తెలంగాణ పై వర్కింగ్ కమిటీ తేల్చలేదు

      ప్రత్యేక తెలంగాణ అంశం పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా నిర్ణయాన్ని హై కామండ్ కే వదిలిపెట్టవచ్చునని వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు సంజీవరెడ్డి అబిప్రాయపడ్డారు. తెలంగాణాపై వర్కింగ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోవచ్చునని తెలిపారు. తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంద్రలో వ్యతిరేకత వస్తుందని, లేకపోతె తెలంగాణ లో వ్యతిరేకత వస్తుందని, ఏ నిర్ణయం తీసుకున్నా రెండో ప్రాంతంలో సమస్య అని,రాజకీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అందరూ మాట్లాడుతున్నారని,ఎవరూ రాజకీయ సన్యాసం కోరుకోరు కదా అని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినేనని... తెలంగాణ చాలా క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఎక్కడో ఒక చోట రాజీ కుదిరేలా ప్రయత్నించాలని ఆయన అన్నారు. విభజన వల్ల ఇతరరాష్ట్రాలలో సమస్యలు వస్తాయని చెప్పారు.

తెలుగువాళ్ళతో కాంగ్రెస్ ఆడుకుంటుంది

      తెలంగాణాపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వాయిదా వేయడంపై సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలుగు వాళ్ళ చెవిలో కాంగ్రెస్ పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇరుప్రాంతలవారి భావోద్రేకాలతో కేంద్రం ఆడుకుంటూ వేడుక చేసుకుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ది నీచపు ఎత్తుగడ అని, ఎన్నికలలో లబ్ది పొందాలన్నదే దాని ఆలోచన తప్ప, ప్రజల సంక్షేమం పట్టదని అన్నారు. ఈ నెల పదిహేడు తర్వాత తెలంగాణ కోసం ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. 2014లోపు తెలంగాణ సమస్య పరిష్కరించకుంటే కాంగ్రెస్పార్టీకి సమాధి కడతామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో టిఆర్ఎస్ అదినేత చంద్రశేఖరరావుకు కూడా చిత్తశుద్ది లేదని ఆయన విమర్శించారు.

