బయ్యారం గనుల కేటాయింపుపై టి.ఆర్.ఎస్. గరం గరం

 

బయ్యారం గనులలోని ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టి.ఆర్.ఎస్. నేతలు హరీష్ రావు, టి.ఆర్.ఎస్.ఎల్పీ నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సబ్యుడు వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విభేదించగా లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ స్వాగతిస్తున్నారు. గనుల కేటాయింపుపై మాట్లాడుతూ హరీష్ రావు ... విశాఖ స్టీల్స్ కు తెలంగాణాలోని గనులు అప్పగిస్తే తెలంగాణాకు ఎలాంటి లాభం చేకూరుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బొకారో స్టీల్ ఫ్యాక్టరీ లాంటి భారీ ఫ్యాక్టరీ బయ్యారంలో స్థాపించి లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది తెలంగాణా యువతకు ఉద్యోగాలు కల్పించారో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. టి.ఆర్.ఎస్. ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణాలోని సహజ వనరులను తాతజాగీరులా సీమాంధ్రకు కట్టబెడితే ఖబడ్దార్ అని ఘాటుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.  బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అని ఖమ్మం జిల్లాలోని ఖనిజాన్ని ఇక్కడే వినియోగించుకునేందుకు వీలుగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బయ్యారం, తెలంగాణాలోని బాగా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడే ఉక్కుపరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలని, దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సిఎంకు లేఖ రాశారు. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే సరిపోదని, దాని ద్వారా ఖమ్మంలో పూర్తీస్థాయి స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆలస్యంగానైనా బయ్యారం సహా 5342 హెక్టార్ల ఇనుపగనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు

Teluguone gnews banner