అన్నగారి శత్రువులు..బాలయ్య కు మిత్రులు!
నందమూరి వంశానికి, వారి స్వగ్రామం నిమ్మకూరుకి ఉన్నప్రత్యేక అనుబంధం గురించి అందరికి తెలిసిన విషయమే. స్వగ్రామం అంటే ప్రాణాలు పెట్టే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తన ప్రతీ పధకాన్ని నిమ్మకూరు నుండే ప్రారంభం కావాలని కోరుకొనేవారు. సాధారణంగా అటువంటి గ్రామాలలో స్థానిక నేతల చేతుల్లో జరిగే శంకు స్థాపనల వంటి చిన్నచిన్న కార్యక్రమాలకు కూడా స్వగ్రామంపై అభిమానంతో ఆయనే స్వయంగావచ్చి తన స్వహస్తలతో చేసేందుకు ఇష్టపడేవారు.
నిమ్మకూరు అంటే అంత వెర్రి అభిమానం చూపే ఆయన, 1987 ఆగస్టులో నిమ్మకూరు పర్యటించనున్న తరుణంలో, కారణాలు ఏవయినప్పటికీ ఆయన తోడల్లుడు నందమూరి చంద్రం కుమారుడు వెంకటరత్నం, పార్టీ జెండా దిమ్మెను స్వయంగా తన ట్రాక్టర్ తో కూలగొట్టడంతో, తీవ్ర కలత చెందిన యన్టీఆర్ ఇక మళ్ళీ తన జీవితంలోఆ గ్రామంలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, ఆ తరువాత ఎంత మంది నచ్చజెప్పాలని చూసినా, ఎవరెన్ని సార్లు క్షమాపణలు కోరినా ఆయన తన మనసు మార్చుకోలేదు. స్వంత బందువయి ఉండి కూడా తను స్థాపించిన పార్టీ జెండాని అవమానించారనే బాధతో వారి కుటుంబాన్నికూడా చనిపోయే వరకు దూరంగానే ఉంచారు. ఆ తరువాత కూడా యన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా వెంకటరత్నంని కానీ, ఆయన కుటుంబ సభ్యుల వైపు కానీ కన్నెత్తి చూడలేదు.
అయినప్పటికీ, వారందరికీ నేటికీ నిమ్మకూరు అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది. అదేవిధంగా నిమ్మకూరు వాసులకు కూడా నందమూరి కుటుంబం అంటే ఎనలేని అభిమానం. అయితే, ఆనాడు జరిగిన దానిని ఇంకా మనసులో పెట్టుకొని తన వారిని తన గ్రామాన్ని దూరం చేసుకోవడం ఎందుకనుకున్నారో, లేక పార్టీలో మారుతున్న సమీకరణాలకు అనువుగా తను కూడా బలం పెంచుకోవాలని తలచేరో తెలియదు కానీ, నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఆగ్రహానికి గురయిన తమ బందువు వెంకటరత్నం ఇంట్లో చాలా ఏళ్ల తరువాత ఈ మద్యనే అడుగు పెట్టారు. అంతే కాకుండా ఆయన కుమారుడు శివరామకృష్ణ ఇంట్లో కూడా బస చేశారు. అయితే, అదే ఊరిలో జూ.యన్టీఆర్ నెలకొల్పిన తన తల్లితండ్రుల విగ్రహలవైపు ఆయన కన్నెత్తి చూడకపోవడంతో, అక్కడ నివసిస్తున్న నందమూరి వంశస్తులు కోరిక మీద విగ్రహాలకు పూలమాలలు వేసి, అక్కడి నుండి మళ్ళీ నేరుగా శివరామకృష్ణ ఇంటికి వెళ్ళిపోయారు.
బాలకృష్ణ ఈ విధంగా అకస్మాత్తుగా వారిపట్ల ఇంత అభిమానంగా వ్యవహరించడం అక్కడి ప్రజలనే కాకుండా, వెంకటరత్నం అతని కుమారుడు శివరామకృష్ణలను కూడా ఆశ్చర్య పరిచింది. అయితే, ఇందుకు కారణాలు ఇదమిద్ధంగా ఎవరూ చెప్పలేకపోయినప్పటికీ, తన సోదరుడు హరికృష్ణతో, అతని కుమారుడు జూ.యన్టీఆర్ తో పెరిగిన దూరం వల్లనే ఆయన తన స్వగ్రామంలో నివశిస్తున్న నందమూరి వంశస్తులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చును.
అంతే గాక, వచ్చే ఎన్నికలలో తప్పకుండా శాసనసభకే పోటీ చేస్తానని పదేపదే చెపుతున్న బాలకృష్ణ బహుశః నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజక వర్గం నుండే పోటీ చేయాలని భావిస్తునట్లయితే, ఆ ప్రయత్నాలలో భాగంగానే పాత విబేధాలు పక్కన పెట్టి, మళ్ళీ తనవారి మద్దతు కూడగట్టుకొంటునారని భావించవచ్చును.
జూ.యన్టీఆర్ స్థాపించాడనే కారణంతో, తన తల్లితండ్రుల విగ్రహాలకు కూడా బాలకృష్ణ పూలదండలు వేయడానికి ఇష్టపడక పోవడం చూస్తే, ఆయనకి తన సోదరుడు హరికృష్ణపై, అతని కుమారుడు జూ.యన్టీఆర్ పై ఎంత కోపం ఉందో అర్ధం అవుతోంది. ఇక, బాలకృష్ణ చర్యలకు ఆయన సోదరుడు ఎటువంటి ప్రతిచర్యలు ప్రదర్శిస్తారనే దానిని బట్టి బాలకృష్ణ అంతర్యం అర్ధం చేసుకొనే వీలుంటుంది.
కానీ, తన తండ్రి వద్దనుకొన్నవెంకటరత్నం, అతని కుమారుడు శివరామకృష్ణలను కూడా అక్కున చేర్చుకొనేందుకు సిద్దపడుతున్న బాలకృష్ణ, స్వయాన్న తన సోదరుడిని, అతని కుమారుడిని ద్వేషించడం, దూరం చేసుకోవడం సమంజసంగా లేదు. ఈ రోజు వారినిరువురినీ ద్వేషించి, మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఇదే విధంగా మనసు మార్చుకొని పాత కక్షలను, మనస్పర్ధలను పక్కన బెట్టి కలుసుకొందామని ఆయన భావించవచ్చును. కానీ, అప్పటికే చాలా ఆలస్యం, తిరిగి చక్కదిద్దుకోలేనంత నష్టం జరిగిపోయి ఉంటుంది.
మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బ్యానర్లను ఆయుధంగా చేసుకొని తమతో ఆడుకోగలిగిదంటే కారణం వారి ఈ బలహీనతలు అది కనిపెట్టగలిగినందునేనని చెప్పవచ్చును. అందుకే పెద్దలు ‘ఇంటి గుట్టు లంకకు చేట’న్నారు.