కోర్ కమిటీ తేల్చలేనిది వర్కింగ్ తేల్చగలదా

  తెలంగాణా అంశం కాంగ్రెస్ కోర్ కమిటీ నుండి వర్కింగ్ కమిటీలో పడిందిప్పుడు. ఇంత వరకు చర్చించింది వేరెవరో పార్టీ వాళ్ళన్నట్లు ‘ఇక తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయే’నని నిన్న దిగ్విజయ్ సింగ్ గారు చేతులు దులుపుకొన్నారు. నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఎవరూ అనామకులు, రాజకీయ పరిజ్ఞానం లేని వారు పాల్గొనలేదు. 125సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీని, సువిశాల భారత దేశాన్ని నడిపిస్తున్న అతిరధ మహారధులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటువంటి వారు ఒక సంక్లిష్టమయిన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేసినప్పుడు, రేపు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకుండా ఉంటాయా? సదరు ప్రతినిధులు ఇచ్చే సరికొత్త ఆలోచనలు, వెలిబుచ్చే సరికొత్త ధర్మ సందేహాలతో మళ్ళీ సమస్య మొదటికి రాకుండా ఉంటుందా?   దీనికి టీ-కాంగ్రెస్ నేత యంపీ పొన్నం ప్రభాకర్ చెప్పిన సమాధానం చాలా వింతగా ఉంది. “ఏదయినా ఒక ముఖ్య అంశంపై నిర్ణయం తీసుకోవలసివచ్చినపుడు దానిని వర్కింగ్ కమిటీకి నివేదించి వారితో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ సంప్రదాయం. కాంగ్రెస్ ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకొంటుందని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ. అయితే అంత మాత్రాన్న అధిష్టానం ప్రతిపాదించిన అంశాన్ని వర్కింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేఖించే అవకాశం లేదు. ఎందుకంటే అందరికీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. వారు ఈ అంశంపై కేవలం చర్చిస్తారు తప్ప అంతిమ నిర్ణయం తీసుకోరు. అందువల్ల తెలంగాణా అంశంపై అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.”   ఆయన చెప్పిన ప్రకారం చూస్తే వర్కింగ్ కమిటీకి నిర్ణయం తీసుకొనే హక్కు లేదని, కేవలం సమస్యపై చర్చించడానికి మాత్రమే అవకాశం ఉందని అర్ధం అవుతోంది.మరి అటువంటప్పుడు మళ్ళీ అటువంటి నిర్ణయం తీసుకోలేని కమిటీకి ఈ అంశాన్ని నివేదించడం ఎందుకు? గత మూడేళ్ళుగా అనేక నివేదికలను, రాజకీయ పార్టీలను సంప్రదించి అన్ని విషయాలపై అనేక మార్లు లోతుగా చర్చించిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఈ వర్కింగ్ కమిటీలో నిరుపయోగమయిన చర్చ ఎందుకు? ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి అంత నియమనిష్టలు ఉండి ఉంటే మరి ఈ పని ముందే చేసి ఉంటే దానివల్ల దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రతినిధుల అమూల్యమయిన సలాహాలు ముందుగానే దొరికేవి కదా? ముందు చేయవలసిన ఈ పనిని ఆఖరున చేయాలనుకోవడం కేవలం మరికొంత కాలం ఈ సమస్యను సాగదీసేందుకే తప్ప వేరొక ఆలోచన కాదు.   ఇక ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ మరో నిఖార్సయిన నిజం కూడా చెప్పారు. “చర్చల పేరిట కాలయాపన జరగడం, ఒక కమిటీ నుండి మరొక కమిటీకి అంశం బదలాయించుకొంటూ పోవడం వలన ప్రజలలో మా పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్న మాట వాస్తవం. అయితే, తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది మేమే అని ఘంటాపధంగా చెపుతున్నపుడు, మా పార్టీ అధిష్టానం చేత తెలంగాణా ఇప్పించినా, ఇప్పించలేకపోయినా కూడా అందుకు మేమే బాధ్యత వహించక తప్పదు. మా అధిష్టానం త్వరలోనే తెలంగాణా ఇస్తుందని మాకు నమ్మకం ఉంది,” అని ఆయన అన్నారు.   కాంగ్రెస్ అధిష్టానం, తెరాసను విలీనం కోసమో లేక సీమంధ్ర నేతల ఒత్తిళ్ళు తట్టుకోలేకనో చర్చలపేరిట సమయం పొందేందుకు ప్రయత్నిస్తూ కాలక్షేపం చేస్తూపోతే అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం కల్గించక మానదు. అదే విషయాన్నీ పొన్నం మరో విధంగా తెలియజేస్తున్నారు.

వాళ్లు కుక్కపిల్లలన్న మోడీ

      మరో రాజకీయ దుమారానికి తెరతీశారు మోడీ.. 2002లొ జరిగిన గుజరాత్‌ అల్లర్ల సమయంలో ఆయన వ్యవహరించిన తీరు తీసుకున్నచర్యలను ఆయన సమర్థించుకున్నాడు.. ఆ సమయంలో తను చేసింది నూటి నూరుశాతం సరైనదే అన్నారు. తాను పక్కా హిందూ జాతీయ వాదినని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు..   అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కాని అప్పటి అల్లర్లలో మరణించిన వారిని ఉద్దేశిస్తూ కుక్కపిల్ల కారు చక్రం కింద పడితే బాధపడతాం కదా అన్న మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇతర పార్టీలు మోడీని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు..   భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చిన మోడీ గుజరాత్‌ అల్లర్ల సమయంలో జరిగిన విషయాలను వివరించారు. ఆ సమయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే సుప్రిం కోర్టు కూడా తనను నిర్దోషిగా తెల్చిందన్నారు..   ఈ విషయంలో ఎప్పుడైన పశ్చాతాప పడ్డారా అన్న ప్రశ్నకు కుక్కపిల్ల కారు కింద పడితే ఎవరికైన బాధ ఉంటుందని బదులిచ్చారు.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీతో పాటు సమాజ్‌వాది, సిపిఐ, సిపియం పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.. భవిష్యత్‌ ప్రదానిగా అభివర్ణిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు..

బూతును ఆపే శక్తి లేదు

    అంతర్జాలంలో పేరుకుపోతున్న అశ్లీలం పై చేతులెత్తేసిన ప్రభుత్వం.. గత కొంత కాలంగా దేశంలో అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలకు ఇంటర్నెట్‌లో ఉన్న అశ్లీల సాహిత్యాలు, వీడియో ముఖ్యకారణంగా భావిస్తున్నారు విశ్లేషకలు.. అందుకే దానిపై చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు..   ఈ విషయంపై సుప్రిం కోర్టులో పిల్‌ వేసిన కమ్లేష్‌ వాస్వాని అనే వ్యక్తి పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆ వెబ్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది.. కాని కోర్టు ఉత్తర్వుల పై స్పందించిన ప్రభుత్వం సమీపకాలంలో అలాంటి వెబ్‌సైట్స్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పేసింది.. ఈ విషయంలో మరిన్ని మినిస్ట్రీస్‌తో సంప్రదించి వారి సాయం తీసుకోవాలని.. కాబట్టి వెనువెంటనే ఆ వెబ్‌సైట్స్‌ని నిషేదించలేమని కోర్టుకు తెలిపింది. దీని పై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం ఆయాశాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి నాలుగు వారాలలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది..

నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ మార్క్ సమావేశం

  కాంగ్రెస్ పని ఎప్పుడు కూడా కొండను త్రవ్వి ఎలకను పట్టినట్లుగానే ఉంటుందని ఈ రోజు మరోమారు ఋజువు చేసింది. ఈ రోజు సమావేశమయిన కాంగ్రెస్ కోర్ కమిటీ రాష్ట్ర విభజనపై ఏదో ఒక ఖచ్చితమయిన ప్రకటన చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నవారందరికీ, ముఖ్యంగా తెలంగాణా ప్రజలని, తెలంగాణా నేతలని తీవ్ర నిరాశకు గురిచేస్తూ ఎటువంటి ప్రకటన చేయకుండా, “తెలంగాణా అంశంపై కోర్ కమిటీలో లోతుగా చర్చ జరిగిందని, ఇక ఈ విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొంటామని” పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ అని క్లుప్తంగా శలవిచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో వారం పది రోజులో సమావేశం అయ్యే అవకాశం ఉంది. గనుక ఈ సస్పెన్స్ స్టోరీ మళ్ళీ మరికొన్ని రోజులు పొడిగించబడింది. ఈ రోజు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ తప్పని సరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకొంటుందని అందరూ భావించినప్పటికీ, కాంగ్రెస్ పద్దతుల గురించి ఔపోసన పట్టిన తెదేపా, తెరాసలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. వారి నమ్మకాలను వమ్ము చేయకుండా కాంగ్రెస్ ఈ సమావేశంలో ‘మరో మారు సమావేశం అవ్వాలని’ మాత్రమే ఒక ఖచ్చితమయిన నిర్ణయానికి రాగలిగింది.

ముగిసిన కోర్ కమిటీ భేటి..ఉత్కంఠకు తెర

      తెలంగాణ అంశం పై చర్చించేందుకు భేటి అయిన కాంగ్రెస్ వ్యహ బృందం సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ ఆంటొనీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుగానే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు చేరుకున్నారు.   కోర్ కమిటీ భేటిలో ప్రధానంగా తెలంగాణ అంశం, వచ్చే ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. కార్యాచరణ ప్రణాళిక పై కోర్ కమిటీ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ గెలుపు, ఓటములు బాలబాలపై పార్టీ నేతలు సమీక్షించారు.

కోర్ కమిటీ భేటి ప్రారంభ౦, సర్వత్రా ఉత్కంఠ

      కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్‌మోహన్ సింగ్ నివాసంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ ఆంటొనీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుగానే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు చేరుకున్నారు. మరోవైపు ప్రధాని నివాసం ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. విభజించాలని ఓయు నేతలు, విభజించవద్దంటూ సీమాంధ్ర విద్యార్థి నేతలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ అంశంపై కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.  

టి.టెన్షన్: రాజీనామాపై కిరణ్ స్పందన

      తన రాజీనామాపై వచ్చిన వార్తలని ముఖ్యమంత్రి కిరణ్ ఖండించారు. రాజీనామా చేస్తారన్న ప్రచారాన్ని ఖండిస్తూ ఢిల్లీలో ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీని కలిసిన తరువాత ఈ ప్రకటన చేయడం విశేషం. కోర్ కమిటీ భేటి కంటే కిరణ్ సోనియా గాంధీని కలవడం ఆసక్తిని కలిగిస్తుంది. సోనియాగాందీతో బేటీ అయిన తర్వాత ఐదు నుంచి పది నిమిసాలలోపే కిరణ్ తిరిగి రావడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భేటిలో కిరణ్ ను రాజీనామా వార్తలను ఖండించాలని కోరినట్లు సమాచారం. కిరణ్ క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసు కార్యకర్తగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇలాంటి ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు.

కిరణ్ రోడ్డు మ్యాపే అధిష్టానం ఫాలో అవుతుందా!

  ఇంత వరకు తెలంగాణా అంశంపై నిర్ణయం చేసే బాధ్యత అధిష్టానం మీదనే ఉందంటూ, ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా నిశ్చింతగా కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రోడ్డు మ్యాప్ తయారు చేయమని దిగ్విజయ్ సింగ్ ఆదేశించినప్పటి నుండి రాష్ట్ర విభజన సమస్య తలకి చుట్టుకొన్నట్లయింది. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉందని చెప్పవచ్చును. వారిద్దరూ సమైక్యవాదులయినప్పటికీ, కీలకమయిన పదవులలో ఉన్నందున, ఇంత కాలం తెలంగాణా అంశం తమ చేతుల్లో ఏమీ లేదని, అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకొంటామని చెబుతూ, పెద్దగా ఇబ్బంది కలగకుండానే రోజులు దొర్లించేసారు.   అయితే, ఈ రోజు రాష్ట్ర విభజనపై ప్రకటనకి ముహూర్తం ఖరారయిపోవడంతో, వారిద్దరూ తమ వైఖరి కూడా ప్రకటించక తప్పట్లేదు. వారు బహుశః ఇప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకే మొగ్గు చూపుతున్నపటికీ, సీమంధ్రా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా తమ ప్రాంత నేతల మనోభావాలను అధిష్టానానికి తెలియజేసి తదనుగుణంగా నిర్ణయం వచ్చేలా కృషి చేయక తప్పట్లేదు. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో మఖాం వేసిన సీమంధ్ర నేతలని కలిసిన వెంటనే, అక్కడి నుండి నేరుగా సోనియా గాంధీని కలిసి రావడం జరిగింది. అంటే, ఆయన వారి అభిప్రాయాలను, నిర్ణయాలను అధిష్టానానికి చేరవేసినట్లు భావించవచ్చును. కానీ అక్కడే మఖాం వేసి ఉన్న టీ-కాంగ్రెస్ నేతలని మాత్రం ఆయన కలిసినట్లు ఎటువంటి సమాచారం లేదు.   అందువల్ల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జోరుగా లాబీయింగ్ చేస్తునట్లు భావించవచ్చును. ఈవిధంగా సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశానికి ముందే, వారిరువురూ పార్టీ అధిష్టానంపై ఇంత తీవ్రమయిన ఒత్తిడి తెస్తే, ఆ సమావేశం అనంతరం ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ సమావేశం తరువాత, మళ్ళీ తెలంగాణపై నాన్పుడు ధోరణి అవలంభిస్తే, అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయనే కారకులని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతలు భావించడం ఖాయం, తత్ఫలితంగా వారిరువురికీ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తీవ్రవ్యతిరేఖత ఎదురవడం కూడా అంతే ఖాయం. మరి కాంగ్రెస్ అధిష్టానం వారిరువురుకి అటువంటి పరిస్థితి కల్పిస్తుందో లేక తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తుందో ఈ రోజు సాయంత్రం సమావేశం ముగిస్తే గానీ తెలియదు.

