మానవత్వం అడుగంటుతున్నసమాజం
posted on Apr 20, 2013 @ 1:08PM
డిల్లీ ఘటన తరువాత నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తరువాత కూడా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగకపోగా అదొక అంటూ రోగంలా దేశమంతటా వ్యాపించి ఇప్పుడు అభం శుభం తెలియని పసిపిల్లలను సైతం బలి తీసుకొంటోంది. ఈ ఆకృత్యాలు సరిపోవన్నట్లు మనుషుల్లో దాగిఉన్న రాక్షస ప్రవృతి కూడా ఇప్పుడు బయటపడుతోంది. డిల్లీలో జరిగిన సంఘటనతో దేశం మరో మారు ఉలిక్కి పడింది.
నానాటికి దేశంలో పెరిగిపోతున్నఇటువంటి ఆకృత్యాలకు వెంటనే కటినమయిన శిక్షలు అమలు చేయడంలోచట్టపరంగా జరుగుతున్నఆలస్యమే ఇటువంటి ఉన్మాదులకు మరింత దైర్యం ఇస్తోందని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు చట్టాలు చేసి, నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటే, న్యాయ వ్యవస్థలో ఉన్న అన్నిఅవకాశాలను, లొసుగులను సంపూర్ణంగా వాడుకొంటూ, తమకు మంచి ఆహారం, పళ్ళు, సౌకర్యాలు కావాలని నిందితులు డిమాండ్ చేయగలుగుతున్నారు. అయినప్పటికీ పటిష్టమయిన మన న్యాయ వ్యవస్థ వారిని ఇంతవరకు శిక్షించలేకపోతోంది. ఈ ఆలస్యమే నేడు మృగాళ్ళను ఇటువంటి దారుణాలకు పాల్పడేందుకు దైర్యం కల్పిస్తోంది.
డిల్లీ ఉదంతం జరిగినప్పుడు అక్కడి బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో దానిని ఖండించడమే కాకుండా, ఆ నేరస్తుల తరపున తామెవరము కూడా వాదించబోమని భీషణ ప్రతిజ్ఞలు కూడా చేశారు. కానీ, నెల తిరిగేసరికి వారి ఆలోచనలలో మార్పులు వచ్చి, ఇప్పుడు ఆ నేరస్తుల తరపున వాదించడానికి పోటీలు పడుతున్నారు కూడా. ఎందుకంటే అటువంటి కేసుల్లో వాదించినప్పుడే మీడియాలో కనబడుతూ, మంచి పేరు సంపాదించుకోవచ్చుననే దురాశ వారిలోమానవత్వాన్ని కబళించివేసింది.
ఇటువంటి ఘోర అకృత్యాలు జరిగిన ప్రతీసారి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తే తప్ప మన వ్యవస్థలలో స్వయం చలనం కనబడకపోవడం చూస్తుంటే, మనుషుల్లో మానవత్వం కూడా ఇప్పుడు క్రమంగా అడుగంటిపోతున్నదని అనిపిస్తోంది. అన్నెంపున్నెం ఎరుగని 5ఏళ్ల పసిపాపపై రాక్షసత్యాచారం జరిగిన తరువాత కటినంగా వ్యవహరించవలసిన డిల్లీ పోలీసులు, ఆ పసిపాప తల్లి తండ్రులు పిర్యాదుచేయడానికి వస్తే, “మీ పాప మీకు దక్కింది కదా ఇంకా ఎందుకు ఈ ఏడుపులు? అనవసరంగా కోర్టులు, కేసులు అంటూ ఎందుకు తిరుగుతారు?” అని వారి చేతిలో పోలీసులే ఓ రెండువేలు పెట్టడం చూస్తే ఇక ప్రజలకి దిక్కెవరని అనిపించకమానదు. పైగా నిరసన తెలియజేస్తున్న మహిళలపై కూడా పోలీసులు చెయ్యి చేసుకోవడం వారు ఇటువంటి సంఘటనల పట్ల స్పందన కోల్పోయారని తెలియజేస్తోంది.
ఇటువంటి వ్యవస్థలో ఎవరు మాత్రం భద్రత ఆశించగలరు? ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే యధావిధిగా మీడియాలో పతక శీర్షికన వార్తలు, టీవీ స్క్రోలింగులు, చర్చలు, పద్దతి ప్రకారం రాజకీయ పార్టీల ఖండనలు, అధికార పార్టీపై విమర్శలు, అధికార పార్టీ నేతల దిగ్బ్రాంతి ప్రకటనలు, హామీలు వగైరాలన్నిమాత్రం అత్యంత నిర్దిష్టమయిన పద్దతిలో జరిగిపోతున్నాయి. మానవత్వంతో స్పందించవలసిన సమాజం, వ్యవస్థలు, ఇటువంటి ఘోర అకృత్యాలు జరిగినప్పుడు కూడాఇంత యాదృచ్చికంగా, ఇంత అమానవీయంగా స్పందించడం చూస్తుంటే అసలు మనమెటువంటి సమాజంలో బ్రతుకుతున్నామనే బాధ కలుగకమానదు.
శరీరంలో ఒక భాగానికి కాన్సర్ సోకితే దానిని ముందుగా మందులతో నయం చేసుకొనేందుకు ప్రయత్నించి, నయం అవకపోతే ఆ భాగాన్నే తొలగించుకొని బ్రకాలనుకొంటాము తప్ప చనిపోవాలని ఎవరూ అనుకోము. అదే విధంగా ఇటువంటి అకృత్యాలకి పాల్పడుతున్న వారికి మంచి మాటలతో అర్ధం కానప్పుడు, మరణదండన వంటి కటిన శిక్షలు విధించినప్పుడే, మళ్ళీ అటువంటి నేరాలు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ, అవి కూడా నేరం జరిగిన రెండు మూడు నెలలోగా అమలు చేయగలిగినప్పుడే, మృగాళ్ళలో అటువంటి నేరం చేస్తే ఉరి తప్పదనే ఒక భయం ఏర్పడుతుంది. మన వ్యవస్థలను శక్తివంతం, ప్రక్షాళనం చేసుకోనంతకాలం ఇటువంటి ఘోర అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి.