రాహుల్‌కి ‘నోటి’సులు!

      ఎన్నికల ప్రచారం సందర్భంగా నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్ ‘నోటి’సులు జారీ చేసింది. ముజఫర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు పరమ దరిద్రంగా ఉందన్న విమర్శలు అప్పుడే దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి.   ముస్లిం యువకులు తీవ్రవాదులకు సహకరిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లింలను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. అలాగే తన నాయనమ్మ ఇందిర, తన తండ్రి రాజీవ్ తరహాలోనే తనకూ ప్రాణహాని వుందని రాహుల్ అనడం ఓట్లకోసం దిగజారి మాట్లాడిన మాటలుగా అందరి చేతా విమర్శలు ఎదుర్కొన్నాయి.  రాహుల్ మాట్లాడిన తీరు పట్ల అన్ని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ విషయలో భారతీయ జనతాపార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. కాస్తంత లేటుగా అయినా ఇ.సి. స్పందించింది. రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈనెల 4వ తేదీలోపు తాను చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దున్నపోతు మీద వాన పడ్డ చందాన వ్యవహరిస్తోంది. యువరాజు చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని వెనుకేసుకుని వస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇ.సి. నోటీసుల విషయంలో కూడా అదే ధోరణిని వ్యక్తం చేసింది. ఇ.సి. నోటీసుల వల్ల తమకి, తమ పార్టీకి, యువరాజు రాహుల్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదని అంటోంది.  

ఆంధ్రప్రదేశ్ అవతరోణత్సవాలు ఆపలేరు..!

      తెలుగు జాతి మొత్తం ఎంతో గర్వకారణంగా భావిస్తూ జరుపుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాన్ని కూడా అవమానిస్తున్నారు. పదవుల కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం ‘తెలంగాణవాదులు’ అనే ముసుగు వేసుకున్న కొందరు స్వార్థపరులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా, బ్లాక్ డేగా ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలను జరుపుకోవాలంటే ప్రజలు భయపడేలా చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎవరెన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ అవతరోణత్సవాలు రాష్ట్రమంతటా జరుగుతూనే వున్నాయి. భవిష్యత్తులో జరుగుతూనే వుంటాయి. ఎంతో బలమైన తెలుగుజాతిని వేరుచేయడం తెలుగుజాతిలోనే వున్న ద్రోహుల వల్ల కాదు.. ఇతర రాష్ట్రాలవారి వల్ల కాదు అయ్యేపని కాదు.

వై దిస్ కోల వెర్రి బొత్స, లగడపాటి?

  ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్రతో పోరాటంతో పాటు వారిలో వారు కూడా  పోరాటాలు చేసుకొంటూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆ పోరాటాలు దేనికోసం?   పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్ని వారాల క్రితం విజయనగరంలో తన ఆస్తులపై సమైక్యవాదులు దాడులు చేస్తునప్పుడు “రాష్ట్ర విభజన విషయంలో కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దలే తనను తప్పు ద్రోవ పట్టించారని, మళ్ళీ వారే తాను ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాస్తూ విభజనకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రోత్సహించానని ప్రచారం చేస్తూ తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. వారు తన రాజకీయ భవిష్యత్ దెబ్బతీయాలనే ఆవిధంగా కుట్రలు పన్నుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఎవరు కుట్రలు పన్నుతున్నారో మాత్రం చెప్పలేదు.   కానీ దివాకర్ రెడ్డి విషయంలో బొత్స వ్యవహరించిన తీరుని తప్పు పడుతూ లగడపాటి అన్న మాటలతో కనపడని ఈ యుద్ధం వారిద్దరి మధ్యేజరుగుతోందని స్పష్టం అయిపోయింది.   లగడపాటి మీడియాతో మాట్లాడుతూ "కొందరు మమ్మల్ని పార్టీ నుండి బయటకి పొమ్మంటున్నారు. ఎందుకంటే మేము క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నామని చెపుతున్నారు. వ్యక్తులు తమ అభిప్రాయాలను చెప్పడం పార్టీ వ్యతిరేఖం కాదు. అది మన ప్రజాస్వామ్య పద్ధతని తెలుసుకోవాలి. జేసీ దివాకర్ రెడ్డి తాత ముత్తాతల కాలం నుండి అంటే దాదాపు నాలుగు దశాబ్దాల నుండి వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తోంది. అటువంటి కుటుంబానికి చెందిన ఒక సీనియర్ నేతను బయటకి పొమ్మని చెపితే, ముందుగా సదరు వ్యక్తులకే వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారు," అని హెచ్చరించారు.   అయితే వీరిరువురి మధ్య ఈ జగడానికి కారణమేమిటని ఆలోచిస్తే రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి పదవి చెప్పట్టేందుకు జరుగుతున్నా పోటీగా కనబడుతోంది.   లగడపాటి మొదటి నుండి సమైక్యవాదిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. కానీ రాష్ట్ర విభజన అనివార్యమని బహుశః అందరికంటే ఎక్కువ బాగా తెలుసు. గనుక ఆయన దూరదృష్టితో గట్టిగా సమైక్యవాదం పట్టుకొని ముందుకు సాగుతూ నిత్యం మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి పదవికి పరిశీలనకు వచ్చే పేర్లలో అప్పుడు ఆయన పేరే మొదట ఉండే అవకాశం ఉంటుందనే ఈ తాపత్రయమంతా.   ఇక బొత్స తనకి ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకోవడంలో తప్పేమీ లేదని అందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఏనాడో చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాతయినా తన కల నెరవేర్చుకోవాలనుకోవడం సహజం గనుక తన ప్రయత్నాలు తను చేసుకొంటూ ఉండవచ్చును. అటువంటప్పుడు పోటీ దారుల మధ్య ఇటువంటి యుద్దాలు జరగడం కూడా సహజమే.   అయితే కాంగ్రెస్ అధిష్టానం గత కొన్నేళ్లుగా ఎవరూ ఊహించని వ్యక్తులనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడుతోంది. అంటే ఆ ఎవరూ ఊహించలేని వ్యక్తి ఎవరు? పురందేశ్వరా? చిరంజీవా? లేక జగనా? ఊహిస్తూనే ఉండండి.

అఖిలపక్షంతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడం సాధ్యమేనా

  కేంద్రం మళ్ళీ అఖిలపక్ష సమావేశం అంటూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు మరో మారు అగ్ని పరీక్ష పెట్టి, తనపై వస్తున్న నిందలను తొలగించుకొంటూనే, ప్రతిపక్షాలపైకి వాటిని నెట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్నకేంద్రమంత్రుల బృందం వద్దకు వెళ్లి సూచనలు, సలహాలు చెప్పి రావడమంటేనే విభజనకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లవుతుందని భావిస్తూ అన్నిరాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నఈ సమయంలో, అవ్వ పేరే ముసలమ్మ అన్నట్లు మళ్ళీ ఇప్పుడు విభజన కోసం మార్గదర్శకాలను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి రమ్మంటూ ఆహ్వానించడం కూడా ప్రతిపక్షాలను ఇరికించాలనే ప్రయత్నమే.   అందువల్ల ఈ విభజన చదరంగంలో తెలివిగా పావులు కదుపుతున్న తెదేపా, వైకాపాలు ఈ అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవచ్చును. మజ్లిస్ మరియు లెఫ్ట్ పార్టీలు తప్ప తెరాసతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇటువంటి తరుణంలో సమావేశం నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఎవరి కారణాలు వారికి ఉన్నపటికీ ఇప్పుడు ఈ సమావేశం అవసరం లేదనే విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.   కానీ, ఎవరు వచ్చినా రాకపోయినా కేంద్రం మాత్రం సమావేశం నిర్వహించడం ఖాయం. ఎందుకంటే తెదేపా, వైకాపా నేతలు మరికొందరు వ్యక్తులు విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేస్తుండటం, ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు, తమ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి లేఖాస్త్రాలు సందిస్తూ, ప్రజల ముందు కాంగ్రెస్ అధిష్టానాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుండటం వంటి అన్ని ఇబ్బందికర అంశాలను లెక్కలోకి తీసుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు అఖిలపక్ష సమావేశంతోనే స్వపక్ష, ప్రతిపక్షాలను కట్టడిచేయవచ్చని ఈ ఎత్తు వేసింది. అయితే వాళ్ళు సమావేశానికి వచ్చినా రాకున్నావాళ్ళని ఏదోవిధంగా దోషులుగా నిరూపించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం గనుక సమావేశం ఖచ్చితంగా నిర్వహిస్తుంది. తద్వారా రేపు సుప్రీం కోర్టు కేంద్రం నుండి సంజాయిషీ కోరినప్పుడు, కోర్టుకి ఈ అఖిలపక్షం ద్వారా తాము చేసిన ప్రయత్నాలను వివరించి ప్రతిపక్షాల ద్వంద వైఖరిని, వ్యవహార శైలి గురించి చెప్పడానికి కూడా అవకాశం దొరుకుతుంది.   అయితే కాంగ్రెస్ దేశముదురయితే ప్రతిపక్షాలు కూడా మాహా ముదుర్లే గనుక దీనినుండి ఏవిధంగా బయటపడాలో వాళ్ళకి కూడా బాగా తెలుసు.

రాష్ట్ర అవతరణ వేడుకలపై లగడపాటి ధీమా

      రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసమే తెలుగు తల్లిని ముక్కలు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పాంత్రాల వారీగా పార్టీలు విడిపోవడం వల్లే మళ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి విభజన తీర్మానం వస్తుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.     మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. యనమల మాట్లాడుతూ కలిసి ఉండటం వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. విభజన నిర్ణయం మనస్తాపం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి కుంటుబడుతుందన్నారు. విభజన సందిగ్దతకు త్వరగా తెరపడాలని ఆశిస్తున్నట్లు యనమల పేర్కొన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలు: కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

      ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియ౦ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎ౦ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతాయా,లేదా అన్న అనిశ్చితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలుగు మాట్లాడే వారందరి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, బూర్గుల రామకృష్ణ రావు పదవీ త్యాగం చేశారని అన్నారు. తెలుగు వారు ఉన్నత శిఖరాలకు ఎదిగి భారత దేశానికి దశ దిశ చూపిన సంజీవ రెడ్డి, పివి నరసింహ రావు వంటి వారికి జోహార్లు అన్నారు.

బొత్స అండ్ కిరణ్ ఆర్ నవ్ ఫ్రెండ్స్

  సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ విభజనకు వ్యతిరేఖంగానో, అనుకూలంగామాట్లాడుతూనో అదీ వీలుకాకపోతే ఇంట్లో దుప్పటి ముసుగేసి పడుకొనో కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ పాపం! బొత్సబాబుకే ఏమి మాట్లాడాలో తెలియక, ఏదేదో మాట్లాడేస్తూ తన ఆ జ్ఞానమంతా బయటపెట్టేసు కొంటున్నారు. తను సమైక్యవాదినని చెపుతూనే ఇక డెఫినెట్గా విభజన జరిగిపోతుందని చెపుతారు. తనకు ముఖ్యమంత్రిపై ఆశ ఉందని, అందుకే రాష్ట్ర విభజనకు కేంద్రాన్ని ప్రోత్సహించానని పార్టీలో బయట కూడా కొందరు మతి స్థిమితం లేని వాళ్ళు అవాకులు చవాకులు వాగుతున్నారని అంటారు. ఆ వెంటనే 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే మాట మరిచిపోకుండా కలుపుతుంటారు.   తను పీసీసీ అధ్యక్షుడినని గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని చూడకుండా “పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే బయటకి పొండి” అని చిందులు వేసిన తరువాత, వాళ్ళు కూడా తనకంటే సీనియర్స్ అనే సంగతి గుర్తుకు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి “నా ఉద్దేశ్యం అదికాదు...” అంటూ ఏవో సంజాయిషీలు ఇస్తూ మరింత గందరగోళం సృష్టిసారు.   ఫేస్ బుక్కులో తండ్రి కొడుకులో లేక అన్నదమ్ములో లేక మొగుడు పెళ్ళాలో ఇవాల్టి నుండి ఫ్రెండ్స్ అని మెసేజ్ ఏవిధంగా వస్తుందో అదేవిధంగా ఇప్పుడు బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని ఆయన ప్రస్తుతం చెప్పుకొంటున్నారు. అలాగని కిరణ్ కుమార్ రెడ్డిని అనుసరించే దైర్యం ఉందా? అంటే అదీ అనుమానమే.   ఎందుకంటే అధిష్టానం చల్లగా చూస్తే నేడు కాకపోతే రేపు రాష్ట్రం విడిపోయిన తరువాతయినా ముఖ్యమంత్రి అవకపోతానా అనే ఆలోచన ఉంది కదా! అటువంటప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటి ముఖ్యమంత్రి పదవి గట్టిగా పట్టుకొని సమైక్యంగా ముందుకు సాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి చేయి పట్టుకొని ముందుకు సాగడం అంటే, ఇక శాశ్వితంగా రవాణా శాఖకే కమిట్ అయిపోయే ప్రమాదం ఉంది.   అయితే దివాకర్ రెడ్డిని అన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డిని ‘పార్టీలో నుండి బయటకి పొమ్మనే’ సాహసం చేయలేక బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొంటున్నారనుకోవాలి. ఒకవేళ అధిష్టానం “రిప్లేసింగ్ కిరణ్ కుమార్ రెడ్డి సూన్” అని మెసేజ్ ఏమయినా పెడితే, అప్పుడు ఆయన ‘నెట్ వర్క్’ లో మార్పులు ఏర్పడవచ్చును. ఏమయినప్పటికీ ఆయన ఈ విషయంలో చిరంజీవికి ఈ మాత్రం తీసిపోరని మాత్రం గట్టిగా చెప్పవచ్చును.

వైసిపికి తెలంగాణ సెగ

  తెలంగాణ అంశం పై పూర్తిగా యు టర్న్‌ తీసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ సెగ తగిలింది.. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వచ్చిన విజయమ్మను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.   అయితే  ఈ సందర్భంగా అక్కడ వైసిపి కార్యకర్తలు తెలంగాణ వాదుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో స్పందించిన పోలీసులు వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోలీసులు అరెస్ట్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.   అయితే తన అరెస్ట్‌ పై స్పందించిన విజయమ్మ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కూడా తెలంగాణ లో పర్యటిస్తే అరెస్ట్ చేస్తారా ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. పోలీసులు తమ పర్యటనను అడ్డుకోవడం అనైతికం అన్నారు.

బొత్సాకు లగడపాటి కౌంటర్‌

  తెలంగాణ అంశం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రగిలిస్తూనే ఉంది.. జగన్‌ను దగ్గర చేసుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీ సొంత పార్టీ నాయకులను పక్కన పెడుతుందని విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి విమర్శలే చేసిన జేసి దివాకర్‌ రెడ్డి పై పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారయణ తీవ్రంగా స్పందించారు. ఇష్టం అయితే పార్టీలో ఉండండి లేదంటే వెళ్లిపొండి అని ఘాటుగా బదులులిచ్చారు.   అయితే బొత్సా వ్యాఖ్యలపై తమ పార్టీ నాయకుల నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ బోత్సా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్టీని దిక్కరించిన వారిని వెళ్లిపొమనడం సరికాదన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కళంకితుల ఆర్డినెన్స్‌ను చించేయడం కూడా పార్టీ ధిక్కారమేనని ఆయన అన్నారు. తాము సమైక్యవాది ఇందిరా గాంధీ బాటలోనే నడుస్తున్నామని చెప్పారు.   అంతేకాదు జెసి కుటుంబం ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉందన్న  ఆయన, అటువంటివారిని వెళ్లిపొమ్మనడం సరి కాదని ఆయన అన్నారు. విభజనపై పార్టీల అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఏర్పాటు చేయాల్సింది అఖిల పక్ష సమావేశం కాదని, అసెంబ్లీని సమావేశపరచాలి లేదా ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు.

అక్కడా దిగజారారు!

      గడచిన ఏడాది కాలంలో రాజకీయంగా ఎంతో దిగజారిపోయిన యు.పి.ఎ. ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధానిమన్మోహన్ సింగ్ పరువు ప్రతిష్టలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. యు.పి.ఎ. ప్రభుత్వంలో ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పుణ్యమా అని మిస్టర్ క్లీన్‌గా ఇమేజ్ వున్న మన్మోహన్‌కి బొగ్గు మసి అతుక్కుంది.   సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ పరువు ప్రతిష్టలు గత సంవత్సరం కంటే తగ్గిపోయాయి. ఇది చెబుతున్నది ఎవరో కాదు.. ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్. ప్రతి ఏటా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ ప్రముఖులతో ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ పేరిట లిస్ట్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన లిస్ట్ లో రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ లిస్ట్ లో ఘనత వహించిన మన ఇద్దరు నాయకులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కిందకి దిగజారారు. గత సంవత్సరం సోనియాగాంధీ 12వ స్థానంలో నిలిస్తే, ఈ సంవత్సరం 21వ స్థానానికి జారిపోయారు. ప్రధాని మన్మోహన్ గత సంవత్సరం 19వ స్థానంలో నిలిస్తే ఈ సంవత్సరం 28వ స్థానానికి దిగజారారు.  ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తే గ్రాఫ్ ఇలాగే పడిపోతుంది. 2014 లిస్ట్ లో వీళ్ళిద్దరి పేర్లు టోటల్‌గా గల్లంతయ్యే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.