తెలంగాణ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా?

      తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఏర్పాటుకి ఆయన పూర్తి వ్యతిరేకం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని సూచిస్తే ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 175 మంది శాసనసభ్యుల్లో 170 మంది సభ్యులు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం శాసనసభ్యులు కూడా రాజీనామాకు ముందుకు రావచ్చునని అంటున్నారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతను సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పెట్టినట్లు సమాచారం. దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. తనను తాను నాయకుడిగా నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

మాకూ ప్రత్యేక రాష్ట్రం కావాలి

      కేంద్ర తెలంగాణ అంశం పై తేల్చేందుకు సిద్దం అవుతుండటంతో ఇప్పుడు మరిన్నిసమస్యలు అధిష్టానం ముందుకు వస్తున్నాయి.. ఇన్నాళ్ల ప్యాకిజీలతో సరిపెట్టిన ఎన్నో ప్రత్యేక వాదాలు జూలై 12 నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెర మీదకు వస్తున్నాయి.. జూలై 12న కాంగ్రెస్‌ తెలంగాణ అంశం పై ఏదో ఒకటి తెల్చేస్తుంది అంటుండటంతో.. గుర్ఖా జనముక్తి మోర్చా ప్రత్యేక గూర్ఖాలాంగ్‌ అంశాన్ని లేవనెత్తాయి.. ప్రత్యేక తెలంగాణ ఎర్పాటుకు కేంద్ర అంగీకరించినట్టయితే ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిందే అంటున్నారు.. గతంలో కూడా ప్రత్యేక వాదంతో ఎన్నో ఉద్యమాలు చేసిన జిజెయం ఇప్పుడు మరోసారి అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తుంది.. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు మరోసారి ఆలోచనలో పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు  

మరో స్వతంత్ర పోరాటం

      అవినీతి నాయకులను కట్టడి చేసే జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం సామాజిక వేత్త అన్నాహజారే మరోసారి ఉద్యమించనున్నారు.. అక్టోబర్‌ నవంబర్‌ మాసాలలో మరోసారి రామ్‌లీల మైదాన్‌ వేదిక జన్‌ లోక్ పాల్ సాధన కోసం దీక్షచేపట్టునున్నారు..   ఇప్పటికే పలుమార్లు హాజారే ఉద్యమాన్ని అనచివేసిన ప్రభుత్వం మరోసారి అదే పిరస్థితిని ఎదుర్కొనబోతుంది. అవినీతి అధికారులతో పాటు ప్రస్థుత ఎలక్షణ్‌ ప్రక్రియను కూడా తప్పు పట్టారు హజారే. ప్రస్థుత నడుస్తు విదానంలో కాకుండా రాష్ట్రపతి, ప్రదాన మంత్రి పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలన్నారు.   ప్రస్థుతం జనతంత్ర మోర్చ తరుపున దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న  హజారే త్వరలోనే మరోసారి భారీ ఉద్యమానికి వ్యూహం రచిస్తున్నారు.. ఇటీవల నేర చరితులు పోలీస్‌ కస్టడీలో ఉన్న నేతలు ఎలక్షన్లలో పోటికి అనర్హులు అంటూ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు..

