డీకే అరుణ కలియుగ తాటకి
posted on Apr 19, 2013 @ 2:40PM
పాలమూరు జిల్లాలో మంత్రి అరుణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య మాటల యుద్దం ముదిరి పాకాన పడింది. తనపై డికె అరుణ చేసిన వ్యాఖ్యలపై జూపల్లి ధీటుగా సమాధానం ఇచ్చారు. చీర, గాజులు నీ భర్త భరత్ సింహారెడ్డికి ఇవ్వాలని సూచించారు. నీవు కలియుగ తాటకివి అని, దమ్ముంటే రాజీనామా చేసి ఒక్క ఓటుతో గెలిచినా నేను రాజకీయ సన్యాసం చేస్తానని జూపల్లి సవాల్ విసిరారు. తెలంగాణ వాదాన్ని అణచేందుకు ముఖ్యమంత్రి ఆడించినట్లు ఆడుతుందని, సోదరిలా భావించి ఊరుకుంటే బజారున పడి బజారు మాటలు మాట్లాడుతుందని, హోంమంత్రి పదవి కోసమే ఆమె ఆరాటం అని అన్నారు. జడ్పీటీసీగా గెలిపించి అరుణకు రాజకీయ భిక్ష పెడితే అధికారం ఉందని ఎగిరిపడుతుందని, పోలీసుల బలం చూసుకుని మాట్లాడుతుందని విమర్శించారు.
అరుణ జీవితం దందాల మయం అని, నాకు దమ్ముంది కాబట్టే పోలీసుల భద్రతలేకుండా తిరుగుతున్నానని, గద్వాలలో పాదయాత్ర చేశానని, అరుణ అహంకారం చూసి అక్కడ జనం బ్రహ్మరథం పట్టారని అన్నారు. నన్ను పిల్లి అని అరుణమ్మ అందని, అవును నేను పిల్లినే అందుకే ప్రజల చుట్టూ తిరుగుతున్నాను. మీలాగ రక్త మాంసాలు తినే పులిని, తోడేలును కాదు అని జూపల్లి అన్నారు.