ఒం‘గోల్’మాల్!

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒంగోలు రాజధాని అయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఒంగోలు కొత్త రాజధాని అయ్యే అవకాశాలు గోల్‌మాల్ అయిపోయినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఒంగోలు పరిసరాల్లో చాలా విస్తారంగా ప్రభుత్వ స్థలాలు వుండటం, కొత్త రాజధాని ఏర్పడాలంటే ప్రభుత్వ స్థలాల అవసరం చాలా వుండటం, ఇటు కోస్తాంధ్రకు, అటు రాయలసీమకు రాజధానికి సంబంధించిన అనుసంధానం బాగా వుండాలంటే రాజధానిగా ఒంగోలు కరెక్ట్ అనే అభిప్రాయాలు గతంలో వినిపించాయి. ఒంగోలు రాజధాని కాబోతోందన్న ఊహాగానాలతో ఒంగోలులో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒంగోలు పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల గురించి ఆరా తీయడం, ప్రభుత్వ భూములను గుర్తించి వాటికి ఫెన్సింగ్స్ నిర్మించడం చూసి ఇక ఒంగోలు రాజధాని అయిపోవడం ఖాయమని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆశలు, అంచనాలు అన్నీ అడుగంటిపోయాయి. సీమాంధ్ర నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు విజయవాడ-గుంటూరు మధ్యలో కొత్త రాజధాని వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు కూడా చేస్తున్నారు. ఈ రెండు జంట నగరాల మధ్య రాజధాని ఏర్పడితో కోస్తాంధ్రతోపాటు ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ ప్రజలకు కూడా అనుకూలంగా వుంటుందని చెబుతున్నారు. విశాఖపట్నం రాజధాని అవ్వాలని ఉత్తరాంధ్ర వాసులకు, గతంలో కర్నూలును త్యాగం చేశాం కాబట్టి కొత్త రాజధాని రాయలసీమలోనే ఉండాలని రాయలసీమ వాసులు కోరుకుంటున్నప్పటికీ మెజారిటీ అభిప్రాయం విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని వుండాలని వినిపిస్తోంది. పాపం రాజధాని హోదా వస్తుందని ఆశలు పెట్టుకున్న ఒంగోలు మాత్రం తనను పట్టించుకునేవారే లేకపోవడంతో రాజధాని రేసు నుంచి తప్పుకునే స్థితికి వచ్చేసింది. ఒంగోలు ప్రాంతంతో సంబంధం వున్న దగ్గుబాటి పురంద్రేశ్వరి, పనబాక లక్ష్మి, జేడీ శీలం కూడా ఒంగోలు గురించి మాట్లాడటం లేదు. అందరి గోల్ విజయవాడ-గుంటూరు మధ్యే ఉన్నప్పుడు ఒంగోల్ గోల్‌మాల్ కాక మరేమవుతుంది?  

చిరు మళ్ళీ దొరికిపోయాడు..!

      కేంద్రమంత్రి చిరంజీవి తనలోని సమైక్యవాదాన్ని నిరూపించుకోవడానికి, చాటడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పదవిని పట్టుకొని వేలాడుతున్న ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా సీమాంధ్ర ప్రజలను మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి చిదంబరంను కలిసిన మెగాస్టార్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మార్గం లేదని అన్నాడు. హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరి భాగస్వామ్యం ఉందన్నాడు. సీమాంధ్ర సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని చిరంజీవి చెప్పుకొచ్చాడు.   మరి ఇంతలా సమైక్యవాదాన్ని మేడమ్ కు వినిపించామని అంటున్న చిరంజీవి అంతలోనే విభజన గురించి మాట్లాడాడు. సమైక్యానికి మించిన పరిష్కారం లేదన్న ఈ నేత విభజన చేయదలుచుకొంటే.. అంటూ హైదరాబాద్ గురించి మరోసారి ఆలోచించాలని కోరామని అన్నాడు! ఉద్యోగులు, విద్యార్థుల భయాలు తొలగించాలని సూచించామని, హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి భద్రత కల్పిస్తారో చెప్పాలని కోరామని, అందరికీ న్యాయం చేయాలని, తమ అనుమానాలు తీర్చాలని కోరినట్టు చెప్పాడు. ఇక్కడ కామెడీ ఏమిటంటే.. సమైక్యతకు మించిన పరిష్కారం లేదంటూనే.. విభజన గురించి మాట్లాడటం. మనసా కర్మనా వాచా సమైక్యానికి కట్టుబడి ఉంటామన్న ఇలాంటి నేత మదిలోకి విభజన జరిగితే అనే ఐడియా ఎలా వస్తోంది?

ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కమ్మని దిలీ నుండి పిలుపు రావడంతో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ రాష్ట్రవిభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నకారణంగా, ఆయనను ఎప్పుడయినా ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నతరుణంలో ఆయనకు డిల్లీ నుండి పిలుపురావడం, ఆయన నిన్నసాయంత్రం హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలవడం చర్చనీయాంశమైంది. దాదాపు గంట సేపు సాగిన వారి వీరి భేటీలో ఇరువురు ఏమి చర్చించారనేది తెలియలేదు.   ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం డిల్లీలో జరుగనున్నసమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా, డిప్యూటీ సీం రాజనరసింహ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తదితరులు పాల్గొని రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడం, పార్టీ పరిస్థితి, శాసనసభలో తెలంగాణా బిల్లు ఆమోదం తదితర అంశాలను చర్చించవచ్చును.

