కేసీఆర్ కి హస్తం ఇచ్చిన కోమటిరెడ్డి సోదరులు
posted on Apr 20, 2013 @ 9:13PM
కోమటిరెడ్డి సోదరులు ఎట్టకేలకు తామిరువురు ప్రస్తుతం కాంగ్రెస్ వీడే ఆలోచనలేనట్లు సూచన ప్రాయంగా ఈరోజు తెలియజేసారు. తెరాస అధ్యక్షడు కేసీఆర్ తమ పార్టీలో చేరే కాంగ్రెస్ నేతలకి ఈనెల 27వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించడంతో, ఇంతకాలంగా తెరాసలో చేరాలా లేక వైయస్సార్ పార్టీలో చేరాలా అనే విషయంపై తీవ్ర అయోమయంలో ఉన్న కోమటిరెడ్డి సోదరులు, తప్పనిసరి పరిస్థితుల్లో తమ నిర్ణయం ప్రకటించవలసి వచ్చింది.
భువనగిరి కాంగ్రెస్ పార్టీ యంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలోగా తమ అధిష్టానం తెలంగాణ అంశంపై ఖచ్చితమయిన ప్రకటన చేయకపోతే తామిరువురు తమ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించక తప్పదని చెప్పారు.తద్వారా వారు ప్రస్తుతం కాంగ్రెస్ వీడే ఆలోచనలేనట్లు తెలియజేయడమే కాకుండా, కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ కూడా తాము కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని స్పష్టం చేసినట్లయింది. అదే సమయంలో తమపై ఆసక్తి ఉన్న రాజకీయ పార్టీలు మరికొంత కాలం ఎదురుచూడక తప్పదనే సూచన కూడా వారి ప్రకటనలో ఇమిడి ఉంది. ప్రజలు, కార్యకర్తలు కోరినట్లయితే రాబోయే ఎన్నికలలో నల్గొండ జిల్లా ఆలేరు నుండి శాసనసభకు పోటీ చేస్తానని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్రపడ్డ కోమటిరెడ్డి సోదరులు, ఒకవేళ తమకు పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే అప్పుడే తగిన నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నట్లున్నారు. అందుకే వారిరువురూ మరికొంత కాలం పార్టీలోనే కొనసాగుతూ వేచి చూసేందుకు నిర్ణయించుకొని ఉండవచ్చును.
కేసీఆర్ చెప్పటిన ఆపరేషన్ ఆకర్షకి వెలువడిన మొదటి ప్రతిస్పందన ఈవిధంగా రావడం కేసీఆర్ కు కొంచెం నిరాశ కలిగించక మానదు. ఇక ఇప్పటికీ ఎటువంటి ఖచ్చితమయిన ప్రకటన చేయకుండా సస్పెన్స్ నడిపిస్తున్న మందా జగన్నాధం, వివేక్ మరియు కే.కేశవ్ రావుల ప్రకటన కోసం కేసీఆర్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇంకా కేవలం వారం రోజులే గడువు ఉన్నపటికీ, వారు కూడా మరికొంత కాలం ఈ సస్పెన్స్ కొనసాగించవచ్చును. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీతో వారికున్న అనుబంధం వారిని ఇప్పటికీ వెనక్కు లాగుతూనే ఉంది. పార్టీలో ఇతర సీనియర్లు ఇన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, ఇక రిటైర్ అయ్యే సమయంలో తెరాసలో జేరి ఇంతకాలం పొందిన గౌరవం, పరువు ప్రతిష్టలు పాడు చేసుకోవడం ఎందుకని అడిగిన ప్రశ్నతో వారిని తీవ్ర సందిగ్ధంలో పడేశాయి. అందువల్ల కేసీఆర్ పెట్టిన 27వ తేదీ డెడ్ లైన్ లోగా ఎవరు చేరకపోవచ్చును.