జగన్ పునరాలోచన!

  విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడమే వైసీపీ అధినేత జగన్ విధానంలా కనిపిస్తోంది. విభజన వాదం నుంచి సమన్యాయ వాదానికి మళ్ళీ అక్కడి నుంచి సమైక్య వాదానికి షిష్టయిన జగన్‌లో ఇప్పటికీ క్లారిటీ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమంటే విభజనకు అంగీకరించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. తమ పార్టీకి రాష్ట్ర విభజన ఇష్టం లేదు కాబట్టి ఆ సమావేశానికి తమ పార్టీ వెళ్ళబోదని జగన్ మొదట్లో ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం ఐడియా వచ్చిందోగానీ, తాజాగా జీఓఎం సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిగా మైసూరారెడ్డి వెళ్తారని ప్రకటించి రాష్ట్ర విభజన మీద తనకున్న మక్కువను బహిర్గతం చేశారు. ఆ సమావేశానికి మీ పార్టీ నుంచి సభ్యుడిని పంపితే విభజనకు ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నిస్తే, అబ్బే మైసూరారెడ్డి మీటింగ్‌కి వెళ్ళి విభజనకు ఒప్పుకోరు.. కేంద్ర మంత్రుల బృందాన్ని బాగా తిట్టి, వాళ్ళకి సమైక్య పాఠాలు బోధించి వస్తారని జగన్ వివరణ ఇచ్చాడు. అసలు  ఆ మీటింగ్‌కి వెళ్ళకపోతేనే రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు లెక్క! అలాంటప్పుడు ప్రత్యేకంగా మీటింగ్‌కి వెళ్ళి విభజనని వ్యతిరేకిస్తున్నామని చెప్పడమెందుకో కిందున్న జగన్మోహనరెడ్డికి, పైనున్న ఆ రాజశేఖరరెడ్డికే తెలియాలి. మైసూరాని మీటింగ్‌కి పంపాలని తాను తీసుకున్న నిర్ణయానికి సమైక్యవాదుల నుంచి, వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ వుండటంతో జగన్ మరోసారి తన విధానాన్ని మార్చుకునే ఉద్దేశంలో వున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. మొన్నటి వరకూ వీర తెలంగాణవాదిగా ముద్ర పడిన బీజేపీ కూడా మంత్రుల బృందం మీటింగ్‌కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. అలాంటప్పుడు సమైక్యవాద పార్టీగా క్లెయిమ్ చేసుకుంటున్న తమ పార్టీ ఆ ‌మీటింగ్‌కి వెళ్తే సీమాంధ్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచన వైసీపీ పార్టీ వర్గాల్లో నలుగుతోంది. దాంతో మంత్రుల బృందం మీటింగ్‌కి తమ  పార్టీ నుంచి మైసూరాని పంపకుండా వుంటే ఎలా వుంటుందన్న దానిమీద పార్టీలో తీవ్ర స్థాయిలో తర్జన భర్జనలు జరుగుతున్నట్టు సమాచారం.

రాజీబాటలో ‘హర్రీ’కృష్ణ!

  తన పుత్రరత్నం జూనియర్ ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీలో సువర్ణ రత్నఖచిత సింహాసనం వేయట్లేదని నందమూరి హరికృష్ణ ఫీలవుతూ వుంటారు. ఆ అసంతృప్తిని అప్పుడప్పుడు వెళ్ళగక్కుతూ వుంటారు. ఆ అసంతృప్తిని మరింత బలంగా వ్యక్తం చేయడానికి సందర్భం కోసం ఎదురు చూసిన ఆయనకి సమైక్యాంధ్ర ఉద్యమం ఒక మంచి అవకాశంలా దొరికింది. దాంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగాచూపించి తన రాజ్యసభ సభ్యత్వానికి హర్రీగా రాజీనామా చేశారు. అదేం ఖర్మోగానీ, ఆయన రాజీనామాని లటుక్కున ఆమోదించేశారు. ఊహించని పరిణామానికి హరికృష్ణ కంగుతిన్నారు. పదవి పోతేపోయింది.. సమైక్యాంధ్ర హీరోగా అయినా మిగులుతానులే అనుకుని సరిపెట్టుకున్నారు. ‘హర్రీ’కృష్ణ బ్యాడ్ లక్ ఏంటోగానీ, ఆయన చేసిన ‘త్యాగాన్ని’ ఎవరూ పట్టించుకోలేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన పేరుని తలుచుకున్నవాళ్ళే లేరు. హరికృష్ణ సమైక్యాంధ్ర ఉద్యమంలో దూకితే అద్భుతాలు జరుగుతాయని దురాశపడిన అమాయకులు కూడా ఎవరూ లేరు! అటు రాజ్యసభ సభ్యత్వం పాయె.. ఇటు రాజీనామా క్రెడిట్టూ దక్కకపాయె! మరోవైపు తాను రాజీనామా చేసినా చంద్రబాబు బావ ఎంతమాత్రం చలించక పాయె! దాంతో హరికృష్ణలో ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైనట్టు తెలుస్తోంది. తండ్రి ఎన్టీఆర్ నుంచి ఆవేశాన్ని మాత్రమే వారసత్వంగా పొందిన హరికృష్ణలో ఇప్పుడు అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. అపర చాణక్యుడైన చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి తాను చెడిపోయి, తన పుత్రరత్నం జూనియర్ ఎన్టీఆర్‌ని చెడగొట్టడం కంటే రాజీబాటలో నడిచి పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో హరికృష్ణ వున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన హితబోధ కారణంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా మసలుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ని మళ్ళీ తెలుగుదేశానికి చేరువ చేయడానికి హరికృష్ణ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. చంద్రబాబు తనయుడు లోకేష్‌తో ఎన్టీఆర్‌కి సఖ్యతని కుదర్చడం ద్వారా ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దాలని హరికృష్ణ భావిస్తున్నట్టు సమాచారం.