గులాబీ కారు స్టీరింగ్ కాంగ్రెస్ హస్తానికి దక్కుతుందా

  కాంగ్రెస్ విలీనం అంటోంది. తెరాస అప్పుడే కాదంటోంది. ఇంకా గట్టిగా అడిగితే పో..పొమ్మంటోంది. ఎందుకు? ఎందుకంటే మంచి బలమయిన కారణాలే ఉన్నాయి. నరేంద్ర మోడీ రంగంలోకి దిగడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ వెలవెలబోతున్నాడనేది ఎవరూ కాదనలేని సత్యం. మోడీ సారధ్యంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా లేదా? అనే భేతాళ ప్రశ్నకు ఇప్పుడు జవాబు చెప్పడం కష్టమే. గానీ, ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోగల సమర్ధుడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.   మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయడం అంటే రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే. రాహుల్ సుడి బాగుండి కాంగ్రెస్ గెలిస్తే పరవాలేదు. కానీ, కాంగ్రెస్ ఓడిపోయి మోడీ ప్రధాని కుర్చీలో కూర్చొంటే? అప్పటికే తెరాస కాంగ్రెస్ విలీనం అయిపోయుంటే? చేజేతులా ఒక సువర్ణావకాశాన్ని వదులుకొన్నట్లే! అందుకే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఇష్టపడటం లేదు. మహా అయితే ఆ పార్టీతో ఎన్నికల పొత్తులకు అంగీకరించవచ్చేమో. తద్వారా 2014లో కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచినా కూడా తెరాస కారుకి అవసరమయినంత డీజిల్ సంపాదించుకోవచ్చును.   ఇక మరో న్యాయమయిన కారణం ఏమిటంటే పదేళ్ళు కష్టపడి ఉద్యమాలు చేసిన తరువాత, తీరా చేసి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న తరుణంలో తెరాసను కాంగ్రెస్ హస్తంలో పెట్టి, కేసీఆర్ తో సహా పార్టీ నేతలందరూ మంత్రి పదవుల కోసం సోనియమ్మ ముందు చేతులు కట్టుకొని నిలబడతారని ఎవరూ ఊహించలేరు. కానీ కాంగ్రెస్ మాత్రం అది సాధ్యమేనని నమ్మడం విచిత్రం! తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే గులాబీ కారు స్టీరింగు తిప్పే అవకాశం కళ్ళెదుట కనబడుతుంటే, ఆ అవకాశం కాదనుకొని కాంగ్రెస్ కి తమ కారు అప్పగించేసి దామోదర్, జానా రెడ్డి, గీతారెడ్డి వంటి వారు వంతుల వారిగా స్టీరింగు తిప్పుతుంటే , తాము మాత్రం ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ వెనుక సీటులో కూర్చోవలని ఎంత బుద్ది తక్కువ రాజకీయ నాయకుడయినా కోరుకోడు. మరి ఆవులిస్తే ప్రేగులు లెక్కజెప్పగల సమర్ధుడు కేసీఆర్ ఎలా ఒప్పుకొంటాడని కాంగ్రెస్ భావిస్తోందో మరి తెలియదు.   బహుశః తన పెంపుడు చిలుకలు సీబీఐ, ఆదాయపన్ను,ఈడీలను చూసుకొనే భరోసాగా ఉందేమో!

విశాఖ వన్డే పై కాంగ్రెస్‌లో వార్

  ఈ నెల 24 న ఇండియా వెస్టిండీస్‌కు మధ్యజరగనున్న వన్‌ డే మ్యాచ్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆదిపత్యపోరుకు తెరతీసింది. విశాఖలో జరగనున్న ఈ మ్యాచ్‌ విషయంలో అదే జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యులు కత్తులు దూసుకుంటున్నారు.   ప్రస్తుతం విశాఖ జిల్లాలో సమైక్య పోరు ఉదృతంగా సాగుతున్న నేపధ్యంలో మ్యాచ్ జరపొద్దంటూ బీసీసీఐ కి లేఖ రాయాలని మంత్రి గంటా కలెక్టరును కోరారు అంతేకాదు స్వయంగా తానే మ్యాచ్‌ను అడ్డుకుంటానంటూ బహిరంగంగానే హెచ్చరించారు.   అయితే గంట వ్యాఖ్యలకు ఆయన రాజకీయ ప్రత్యర్థి గళం విప్పారు.  ఆరు నూరైనా విశాఖలో మ్యాచ్‌ జరిగి తీరుతుందని మంత్రి బాలరాజు ప్రకటించారు. మ్యాచ్ రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయాల్సిన అవసరం లేదన్నారు. మ్యాచ్‌ను అడ్డుకుంటే విశాఖ ఖ్యాతిని దిగజార్చినట్టే అవుతుందని పరోక్షంగా గంటను విమర్శించారు.  

సిబిఐ ఏర్పాటు చెల్లదు

  పలు కేసుల్లో సంచలనాలను నమోదు చేయటంతో పాటు విమర్శలను మూట గట్టుకుంటున్న సిబిఐ పై ఇప్పుడు మరో వివాదం రేగింది. భారత దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’(సీబీఐ) ఏర్పాటే అసలు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదని గౌహతి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్‌ ఐ ఎ అన్సారీ, జస్టిస్‌ ఇందిరా షాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. 1963 ఏప్రిల్‌ 1న కేంద్రహోం శాఖ సీబిఐని ఏర్పాటు చేస్తూ చేసిన తీర్మానాన్ని కోర్టు కొట్టేసింది.   నేర దర్యాప్తు అధికారం కలిగిన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ని కేవలం ఆ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వార ఏర్పాటు చేయటం కుదరదని కోర్టు అభిప్రాయపడింది. అలా ఓ పోలీస్‌ శాఖను ఏర్పాటు చేయాలంటే చట్టం తప్పని సరి అని కోర్టు స్పష్టం చేసింది.  అప్పట్లో సిబిఐ ఏర్పాటు విషయంలో కేబినెట్‌ నిర్ణయంగాని, రాష్ట్రపతి ఆమోదం గాని ఆర్డినెన్స్‌ లాంటివి ఏవి జరగలేదని కాబట్టి సిబిఐకి రాజ్యంగ బద్దత లేదని స్పష్టం చేసింది.   అంతేకాదు హోం శాఖ తీర్మానంతో ఏర్పాటైన ఒక పోలీసు దళం.. ఒక నిందితుడిని అరెస్టు చేయటం, దాడులు, తనిఖీలు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, చార్జిషీట్లు దాఖలు చేయటం, నిందితుడిని ప్రాసిక్యూట్ చేయటం లాంటి చర్యలన్నిటినీ రాజ్యాంగ విరుద్ధంగా పరిగణిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.  