రాష్ట్రాన్ని విభజిస్తే మెరుపు సమ్మే

      ఢిల్లీ తెలంగాణ వేడి రాచుకుంటుంటే సీమాంద్ర సమైఖ్య సెగలు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఢిల్లీ పెద్దలతో లాభీయింగ్‌ చేస్తుండగా..మరి కొందరు నాయకులు రాజీనామాలకు సిద్దపడ్డారు..   ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీఎన్జీవో) సంఘం ఎట్టి పరిస్థితు్లోనూ రాష్ట్రన్ని విడదీయవద్దని డిమాండ్ చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే సీమాంద్రప్రాంత ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా, త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రటించింది.. అంతేకాదు తెలంగాణ ఎర్పడే పరిస్థితి వస్తే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. కొత్త రాష్ట్రం ఎర్పడితే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దవుతాయని, ఫలితంగా సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని తెలిపారు. అంతే కాదు త్వరలో సమైఖ్య రాష్ట్ర ఆవశ్యకత ఢిల్లీ నాయకత్వానికి తెలిసేలా హైదరభాద్‌లో భారీ బహింరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ఉద్యోగ విద్యార్థి సంఘాలతో పాటు.. రాజకీయ నాయకులు కూడా పాల్గొంటానరని ప్రకటించారు..

గంటాది సమైక్య రాగం, మరి చిరంజీవిది?

  చిరంజీవికి భుజకీర్తుల వంటి వారెవరని అడిగితే, రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులని ఎవరయినా టక్కున తడుముకోకుండా చెప్పేస్తారు. మరి చిరంజీవి రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు, అయన అనుచరుడు రామచంద్రయ్య మౌనం దాల్చగా, మరో అనుచరుడు గంటా మాత్రం ఎందుకు సమైక్య గానం చేస్తున్నట్లు? అంటే ఆయన చిరంజీవిని కాదని ముందుకు వెళ్తున్నాడా? లేక స్వతహాగా సమైక్యవాదయిన చిరంజీవే ఆయనను వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారా? ఒక వేళ చిరంజీవి ప్రోత్సహిస్తున్నారనుకొంటే మరప్పుడు రామచంద్రయ్య కూడా సమైక్య రాగం ఆలపించాలి కదా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే డొంక కదులుతుంది.   కొద్ది వారాల క్రితం రామచంద్రయ్య విశాఖలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “రానున్నఎన్నికలలో, ఆ తరువాత కూడా బొత్సతో కలిసి చిరంజీవే చక్రం తిప్పుతాడని, చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నిఅర్హతలు ఉన్నాయని” భజన చేసినప్పటి నుండి చిరంజీవికి కిరణ్ కుమార్ కి కొంత చెడిందని, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసినప్పుడు కూడా రామచంద్రయ్యను వెనకేసుకు రావడంతో వారి మధ్య మరికొంత అగాధం ఏర్పడిందని సమాచారం. ఇక చిరంజీవి కిరణ్ కుమార్ కి వ్యతిరేఖంగా అధిష్టానానికి లేఖ వ్రాయడం కూడా వారి మధ్య భేదాభిప్రాయాలకు మరో కారణంగా చెప్పబడుతోంది.   ఆ కారణంగానే గంటా శ్రీనివాసరావు సమైక్య రాగం తీసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తూ, చిరంజీవిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా గంటా శ్రీనివాసరావు కూడా క్రమంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపుకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. అందువల్లే చిరంజీవి కూడా శ్రీనివాసరావుకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