పయ్యావుల ఎపిసోడ్: ఎర్రబెల్లికి గాలి కౌంటర్

      పయ్యావుల కేశవ్ ఏం తప్పు చేశారని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రశ్నించారు. పయ్యావులపై గురువారం ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజల ఎజెండానే పయ్యావుల మాట్లాడుతున్నారని మద్దతుగా మాట్లాడారు. అఖిలపక్షానికి ఆహ్వానంపై తమకు ఇంకా లేఖ అందలేదని, అందిన తర్వాత పార్టీలో చర్చించి అఖిలపక్ష భేటీపై వెల్లడానికి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని ముద్దు కృష్ణమ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజల తీర్పు తర్వాతే విభజనై అడుగు ముందుకు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు.   పయ్యావుల వివరణ: తెలుగుదేశం పార్టీ వైఖరికి భిన్నంగా ప్రవర్తించలేదని, విభజనపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆ పార్టీ నేత ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానో పార్టీ అధినాయకత్వానికి వివరించానని అన్నారు. తెలుగుదేశం పార్టీ విధానానికి భిన్నంగా తన పిటిషన్ లేదని పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరిని సస్పెండ్ చెయ్యాలన్న పార్టీదే నిర్ణయమని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పయ్యావుల స్పష్టం చేశారు.

కిరణ్ పార్టీ వార్తలకు చెక్!

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల పై ఆయన స్పందించారు. శ్రీకాకుళంలో దానికి సమాధానం చెబుతూ కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని చెప్పడం విశేషం. వరదబాధితుల ను పరామర్శించడానికి వెళ్లిన కిరణ్ రెడ్డి అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. విభజన నేపథ్యంలో కొత్త పార్టీ ఆలోచనేమీ తనకు లేదని ఆయన వ్యాఖ్యానించాడు. తను సమైక్యవాదినంటున్న కిరణ్ రెడ్డి సమైక్య కాంగ్రెస్ ను నెలకొల్పనున్నాడనే వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగా అనేక మంది కాంగ్రెస్ నేతలుకూడా కిరణ్ కొ్త పార్టీ పెడితే బావుంటుందన్నట్టుగా మాట్లాడారు. దీంతో ఊహానాలు జోరందుకొన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్త పార్టీతో కిరణ్ రెడ్డి కొత్త రకంగా ఎంట్రీ ఇస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడసాగారు.

ఈ హడావుడి మామూలే

      మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీయే అధికారులు చాలా హడావుడి చేస్తున్నారు. భారీ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారులు ప్రైవేట్ బస్సుల ఫిట్ నెస్ పై దృష్టి సారించారు. ప్రమాణాలకు తగ్గట్టుగా లేని బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఏ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులపై సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డులు సరిగా లేని ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, విజయవాడ శివార్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిలో మూడు బస్సులను అధికారులు సీజ్ చేశారు. విజయవాడలో పర్మిట్లు లేని పలు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులను జప్తు చేశారు.     అయితే ఈ విషయంలో అధికారులకు ప్రశంసలు కన్నా విమర్శలే ఎదురవుతున్నాయి. ఇన్ని రోజులూ వీళ్లు ఏం చేశారు? తీవ్రమైన ప్రమాదం జరిగి.. అంత మంది చనిపోతే తప్ప.. అధికారుల నిద్రమత్తు వదల్లేదా? అనే సందేహం తలెత్తుతోంది. అయితే ఈ హడావుడి ఎక్కువ రోజులు ఉండదు. గతంలో షిరిడీ బస్సు ప్రమాదం అనంతరం కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తించింది. మళ్లీ అంతా మామూలే! ఇప్పుడు కూడా అంతేనేమో!

అఖిలపక్ష౦ టార్గెట్ టిడిపి..!!