సీనియర్స్ ని కాదని శ్రీధర్ బాబుకి పట్టం కడితే

  రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాక ముందే తెలంగాణాకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి పదవుల కోసం టీ-కాంగ్రెస్ నేతలు గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొంది రాష్ట్రం ఏర్పడితే గానీ, ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ ఖరారు చేయడం సాధ్యం కాదు గనుక, పార్టీ పరంగా తెలంగాణాకు పీసీసీని ఏర్పాటు చేసి, అధ్యక్షపదవికి పేరు ప్రకటించినట్లయితే, శాసనసభలో తెలంగాణా బిల్లుపై ఏవిధంగా వ్యవహరించాలో నిర్ణయించుకోగాలమని, అంతే గాక ఎన్నికలకు సన్నాహాలు చేసుకోగలుగుతామని టీ-కాంగ్రెస్ నేతల గట్టిగా పట్టుబడుతుండటంతో టీ-పీసీసీ ఏర్పాటుకి కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతోంది.   అయితే వారి విజ్ఞప్తిని మన్నించినా, మాజీ పీసీసీ అధ్యక్షులు డీ. శ్రీనివాస్, షబ్బీర్ ఆలీ వంటి అనేక మంది సీనియర్లను, అనుభవజ్ఞులను పక్కనబెట్టి రాష్ట్రపౌర సరఫరా శాఖా మంత్రి శ్రీధర్ బాబుని డిల్లీకి పిలవడంతో వాళ్ళు కంగు తిన్నారు. యువతకు పెద్ద పీట వేస్తానని చెపుతున్న రాహుల్ గాంధీ అభీష్టం మేరకే శ్రీధర్ బాబుని డిల్లీ పిలిచినట్లు సమాచారం. అదే నిజమయితే, రానున్న ఎన్నికలలో ఇప్పుడున్న సీనియర్లలో ఎంత మందికి మళ్ళీ టికెట్స్ దొరుకుతాయో తెలియదు. ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ముఖ్యమంత్రి కలలను సాకారం చేసుకోవాలని వారు భావిస్తుంటే ఇప్పుడు ఈ ‘యువ కారణం’ వలన అన్యాయం అయిపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఎన్నికల సమయంలో ఈ సీనియర్స్ పార్టీని తమ జూనియర్స్ ని ముప్పతిప్పలు పెట్టడం ఖాయం.

రాజకీయాలలో యాక్టివ్ గా నారా లోకేష్

      టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాగా యాక్టివ్ అవుతున్నట్లే. ఆయన ఏకంగా ఎన్నికల నిర్వహణకు సంబందించిన ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా టిడిపి యువ నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. చంద్రబాబు నివాసంలో పార్టీ యువనేతలతో నారా లోకేష్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. వచ్చే నెల నుంచి చేపట్టనున్న యువసదస్సులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీవైపు యువతను ఆకర్షించాల్సిన అవసరం ఉందని, మాస్ ఓటర్లను పార్టీవైపు వచ్చేలా చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటారని టీఎన్ఎస్ఎఫ్ నేతలతో లోకేష్ అన్నట్లు సమాచారం.

ఏవీఎస్ కు చంద్రబాబు నివాళి

      ఫిల్మ్‌చాంబర్‌లో ఉన్న ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ భౌతికకాయాన్ని శనివారం ఉదయం పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏవీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏవీఎస్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిజేశారు. ఈ సందర్భంగా ఏవీఎస్‌తో తమకున్న అనుంబంధాన్ని గుర్తు చేశారు. ఎంపీ నామానాగేశ్వరరావు, నన్నపనేని రాజకుమారి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు దాసరి,అల్లు అరవింద్, వెంకటేష్, మురళీ మోహన్, జమున, జయసుధ, బ్రహ్మానందం,గుండు హన్మంతరావు, ఆర్.నారాయణమూర్తి, బుల్లితెర నటీనటులు తదితరులు ఏవీఎస్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

విభజనకు జగన్ ఓకే!

