రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహం తొలగింపు
posted on Aug 28, 2025 @ 2:30PM
హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి. వాడవాడలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. అలాగే మండపాలలో ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమలు వినూత్నత, సృజన ఉట్టిపడేలా ఉంటాయి. భిన్న రూపాలలలో సమాకాలీన అంశాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే హైదరాబాద్ హబీబ్ నగర్ లో కాంగ్రెస్ నేత, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్.. తమ పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్ఫురింప చేసేలా ప్యాంటు, షర్టు ధరించిన గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ముఖ్యమంత్రి రూపాన్ని స్ఫురింపచేసేలా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వివాదాస్పదంగా మారింది. విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా మండపాన్ని సైతం తెలంగాణ రైజింగ్ అనే హోర్టింగ్ లతో ఏర్పాటు చేశారు. ఇలా ఏకంగా సిఎం రేవంత్ రెడ్డిని వినాయకుడి రూపంలో మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానం ఉండాలే కానీ అది హద్దులు దాటకూడదు, హీరోలు, రాజకీయ నాయకుల రూపాలలో గణేష్ ప్రతిమలు చేయడం సరికాదంటూ పలువురు అభ్యంతరం చెప్పారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్ రూపాన్ని స్ఫురింప చేసేలా వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం తగదంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన ఫిర్యాదు మేరకు హబీబ్ నగర్ లో ఏర్పాటు చేసిన మండపం వద్దకు బుధవారం (ఆగస్టు 27) వెళ్లి పరిశీలించిన సౌత్ జోన్ డిసిపి రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుని విగ్రహం ఉండడం చూసి, వెంటనే మండపం ఏర్పాటు చేసిన ఫిషిరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిలిపించి భక్తుల మనోభావాలు దెబ్బతీయ వద్దనీ, వెంటనే విగ్రహం మార్చా లంటూ పోలీసులు సూచించారు. దీంతో నిర్వాహ కులు రేవంత్ రెడ్డి రూపం లో ఉన్న విగ్రహం మార్చి మరో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు.