సివిల్స్ ప్రహసనంలో దాగిన డెవిల్స్!
డా.ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
కుడుము చేతికిస్తే చాలు అదే పండగనుకొనేవాడు అల్పసంతోషి! ఆరంభశూరత్వానికి ఆంధ్రుడు ఎంతపేరు మోశాడో, అల్పసంతోషానికి కూడా అంతగా అలవాటు పడిపోయాడు. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఐ.ఎ.ఎస్. సిబ్బంది రిక్రూట్ మెంట్ కోసం అఖిలభారత స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ అవసరమైన ఉన్నతస్థాయి సబార్డినేట్ స్థాయి శాఖలకు నిర్వహించే పరీక్షలు రాయగోరే అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ భాషలలోనే రాయాలన్న నిబంధనను "ప్రస్తుతానికి నిలుపు చేసినట్టు'' ఒక వార్త [16-03-2013] వెలువడింది. గడచిన నలభైఏళ్ళుగా ఈ 'రూలు'తోనే హిందీమినహా రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్ లోని 17 ప్రాంతీయభాషల అభ్యర్థుల నోళ్ళకు 'సీళ్ళు' వేసేశారు! భారతదేశంలోని చట్టాలముందు పౌరులంతా సమానులేననీ, ఈ చట్టాల కింద అందరికీ సరిసమాన రక్షణ ఉంటుందనీ, ప్రభుత్వ ఉద్యోగ సద్యోగాలలో సర్వులకూ సమానావకాశాలుంటాయనీ హామీపడిన రాజ్యాంగంలోని 14-16 అధికరణలకు విరుద్ధంగా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహణకు, ఉద్యోగాల్లో అభ్యర్థుల నియామకాలకు బాధ్యత వహించవలసిన స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి.) వ్యవహరిస్తూవచ్చింది. దీని పర్యవసానంగా దక్షిణాది రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కేంద్ర-రాష్ట్ర సర్వీసులకు లక్షలసంఖలోనే ఉద్యోగార్హులుకాగల అవకాశమున్న యువకులు ప్రాంతీయ భాషలయిన మాతృభాషలకు దూరంకావలసివచ్చి ఉపాధి కోల్పోయారు!
40 ఏళ్ళుగా రాష్ట్రప్రభుత్వాలు స్థానిక భాషలలో కేంద్ర సర్వీసులకు పరీక్షలను (ప్రిలిమ్స్/మెయిన్) నిర్వహించే విషయాన్ని పట్టించుకోకుండా "గుడ్లు అప్పగించి'' చూస్తూ ఉన్నందున ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2011 వరకూ సుమారు 4 లక్షలమంది యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అంచనా! ఇప్పటికైనా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పాక్షిక విధానాన్ని కేంద్రమూ, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ శాశ్వతంగా నిరోధించి, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషలలో కూడా సివిల్ సర్వీసు పరీక్షలను, ఇంటర్వ్యూలనూ, నియామకాలనూ నిర్వహించకపోతే జాతీయ సమైక్యతా భావనను సంరక్షించడం ఉత్తరోత్తరా సాధ్యపడకపోవచ్చు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తోందంటే, దక్షిణాది రాష్ట్రాలు సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు (బీహార్ వగైరా) కూడా ఎస్.ఎస్.సి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమించడంవల్ల 05-03-2013 నాటి సివిల్స్ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా ("ప్రస్తుతానికి'') నిలిపి ఉంచారుగాని, దాని ఉపసంహరణ మాత్రం జరగలేదని గుర్తుంచుకోవాలి.
ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ జరిగి, యావద్భారతంలోనూ రాజ్యాంగం హామీపడిన ప్రాంతీయ భాషలలో కూడా యూనియన్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ లు నిర్వహించే పరీక్షలను రాయడానికి అభ్యర్థులకు అధికారికమైన ఏర్పాట్లు జరిగేదాకా యువకులు విశ్రమించరాదు. ఎందుకంటే, ఇప్పటికీ, నోటిఫికేషన్ కేవలం "తాత్కాలిక నిల్పివేత'' [నోటిఫికేషన్ పుటాన్ హోల్డ్] జరిగిన తరువాత కూడా "సామర్థ్యం'' పేరిట, "సంభాషణా నైపుణ్యా''ల పేరిట, "అవగాహనశక్తి'' పేరిట, "గ్రహ్యశక్తి''. "సంక్షిప్తీకరణ యోగ్యతా'' వగైరాల పేరిట ప్రాంతీయ భాషలను అవమానపరిచే ప్రయత్నం కొందరు ఉన్నతాధికారులు మానుకోలేకుండా ఉన్నారు! ఉదాహరణకు నోటిఫికేషన్ "తాత్కాలిక నిలుపుదల'' వార్త వచ్చిన మరునాడే [17-03-2013] యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ పూర్వాద్యక్షుడు అరుణ్ నిగావేకర్ ఓ విచిత్రమైన "కప్పదాటు'' ప్రకటనతో ముందుకొచ్చాడు. సర్వీస్ కమీషన్ పరీక్షలను, ఇంటర్వ్యూలనూ కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే నిర్వహించాలన్న నోటిఫికేషన్ జారీ చేయడానికి సిఫారసు చేసిన "నిపుణుల కమిటీకి'' ఇంతకుముందు సారథ్యం వహించిన వ్యక్తి ఈ నిగావేకరే!
నిజానికి ఇతర ప్రాంతీయ భాషలలో పరీక్షలను, ఇంటర్వ్యూలను నిరోదిస్తున్న నిరంకుశ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ - వేళ కాదు ఎనిమిదేళ్ళ క్రితమే క్రితమే [2004లో] సోదర ప్రముఖ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త సుభాష్ చంద్రన్, నేనూ ఆందోళన లేవనెత్తాం. సుభాష్ చంద్రన్ సర్వీస్ కమీషన్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టులో కీలకమైన రిట్ వేయగా [రిట్ నెం డబ్యు.పి.11000/2004] నేను దానికి దన్నుగా రచనాపరంగా ఆందోళన చేపట్టాను. రిట్ ను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కూ నోటీసులు జారీ చేయడమూ తరువాత పరీక్షలు, ఇంటర్వ్యూలను తెలుగు సహా దక్షిణాది ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న కోర్కెలోని సామంజస్యాన్ని సమర్థించడమూ జరిగింది. దానితో చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూచే సర్వీస్ కమీషన్ సంచాలకుడు మన రాష్ట్ర హైకోర్టుకు లేఖరాస్తూ "పిటీషనర్ల డిమాండ్ మేరకు రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ప్రాంతీయ భాషలలో దేనిలోనైనా సరే అభ్యర్థులు సమాధాన పత్రాలు రాయడానికి ప్రభుత్వం ఇప్పుడు సమ్మతించింద''ని తెలిపాడు!
అయినా సరే "కుక్కతోక వంకర'' అన్నట్టుగానే ప్రాంతీయ (మాతృ) భాషలలో సర్వీస్ కమీషన్ ప్రిలిమ్స్, మెయిన్ తుది పరీక్షలు రాయకుండా అభ్యర్థులను నిరోధిస్తూ సర్వీస్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ఈసారి కూడా జారీ చేసిందంటే పాలనా నియంత్రణ వ్యవస్థ ఎలా పతనోన్ముఖంగా ప్రయాణిస్తోందో అర్థమవుతుంది. ఇంతకుముందొకసారి సుప్రీంకోర్టు సహితం [రాధేశ్యామ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు] ఇలాంటి నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమనీ, జోనల్ పద్ధతిపైన విడివిడిగా పరీక్షలు నిర్వహించడం "సమానత్వ సూత్రానికే విరుద్ధమ''నీ సర్వీస్ కమీషన్ లాంటి అఖిలభారత స్థాయి సంస్థలకు రిక్యూట్ మెంట్ పరీక్షలను ఏకకాలంలో దేశమంతటా ఒకేసారి నిర్వహించాలనీ ఆదేశించిందని మరవరాదు. కానీ నిగావేకర్ తన కమిటీ సిఫారసును పరోక్షంగా సమర్ధించుకోడానికి 'రూటు'మార్చి ఒక ప్రకటనలో "ఫలానా భాషలోనే సివిల్స్ పరీక్షలను నిర్వహించాలని కమిటీ నొక్కి చెప్పలేద''ని అంటూనే మరొక మెలిక పెట్టాడు : "అభ్యర్థులు సంభాషణా సామర్థ్యాల్ని (కమ్యూనికేషన్ స్కిల్స్) పరీక్షించి మరీ నిర్ణయం చేయాల''ని మాత్రమే కమిటీ కోరిందని చెప్పాడు! కాని ఆ వెంటనే మరొక ఉన్నతాధికారేమో "కమిటీ పరిశీలనకు నివేదించిన అంశాలలో భాషా సమస్యే లేద''ని 'కథ' వినిపించడానికి ప్రయత్నించాడు!
అయినప్పుడు మెడమీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికీ వెంటనే స్ఫురించే ప్రశ్న : "అయితే మరి ఇంతకూ ప్రాంతీయ భాషలలో పరీక్షలను అడ్డుకుని సివిల్స్ ను కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే రాయాలన్న నిబంధనను చేర్చిందెవరు? లేదా 'రూల్స్'ను మార్చిందెవరు?'' అని! దేశ స్వాతంత్ర్యం అప్పనంగా అర్థరాత్రి పూట చేతికి బదిలీ అయినట్టే, పాలకులు, అధికారగణం బుద్ధులు కూడా వలసపాలనా వశేషంగా అప్పనంగా సంక్రమించాయి! దాని ఫలితమే నేటి సర్వవ్యాపిత సంక్షోభంలో భాగంగా "చుట్టుచూపు లేని'' విద్యలు, విద్యావిదానాలూ ఏలినాటి శనిగా, ఎలేనాటి శనిగా పీడించడం! సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్ తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశారనడానికి మరొక ఉదాహరణ - ఆ యు.జి.సి. మాజీ చైర్మన్ నిగావేకర్ "ప్రపంచీకరణ'' నేపథ్యంలో మాట్లాడుతూ "21వ శతాబ్దపు సివిల్ సర్వెంటు (ఉన్నతాధికారి, అంటే ఇంగ్లీషు చదవరి) వర్తమాన ప్రపంచంనుంచి ఎదురయ్యే అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన లక్షణాలు, అర్హతలూ కలిగి ఉండాల''ని ఒక షరతును ముందుకు నెట్టడం! అంటే, మరొక మాటలో, మాతృభాష లేదా 'ప్రాంతీయ భాష నీకు బువ్వపెట్టదు, ఉద్యోగమివ్వదు, కాబట్టి ఇంగ్లీషో, హిందీయో రాకపోతే అసలు నీకు బతుకే లేదు' పొమ్మని చెప్పడమే!