దాడి కోసం కొణతాలను వదులుకొంటున్న వైకాపా

  ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో అండగా నిలబడి, ఆపార్టీకి పాత కాపుగా పేరుబడ్డ కొణతాల రామకృష్ణ కంటే, నిన్న మొన్న తెదేపా నుంచి పార్టీలోకి దూకిన దాడి వీరభద్రరావు అంటేనే ఆ పార్టీకి మమకారం పుట్టుకొచ్చింది. కొణతాలను పక్కన బెట్టి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు దాడి వీరభద్ర రావుని పార్టీ సమన్వయకర్తగా నియామకం చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించింది.   తమ చిరకాల రాజకీయ ప్రత్యర్ధయిన దాడితో కలిసి పనిచేయలేమని, అందువల్ల ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని కొణతాల వర్గీయులు ఎంత బ్రతిమాలినప్పటికీ, కారణాలేవయినప్పటికీ వైకాపా అధిష్టానం ఆయనకు ఎర్ర తివాచీ పరిచి మరీ పార్టీలోకి స్వాగతించింది. నాటి నుండి పార్టీ కొణతాల వర్గీయులు కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అదే విధంగా పార్టీ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నాలేవీ చేయలేదు.   ఇప్పుడు దాడికి కీలకమయిన బాధ్యతలు అప్పగించడం ద్వారా కొణతాల వర్గీయులను పూర్తిగా పక్కన పెట్టినట్లేనని భావించవచ్చును. గనుక, ఇంత కాలం పార్టీ సానుకూల స్పందన కోసం ఆశగా ఎదురు చూసిన కొణతాల రామకృష్ణ అతని తమ్ముడు లక్ష్మి నారాయణ, మరియు వారి అనుచరులు త్వరలో పార్టీ వీడే అవకాశం ఉంది.   దాడి వీరభద్రరావు స్థానంలోకి కొణతాల రామకృష్ణ ను తెదేపా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ నుండి కూడా వారికి ఆహ్వానం ఉంది. అయితే, ఆయన తెదేపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చును.

తెలంగాణపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు

      తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాపై రాజ్యంగా సవరణ చేయవలిసి వుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించవలసి ఉంటుందని, అలాగే విపక్షాలతో కూడా మాట్లాడవలసి ఉంటుందని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని, ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణాపై ఇప్పుడేమి చెప్పలేమని, సందిగ్దత మాత్రం తొలగిస్తామని చెప్పారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకొని దీనిపై స్పందిస్తామని అంటున్నారు.

రాష్ట్ర విభజనపై స్పష్టత ఇస్తాం: దిగ్విజయ్

  తెలంగాణ అంశంపై రేపు కీలక నిర్ణయం వెలువడనుందని అందరూ భావిస్తున్నతరుణంలో నిన్న హోంమంత్రి షిండే ‘అది ఇప్పటికిప్పుడు తేల్చగలిగే విషయం కాదని’ అన్నారు. ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇక ఈ అంశాన్ని వాయిదా వేయడం ఎంత మాత్రం కుదరదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా? లేక విభజించాలా? అనే రెండు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి అమలు చేయక తప్పదని’ అన్నారు. తాము రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఒక నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని, అలాగే యుపీయే భాగస్వామ్య పక్షాలతో కూడా ఈవిషయంపై చర్చించి వారి అభిప్రాయం కూడా తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ఏమయినప్పటికీ రాష్ట్ర విభజనపై ఇక ఎంత మాత్రం నాన్చకుండా స్పష్టత ఈయబోతున్నామని ఆయన తెలియజేసారు.

తెలంగాణపై సీమాంద్ర నేతల కుట్రలు

      తెలంగాణ ఏర్పాటుపై కదలిక మొదలు కాగానే సీమాంద్ర నేతలు కుట్రలకు తెరలు లేపుతారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నప్పుడు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలో భాగమే ఉండవల్లి మాటలు అని హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో పంటలు పండాలంటే గిరిజనులను కాల్చి చంపేయాలని ఉండవల్లి మాట్లాడారని హరీష్‌రావు గుర్తు చేశారు. ఉండవల్లి మాటల్లో హేతుబద్దత లేదని, ఆంధ్రా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకు ఉండవల్లి నీచంగా మాట్లాడుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు.కేసీఆర్ ఎల్లప్పుడూ అబద్ధాలు మాట్లాడితే మరీ 2004లో తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. నయవంచనలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఎవరూ సాటి రారు అని హరీష్‌రావు పేర్కొన్నారు.