      ఢిల్లీ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు.. ఇలా ఇండియాలోని చాలా రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు తెలుగువాళ్ళ చెవుల్లో పూలు పెడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వేరే రాష్ట్రాల వాళ్ళు చాలరన్నట్టు తెలుగోడే తెలుగోడి చెవిలో పూలు పెడుతున్నాడు. ఆ తెలుగోడు ఎవరో కాదు... వైసీపీ నాయకుడు జగన్!   అయ్యగారు తనను తాను సమైక్యవాదినని చెప్పుకుంటూ వుంటారు. మరోవైపు విభజనకు తనవంతు సహకారం తాను అందిస్తూ వుంటారు. జగన్  ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధమైంది. అంత దారుణానికి సహకరించి కూడా తాను తాను సమైక్యవాదినని చెప్పుకుంటున్న జగన్ తెలుగు ప్రజల చెవుల్లో  క్యాలీఫ్లవర్లు  పెడుతున్నాడు. రాష్ట్ర విభజన విషయంలో జగన్ కర్ణపుష్పన్యాయం మరోసారి బయటపడింది.  రాష్ట్ర విభజన గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమావేశాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, తమ పార్టీ నుంచి ఆ మీటింగ్‌కి ఎవరూ వెళ్ళరని జగన్ చెప్పాడు. ఆ మీటింగ్‌కి వెళ్తే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టే అవుతుందని, తాను కనీవినీ ఎరుగనంత సమైక్యవాదిని కాబట్టి తమ పార్టీ మీటింగ్‌తో పాల్గొనదని జగన్ తియ్యగా చెప్పాడు. కొంతమంది అమాయకులు చెప్పిన మాటలు నమ్మేశారు. అయితే తాజాగా జగన్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. జీవోఎం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. ఆ సమావేశానికి వైసీపీ తరఫున మైసూరారెడ్డి పాల్గొంటారట. ఆయన ఆ మీటింగ్‌లో సమైక్య గళాన్ని మంత్రుల బృందంలో వున్నవాళ్ళ కర్ణభేరి పగిలిపోయేంత గట్టిగా వినిపిస్తారట. మంత్రుల బృందం మీటింగ్‌కి వెళ్తే విభజనకు ఓకే అన్నట్టే అని వక్కాణించిన జగన్ ఇప్పుడు ఆ మీటింగ్‌కి తన పార్టీ నుంచి ప్రతినిధిని పంపిస్తున్నాడంటే రాష్ట్ర విభజనకు జగన్ అధికారికంగా ఓకే చెప్పినట్టే భావించాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నేను ఎప్పటికీ సమైక్యవాదినే: కిరణ్

      ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని, తాను రాష్ట్ర విభజనకు అంగీకరించానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని ప్రకటించారు.   ఏంటీ డ్రామాలు? ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొంత ప్రాపర్టీనా? ఒకపక్క తెలుగు ప్రజల గుండెలు మండిపోతూ వుంటే ఇలాంటి చెలగాటాలు ఆడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు పద్ధతి కాదు. దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలుచుకుంటే తనని తరిమికొట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చేసుకుంటే మంచిది. తెలుగు ప్రజలతో ఇంకా ఆడుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆటలని తెలుగు ప్రజలు త్వరలో కట్టిస్తారు.

తెలంగాణ వద్దట!

      ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం కావాల్సిందేనని పట్టుపట్టిన విభజన వాదుల నోటి వెంట తెలంగాణ వద్దనే మాటలు కూడా వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో పార్టీలతో నిమిత్తం లేకుండా తెలంగాణ వాదులంతా ‘మాకు తెలంగాణ వద్దు బాబోయ్.. సమైక్యంగానే ఉంటాము దేవుడోయ్’ అని మొత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి శుభారంభంగా ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నోటి వెంట ‘ఇలాగైతే తెలంగాణ వద్దు’ అనే మాటలు వచ్చాయి.   ఆ ఇద్దరు నాయకులు ఎవరో కాదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆమోస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ! కేంద్ర రాజకీయాలు మొన్నటి వరకు విభజనవాదులకు అనుకూలంగా సాగాయి. రెండు రోజుల నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. జరుగుతున్న ఒక్కో పరిణామం  విభజనవాదుల గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారవుతోంది. రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎలా వుండాలో నిర్ణయించే టాస్క్ ఫోర్స్ నివేదిక బయటకి వచ్చింది. అలాగే ఆంటోనీ కమిటీ తన నివేదిక రెడీ చేసింది. నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. టాస్క్ ఫోర్స్ నుంచి, ఆంటోనీ నుంచి వచ్చిన నివేదికలలో ప్రస్తావించిన ప్రతిపాదనలు విభజనవాదుల గొంతెమ్మ కోర్కెలకు వ్యతిరేకంగా వున్నాయి.  సీమాంధ్రుల ఆవేదనను అర్థం చేసుకున్నట్టు, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా వున్నాయి.  ఇప్పటి వరకు సీమాంధ్రుల నెత్తిన తెల్లగుడ్డ వేసి  హైదరాబాద్‌లో నుంచి పంపేసే ఆలోచనలో వున్న విభజన వాదులకు ఇవి షాకిచ్చాయి. వాళ్ళ విభజనోత్సాహం మీద నీళ్ళు పోశాయి. దాంతో వెంటనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆమోస్ మీడియా ముందుకు వచ్చేశాడు. ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రతిపాదనలతో తెలంగాణ బిల్లు రూపొందిస్తే తెలంగాణ ఇచ్చీ వేస్టన్నాడు. ఈ పద్ధతిలో అయితే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదన్న మాట ఆయన నోట్లోంచి బయటపడింది. అదేవిధంగా, కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం రాజనర్సింహ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించేట్టయితే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదని ఆవేశంగా అన్నట్టు సమాచారం. ఈమాత్రం దానికే తెలంగాణ వద్దన్న మాటలు వస్తున్నాయి. రేపు హైదరాబాద్ గురించి ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయో, అప్పుడు విభజనవాదులు ఎలా స్పందిస్తారో!

కిరణ్ జగమొండి..!

      ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి ఇంత వరకూ రాష్ట్ర సమైక్యత కోసం సాధించింది ఏమీ లేదు.. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదిని అని ముఖ్యమంత్రి చెప్పుకొంటున్నా.. ఇంత వరకూ ఆయన విభజనకు వ్యతిరేకంగా చేసింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి ఇంత వరకూ కేవలం మాటల వరకే పరిమితం అయ్యాడు. అయితే.. ముఖ్యమంత్రిని సమైక్యవాదిగా పొగిడే కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కువమందే ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకరు శివరామిరెడ్డి. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగమొండి అని వ్యాఖ్యానించాడు. రాష్ట్ర సమైక్యత కోసం కిరణ్ పోరాడుతున్నాడని శివరామిరెడ్డి అన్నాడు. కిరణ్ సమైక్యవాదులలో కూడా గట్టి సమైక్యవాది అని ఆయన విభజనకు ఒప్పుకుంటారని తాను అనుకోవడం లేదని శివరామిరెడ్డి చెబుతున్నాడు. ఈ విధంగా తాను కిరణ్ భక్తుడేనని శివరామిరెడ్డి చెప్పినట్టు అయ్యింది.

కాంగ్రెసేతర పార్టీలతో జగన్ నెయ్యమా? దేనికి

  జగన్మోహన్ రెడ్డి ద్వారా తేదేపాకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే మడమ తిప్పే వంశం కాదంటూనే అనేక ‘యూ టర్నులు’ తీసుకొన్నఅతను ఇప్పుడు అకస్మాత్తుగా దేశాటనకి బయలుదేరి కాంగ్రెసేతర పార్టీలను, ప్రభుత్వాల మద్దతు కూడా గట్టాలని అనుకోవడం చూస్తే అందరికీ స్పాట్ పెట్టే కాంగ్రెస్ పార్టీకే అతను స్పాట్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాడా? అనే అనుమానం కలుగుతుంది.   అయితే అతనిని ఏ పనికోసం బెయిలిచ్చి బయటకి రప్పించిందో ఆపని చేయకుండా తన ప్రత్యర్ధులను కూడగట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకొంటుందని అనుకోవడం అమాయకత్వమే. అతని వల్ల తనకు ప్రమాదం ఉందని గ్రహించిన మరుక్షణం లోటస్ పాండ్ మీద సీబీఐ, ఈడీ చిలుకలు వాలిపోతాయని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అటువంటి పొరపాటు పని ఎన్నడు చేయడు. ఒకవేళ అతని రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నట్లుగా కాక, అతనికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి రహస్య ఒప్పందం, అనుబంధం లేదని అనుకొన్నపటికీ, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొంటే ఏమవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసుకొన్న అతను మళ్ళీ మరో మారు అటువంటి దుస్సాహసం చేయడని గట్టిగా చెప్పవచ్చును.   అందువల్ల అతను తన సమైక్య చాంపియన్ షిప్ ట్రోఫీని భద్రంగా కాపాడుకొంటూనే, మరో వైపు రాష్ట్ర విభజన సజావుగా జరిగేందుకు వీలుగా అతను ఈ ఉపాయం ఎంచుకొని ఉండవచ్చును. తద్వారా తను రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదని చెప్పుకొనే అవకాశం, పనిలో పనిగా తను కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధిననే భావన ప్రజలలో కలిగించవచ్చు. అంతేకాక సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో అతనికి రహస్య ఒప్పందం ఉందని చేస్తున్న ఆరోపణలు నిజం కాదని చాటుకొన్నట్లు అవుతుంది కూడా.

