రాహుల్ గాంధీకి గంతలు కట్టిన కిరణ్

 

నిన్న డిల్లీలోముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సమావేశమయిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులతో బాటు, చంద్రబాబు మరియు షర్మిల చేస్తున్నపాదయాత్రల గురించి కూడా వాకబు చేశారు. వారి పాదయాత్రల ప్రభావం ప్రజల మీద ఎలాఉంది? తద్వారా ఆయా పార్టీలకు ప్రయోజనం ఏ మేరకు ఉంటుంది? దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఏవిధంగా ఉంటుంది? అని రాహుల్ గాంధీ ప్రశ్నించడం చూస్తే వారిద్దరూ పాదయాత్రలు చేస్తూ ఒకవైపు తమ పార్టీలు బలోపేతం చేసుకొంటూనే, మరోవైపు తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేఖతను పెంచుతున్నారని, తద్వారా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అర్ధం అవుతోంది. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం, రాహుల్ గాంధీ కళ్ళకు కూడా గంతలు కట్టే ప్రయత్నం చేయడం విశేషం.

 

గత 7 నెలలుగా చంద్రబాబు పాదయాత్రల చేస్తున్నపటికీ, ఆయన స్వంత పార్టీ మీద కానీ, ప్రజలమీద గానీ ఆయన ప్రభావం చూపలేకపోయారని, ప్రజలు కూడా ఆయన మాటలు విశ్వసించడంలేదని చెప్పారు. అంతే కాకుండా వారి పార్టీలో, కుటుంబంలోనే కలహించుకొంటున్నారని అందువల్ల ఆ పార్టీ నుండి రాబోయే ఎన్నికలలో తమకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని కిరణ్ స్పష్టం చేసారు.

 

షర్మిలా చేస్తున్న పాదయాత్రల పట్ల కూడా ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. జగన్ అవినీతి గురించి, అక్రమార్జన గురించి క్రమంగా ప్రజలు కూడా నమ్మడం మొదలుపెట్టారని అందువల్ల వైయస్సార్ కాంగ్రెస్ వల్ల కూడా తమకొచ్చే నష్టం ఏమిలేదని ఆయన వివరించారు.

 

తానూ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల గురించి వివరించి, త్వరలో మరి కొన్ని పధకాలు ప్రవేశ పెట్టబోతున్నట్లు కూడా తెలిపారు. తానూ ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల వల్ల రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని, అది వచ్చే ఎన్నికల నాటికి పూర్తి అనుకూల వాతావరణం సృష్టించడం ఖాయమని గట్టిగా భరోసా ఇచ్చారు.

 

ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం చూస్తే, రాష్ట్రప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతున్నారని అర్ధం అవుతుంది. కానీ, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికయినా ఆయన స్వయంగా ఆత్మవంచన చేసుకొంటూ, తమ అధినేతను కూడా మభ్యపెడుతున్నారని అర్ధం అవుతుంది. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు కలహించుకొంటున్నపటికీ, ఇద్దరూ కూడా గత 6నెలలుగా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల గురించి,అవినీతి గురించి ప్రజలకు అర్ధమయ్యే విధంగా సోదాహరణగా వివరిస్తుంటే, ఆ ప్రభావం అసలు ప్రజల మీద ఉండబోదని నమ్మించే ప్రయత్నం చేయడం భ్రమలో బ్రతకడమే అవుతుంది.

 

ఇక ఒకవైపు ఎన్ని పధకాలు ప్రవేశ పెడుతున్నపటికీ, మరో వైపు కరెంటు కోతలు, తద్వారా ఎండుతున్న పంటలు, కుంటుపడిన పరిశ్రమలు , దివాలా తీస్తున్న వ్యాపారాలు, తద్వారా పెరుగుతున్న నిరుద్యోగం వంటివి ఆయన తమ అధినేతకు చెప్పకుండా కేవలం తన పధకాల గురించి మాత్రమె చెప్పుకోవడం ఆయన కళ్ళకు గంతలు కట్టడం కాక మరేమిటి?

 

గతంలో ఏ ఆరు నెలలకో, ఏడాదికో పెరిగే కరెంటు బిల్లులు ఇప్పుడు ప్రతీ నెలా పెరగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ, వారు తను ప్రవేశ పెడుతున్న సంక్షేమ పదకాలను చూసి ఐస్’ అయిపోయి తమకే గంప గుత్తగా ఓట్లేసి గెలిపించేస్తారని భావించడాన్ని ఏమనుకోవాలి?

 

ఇక, ప్రజాగ్రహం సంగతి పక్కన పెట్టినా, తెలంగాణలో తెరాస ప్రభావం, ఆంధ్రాలో తెదేపా, జగన్ ప్రభావం అసలు ఉండబోదని అనుకోవడం భ్రమ కాదా? రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కాకపోవచ్చును. కానీ, తెరాస, తెదేపా, మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక ఆ మూడు పార్టీలు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేయకమానవు. వీటికి అదనంగా రాష్ట్రంలో ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతున్న కులం, ప్రాంతం, ధనం మొదలయిన వాటి ప్రభావం ఎన్నికలపై ఉండనే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని లుకలుకలు, ముఠాలు మరే పార్టీలోను కనబడవని లోకోక్తి ఉండనే ఉంది.

 

ఇన్ని అంశాలు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంటే మరి రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో చాలా హాయిగా బ్రతుకుతున్నట్లు, రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రభావం అసలు ఏమిలేనట్లు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా నమ్మడమే కాకుండా, తమ పార్టీ అధినేతకు కూడా చెప్పడం చూస్తే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆయనే శల్యసారద్యం చేస్తున్నారని భావించవలసి ఉంటుంది. నిద్ర పోయే వారిని లేపోచ్చు కానీ, నిద్ర నటించే వారిని లేపడం ఎవరి తరం?