకరు పలకరించుకుని నవ్వుకోవడం ఏంటి? దీన్నెలా అర్ధం చేసుకోవాలి? చాలా మందికి అంతు చిక్కని ఫజిల్లా మారింది.
గతంలో ఇదే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే అంశం మీద సీఎం రమేష్ అన్న మాటలకు ఇది తార్కాణమా? బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసుల నుంచి తప్పించుకోడానికి బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేస్తారన్న మాట నిజమవుతుందనుకోవాలా? అని చూస్తే.. అంత వరకూ వస్తుందో రాదో తెలీదు కానీ కొంత వరకూ అయితే... ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగారు కేటీఆర్. అదెలాంటిదంటే, తమకు కేంద్ర బీజేపీ నాయకత్వం అండ పుష్కలంగా ఉంది. మీ కేసులు, కమిషన్ల బెదిరింపులకు భయపడం అన్న కోణంలో కొంత కేటీఆర్ ఈ దృశ్యం ద్వారా చెప్పాలని చూసినట్టుగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. మొన్నటికి మొన్న జగన్ ఎదురు పడ్డప్పుడు ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఎంతో సరదాగా పలకరించారు. జగన్ పై తాను చాకిరేవు పెట్టి ఉతికి ఆరేసినదేదీ ఆయన పెద్దగా తీస్కోలేదు. ఇద్దరు కూడా రాజకీయాల్లో ఇవన్నీ సర్వ సాధారణం అన్న కోణంలో చేతులు కలుపుకుని వెళ్లిపోయారు.
ఆ మాటకొస్తే అసెంబ్లీ లోపల గల్లా పట్టుకుని కొట్టుకుంటారేమో అన్న కోణంలో కనిపించే- అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు బయట కలసి జోకులేసుకుని హ్యాపీగా మాట్లాడుకుని వెళ్లిపోతుంటారు. అచ్చం సినిమా హీరోల్లా.. ఇక్కడ జనమే వారి పేరు చేప్పుకుని వీరు- వీరి పేరు చెప్పుకుని వారు తన్నుకులాడుకుంటారు. కానీ వాళ్లు వాళ్లు లోపల అలాయ్ బలాయే.
రాజాసింగ్ కిషన్ రెడ్డి మీద చేసిన మెయిన్ కామెంట్ ఇదేగా? ఎవరు పవర్ లో ఉంటే కిషన్ వారితో కుమ్మక్కయ్యి కావల్సిన పనులు చేసుకుంటాడని. అలాంటి కామెంట్ చేసిన రాజాసింగ్ ప్రెజంట్ బయట ఉన్నారు. అదే కిషన్ తాను పార్టీలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. అదే ఏదైనా ఆల్ పార్టీ మీటింగుల్లాంటివి పెట్టినపుడు మాత్రం.. తనకు టైమే లేదన్నట్టు బిల్డప్ ఇచ్చి ఆపై బయట జనానికి తానొక నిఖార్జైన కమలం పార్టీ నాయకుడన్న కలరింగ్ ఇస్తుంటారని అంటారు రాజాసింగ్.
ప్రస్తుతం బండి- కేటీఆర్ కలయిక అనే ఈ దృశ్యంలో స్పష్టంగా ఆ ఫేసుల్లో తొణికిసలాడిన ప్రేమాభిమానాలను బేరీజు వేస్తే.. ఒకరిపట్ల మరొకరికి ఉండాల్సిన దానికన్నా మించి ఏదో ఉంది అన్న ఇంటిమసీ అయితే బాగా కనిపిస్తోందని అంటున్నారు కొందరు. మరి చూడాలి దీనిపై కాంగ్రెస్ లీడర్ల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.