రోజు కూలీలకు ఐటి నోటీసులు

  వేల కోట్లు కొల్లగొట్టిన వారిని హాయిగా బయట తిరగనిస్తున్న ఆదాయపన్ను శాఖ రోజు కూలీతో బతికే బడుగు జీవుల మీద కొరడా జులిపిస్తుంది. కేవలం బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారంతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలను ఐటి నోటిసులతో వేదిస్తుంది.   ఇందులో భాగంగానే పిల్లల చదువుల కోసం, దూర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి ఖాతాలకు డబ్బు పంపించిన వారికి ఈ మధ్య నోటీసులు జారీ చేసింది ఆదాయపన్నుశాఖ. పాన్ నెంబర్ లేకుండా ఏడాదిలో రూ.5 లక్షలకు మించి జరిగిన లావాదేవీలకు లెక్కలు చూపాలని నోటిసులో పేర్కొంది. దాదాపు ఆరువేల మందికి ఇటువంటి నోటీసులను జారీ చేసింది.   అయితే విచిత్రం ఏంటంటే ఇందులో దాదాపు 1200 మంది దిగువ మద్యతరగతి ప్రజలు ఉండగా, 14 మంది కేవలం రోజు కూలి మీద బతికే బడుగుజీవులు ఉన్నారు. వారి పిల్లల చదువుకోసమో లేక వ్యవసాయం చేసుకోవడానికి అప్పుగానో తామీ సొమ్ముతీసకున్నామని బాదితులు చెపుతున్నారు. అయితే అప్పు ఇచ్చిన వారి వివరాలైన తెలియజేయాలని ఐటి కోరుతుండటంతో ఇక పై తమకు సాయం అందటం కూడా కష్టం అంటున్నారు బాదితులు.  

కాంగ్రెస్ కి తెరాసకి మధ్య కార్పోరేట్ అడ్డుగోడలున్నాయా

  తెలంగాణా సాధనలో తెరాస పాత్ర గురించి ప్రత్యేకంగా పేర్కొనవలసిన పనిలేదు. అయితే ఒక ప్రముఖ వెబ్ సైట్ తాజా సంచికలో తెరాస మరియు కేసీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు పేర్కొంది.   తెలంగాణా ఏర్పడిన మూడు నాలుగు సం.లలోనే మిగులు విద్యుత్ ఉత్పత్తి సాధించే విధంగా అనేక ప్రణాళికలు తమ వద్ద సిద్దంగా ఉన్నాయని ఇంతవరకు చెపుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు కొత్తగా కేజీ బేసిన్ నుండి తమకు వాటా కేటాయించాలని డిమాండ్ చేయడం, కేవలం అక్కడి పార్టీలలో కలకలం సృష్టించి విభజన ప్రక్రియను ఆలస్యం చేయడానికేనని పేర్కొంది.   తెరాసను విలీనం చేయడానికి ఇష్టపడితే కె.తారక రామారావుకి ఉపముఖ్యమంత్రి పదవి, కవితకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, కానీ కేసీఆర్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని మంకు పట్టుపట్టడంతో జాప్యం జరుగుతోందని సదరు వెబ్ సైట్ పేర్కొంది.   అయితే కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయవద్దని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తరపున గుజరాత్ లోని కొన్నిపెద్ద కార్పోరేట్ సంస్థల నుండి కేసీఆర్ కు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ తో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తే, తెరాస ఎన్నికల ఖర్చులు భరించగలమని సదరు సంస్థల ప్రతినిధులు హామీ ఇస్తున్నట్లుగా తెరాస నేతలు కొందరు చెప్పినట్లు పేర్కొంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు ‘షరతులు లేని తెలంగాణా’ అనే కొత్త పల్లవి అందుకొన్నారని పేర్కొంది.   బీజేపీతో తెదేపా కూడా స్నేహం చేయాలనీ ఆశిస్తున్నపటికీ, తెలంగాణాలో బలంగా ఉన్నబీజేపీ ఒత్తిడి మేరకు మోడీ ఆ ఆలోచనను ప్రస్తుతం పక్కనబెట్టి తెరాసకు గాలం వేస్తున్నారని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే బేషరతుగా మద్దతు ఇస్తామనిఇంతవరకు బీజేపీ అధిష్టానం హామీ ఇస్తున్నపటికీ, ఆఖరి క్షణంలో ఆపార్టీ తన నిర్ణయం మార్చుకోవచ్చని పేర్కొంది. రాజకీయ పార్టీలన్నీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తాయని సదరు వెబ్ సైట్ పేర్కొంది. అయితే ఇదంతా నిజమని నమ్మకపోయినప్పటికీ, నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు ఇందులో ఎంతో కొంత యదార్ధం ఉంది ఉండవచ్చును.

యధా రాహుల్ తధా సోనియా

  కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ రాజస్తాన్ లో ఎన్నికల ప్రచార సభలో త్యాగమయమయిన తన వంశ చరిత్ర తిరగేసి, అందులో ఏదో ఒకరోజు తన పేరు కూడా ఉంటుందని కొంచెం సెంటిమెంటు జోడించారు. “కాంగ్రెస్ పాలన గురించి చెప్పుకోవడానికి ఏమే లేనందునే గురుడు అలా సెంటిమెంటుతో జనాలని కొడుతున్నాడని” బీజేపీ ఎద్దేవా చేసింది. అతనేదో మ్యాటర్ లేక అలా సరిబెట్టేసాడని అని అనుకొన్నా, కాంగ్రెస్ పార్టీని, యావత్ దేశాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న సోనియమ్మ కూడా సెంటిమెంటు పాయింటే ఎత్తుకోవడం ఆశ్చర్యం కలిగించింది.   ఈ రోజు ఛత్తిస్ ఘర్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన ఆమె కూడా ముందుగా త్యాగమయమయిన తన వంశ చరిత్ర ఏకరువు పెట్టి, ఈ ఏడాది మే నెలలో ఆ రాష్ట్రంలో నక్సల్స్ దాడిలో మరణించిన కాంగ్రెస్ నేతలది కూడా ‘సేమ్ టు సేమ్ హిస్టరీ’ అని సర్టిఫై చేసారు. అయితే నక్సల్స్ దాడిలో మరణించిన వారు ఏవిధంగా త్యాగమూర్తుల కోవలోకి వస్తారో ఆమె వివరించలేదు. (రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారు కూడా త్యాగమూర్తుల కోవలోకి వస్తారో లేదో కన్ఫర్మ్ చేసుకోవలసి ఉంది.) ఇక రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అసమర్ధత వల్లనే రాష్ట్రంలో దారిద్ర్యం, నక్సల్స్ సమస్య వగైరాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. (కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ అభివృద్ధి దిశలో పైపైకి దూసుకుపోతున్నాయని చెప్పడానికి నిన్న మన రాష్ట్రం నుండి అంగారక గ్రహంపైకి దూసుకుపోయిన పీ.యస్.యల్వీ. ఒక గొప్ప ఉదాహారణ).   కాంగ్రెస్ అంటేనే త్యాగాల పుట్ట అని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని ఆమె అక్కడి ప్రజలకు వివరించారు. వారికి కూడా సుఖంగా జీవించాలని కోరిక ఉంటే ఈ నెల 11న జరగనున్న శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించేస్తే, ఇక వారి జీవితాలే మారిపోతాయని ఆమె హామీ ఇచ్చారు.   రేపు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడితే బహుశః ఇదే తరహ ఉపన్యాసం రిపీట్ అవుతుందేమో.

