తెలంగాణ కోసం యువకుడు బలిదానం
posted on Apr 19, 2013 @ 10:54AM
తెలంగాణ కోసం మరో యువకుడు ప్రాణాలర్పించాడు. ప్రత్యేక రాష్ట్రం రావాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత విద్యాసాగర్ రావును గెలిపించాలని సూసైడ్ నోట్‌లో కోరాడు. తెలంగాణ కోసం తన చావే చివరిది కావాలని అందులో పేర్కొన్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన పెరుమాండ్ల నరేష్ బీజెవైఎం మండల ఉపాధ్యక్షుడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి, రాత్రివరకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి వెతకగా పొలం వద్ద పురుగుల మందు డబ్బా కనిపించింది. ఆ పక్కనే నరేష్ పడి ఉండడం గమనించిన అతని తండ్రి నారాయణ 108కు సమాచారాన్ని అందించాడు. 108 సిబ్బంది వచ్చి నరేష్ మరణించినట్లు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణను ఇస్తుందని, బీజెపీని ప్రజలు గెలిపించాలని ఆ లేఖలో రాశాడు.