విజయమ్మ మెడకు చుట్టుకొన్న బయ్యారం గనులు
posted on Apr 20, 2013 @ 5:03PM
అదేమి దురదృష్టమో తెలియదు కానీ ఎంకి పెళ్లి సుబ్బుచావుకొచ్చినట్లు, రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం గనులను విశాఖ ఉక్కుకి కట్టబెడితే అందుకు ప్రభుత్వంతో పట్లు పట్టవలసిన తెరాస నేతలు ఆ సమస్యను వైయస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మెడకు చుట్టారు. కొంచెం రాజకీయ అవగాహన పెంచుకొని, సభలలో మాట్లాడేందుకు అడ్డువస్తున్న తన బెరుకుదనం వదిలించుకోవాలనే ఆలోచనతో, ఈ నెల 27నుండి తన భర్తకు బాగా అచ్చొచిన చేవెళ్ళలో ‘రచ్చబండ’కార్యక్రమం పెట్టుకొంటే, “ముందు బయ్యారం గనుల గురించి మీ పార్టీ అభిప్రాయం చెప్పి ఆనక రచ్చబండ మీద కూర్చోమని తెరాస నేత హరీష్ రావు విజయమ్మను హెచ్చరించారు. అసలు చేవెళ్లలో కూర్చొనే బదులు వెళ్లి బయ్యారం రచ్చబండ వద్ద కూర్చొంటే బాగుంటుందని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. బయ్యారం గనులను విశాఖకు తరలించరాదని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసి తెలంగాణా పట్ల మీ పార్టీ వైఖరి స్పష్టం చేసిన తరువాత మీరు మా తెలంగాణాలో ఏ రచ్చబండ మీద కూర్చొన్నా మాకేమి అభ్యంతరం ఉండదు” అని చెప్పారు. అసలు బయ్యారం గనులు ఆమె అల్లుడు అనిల్ కుమార్ చేతిలోనే ఉన్నాయని కాంగ్రెస్ మంత్రి ఆనం రామి నారాయణ రెడ్డి చెప్పిన విషయం పట్టించుకోకుండా, ఈ విధంగా పెద్దావిడ ను ఇబ్బంది పెట్టడం ఏమి సబబు? తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మండు వేసవిలో తన రాజమందిరం నుండి బయటకి వస్తున్నఆమెకు చలువ పందిళ్ళు వేసి సాదరంగా ఆహ్వానించకపోగా నిలదీయడం ఏమి న్యాయం? అయినా కరెంటు చార్జీలను కొంచెం తగ్గించమని కోరుతూ ఆమె 5 రోజులు నిరవదిక నిరాహార దీక్ష చేస్తేనే పట్టించుకోని ప్రభుత్వం, బయ్యారం గనుల గురించి ఆమె చెపితే వింటుందా? అందువల్ల పెద్దావిడను ఇబ్బoది పెట్టకుండా తెరాస నేతలు వెళ్లి అల్లుడిగారిని కలిస్తే బాగుంటుందేమో!