'విభజన'కు తెలుగేతర శక్తులు కుట్రపన్నుతున్న వేళ ...

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     దేశ స్వాతంత్ర్యానంతరం భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ముందు ఆంధ్రరాష్ట్రంగా, ఆ పిమ్మట తెలుగుప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను కలుపుకుని మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి పురోభివృద్ధి చెందుతున్న తెలుగుజాతిని బలవంతంగా విడగొట్టే ప్రయత్నంలో చరిత్రలో మొదటిసారిగా జాతీయ కాంగ్రెస్ లోని, దాని కేంద్రప్రభుత్వంలోని తెలుగేతర శక్తులన్నీ ఏకమవుతున్న వేళ జాతి యావత్తు - మూడుప్రాంతాలలోని తెలుగుప్రజలూ ముప్పేటగా ప్రతిఘటించవలసిన తరుణం ఎప్పటికన్న కూడా ఇప్పుడు వచ్చింది; తెలుగుజాతి ఉనికిని భంగపరిచే కుట్రకు తెలుగేతరులతో చేతులు కలిపిన స్వార్థపరులూ, విద్రోహులూ తెలుగువారి మధ్యనే ఉండటం ఏమాత్రం సహించరాని పరిణామం. "ఇంటిదొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడ''న్న సామెత వచ్చింది! ఈ ఇంటిదొంగల విద్రోహాన్ని కనిపెట్టిన తెలుగేతర శక్తులు ఆ దొంగల్ని వినియోగించుకుని "2009 డిసెంబర్ 9''న ఢిల్లీనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజం నాటేందుకు ముందుకొచ్చారు. ఈ "విభజన'' ప్రాతిపాదనకు కారకులైన స్థానిక విద్రోహులు ముగ్గురూ పచ్చి పదవీ కాంక్షాపరులూ, స్వార్థపరులూ, రాజకీయ నిరుద్యోగంతో "లంఖణాలు'' పడుతూ వచ్చిన సీమాంధ్రులే కావటం మరీ దారుణమైన పరిణామం. ఈ ముగ్గురూ జాతి చరిత్ర, దేశచరిత్రా తెలియని మూర్ఖులే.     వీరిలో ఒకరు ఒక స్థానిక పార్టీకి అధ్యక్షుడూ, మాజీ ముఖ్యమంత్రీకాగా, మరొకరు మరో స్థానిక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ఒక మాజీమంత్రి, పచ్చి అవకాశవాదే గాకుండా ఒక ప్రాంతానికి ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి పదవికి 'ఏతాం' ఎత్తిన 'దొర', ఇంకో నాయకుడు లాడ్జింగ్ ల వ్యాపారంలో రకరకాల వ్యాపకాల కోసం లాడ్జింగ్ ల నిర్వహణలో కాకలు తీరడం ద్వారా రాజకీయాల్లోకి దూసుకువచ్చిన మహానుభావుడు, ఒక స్థానిక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడూ! వీరిలో ఒకరు తెలంగాణాకు వలసవచ్చి స్థానిక ప్రజల్ని దోపిడీ చేయడంలో మొనగాడుగా మారి, ఆ సంపదను రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణా ప్రజల్ని ముఖ్యంగా దళితవర్గాల ప్రజలను నానాయాతనలు పెట్టడానికి 'ఉద్యమిం'చినవాడు; ఆ పదవీ స్వలాభం కోసం తోటి తెలుగు యువకులను, నిరుద్యోగ యువతను పచ్చిఅబద్ధాలతో తెలుగుజాతికే వ్యతిరేకంగా అనేక ప్రలోభాలతో ఉద్రేకపరిచి, బలవంతాన వందలాది మందిని ఆత్మహత్యల వైపు ప్రోత్సహించిన వాడు; ఆ క్రమంలో ఆ నేరం ఫలితంగా తనకు శిక్షలు పడకుండా తప్పించుకో జూస్తున్నాడు! ఈ ముగ్గురూ ఎవరో ఈసరికే అర్థమైపోయి ఉండాలి. ఈ ముగ్గురు తెలుగు "మరాఠీ''ల వ్యవహారసరళి గమనించిన తరువాత సోనియాసహా కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో కూడా "విదూషకులు'' తలెత్తారు. జాతి విభజన ప్రతిపాదనకు ముందు కాంగ్రెస్ అధిష్ఠానంలోని కేంద్రమంత్రి మండలిలోని తెలుగేతర శక్తులు చేసిన పని తెలుగుకు ప్రాచీన (శిష్ట) భాషా ప్రతిపత్తి దక్కకుండా కుట్రపన్నటం! ఈ బాపతులో ముఖ్యమైన చొరవచూపిన వాళ్ళు - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని డి.ఎం.కె.ముఠా భారతీయ భాషల్లో అత్యంత శక్తిమంతమైన ద్రావిడభాషా కుటుంబంలో అజంత భాషగానూ, యావత్తు ప్రాచ్యఖండపు భాషలలోనే "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' (ప్రాచ్యాఖండపు ఇటలీభాష)గానూ నికోలమ్ కోంటీ కీర్తించిన తెలుగుభాషను తొక్కిపెట్టడానికి ప్రయత్నించడమేగాక, ప్రాచీన చరిత్రగల సంస్కృత భాషను కూడా పక్కనపెట్టి ముందుగా తమిళభాషకు శిష్ట భాష ప్రతిపత్తిని అధికారికంగా కుట్రద్వారా ప్రకటింపజేసుకున్నవారు కొందరు తమిళ మంత్రులు! ఆ తరువాతనే సంస్కృతానికి, తెలుగు, కన్నడ భాషలకు కూడా ప్రజాద్యోమాల ద్వారానే కేంద్రం శిష్టభాషా ప్రతిపత్తిని ప్రకటించకతప్పలేదు! ద్రావిడ భాషా కుటుంబంలో స్వతంత్రప్రతిపత్తితో మొట్టమొదటిసారిగా విడివడి తన తనాన్ని ఘనంగా చాటుకున్న భాష తెలుగేనని మరచిపోరాదు!   అలా కేంద్రమంత్రి వర్గంలోని 'తమిళలాబీ'వర్గం ముందు తెలుగుభాషకు చిచ్చుపెట్టడానికి కాల్డువ్వి విఫలమైన తరువాత తెలుగుజాతిని చీల్చడానికి కూడా సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నిరుద్యోగులైన 'గుప్పిడు' నాయకుల స్వార్థప్రయోజనాలను పసికట్టిన తమిళపెద్దలు ఆ నాయకుల పదవీలాలసను వాడుకున్నారు; దాని ఫలితంగా కేంద్రంలో తమిళమంత్రి చిదంబరం నోటినుంచి వెలువడిందే - తెలంగాణా విభజనకు ''ప్రక్రియ (ప్రోసెస్) మొదలవుతుందన్న ప్రకటన! ఇక అక్కడినుంచి ఇటీవల దాకా ఆ ప్రక్రియను ఎలా ప్రారంభించి, ఎలా ముగించాలో పాలుపోక కుడితిలో పడిన ఎలుక మాదిరిగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వమూ, రాష్ట్రంలోని నేను పైన ప్రస్తావించిన ఆ ముగ్గురు 'విదూషక' రాజకీయవేత్తలూ తన్నుకు చావవలసి వచ్చింది! సరిగ్గా ఈ సమయంలోనే తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఒక ప్రకటనలో "తమిళనాడు రాష్ట్రంనుంచి మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు విడిపోవాలని సాగుతున్న వేర్పాటువాద ఉద్యమాన్ని గమనించకుండా ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన ప్రక్రియను ఎలా చేపట్టావ''ని చిదంబరాన్ని వాయించ వలసివచ్చిందని మరచిపోరాదు.   