      రాజకీయ ప్రయోజానాల కోసం రాష్ట్రాన్నివిభజించే ప్రయత్నం చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీ తనతోపాటు రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే రాష్ట్ర విభజన అంశంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   అసలు ఈ సమావేశానికి ఏ పార్టీ అయినా హాజరై ఒక్క అంశానికి సమాధానం ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అంగీకరించినట్టే అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఈ అఖిలపక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా చేసుకుందని అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోతున్నా చంద్రబాబు ఇప్పటికీ తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎలాగో రోజులు దొర్లించేస్తుంటే..తన దత్త పుత్రుడు మాత్రం పూర్తిగా సమైక్యఫలం పొందలేక బాధపడుతున్నారు. కాబట్టి టిడిపి ఎలాగు సమన్యాయం కోరుతోంది గనుక రాష్ట్ర విభజనకు అవసరమయిన మార్గదర్శకాల పేరిట ఆ మాటేదో తెదేపా నోటనే చెప్పించేస్తే, సమైక్యాంద్రాకి ఆ పార్టీ వ్యతిరేఖమనే ట్యాగ్ తగిలించేసి, వైకాపా సీమాంద్రాలో దూసుకుపోవడానికి మార్గం సుగమం చేసేయవచ్చును. తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈసారి కూడా స్పష్టమయిన వైఖరి చెప్పకపోవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా తేదేపాకు చీటీ చింపేయవచ్చనే ఆశో అత్యాశో ఈ అఖిలపక్షం ఐడియాలో దాగి ఉండి ఉండవచ్చును.

కిరణ్ మాటల ఆంతర్యం ఇదేనా..!

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య బాణి వినిపించారు. విశాఖపట్నంలో జరిగిన ఇందిరాగాంధీ 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రం ఇప్పటికీ సమైక్యంగా ఉందంటే ఆ ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలసి వుండాలని చెప్పి, ఆ మాటమీద నిలబడి వున్న గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. తాను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ ఇప్పటి వరకూ చెప్పిన మాటలన్నీ తన సొంత మాటలు కాదని.. ఇందిరాగాంధీ చెప్పినమాటలనే చెప్పానని అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున మరోసారి సమైక్యవాణిని వినిపించడం పరోక్షంగా మరోసారి సోనియాగాంధీకి సమైక్య సందేశం పంపడమేనని సీఎం సన్నిహితులు అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా అయినా పునస్సమీక్షించుకోవాలని ఆయన పరోక్షంగా సోనియాగాంధీకి సూచిస్తున్నారని అంటున్నారు.

అఖిలంతో పార్టీలలో కలకలం

  తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషనుతో, అవసరమయితే చంద్రబాబుని ఒప్పించయినా సరే తెలంగాణాపై పార్టీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని చెప్పిన మాటలతో, పార్టీలో ఆంధ్ర-తెలంగాణా నేతల మధ్య ఇప్పటికే చిన్నపాటి యుద్ధం మొదలయింది.   ఇప్పుడు హోం మంత్రి షిండే దీపావళి సందర్భంగా అఖిలపక్షం బాంబు పేల్చడం కేవలం తమ పార్టీలో విద్వంసం సృష్టించడానికేనని ఆ పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే మొదటి నుండి అఖిలపక్షం కోసం గట్టిగా డిమాండ్ చేసింది కూడా తమ పార్టీయే కావడంతో, ఇప్పడు దానిపై గట్టిగా మాట్లాడేందుకు తెదేపా నేతలు తడబడుతున్నారు. తెరాస,టీ-కాంగ్రెస్ నేతలు దీనిపట్ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.   బీజేపీ ఇదీ ఒకందుకు తమ మంచికే జరుగుతోందని భావిస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దీనిని వ్యతిరేఖిస్తుండగా మొదటి నుండి రాష్ట్ర విభజన సమర్దిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం దీనిని స్వాగతించారు. అయితే ఈసారి అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆయన డిమాండ్ చేసారు.   బహుశః ఆయన కాంగ్రెస్ మనసులోమాటే పలికినట్లుంది. అలా చేస్తే మొట్ట మొదట ఇబ్బంది పడేది తెదేపాయేనని కాంగ్రెస్ కి తెలియకపోదు. అందువల్ల ఈసారి ఒక్కరినే రమ్మని ఆహ్వానించవచ్చును. అయితే తెదేపా కూడా కాంగ్రెస్ జిమ్మికులన్నిటినీ ఔపోసన పట్టిన పార్టీయే గనుక, ఒకవేళ అఖిలపక్షానికి ఒక్కరినే ఆహ్వానిస్తే, ఏదో కారణంతో బాయ్ కాట్ చేసి గండం గట్టె క్కేప్రయత్నం చేయవచ్చును. అయితే సమస్యకు ఇది సరయిన, శాశ్విత పరిష్కారం కాదని ఆ పార్టీకి తెలియకపోదు. అయితే ఇంతకంటే వేరే మార్గం కూడా లేదు.   ఇక సమైక్యాంధ్ర ఉద్యమ గురుతర భాద్యతలని తన భుజస్కందాలకెత్తుకొన్న జగన్మోహన్ రెడ్డి, ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చేయడానికి వీలులేదని, కేంద్రమంత్రుల బృందం సూచనలేవీ తమకు ఆమోదయోగ్యం కావని గట్టిగా వాదించి, తన సమైక్య చాంపియన్ బిరుదుని కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును.