సెక్కరం తిప్పుతా సూడు!

  నాయుడు: ఒరే సత్తిగా! ఈ సంగతి ఇన్నావా?మనోడు మళ్ళీ మనల్ని ఓదార్సేందుకు ఇమానం ఎక్కి మనూరు వస్తున్నాడుట! ఇంత కాలం మనోడ్నిఆ కాంగిరేసోల్లు జైల్లో ఎట్టేయబట్టి గానీ, నేకుంటే ఎప్పుడో ఓదార్సేవాడట!   సత్తి: అవున్రా! కానీ మనోడు జైల్లో ఉన్నప్పుడు మనం ఒక్కపాలి కూడా ఎల్లి ఓదార్సనేకపోనాము. నీ కెట్టుందో గానీ నాకు మాత్రం మా సెడ్డ సిగ్గుగా ఉందిరా నాయుడూ. అయినా మనోడు మాత్రం జైలు నుండి ఇడిసిపెట్టగానే పెళ్ళాం బిడ్డలను కూడా ఓదార్సకుండా ఫస్టు మనకాడికే లగ్గెతుకొస్తున్నాడు సూడు...అందుకే నాను మనోడ్ని బాగా లైక్ సేత్తుంటా!   నాయుడు: అవున్రా సత్తిగా నాకో డవుటు..ఎవులయినా ఇన్నేళ్ళయినాక తీరిగ్గా సచ్చినోల్లని గురుతుసేసి మరీ ఓదార్సడమేటిరా ఇడ్డూరం గాకపోతే...   సత్తి: స్సీస్సీ.. ఎదవనాయాల! శుభమా అని అన్నఓదార్సేందుకు వత్తుంటే నీ ఎడుపేటిరా ఎదవన్నర ఎదవా? రిచ్చాబేరానేకపోతే బీడీ ముక్కలో, సుట్ట ముక్కలో కాల్సుకొంటూ కూకోక ఈ పిచ్చిపెశ్నలేటి?   నాయుడు: గానొరే సత్తిగా..నాకో డవుటు. అక్కడ డిల్లీలో హిందీవోల్లు అందరూ కూకోని మన రాట్రాన్ని ఇడగొట్టేస్తుంటే ‘సమేకం.. సమేకం..’ అని ఓ తెగ కలవరించే మనోడు ముందాపని సూడకుండా ఇప్పుడీ ఓదార్పులెందుకురా...పైగా ఎనకమాలే ఆ ఫోటోవోళ్ళని ఎంటేసుకొచ్చి.. ఏదో రోజూ మన్నాగే ఉల్లిగడ్డ, పచ్చిమిరిసి కొరికి గంజి తాగుతూ బతుకుతున్నోడిలా ఆ ఫోటోలకి పోజులేటి? ఇప్పుడేటయినా ఎలచన్లున్నాయా ఏటి నువ్వే సెప్పు?   సత్తి: ఒరే! నాయుడిగా అన్న దేవుడు రా...అన్న గురించి అట్టాగ మాటాడితే కళ్ళు పేలిపోతాయిరా.. ఎదవ నాయాల... ఆయనింట్లో గంజినేకనే నీ ఇంట్లో, నా ఇంట్లో గంజి తాగేందుకు వస్తున్నాడా ఏటి?ఎర్రి నాయాల?   నాయుడు: ఎహే! మనోడి బుర్ర నిండా కంతిరీ బుద్ధులే...ఉంటే, నీ బుర్రలో మాత్రం ఒట్టి మట్టి..కాదు.. కాదు బూడిదే ఉంది. నా ఏడుపేటంటే మనోడి సేతిలో కార్లు, బళ్ళేటి... రైళ్ళు, ఇమానాలున్నాయి కూడా ఉన్నాయి కదా..మరి మనోడు అవెక్కి డిల్లీ ఎల్లి ఆ హిందీ ఓల్ల కాలరట్టుకొని ‘ఎందుకురా మా రాట్రం ఇడదీత్తున్నారు ఎదవ సచ్చినోల్లారా?” అని ఆళ్ళని నాలుగు పీకి సమేకం పట్టుకురావచ్చుగదా...అని నా డవుటు..   సత్తి: ఓసోస్! ఇంతోటి తెలివి మహా నీకే ఉంది మరి. మనోడు దేశమంతా తిరిగి జనాలని పోగేసి మనకి డిల్లీ ఓళ్ళు సేత్తున్న అన్నేయం గురించి ఇడమరిసి సెప్పి వత్తాడుట! ఎప్పుడయినా పేపరు సూసిన ముఖమేనా మనది అంట?   నాయుడు: ఒరే! సత్తిగా.. మనోడికి బుర్రలో మరేటుందో నాకయితే ఎరుకనేదు గానీ... ఓటి సెప్పు. డిల్లీవోల్లు మన రాట్రం ఇడదీసేతుంటే మనోడు నేరుగా డిల్లీ ఎల్లి ఆల్లకి వార్నింగ్ ఇచ్చి రాకుండా వేరే ఎక్కడెక్కడికో ఎల్లి జనాలను పోగేసి మీటింగులేటిరా బుద్ది నేకపోతేను? ఇంతకీ మనోడు ముక్కెమంతిరవుదామనే కదా ఈ సమేకభాగోతమంతా...గానీ రేతిరికి రేతిరి మళ్ళీ మనోడి ప్లాను గానీ మారిపోనాదా ఏటి? ఇప్పుడు ఏకంగా పెదానిమంతిరి అయిపోదారనా దేశం పట్టుకొని తిరిగేందుకు సిద్దమవుతున్నాడు?   సత్తి: స్సీస్సీ..అపశకున పక్షి మనోడు ఓదార్సుతాడంటే ఏడుత్తావు. పోనీ సమేకం అంటే నిజమేనా... నమ్మ మంటవా? అని సచ్చుపెశ్నలు. ..అనుమానాలు. పోనీ నాలుగూళ్ళు తిరిగి జనాలని పోగేసి డిల్లీలో సెక్కరం తిప్పుదారని ఎల్తుంటే ఎదవ అనుమానాలు... ఎదవ ఏడుపులు స్సీస్సీ! నువ్వు సస్తే మీ ఓల్లని ఓదార్సేందుకు కూడా రావొద్దని మనోడికి నానే గట్టిగా సేపుతాలే!   నాయుడు: ఓరోరి సత్తిగా.. నాకు సానా ఇంసల్టు సేసేసినావురా! రేపు నువ్వు సచ్చినా మనోడిని నీ గుడిసెకి రానిత్తే ఒట్టు!

ఇక తుత్తి లేదు

  నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం.. అనే సూత్రాన్ని తూచా తప్పకుండా ఏ క్యారక్టర్ లోనైనా అందులో తన మార్క్ కామెడీని పండించి సినిమా విజయానికి తను కూడా ఒక కారణం అయ్యేలా తన నటనను కనబరిచారు ఏ.వియస్.. రంగుపడుద్ది ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే ఆ డైలాగ్ ని ప్రేక్షకులు మర్చిపోలేనంతగా చేసిన ఏ.వి.యస్.. ఆ సినిమా సక్సెస్ కి కీ రోల్ అనే చెప్పవచ్చు..అలాంటి ఆయన మనల్ని అందరిని శోక సముద్రంలో ముంచి తను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఒక పక్క కమెడీయన్ గా సినిమాల్లో నటిస్తూనే డైరెక్టర్ గా మంచి మంచి సినిమాలు తీసి తన లో దాగున్న క్రియేటివ్ యాంగిల్ కూడా చూపిచారు ఏవియస్‌.  యూత్ ఫుల్ కామెడీ సినిమాలు తీసి ప్రేక్షకులని అలరించారు. దర్శకుడు , నిర్మాత, రచయిత మరియు రాజకీయనాయకుడిగా. పాత్రికేయుడు గా కెరియర్ ని స్టార్ట్ చేసి ..మొదట చిన్న చిన్న వేషాలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక నట శైలిని ఏర్పరుచుకున్నాడు. నత్తి గా మరియు నంగిగా మాట్లాడే తుత్తి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో కూడా కొద్దికాలం క్రియాశీలంగా పనిచేశాడు. ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి పాత్రకు  ఓ డిఫరెంట్‌మేనరిజమ్‌క్రియేట్‌చేసి అందులోనుంచి హాస్యం పండించే అద్భుత నటన ఆయనది.. తొలి సినిమాలో తుత్తితో మొదలైన ఆయన నవ్వుల జల్లు తెలుగు సినీ అభిమానులను ఇప్పటికే ముంచెత్తుతూనే ఉంది. కేవలం క్యారెక్టర్‌ఆర్టిస్ట్‌గానే కాదు, హీరోగా కూడా మెప్పించాడు ఏవీయస్‌, తన స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హీరోస్‌సినిమాలో బ్రహ్మనందంతో కలిసి హీరోగా నటించిన ఆయన కామెడీనే కాదు ట్రాజెడీని కూడా అద్భుతంగా పడించగలనని నిరూపించుకున్నాడు. గతంలో కూడా కాలేయ వ్యాదితోనే అస్వస్థతకు గురైన ఏవియస్‌తన కూతురి కాలేయం దానం చేయటంతో తిరిగి కోలుకున్నారు. పూర్తి స్ధాయిలో కాకపోయినా సినీరంగానికి తనవంతు సేవలందించారు. నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఏవియస్‌కేవలం నటునిగా మిగిలిపోవాలనుకోలేదు.. అందుకే తనను ఆదరించిన ప్రేక్షకుల కోసం రాజకీయరంగంలోకి కూడా వచ్చారు. వారికి పక్షాలన నిలబడి ఎన్నో సేవకార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇలా తన నటనతో పాటు తన వ్యక్తిత్వంతో కూడా నూరేళ్లకు సరిపడా కీర్తిని సంపాదించుకున్న ఏవియస్‌.. ఆ జ్ఞాపకాలను వెండితెర మీద వదిలేసి ఆయన మాత్రం శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నారు. మనల్ని తన నవ్వుల జల్లులతో అలరించిన ఆయన ఆత్మ శాంతించాలని.. ఆ నవ్వుల నటుడికి నివాళి అర్పిద్దాం..  

ఈడెన్ లో భారత్ ఘన విజయం

  ఈడెన్ గార్డెన్ లో భారత్-వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ను భారత్ ముడురోజుల్లో ముగించి విజయపతాకం ఎగురవేసింది. రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకోగా, మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చారు. మొదటి ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసిన వెస్టిండీస్, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ మొదటి ఇన్నిం గ్స్ లో 453 పరుగులు చేసింది. 177 పరుగులతో మ్యాచ్ ను ఒంటి చేత్తో నడిపించిన రోహిత్ శర్మ, అలాగే ఒకే మ్యాచ్ లో 9 వికెట్లు తీసి మ్యాచ్ ను శాసించిన మహ్మద్ షమీ ఇద్దరు సూపర్ హీరోలుగా నిలిచారు. రోహిత్ కు అండగా సెంచరితో కదం తొక్కిన బౌలర్ అశ్విన్ ని కూడా మరువకూడదు. ఇంకా 5 రోజులు మ్యాచ్ సాగుతుంది. సచిన్ బ్యాటింగ్ మళ్లీ రెండోసారి చుద్దామని అనుకున్న ఆయన అభిమానులందరికి నిరాశే మిగిలింది. అయితే సచిన్ ఆడుతున్న199 టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిందనే సంతృప్తితో అభిమానులు అతనికి ఈడెన్ గార్డెన్ మైదానంలో ఘనంగా వీడ్కోలు పలికారు.

నటుడు ఏవీఎస్ కు తీవ్ర అస్వస్థత

      సినీ నటుడు, దర్శకుడు ఏవీఎస్ తీవ్ర అస్వస్థతకు గురై హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఏవీఎస్‌ బాధపడ్తున్నారు. కొంతకాలం క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఏవీఎస్‌కి అప్పట్లో కాలేయ మార్పిడి చికిత్స కూడా జరిగింది. ఆయన కుమార్తె, తన తండ్రికి తన కాలేయంలోని కొంత బాగాన్ని దానం చేయడంతో, ప్రాణాపాయం నుంచి అప్పట్లో ఏవీఎస్‌ కోలుకున్నారు. మరోమారు కాలేయ సంబంధిత అనారోగ్యం తలెత్తడంతో ఏవీఎస్‌ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.ఏవీఎస్ త్వరగా కోలుకుని, తిరిగి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని ఆకాంక్షిద్దాం.

విశాఖ వాసుల గుండెల్లో జగనన్న బాణం

      జగనన్న వదిలిన బాణం షర్మిల ఈమధ్య ఎక్కడా ఎవరికీ కనబడటం లేదు. మళ్ళీ కొంచెం పదును పెట్టుకొన్నతరువాత రివ్వున విశాఖ లోక్ సభ సీటుని లక్ష్యంగా చేసుకొని దూసుకు రాబోతునట్లు సమాచారం. ఎందుకంటే ఆమె ఆశిస్తున్న కడప సీటుని అవినాష్ రెడ్డికి కేటాయించినట్లు సమాచారం. అందువల్ల విశాఖలో పురందేశ్వరితో సర్దుకుపోమ్మని నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.   అయితే చాన్నాలుగా సుబ్బిరామిరెడ్డి పెడుతున్నపొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నపురందేశ్వరి పక్కనున్న నర్సాపురానికో మరో చోటికో జంప్ అయిపోతే, అప్పుడు ఆమె స్థానంలోకి ‘హరోం హర’ అంటూ సుబ్బి రామిరెడ్డి దూకి శివ తాండవం చేసేయడం ఖాయం. విశాఖ బీచ్ వరకు వేళ్ళు పాకిపోయున్న ఆయనతో డ్డీ కొనాలంటే షర్మిల కూడా ఏదో ఒక కార్డ్ వేయక తప్పదు. లేకుంటే ఆమె నాన్-లోకల్ అని సుబ్బడు శివాలెత్తిపోతాడు. తన బ్రదర్ జగన్ ప్రజలని ఓ పక్క ఒదార్చుతుంటే, హస్బండ్ అనిల్ కుమార్ చేత ‘అల్లెలూయ’ పాడిస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడమే తడువు దానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేసినట్లు సమాచారం. వచ్చేనెల 6 నుండి ఓ మూడు రోజులపాటు హస్బండ్ అనిల్ కుమార్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సువార్త సభలకి డేట్స్ ఫిక్స్ అవడంతో, స్థానిక వైకాపా నేత రాకుర్తి చక్రధరరావు అందుకు ఓ చేయి వేస్తున్నారని సమాచారం.

ఏమిటిది ఎర్రబెల్లీ?!

      తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కాంగ్రెస్ పార్టీలో తరహాలో ఎవరుపడితే వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడటం, మీడియాలోకి ఎక్కి రచ్చచేయడం తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఈ క్రమశిక్షణే ఆ పార్టీకి ప్రజల్లో గౌరవాన్ని పెంచింది. ఆ క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటి కేడర్‌ని సంపాదించిపెట్టింది. అలాంటి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరు తెచ్చుకున్న ఎర్రబెల్లి దయాకరరావు ఈమధ్యకాలంలో గీతదాటి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.   పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్ వంటి తన సహచరుల మీద ఎర్రబెల్లి మాటల దాడి చేయడం చాలామందిని విస్మయానికి గురి చేసింది. తెలుగుజాతి క్షేమంగా వుండాలని, రాష్ట్ర విభజన కారణంగా ఏ ప్రాంతంలోని తెలుగువారూ నష్టపోకూడదని తన శాయశక్తులా కృషి చేస్తున్న చంద్రబాబుకు తన తమ్ముడు ఎర్రబెల్లి ధోరణి కొంత ఇబ్బందికరమే. అయినప్పటికీ, ఎర్రబెల్లి ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన ఎర్రబెల్లి గీత దాటడాన్ని సహించారు. అయితే తెలుగుదేశం పార్టీలో వున్న తెలంగాణ నాయకులు కూడా ఎర్రబెల్లి అంత బాహాటంగా తన సహచరుల మీద విమర్శల వర్షం కురిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను సరిదిద్దడానికి, ప్రమాదంలో పడిన తెలుగుజాతిని కాపాడటానికి ఓవైపు చంద్రబాబు నాయుడు శ్రమిస్తుంటే, మరోవైపు ఎర్రబెల్లి ఇలా గీత దాటి మాట్లాడటం న్యాయం కాదని అంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో నాయకుడి వెంట నిలబడి నైతిక మద్దతు ఇచ్చి సమస్యల పరిష్కారానికి సహకరించాలే తప్ప తానే ఒక సమస్య కావడం ఎర్రబెల్లికి తగదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఎర్రబెల్లి తన దూకుడును తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసిన చంద్రబాబు చిత్తశుద్ధి ఎర్రబెల్లికి తెలియనిది కాదని అంటున్నారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: బాబు

      “మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఓట్లు, సీట్ల కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తోంది. బొగ్గు కుంభకోణంతో ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతింటోందని తేలింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది” అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో దేశంలోని విద్యావంతులు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయవద్దని విజ్ఞప్తి చేశారు.     కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనంతో రూపాయి విలువ క్షీణిస్తుందని, ఎఫ్ డీఐలను ఆహ్వానించినా రూపాయి విలువ పెరగడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కొత్త ప్రాజెక్టులు కూడా రావడం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థ 1999కంటే ముందున్న రేటుకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ ఓట్లేయరని …గ్రామాలలో చదువుకోని వారు కాంగ్రెస్ కు ఓటేయకుండా కార్యకర్తలు చైతన్యం చేయాలని సూచించారు.

విభజనకు కిరణ్ ఒప్పుకున్నారా?

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒప్పుకున్నాడా ? ఆయన సీడబ్లూసీ తీర్మానాన్ని ఆమోదించాడా ? కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ చెబుతున్న దాని ప్రకారం ఆయన తెలంగాణకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించే పరిస్థితి లేదు. ఆయన అధిష్టానానికి విశ్వాస పాత్రుడు. ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ లోనే పనిచేశారు. వారి కుటుంబ సభ్యులు అందరూ కాంగ్రెస్ కు విధేయులే. ముఖ్యమంత్రిగా ఆయన మాటలు ఆయనకే సంబంధం. సీడబ్లూసీ నిర్ణయానికి ఆయన ఒప్పుకున్నారు. ఎవరయినా దానికి కట్టుబడి ఉండాల్సిందే” అని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.   సీమాంధ్ర లోని సమస్యలను పరిష్కరించడానికి జీవోఎం ఉందని, ఏ సమస్యలయినా దాని దృష్టికి తేవాలని,తెలంగాణ విషయంలో వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని, తమ పార్టీ యూటర్న్ తీసుకునే పార్టీ కాదని, ఈ నెలాఖరులో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని దిగ్విజయ్ తెలిపారు.