అది మొదలు - ఈ రోజువరకూ పొత్తు, పొంతనా లేని ప్రకటనలతో, పరస్పరం విరుద్ధమైన వ్యాఖ్యాలతో మంత్రులూ, కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని దిగ్విజయ్ సింగ్, షిండే, చాకో, వీరప్పమొయిలీ, గులామ్ నబీ ఆజాద్, సందీప్ దీక్షిత్ పోటాపోటీలతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనపైనే కేంద్రీకరిస్తూ వచ్చారు! భాషాప్రయుక్త ప్రాతిపదికపైన అందులోనూ దశాబ్దాలపాటు కాంగ్రెస్ తీర్మానాలకు అనుకూలంగానూ, అదే కాంగెస్ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగుజాతికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అదే కాంగ్రెస్ చేజేతులా స్వార్థప్రయోజనాల కోసం చీల్చాలని తపన పడుతోంది. అందుకు దారి కనపడకనే పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజల్ని గందరగోళ పరుస్తూ 'మానవద్వేషు'లు (శాడిస్టుల)లాగా వీరు తెలుగుజాతిని వారి మధ్య నెలకొన్న భవబంధాలనూ బలవంతంగా తెగ్గొట్టడానికి స్థానిక 'విదూషకు'లను తోలుబొమ్మలుగా కాంగ్రెస్ అధిష్ఠానం వాడుకొంటోంది. 'గురివింద గింజ' తన కింది 'నలుపు'ను ఎరుగనట్టే మహారాష్ట్రలో 'విదర్భ'ప్రాంతం, కర్ణాటకలోని 'కూర్గు', బెంగాల్ లోని 'గూర్ఖాలాండ్', తమిళనాడులోని దక్షిణ తమిళనాడులాంటి ప్రాంతాలు కోరుతున్న వేర్పాటువాదులను ఉద్యమాలను పట్టించుకోకుండా 42 మంది ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల అండతో ఇంతకాలం ధైర్యంగా నిలబడుతూ వచ్చిన కాంగ్రెస్ కేంద్రప్రభుత్వం అకస్మాత్తుగా ఒక్క తెలుగుజాతి ఐకమత్యాన్నే ధ్వంసం చేయడానికి కారణం - రాష్ట్రంలోని గుప్పిడు విద్రోహుల ఉద్యమంతో పాటు ఎన్నికల అనంతరం కేంద్రంలో రకరకాల పదవులకోసం అర్రులుచాస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకుల తపన తప్ప మరొకటి కాదు.   షిండే విదర్భ గురించి మాట్లాడడు, మొయిలీ కూర్గును గురించి ప్రస్తావించడు, గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి గురించి కేంద్రంలోని బెంగాల్ మంత్రులూ మాట్లాడరు. కాని వీరందరికీ ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగుజాతి అన్నా కన్నెర్ర చేయడానికి సాహసిస్తారు. ఈ దుస్సాహసాన్ని తెలుగుజాతి తిప్పికొట్టడానికి సిద్ధమవుతారు. స్థానిక "బుడ్దర్ ఖాన్''ల, జాతి విద్రోహుల భరతాన్ని ప్రజలు పడతారు! ఆరునెలల స్నేహంలో "వారు వీరు, వీరు వారు అవుతార''న్న  సామెతకు తోడుగానే సుమారు 150 సంవత్సరాలపాటు దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన ఫలితంగా వారి "విభజించి - పాలించే'' విధానాన్ని నేటి కాంగ్రెస్ నాయకత్వం అప్పనంగా "దత్త స్వీకార పధ్ధతి'' నమూనాలోనే అందిపుచ్చుకున్నది! అందుకు రాజ్యాంగంలో, స్వదేశ సంస్థానాలు భారత యూనియన్ లో చేరడానికి 'ససేమిరా' అంటూ, ఎవడికివాడు సొంత "రాజ్యాలు'' కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న ఘడియలలో ఆ పరిణామాన్ని నివారించడం కోసం రాజ్యంగా నిర్ణేతలు అధికరణ (3)ను ప్రవేశపెట్టవలసి వచ్చింది; సరిగ్గా ఆ సమయంలోనే ముసాయిదా రాజ్యాంగానికి తుదిమెరుగులు దిద్దుతూ, ఉత్తరాత్టరా తమ "రాజ్యాల''లో [స్వదేశ సంస్థానాలు] స్వతంత్ర భారత పార్లమెంటును కాదని మొరాయించే పక్షంలో ఆ సంస్థానాలను విడగొట్టి వాటి అసహజమైన సరిహద్దుల్ని చెరిపి, ఆ సంస్థానాలను మరొక దానితో విలీనం చేసే స్వేచ్చను పార్లమెంటుకు దఖలు ఏర్పర్చడమే ఆ అధికరణ లక్ష్యం!   కాని ఆ అధికరణ చాటున దాగి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని - అదే అధికరణను తన "సీట్ల''ను కాపాడుకోవడం కోసం, తన అధికారాన్ని ఎలాగోలా నిలుపుకోడం కోసం, ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయడం, పచ్చిస్వార్థంతో ప్రజలను చీల్చడం కోసం ఆ అధికరణ (3)ను ఉపయోగించడానికి అలవాటుపడింది. అంతేగాని, రాష్ట్రాల ప్రజల ప్రయోజనం కాదు. ప్రజల ప్రయోజనమే తన పరమావధి అనుకుంటే, రాజ్యాంగం అయిదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ, గిరిజన తెగల ప్రయోజనాలను కాపాడడం కోసం వలస చట్టాల్ని చించివేసి వారికి స్వపరిపాలనా ఏర్పాట్లు చేయాలి. కాని ఆ పని 65 సంవత్సరాల తర్వాత కూడా జరగలేదు. అందుకే గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి కల్పించాలన్న డిమాండూ ముందుకు రావలసి వచ్చిందని గ్రహించాలి!

రాస్తారోకోలతో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగుతుందా

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా కోరుతున్న వైకాపా మొదటి నుండే అదే మాట మీద నిలబడి ఉంటే నేడు సీమాంధ్రలో సమైక్య చాంపియన్ గా అవతరించాలని ఇంత చెమటోడ్చవలసిన పని ఉండేది కాదు. అలాగే తెలంగాణాలో కూడా ఇంత లోకువ అయ్యేది కాదు. గానీ, తన విశ్వసనీయతను పణంగా పెట్టి మరీ అనేక ‘యూ టర్నులు’ తీసుకొని ఇప్పుడు తెలంగాణాలో మళ్ళీ తన ఉనికిని కాపాడుకోవడానికి, సీమాంధ్రపై పట్టు సాధించడానికి తిప్పలు పడుతోంది.   ఒకవైపు డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, ఇక్కడ వైకాపా రాస్తారోకోలు చేయడం వలన అది ఆగిపోతుందని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలదా? అంటే లేదనే సమాధానం వస్తుంది. దాదాపు ఆరేడు లక్షల మంది ప్రజలు, ఉద్యోగులు రోడ్ల మీద రెండు నెలలపైగా ఉద్యమాలు, సమ్మెలు చేసినా చలించని కాంగ్రెస్ పార్టీ, వైకాపా చేస్తున్న రాస్తా రోకోలతో రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపుతుందని ఎవరయినా నమ్మగలరా?   ఆ పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా, నిజాయితీగా కోరుకొంటున్నట్లయితే, రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం చేయడంమాని చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డే అందుకు బాధ్యులు అని నిందిస్తూ ఎందుకు కాలక్షేపం చేస్తోంది? ఒకప్పుడు రాష్ట్ర విభజనను అడ్డుకొనే శక్తి తమ పార్టీకి లేదని పదేపదే చెప్పిన వైకాపా ఇప్పుడు ఒంటరిగా రాష్ట్ర విభజనను ఏవిధంగా అడ్డుకోవాలనుకొంటోంది? ఆరేడు లక్షల మంది చేయలేని పనిని తను ఒంటరిగా చేయగలనని నిజంగానే భావిస్తోందా? లేక ఈ పేరుతో సీమాంధ్రలో పార్టీని బలపరచుకోవాలని ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్నలకి వైకాపా నిజాయితీగా సమాధానం చెపితే బాగుంటుంది.

కేసీఆర్ కు మెట్రో కౌంటర్

      కేసీఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ మీద చేసిన ఆరోపణలపై మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పందించారు. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతోందనీ, ఇప్పటిదాకా మెట్రో రైల్‌ కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామనీ, మెట్రో రైల్‌ ముసుగులో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ళుగా మెట్రో రైల్‌ని అడ్డుకోవడానికి చాలా రాజకీయ ప్రయత్నాలు జరిగాయనీ, 2015 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైల్‌ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్‌వీఎస్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. టెండర్లు, భూ పరిహారం చెల్లింపులు వంటివన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరిగాయన్నారాయన.

పిల్లి మెడలో గంట కట్టేదెవరు

  చంద్రబాబు మళ్ళీ ఈ నెల 20నుండి ఆత్మగౌరవ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ సారి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఆయన పర్యటిస్తారు. అయితే రాష్ట్ర విభజన కసరత్తు దాదాపు పూర్తి కావస్తున్నఈ తరుణంలో కూడా ఆయన విభజనపై స్పష్టమయిన ప్రకటించలేకపోవడం చాలా చిత్రంగా అనిపిస్తుంది.   కానీ, మొన్న తెదేపా నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తమ పార్టీ ప్రధానికి వ్రాసిన లేఖ మారిన తమ పార్టీ వైఖరికి అడ్డం పడుతోందని చెప్పడం, దానిపై పార్టీలో ఎర్రబెల్లి వంటి తెలంగాణా నేతలు తీవ్ర ఆగ్రహం ప్రకటించడం, ఇంత జరుగుతున్నపటికీ వారి వాదనలలో చంద్రబాబు జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణాలో కూడా పార్టీని రక్షించుకోవాలని గట్టిగా భావిస్తున్నకారణంగానే చంద్రబాబు ఈ వివాదంలో తల దూర్చేందుకు ఇష్టపడి ఉండక పోవచ్చును. ఎందుకంటే వారిలో ఎవరిని వెనకేసుకు వచ్చిన రెండో ప్రాంతానికి తప్పుడు సంకేతాలు వెళతాయనే భయంవల్ల కావచ్చు.   అయితే ఇప్పటికయినా ఆయన తమ పార్టీ రాష్ట్ర విభజనకు ఏ పరిస్థితుల్లో అంగీకరించవలసి వచ్చిందో దైర్యంగా ప్రజలకు చెప్పగలిగితే ప్రజలు కూడా అర్ధం చేసుకొనే అవకాశం ఉంటుంది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని ఊరికే అనలేదు పెద్దలు. ఆ పని ఆయనే స్వయంగా చేయకపోతే, ఆ విషయంలో కాంగ్రెస్, వైకాపాలు చూపుతున్న ఉత్సాహం వల్ల పార్టీకి మున్ముందు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

రూటు మారిన జేసీ బస్సు!

      రాయలసీమ కాంగ్రెస్ నాయకుడు, ట్రావెల్స్ అధినేత జేసీ దివాకరరెడ్డి తన రాజకీయ బస్సును సమైక్యాంధ్ర రూట్లోంచి రాయల తెలంగాణ రూట్లోకి మళ్ళించారు. ఆమధ్యకాలంలో తన బస్సును రాయల తెలంగాణ రూట్లో నడిపినప్పటికీ నిన్న మొన్నటి వరకూ సమైక్యాంధ్ర రూట్లోనే నడిపారు.   తాజాగా తన బస్సును రాయల తెలంగాణ రూట్లోకి ఆయన మళ్ళించారు. గతంలో సమైక్యాంధ్ర కోసం తాపత్రయపడిన జేసీ ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో ఫోన్‌లో గొడవ కూడా పడ్డారు.  బొత్సతో గొడవ పడినందువల్లే పాలెం బస్సు ప్రమాదంలో జేసీ ట్రావెల్స్ మీద కూడా కేసు నమోదైందన్న వార్తలు వచ్చాయి... అది వేరే విషయం. మొత్తమ్మీద జేసీ తన రూటు మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. జేసీ దివాకరరెడ్డి రాయలసీమ ప్రాంత నాయకుడైనప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాయని అంటారు. ఇంకా చెప్పాలంటే దివాకరరెడ్డి పుట్టింది రాయలసీమ పక్కనే వున్న తెలంగాణ ప్రాంతంలోనేనని చెబుతారు. ఆ విధంగా జేసీకి తెలంగాణతో కూడా బోలెడంత అనుబంధం వుంది. అంత అనుబంధం వున్న తెలంగాణ నుంచి విడిపోవడం ఇష్టం లేకనే ఆయన రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి వుండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతోపాటు జేసీకి చెందిన ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కి ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. రేపు రాష్ట్రం విడిపోయి రాయలసీమకు, తెలంగాణకు సంబంధాలు లేకపోతే ఆ ప్రభావం ఆయన ట్రావెల్స్ మీద కూడా వుండే అవకాశం వుంది. అదే రాయల తెలంగాణ ఏర్పడితే తెలంగాణతో తనకున్న అనుబంధం తెగిపోదు అలాగే తన ట్రావెల్స్ కీ ఎలాంటి ఇబ్బందీ వుండదు. ఇవన్నీ ఆలోచించే జేసీ రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి అక్కడితే ఆగితే బాగానే వుండేది. తన బస్సుకి అక్కడితే బ్రేక్ వేస్తే మంచిగా వుండేది. అలా బ్రేక్ వేస్తే ఆయన జేసీ ఎందుకవుతారు? రాయల తెలంగాణని వ్యతిరేకించేవాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దాంతో ఒకవైపు సమైక్యాంధ్రకోసం, మరోవైపు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం తంటాలు పడుతున్న రాయలసీమ నాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం జేసీ బస్సు రాయల తెలంగాణ వైపు దూసుకుపోతోంది. భవిష్యత్తులో ఏ రూట్లోకి మారుతుందో వేచి చూద్దాం.

అఖిలపక్షం కాదు.. వికలపక్షం!

        ఈనెల 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అఖిల పక్షానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్న తెలుగుదేశం, సీపీఎం, వైఎస్సార్సీపీలను మినహాయించి ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలను అఖిలపక్ష సమావేశానికి పిలిచింది. 12న ఉదయం ఐదు పార్టీలతో విడివిడిగా కేంద్ర మంత్రుల బృందం సమావేశం అవుతుంది. అన్ని పార్టీలతో ఏర్పాటు చేసే సమావేశాన్ని ‘అఖిలపక్షం’ అని పిలవొచ్చుగానీ, కొన్ని పార్టీలతో జరిపే సమావేశాన్ని ‘వికలపక్షం’ అని పిలవాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వికలపక్షంలో పాల్గొనే పార్టీల్లో ఒక్క ఎంఐఎం తప్ప మిగతా పార్టీలన్నీ రాష్ట్ర విభజనను సమర్థించే పార్టీలే. ఎంఐఎం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటూనే రాయల తెలంగాణ ఇస్తే ఓకే అంటుంది. మొత్తమ్మీద చూసుకుంటే తెలుగుజాతి విభజనకు అనుకూలంగా ఉండే పార్టీలే కేంద్రం జరపబోయే వికలపక్ష సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఈ వికలపక్ష పార్టీలన్నీ కలసి ఒకే మాట మీద నిలబడి తెలుగు తల్లిని వికలాంగురాలిని చేయాలని నిర్ణయిస్తే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మేం పిలిచినా మీరు రాలేదు.. వికలపక్షానికి వచ్చిన పార్టీలన్నీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేయమన్నాయి కాబట్టి చేసేస్తున్నామని వికలపక్షం ముగిశాక కేంద్రం పక్షపాతంతో ప్రకటిస్తే పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. కేంద్రం తెలుగు జాతిని ఎంత దారుణంగా అవమానిస్తోందో చెప్పడానికి ఈ వికలపక్ష సమావేశం మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సమావేశానికి ప్రతి పార్టీ నుంచి ఐదుగురు మెంబర్లు రావొచ్చట. ఒక్కో పార్టీకి విడివిడిగా అరగంట సమయం కేటాయించారట! రోజుల తరబడి చర్చించినా తీరని సమస్య గురించి అరగంటలో చర్చించాలని కండీషన్ పెట్టడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? తెలుగువారి హృదయాలను మరింత వికలం చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ వికలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని అనుకోవాలి.

విభజనపై కేంద్రం జెట్ స్పీడ్

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం ప్రక్రియను వేగవంతం చేసినట్లుగానే కన్పిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఐదు పార్టీలతో ఈ నెల 12న కేంద్ర మంత్రుల బృందం సమావేశమవుతుంది. దానికన్నా ముందు ఈ రోజు జీవోఎం ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలోనే జీఓఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.   ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందనీ, డిసెంబర్‌ మొదటి వారంలో పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు రానుందనీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రెండూ కేంద్రం అనుకున్నట్టుగానే జరిగితే, డిసెంబర్‌ నెలాఖరుకల్లా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాదాపు ఖాయమే కావొచ్చు.