జగన్ని ఒడ్డున పడేయడానికే అఖిలపక్షమా

  కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా నిద్రనుండి మేల్కొన్నట్లు, రాష్ట్ర విభజన ప్రక్రియని చాలా దూరం తీసుకుపోయాక, ఇప్పుడు అఖిలపక్షమని కలవరింతలు మొదలుపెట్టింది. దానికి అనేక కారణాలు ఉండవచ్చును. గానీ దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీలకేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోతున్నా చంద్రబాబు ఇప్పటికీ తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎలాగో రోజులు దొర్లించేస్తుంటే, సమైక్యాంధ్ర సంకల్పం చెప్పుకొన్నజగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా సమైక్యఫలం పొందలేక బాధపడుతున్నారు.   మొన్ననే అతను చాల తెగించి తుఫానుకి ఎదురీదుతూ హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించినప్పటికీ, దానిని కాస్తా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీకి రెండే రెండు లేఖలు వ్రాసి పడేసి హైజాక్ చేసేసారు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒడ్డున పడేయాలంటే ఈ అఖిలపక్షం చాలా అవసరం. ఈరోజు జగన్ ‘బెయిలు బంధనాలు’ తెంచే పని కూడా పూర్తయిపోయింది. ఇక తెదేపా ఎలాగు సమన్యాయం కోరుతోంది గనుక రాష్ట్ర విభజనకు అవసరమయిన మార్గదర్శకాల పేరిట ఆ మాటేదో తెదేపా నోటనే చెప్పించేస్తే, సమైక్యాంద్రాకి ఆ పార్టీ వ్యతిరేఖమనే ట్యాగ్ తగిలించేసి, వైకాపా సీమాంద్రాలో దూసుకుపోవడానికి మార్గం సుగమం చేసేయవచ్చును.   తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈసారి కూడా స్పష్టమయిన వైఖరి చెప్పకపోవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా తేదేపాకు చీటీ చింపేయవచ్చనే ఆశో అత్యాశో ఈ అఖిలపక్షం ఐడియాలో దాగి ఉండి ఉండవచ్చును.

రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం త్వరలో

  అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిలో చచ్చిందన్నట్లు, “రాష్ట్ర విభజనలో చాలా లోతుగా అధ్యయనం చేసి, అందరినీ సంప్రదించి, అందరి ఆమోదంతో, అందరికీ ఆమోద యోగ్యంగా, చాలా రాజ్యంగబద్దంగా, ఎంతో నీతి నిజాయితీలతో, పూర్తి పారదర్శకతతో రాష్ట్ర విభజన చేస్తున్నామే తప్ప, ఇందులో మా రాజకీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం చూసుకోలేదని” ఇంతకాలం గొప్పగా కబుర్లు చెపుతూ వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్ర విభజనపై మళ్ళీ అఖిలపక్షం అంటూ కొత్త రాగం అందుకొంది. వచ్చేనెల 7న మంత్రుల బృందం సమావేశం జరిగిన తరువాత, 9న ఈ సమావేశం ఉంటుందని హోం మంత్రి షిండే ప్రకటించారు.   సీమాంద్రాలో అన్ని లక్షలమంది ప్రజలు, ఉద్యోగులు రోడ్లమీధకు వచ్చి రెండు నెలల పాటు ఏకధాటిగా తమ నిరసనలను తెలియజేసినా వారి ఆందోళనలని పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు వీసమెత్తు విలువీయకుండా మొండిగా ముందుకు సాగిన కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ అఖిలపక్ష రాగం ఆలపించడం ఎలా ఉందంటే, శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు మధ్యలో ‘నారాయణ నారాయణ గోవింద గోవింద’ అంటూ మూడు సార్లు క్రిందకు దించి లేపుతారు, పోయిన మనిషి తిరిగొస్తాడనే చిన్న ఆశతో కావచ్చు లేదా వేరే కారణం వల్ల కావచ్చును, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభజన విషయంలో అలాగే చేస్తోంది.   ఒకవైపు కేంద్రంలో రాష్ట్ర విభజనతో సంబంధం ఉన్నఅన్నిమంత్రిత్వ శాఖలు పంపకాల ప్రక్రియ పూర్తి చేస్తుంటే, మరో వైపు హోంశాఖ నియమించిన టాస్క్ ఫోర్సు రెండు రాష్ట్రాలలో శాంతి భద్రతల కోసం చకచకా ఏర్పాట్లు చేస్తుంటే, వచ్చే నెల 5ని డెడ్ లైన్ గా పెట్టుకొని అన్ని పనులు పూర్తి చేస్తూ, 7న మంత్రుల బృందం సమావేశం కూడా పూర్తయిన తరువాత, అప్పుడు తీరికగా అఖిలపక్షం అనడం కేవలం వెటకారమే. ఏనుగు నమిలి తినే తన దంతాలను దాచిపెట్టి, పైకి అందమయిన పెద్ద దంతాలు చూపుతునట్లే, కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరిస్తోంది.   అఖిలపక్షం ఐడియాతో రాష్ట్ర విభజనను జాప్యం చేయాలనుకొంటోందని తెలంగాణా వాదులు భావిస్తే, తమను మరో మారు మభ్యపెట్టేందుకే ఈ కొత్త నాటకమని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ రెండు ప్రాంతాలలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంది. అసలు మొదటి నుండి తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే చూసుకొంటూ మొండిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అదే మొండి తనంతో ముందుకు సాగి ఉంటే, కనీసం తెలంగాణాలో అయినా ఆ పార్టీకి నాలుగు ఓట్లు రాలేవేమో!   కానీ ఇప్పుడు అఖిలపక్షం అనడం వలన మేమే తెలంగాణా సాధించామని భుజాలు చరుచుకొంటూ జైత్రయాత్రలు చేస్తున్న టీ-కాంగ్రెస్ నేతలు కూడా మళ్ళీ మారోమారు ఆ సాహసం చేయలేరు. అసలు ముందు చేయవలసిన పనిని ఆఖరున, ఆఖరున చేయవలసిన పనిని ముందు చేస్తూ, కాంగ్రెస్ అభాసుపాలవుతోంది. దీనినే వ్రతం చెడ్డా ఫలం దక్కక పోవడం అంటారేమో.

వైకాపా అభిమానులకి శుభవార్త

      వైకాపా అభిమానులకు శుభవార్త...ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై విధించిన షరతులను సీబీఐ కోర్టు సడలించింది. ఇకా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంతేకాదు.. ఢిల్లీకి కూడా వెళ్లేందుకు అవకాశమిచ్చింది. తాను ఒక రాజకీయ పార్టీకి అద్యక్షుడనని, ఎమ్.పిని అని ,ప్రజలకు సంబంధించిన అంశాలపై ఆయా ప్రాంతాలలో పర్యటించవలసి ఉంటుందని , కనుక తనపై పెట్టిన ఆంక్షలను సడలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున న్యాయవాది కోర్టులో అదే వాదనను వినిపించారు. ఈ వాదనను సిబిఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఢిల్లీ వెళ్ళడానికి, రాష్ట్రంలో పర్యటించడానికి అనుమతినిస్తే కేసుపై తీవ్ర ప్రభావం పడుతుందని వాదించారు. చివరికి జగన్ తరుపు న్యాయవాది వాదనకు ఏకీభవించి కోర్ట్ అనుమతి మంజూరు చేసింది.