నిజానికి, ఏ సమాచార సాంకేతిక వ్యవస్థ ఆధారంగా ఐ.టి.రంగం దండిగా బువ్వపెడుతుందని, రెండు చేతులూ రెండు జేబులూ కాసులు నింపుతుందని భ్రమింపజేసి అమెరికా పాలకులు తమ బాడుగుపనులను (ప్రోగ్రామింగ్ వగైరా) మనకు అప్పగించారో ఆ పనులను కాస్తా అమెరికాలో తామెదుర్కొంటున్నతీవ్ర నిరుద్యోగ పరిష్కారంలో భాగంగా రేపో మాపో నిలిపివేయక తప్పదని ప్రెసిడెంట్ ఒబామా యిప్పటికీ పదే పదే బెదిరిస్తున్నాడు! పైగా శృతిమించిన ఐ.టి. మోజులో పడిపోయిన మన పాలకులు, బ్యూరోక్రాట్లు దేశంలో భారీ ఎత్తున కోట్లాదిమందికి ఉపాధిని కల్పించగల వ్యవసాయక, వస్తూత్పత్తి (మాన్యుఫాక్చరింగ్), లఘుపరిశ్రమల రంగాలను 'మాడ' బెట్టారు! ఇప్పుడు మన దేశ పరిస్థితి - "తల్లినీతండ్రినీ చంపి వచ్చి అయ్యా నేను తల్లీతండ్రీ లేనివాడిని, ఆదుకోండ''ని మొట్టుకున్నట్టు అయింది! స్థానిక పాలనా సంస్థలు, గ్రామస్థాయి వరకూ సామాన్య ప్రజల అవసరాలు, వారి అవసరాలను గురించి తెలుసుకోడానికి ఉపయోగించాల్సిన సంభాషణా మాధ్యమం ఏది, ప్రజాసమస్యల పరిష్కారంలో ఏ భాషా మాధ్యమం ద్వారా ప్రజాబాహుళ్యాన్ని సమీకరించాలన్న ప్రశ్నలే, ఆచార్య నిగావేకర్ లాంటి "వేతనకర్మ''లకు అనవసరం!
పైగా "నేడు వీస్తున్న పరివర్తనా వాయువులకు అనుగుణంగా'', అంటే, "ప్రపంచభాష అయిన ఇంగ్లీషు భాషకు కిటికీలను బాహాటంగా తెరిచి ఉంచాల''నీ, నేడు "ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయి, ఇంగ్లీషే చలామణీలో ఉన్న ఈనాటి కరెన్సీ'' అనీ, అదే వెలుగూ, జిలుగూ, అదే కాంతీ, అదే ధ్వనీ (లైట్ అండ్ సౌండ్) అనీ నిగావేకర్ పూనకం పూనారు! ఈ సందర్భంగా ఆయన మరొక అబద్ధాన్ని కూడా వ్యాపింప చేయడానికి వెనుకాడలేదు: "అన్ని వైపులనుంచి శుభ్రపవనాలను-ఆరోగ్యకర గాలుల్ని-వీచనివ్వండి'' అని గాంధీజీ మతమౌఢ్యంతో తీసుకుంటున్నవారికి హెచ్చరికగా వాడిన మాటల్ని వక్రీకరించుతూ "గాంధీజీ కోరుకున్నది ఈ మార్పునే''నని భాషాపరంగా వర్తింప చేయడానికి నిగావేకర్ ప్రయత్నించాడు! కాని, ఇంగ్లీషు భాషా బోధనా గురించి, మాతృభాషలను పణంగా పెట్టి దానిని పెంచాలన్న దేశీయ ఆంగ్ల విద్యాధికుల ప్రయత్నాలను గాంధీజీ వ్యతిరేకిస్తూ ఎలా హెచ్చరించవలసి వచ్చిందో ఈ క్రింది గాంధీజీ మాటల్లోనే నిగావేకర్ వినడం మంచిది:
"భారతీయ విద్యార్థులు ఒక విదేశీభాషను (ఇంగ్లీషును) పాఠశాల తరగతుల్లో నేర్చుకోడానికి వారానికి ఏడుగంటల శ్రమను వృధా చేసుకుంటున్నారు. ఈ దేశానాయకులు పవిత్రమైన ప్రజల విశ్వాసాన్ని కాస్తా వమ్ము చేస్తున్నారు. ఒక భాషగా నేర్చుకోడానికి ఇంగ్లీషు పట్ల నాకు వ్యతిరేకత లేదు. కానీ దేశీయ మాతృభాషలను చంపి వాటి సమాధిపైన ఇంగ్లీషుభాషను మీరు రుద్ద దలిచితే 'స్వదీషీ'భావాన్ని మీరు సరైన అర్థంలో అనుసరించడం లేదని నేను స్పష్టం చేయదలచాను. ఏ దేశమూ తన సొంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేదు. వీరికి ఎంతసేపూ ఇంగ్లీషు విద్యావ్యాప్తిని గురించిన గొడవే. కాని మనం అసలు సమస్యను మరచిపోరాదు - గత అనేక దశాబ్దాల కొలదీ మన తల్లిభాషలోనే మనం విద్య పొందుతూ [ఇంగ్లీషు ఒక భాషగా నేర్చుకోడానికి అవకాశం కల్పిస్తూనే] వస్తున్నామే అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? మనకీపాటికే స్వేచ్చాభారతం ఏర్పడి, మన సొంత విద్యావంతులు మనకు తయారై ఉండేవారు. అప్పుడు తమ సొంత నేలపైన తామే విదేశీయులుగా గడపాల్సిన పని మనకి ఉండేది కాదు; అలా సొంత భాషను గుండెగొంతుకలో పలికించడం ద్వారా నిరుపేదల మధ్యకు చొరబడి బాగా పనిచేయగలిగి ఉండేవారు.
ఆ అనుభవం జాతి భద్రపరచుకోదగిన వారసత్వ సంపదై ఉండేది. కాని ఈ రోజున మనం పరాయిభాషకు అలవాటు పడినందున, మన మంచి భావాలను చివరికి మన భార్యలు కూడా పంచుకోగల స్థితిలో లేరు! అంతేగాదు, మన విద్యాధిక వర్గమంతా విదేశీ (ఇంగ్లీషు) భాష ద్వారానే విద్యావంతులయినందున దేశ ప్రజాబాహుళ్యం సమస్యలపైనగాని, వారి కోర్కెల గురించిగానీ మనలో స్పందన లేకుండా పోయింది. ఎందుకని? మన ప్రజాబాహుళ్యం ఇంగ్లీషు ఆఫీసర్లను గుర్తించిన దానికన్నా మించి మనల్ని గుర్తించడంలేదు గనుక ఫలితం? అటు ఇంగ్లీషు నేర్చిన అధికారులతోనూ, ఇటు మనతోనూ కూడా ప్రజలు మనసువిప్పి మాట్లాడలేకపోతున్నారు. కనుకనే ప్రజల అవసరాలు, కోరికలు మనవి కాకుండా పోయాయి. అన్ని రకాల విజ్ఞాన శాఖలలోనూ మాతృభాషలోనే బోధనా జరిగి ఉంటే ఈ సరికి ఆ శాఖలన్నీ అద్భుతంగా పరిపుష్టమై ఉండేవి. ఆ పనే జరిగి ఉంటే, గ్రామ పంచాయితీలు తమ ప్రత్యేక పద్ధతుల్లో నేడు సజీవశక్తులుగా మనగల్గుతూ ఉండేవి; అదే జరిగి ఉంటే, భారతదేశం స్థానిక అవసరాలకు తగినట్టుగా స్వపరిపాలనా దిశలో, సౌభాగ్యదశలో ఉండేది; అదే జరిగి ఉంటే, తన పవిత్ర భూమిపైన పనిగట్టుకుని మాతృభాషల హత్య అనే అవమానకరమైన దృశ్యాన్ని చూడకుండా దేశప్రజలు తప్పించుకొగలిగేవారు. నాకు ఇంగ్లీషుపైన ద్వేషంలేదు. కాని నాబాధల్లా మాతృభాషల స్థానాన్ని తాను ఎన్నటికీ పొందలేని ఇంగ్లీషుకు అవసరాలకు మించిన ప్రాధాన్యం యివ్వడానికి చేసే ప్రయత్నం గురించే. మాతృభాషలను విస్మరించితే దేశాన్ని భాషా దారిద్ర్యం ఏలడం ఖాయం!''
అంతేగాదు, నిగావేకర్ మరొక అబద్ధాన్ని కూడా ప్రచారంలో పెట్టడానికి సాహసిస్తున్నాడు : "ఒక దశాబ్దం కిందటి దాకా చైనా, జపాన్ లు కూడా ఇంగ్లీషుపైన కేంద్రీకరించకుండానే అభివృద్ధిని సాధించాయ''ని ఒప్పుకుంటూనే ఆయన "ప్రపంచపోటీని తట్టుకోడానికి'' ఇంగ్లీషు భాషను ఒక సాధనంగా గుర్తిస్తున్నాయ''ని ఒక 'టూమ్రీ' వదిలాడు! కాని ఈ రోజుకీ ఆ రెండు దేశాలూ ఇంగ్లీషును కేవలం వాణిజ్యభాషగానే వినియోగించుకుంటున్నాయనిగాని పాఠశాల దశలనుంచి పట్టభద్ర, పట్టభద్రానంతర దశలవరకూ చైనీస్, జాపనీస్ భాషలలోనే విద్యాబోధ జరుగుతోందని ఈ పెద్దమనిషి మరచిపోకూడదు.
రేపో మాపో చైనా, ప్రపంచంలోకెల్లా ఆర్థికరంగంలో ఇప్పటికి ప్రథమస్థానంలో అగ్రేసరశక్తిగా ఉన్న అమెరికాను తోసిరాజనబోతోందని అమెరికన్ ఆర్థిక నిపుణులు, అమెరికా, బ్రిటన్, జర్మనీ పాలకులే ప్రకటిస్తున్నారు. అందుకు తగినట్టుగానే రేపటి వాణిజ్యభాషగా చైనీస్ భాష దూసుకు వస్తున్నందున, ఈ మూడు అగ్రరాజ్యాలూ తమ దేశాలలో వందలాదిగా చైనీస్ భాషాధ్యయన పాఠశాలలు ఎందుకు తెరవవలసి వచ్చిందో నిగావేకర్ వివరిస్తే బావుంటుంది! దూసుకువస్తున్న రేపటి చైనీస్ భాషను కూడా ఇంగ్లీషులాంటి వాణిజ్య భాష మాత్రమే కాగల్గుతుందిగాని దేశీయ మాతృభాషల స్థానాన్ని తోసిపుచ్చజాలదు!
అంతేగాదు, ఇంగ్లీషుభాష మాత్రమే ఉపాధి అవకాశాలు పెంచగలదన్న భ్రమలో పడిన నిగావేకర్ లాంటి విద్యాధికులు అమెరికా, బ్రిటన్ లాంటి "అభివృద్ధి'' చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో అక్కడి పాలనా, బోధనా భాషగా శతాబ్దాల తరబడిగా ఉన్న ఇంగ్లీషు, ఆ దేశాలలో రోజుకొక తీరుగా రెండు అంకెల జోడుగుర్రాలపైన పరుగెత్తుతున్న నిరుద్యోగ సమస్యను (10 నుంచి 11 శాతం దాకా) ఎందుకు పరిష్కరించలేక పోతున్నాయో కూడా నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి; పెట్టుబదీదారీ విధానాలవల్ల ముమ్మరించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ దేశాల ఆర్థిక సంక్షోభంలో పెట్టుబడి వ్యవస్థకు మూలవిరాట్టుగా ఉన్న వాల్ స్ట్రీట్ గుత్తవ్యాపార వానిజ్యపు ఆయువుపట్టును నొక్కడానికి "ఆక్యుపై ది సిస్టమ్'' అన్న (వ్యవస్థా మార్పుకోసం ఆక్రమణోద్యమం) నినాదంతో విద్యాధికులయిన నిరుద్యోగాలు ఎందుకు ప్రయత్నించవలసి వచ్చిందో నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి!
కాని అమెరికా ఆర్థిక విశ్లేషకులలో ప్రసిద్దుడయిన ప్రొఫెసర్ మైఖేల్ యేట్స్ తాజా అంచనాల ప్రకారం, 2009-2011 మధ్యకాలంలో అమెరికా జాతీయోద్యమంలో 88 శాతం కార్పోరేట్ గుత్తసంస్థల లాభాల కింద స్వాహా అయింది; కాగా కేవలం 1 శాతం ఆదాయం మాత్రమే ఉద్యోగవర్గాల వేతనం కింద జమ అయింది! వ్యక్తిగత ఆదాయాల్లో మొత్తం ఆదాయ పెరుగుదలలో 93 శాతం ఆదాయం జనాభాలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్న అమెరికన్ల హక్కుభుక్తమై పోయింది! అమెరికా విధాన నిర్ణయాలలో కీలకపాత్ర వహించే అమెరికన్ గూఢచారి సంస్థ (సి.ఐ.ఎ) నిర్వహిస్తున్న "వరల్డ్ ఫేస్ బుక్'' అంచనా ప్రకారం నేడు ఇంగ్లీషు ప్రపంచభాషా కేంద్రంలో ఒకటైన అమెరికాలో ప్రబలిపోయిన ఆర్థిక అసమానతలు ఏస్థాయికి వెళ్ళాయంటే చిన్నదేశాలయిన ఐవరీకోస్టు, కామెరూన్ దేశాలకన్నా అమెరికాను వెనకపడేశాయి, ఇక అసమానతలలో ఉగాండాకన్నా అమెరికా ఓ మెట్టు కొంచెం పైస్థాయిలో మాత్రమే ఉంది! ఇక ఇంగ్లీషుకు శిష్టాది గురువుగా భావించుకుంటున్న అదే అమెరికాలో 2001 తర్వాత ఈరోజు దాకా మొత్తం ఉద్యోగాల సంఖ్యా పెరగనేలేదు. 16-50 సంవత్సరాల మధ్య వయస్సుగల ప్రతి ఒక్క వయోవిభాగంలోనూ ఉపాధి పొందినవారి సంఖ్య "సముద్రంలో నీటిబొట్టు''తో సమానమని నిపుణుల అంచనా! విచిత్రమేమంటే, ఈ ఆంగ్లభాషా కేంద్రం (అమెరికా)లో కార్పోరేట్ రంగం చెల్లించవలసిన పెన్షన్ ల విషయంలో అనుసరిస్తున్న దోపిడీ పద్ధతుల మూలంగా వృద్ధాప్యంలో ఉన్న కార్మికులు మాత్రమే ఎక్కువ శ్రమించవలసి రావటం! ఇక 16-29 సంవత్సరాల మధ్యవయస్సులో ఉన్న యువతకు ఉపాధి బాగా దూరమైపోయింది! కళాశాలల నుంచి వచ్చే పట్టబద్రులలో మెజారిటీ నిరుద్యోగులుగా ఉండిపోవలసివస్తోంది, లేదా డిగ్రీ అవసరంలేని పనులకయినా ఎగబడాల్సి వస్తోందని అంచనా!
[2011 డిసెంబర్ 15: అసోసియేటెడ్ ప్రెస్]! ఆంగ్లభాషా కేంద్రమైన అదే అమెరికాలో కళాశాలల పట్టభద్రులు అసంఖ్యాకంగా ఉపాధి దొరకక తిరిగి ఇళ్ళదారి పడుతూండటం మరొక విశేషం! అతి చిన్న దేశాలయినా, అమెరికానుంచి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను 50 ఏళ్ళకుపైగా ఎదుర్కొంటున్న క్యూబా, వెనిజులాల్లో విద్య, వైద్య, ఉపాధిరంగాలను ఎంతటి సామర్థ్యంతో నిర్వహించుకుంటూ ప్రపంచప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారో మన పాలకులు, బ్యూరోక్రాట్లూ తెలుసుకోవటం శ్రేయస్కరం! తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుడుతూనే ఉందట, తెలుకొండిలాంటి నిరంకుశాధికారవర్గం కనుసన్నల్లో జరిగే తంతు కూడా అంతే! నోటిఫికేషన్ "నిలుపుదల'' ఉపసంహరణ కాదు, స్పష్టమైన జీ.వో. విడుదలయ్యేదాకా అల్పసంతోషం అల్పాయుర్థాయం లాంటిది! ఇంతవరకూ కేంద్రప్రభుత్వంగాని యు.పి.ఎస్.సి.గానీ జీ.వో. విడుదల చేసినట్టు వార్తలేదు, నోటి ప్రకటనలు తప్ప!