హోం కుర్చీచుట్టూ మంత్రుల మ్యూజికల్ చైర్స్ ఆట
posted on Apr 20, 2013 @ 6:20PM
సీబీఐ తనపై అభియోగాలు మోపుతూ చార్జ్ షీట్ నమోదుచేయగానే పరుగు పరుగున వచ్చి “అయ్యో!నీ కెంత కష్టం వచ్చిందే చేవెళ్ళ చెల్లెమ్మో..అక్కమ్మో!” అంటూ పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ మొదలుకొని మంత్రులు గల్లా అరుణకుమారి, గీతా రెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ వరకు అందరూ వరుసకట్టి వచ్చి ఒదార్చినప్పుడు, “నాకు పార్టీలో ఇంతమంది అభిమానులున్నారా?” అనుకొన్న సబితమ్మ కళ్ళుఆనందంతో చమర్చాయి.
కానీ, వారందరూ ఆమె తన హోంమంత్రి పదవి నిజంగా వదిలి పెడుతుందా లేక అంటిపెట్టుకొనే ఉంటుందా అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికే వచ్చారని మాత్రం గ్రహించలేకపోయింది ఆ చేవెళ్ళ చెల్లెమ్మ. ఆమెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయమని కోరకపోయినా, ఆమె ఇంకా రాజీనామా ఇవ్వకపోయినా, స్వీయ గృహ నిర్బంధం విదించుకొని డ్యూటీకి రాకపోవడంతో, ఇక ఆమె రాదని రూడీ అవగానే మంత్రులందరూ ఆమె కుర్చీకోసం మ్యూజికల్ చైర్స్ ఆటను రాష్ట్ర జాతీయ స్థాయిలో మొదలుపెట్టేసారు.
“ఈవిషయంలో అందరికంటే ముందుగా ఆమెను తానే ఓదార్చాను గనుక, తనకే ఆమే కుర్చీలో కూర్చొనే ‘నైతిక హక్కు’ ఉందని” భావిస్తున్న బొత్ససత్యనారాయణ గారు, పార్టీ ఉపాధ్యక్షుడు “రాహుల్ బాబు కను సైగ చేయగానే పీసీసీ అధ్యక్ష పదవిని తృణప్రాయంగా భావించి తను ‘చేయనున్న’ త్యాగాలు వృధా కావలసిందేనా? అందుకు నష్ట పరిహారంగా కాళీగా పడున్న హోం కుర్చీలో కూర్చొంటే తప్పేటి? ఇలాగయితే ఇక నేను ప్రజాసేవ ఎలా చేసుకోగలను” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మా తెలంగాణా ఆడపడుచు ఖాళీ చేసిన కుర్చీలో మేము తప్ప మరెవరు కూర్చొన్నా మా తెలంగాణకే అవమానం” అనే ఒక చక్కటి ‘లా పాయింటు’తో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ ఆమె కుర్చీ చుట్టు ఉపగ్రహాల వలే తిరుగుతున్నారు.
“మా సబితమ్మ తరువాత సీబీఐ లిస్టులో నా పేరే ఉంది గనుక, న్యాయంగా ఆసీటు నాకే దక్కాలి” అని మంత్రి గీతా రెడ్డి చక్కటి సీబీఐ పాయింటుతో వాదిస్తుంటే అందరికీ చాలా ముచ్చటేసింది.
“ఇంకా ఎంత కాలం నేను ఈ పప్పు, బెల్లాలు, నూనె డబ్బాలు నెత్తిన బెట్టుకొని తిరగాలి? తిరిగి తిరిగి అలసిపోయాను. కనీసం కుర్చీ ఖాళీగా ఉన్నపుడయినా కాసేపు నన్ను అందులో కూర్చొని సేద తెరనీయండి,” అంటూ పౌర సరఫరాల మంత్రి డీ శ్రీధర్‌బాబు కూడా కొంచెం ‘గట్టిగానే ప్రార్దిస్తున్నట్లు’ సమాచారం.
“పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా కావడానికి డిప్యూటీ సీఎంగా ఉన్నపటికీ, ముఖ్యమంత్రి నన్ను ఏనాడు, ఏ విషయంలో కూడా సంప్రదించలేదు, సలహా కోరలేదు. అసలు నేనొకడిని ఇక్కడ ఉన్నానని గుర్తుచేస్తే తప్ప ఆయన కళ్ళకి నేను ఆనడమేలేదు,” అని వాపోతున్న దామోదర రాజనర్సింహ, “కనీసo హోంమంత్రి కుర్చీలో కూర్చోనిస్తే అప్పుడయినా ఆయన నన్ను పలకరిస్తాడు కదా!” అనే ఒకే ఒక చిన్న కోరికతో ఆయన కూడా డిల్లీ వెళ్లి ఇంకా ఖాళీ అవని సబితమ్మ కుర్చీలో కర్చీఫ్ వేసి వచ్చారు.
పీసీసీ కుర్చీకి టికెట్టు దాదాపు కన్ఫర్మ్అయిపోయినప్పటికీ, ‘హోం కుర్చీ’కోసం వెయిటింగు లిస్టులో కూడా తనపేరు నమోదు చేయించుకొనేందుకు డిల్లీ చుట్టూ తిరుగుతున్నారు డీ శ్రీనివాస్. ఇంతమంది తన కుర్చీ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చూసిన చేవెళ్ళ చెల్లెమ్మ కళ్ళు చెమర్చాయి, ఈ సారి బాధతో!