బాబోయ్ అఖిలపక్షం

  గతంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్ర విభజనపై చర్చించేందుకు రాష్ట్ర రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అప్పుడు వారి నుండి లేఖలు తీసుకోవడమే గాకుండా ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా వారి మాటలను రికార్డు చేసి, వీడియోను కూడా తీసి భద్రంగా ఉంచుకొన్నారు. అఖిలపక్షమయితే ఘనంగానే నిర్వహించారు, గానీ రాష్ట్ర విభజన మాత్రం వెంటనే చేయలేదు.   మళ్ళీ ఆ తరువాత షిండే ఆయన స్థానంలోకి హోం మంత్రిగా రావడంతో మళ్ళీఅదే తంతు మరోసారి జరిపారు. అప్పుడు కూడా మళ్ళీ లేఖలు, వీడియోలు తతంగం షరా మామూలే. ఎట్టకేలకు కాంగ్రెస్ దైర్యంచేసి రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించేసరికి రాష్ట్రంలో రాజకీయపార్టీలు అన్ని కంగు తిన్నాయి. కానీ వెంటనే తేరుకొని తలో వాదన చేస్తూ కేంద్రాన్ని నిందించడం మొదలుపెట్టాయి.   అయితే రాష్ట్రంలో పార్టీలు మహా ముదుర్లయితే, కాంగ్రెస్ దేశాన్నే ఏలేస్తున్నపెద్ద దేశముదురు. తన దగ్గరున్నవారి లేఖలను బయటపెట్టి లొంగ దీయాలని ప్రయత్నించింది. గానీ వాళ్ళు లొంగకపోవడంతో వారి నోళ్లకు తాళం వేసేందుకు మళ్ళీ తన దగ్గరున్న బ్రహ్మాస్త్రం అంటే అఖిలపక్ష సమావేశం ఐడియాని మరోమారు వారిపై ప్రయోగించింది. ఊహించినట్లే ప్రతిపక్షాలు మళ్ళీ కంగు తిన్నాయి.   రెండు సార్లు అఖిలపక్షంలో పాల్గొనందుకే నేటికే లెంపలు వేసుకొనే పరిస్థితి ఎదురవుతుంటే, ఇప్పుడు మళ్ళీ మరో మారు వెళ్లడం బుద్ధి తక్కువ పనే అవుతుందని గ్రహించిన తెదేపా, వైకాపాలు అఖిలపక్షానికి కుంతీ సాకులు చెప్పి డుమ్మా కొట్టేసాయి. అఖిలపక్షానికి వెళితే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తునట్లు సంకేతాలు వెళ్తాయని వైకాపా భయపడితే, వెళ్లి కొత్త ఇబ్బందులు తలెకెత్తుకోవడమెందుకని తెదేపా తప్పించుకొంది. కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు నమ్మవు. వాటిని కాంగ్రెస్ నమ్మదు. అందుకే వారి మధ్య ఈ చదరంగం నిరంతరం సాగుతూనే ఉంటుంది.

కిరణ్‌ కు అధిష్టానం పిలుపు

      ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డికి అధిష్టానం నుండి పిలుపువచ్చింది. దీంతో శుక్రవారం ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. అదే రోజు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్‌పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈనెల 12న కేంద్ర హోంశాఖ నేతృత్వంలో రాష్ట్రవిభజనపై ఏర్పాటైన మంత్రులబృందం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్య మంత్రికి అధిష్టానం నుండి పిలుపురావడం ప్రాధా న్యతను సంతరించుకుంది. రాష్ట్రవిభజనపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ముఖ్య మంత్రి లేఖలు రాయడం, అవకాశమొచ్చిన ప్రతి సభలోనూ సమైక్యరాగాన్ని సిఎం గట్టిగా వినిపించ డాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్రంగా పరిగణి స్తోంది. తాను ఫోన్‌ చేసినా అధిష్టాన ప్రతినిధులు స్పందించటం లేదంటూ ముఖ్య మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపట్ల అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమా చారం. విభజనకు అనుకూలంగా అధిష్టానం తీసు కున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కట్టుబడ తారా? లేక సమైక్యరాగాన్నే అధిష్టానం పెద్దల ముందు వినిపిస్తారా? అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

తెదేపాలో ముసలం

  చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగానే రాష్ట్ర విభజన తెదేపాలో చిచ్చుపెడుతోంది. గోరుచుట్టుపై రోకటి పోటు పడినట్లు, ఇప్పటికే రాష్ట్ర విభజన విషయంలో క్రిందామీద పడుతున్న తెదేపాకి తాజాగా హోంశాఖ విభజనపై అభిప్రాయాలను, సూచనలను పంపవలసిందిగా పార్టీలను కోరడం, అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపడంతో, తెదేపాలో ముసలం పుట్టింది.   హోం శాఖకు ఎటువంటి లేఖ వ్రాయకూడదని, అదేవిధంగా అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకూడదని తెదేపా నిశ్చయించుకొంది. అయితే పార్టీలో రెండు వర్గాలను సంతృప్తి పరిచేందుకు మధ్యేమార్గంగా అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించేవరకు విభజన ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధానికి లేఖ వ్రాసారు.   ఇది సహజంగానే పార్టీలో ఎర్రబెల్లి వంటి తెలంగాణా నేతలకి ఆగ్రహం కలిగించింది.  మళ్ళీ ఇప్పుడు కేంద్రమంత్రుల బృందంతో సమావేశమయ్యి విభజన విషయంలో సలహాలు, సూచనలు చేయడానికి నిరాకరించడంతో, తమ పార్టీ తెలంగాణా కంటే సీమాంధ్రకే ప్రాధాన్యత ఇస్తోందనే భావం తెలంగాణా నేతలలో నెలకొంది. పయ్యావుల, కోడెల వంటి సీమాంధ్ర నేతల ఒత్తిడికి లొంగినందునే చంద్రబాబు నేటికీ తెలంగాణాపై పార్టీ వైఖరి స్పష్టం చేయడం లేదని తెలంగాణా నేతలు ఆగ్రహంతో ఉన్నారు.   పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేసినప్పటి నుండే వారి మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలయింది. పుండు మీద కారం చల్లినట్లు, “తమ అధినేత ప్రధానికి వ్రాసిన లేఖ ద్వారా ఇప్పుడు తమ పార్టీ సమైక్యాంధ్రకి అనుకూలంగా తన వైఖరి మార్చుకొన్నట్లు స్పష్టమవుతోందని, త్వరలో ఈవిషయంపై మరింత స్పష్టత వస్తుందని” పయ్యావుల చేసిన తాజా వ్యాఖ్యలతో తెదేపాలో గొడవ ముదిరి పాకన పడింది. అందుకు ఎర్రబెల్లి తీవ్రంగా స్పందిస్తూ పయ్యావుల వంటి వారు పార్టీలో చీడ పురుగుల వంటి వారని విమర్శించారు.