నేటి నుండి పవన్ ఆంధ్రాలో ప్రచారం

  తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఇప్పుడు సీమాంధ్ర దారి పట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గుంటూరులో నరసరావుపేట, చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇంతవరకు కేసీఆర్ పై తన బాణాలు ఎక్కుపెట్టిన పవన్, ఇకపై జగన్మోహన్ రెడ్డిపై బాణాలు సందించడం ఖాయం. అదేవిధంగా ఇంతవరకు ఆయనపై కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎదురు దాడి చేయగా ఇకపై జగన్, విజయమ్మ, షర్మిలా ఎదురుదాడి చేయవచ్చును. నరేంద్ర మోడీ ఇంకా ప్రచారానికి రాక మునుపే జగన్మోహన్ రెడ్డిపై కటిన చర్యలు తప్పవని హెచ్చరించినందున, ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నపవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగానే విమర్శలు చేయవచ్చును. పవన్ కళ్యాణ్ ప్రచారంతో తెలంగాణాలో తెదేపా-బీజేపీ అభ్యర్ధులు బలం పుంజుకొన్నట్లుగానే, సీమంద్రాలో కూడా వారి అభ్యర్ధులు బలం పుంజుకోవచ్చును. ఇక ఇంతవరకు ఆంధ్రాలో చిరంజీవి ఒక్కరే ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రవేశిస్తుండటంతో ప్రచారపర్వం ఆసక్తికరంగా మారనుంది.

బీజేపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిపై చర్యలు: మోడీ

  బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ నిన్న ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్ట మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, ఆ చర్యలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డితో కూడా కటినంగానే వ్యవహరిస్తామని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతేగాక తమ ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయిన సీట్లను తప్పక సాధిస్తుందని, అందువల్ల వైకాపా మద్దతు తీసుకోబోమని, ఆపార్టీని దూరంగా ఉంచుతామని అన్నారు. ఇంతకు ముందు మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆయన వైకాపా మద్దతు తమకు అవసరం లేదని ప్రకటించడం చూస్తే, బహుశః ఆయన చెపుతున్నట్లు తమ పార్టీ గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారని అర్ధమవుతోంది. ఇటీవల వెలువడిన తాజా సర్వే నివేదికలు కూడా ఎన్డీయే కూటమికి స్పష్టమయిన ఆధిక్యత రావచ్చని సూచిస్తున్నాయి. బహుశః అందుకే మోడీ తమకు వైకాపా మద్దతు అవసరం లేదని అనగలిగారు. అందువలన జగన్మోహన్ రెడ్డి కూడా ఇకపై కాంగ్రెస్ లేదా అది మద్దతు ఇచ్చే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చి కేంద్రంలో మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చును. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి రానున్న నరేంద్ర మోడీ, తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డిపై మరింత ఘాటుగా విమర్శలు, హెచ్చరికలు చేయవచ్చునని ఆయన మాటలు సూచిస్తున్నాయి. ఇది బీజేపీతో పొత్తులు పెట్టుకొన్న తెదేపాకు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి మరింత ఉత్సాహం కలిగించవచ్చును. మోడీ తన ఎన్నికల ప్రచారం వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పోటీ చేస్తున్న వైజాగ్ నుండే మొదలుపెట్టే అవకాశం ఉంది గనుక, అది ఆమె విజయావకాశాలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.

చంద్రబాబు వ్యూహాలతో విజయానికి ఆమడ దూరంలో కాంగ్రెస్, తెరాసలు

  తెలంగాణా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారంతో తెలంగాణాలో తెలుగుదేశం దుఖాణం దాదాపు బంద్ అయిపోయినట్లేనని అందరూ భావించారు. రాష్ట్ర విభజన తరువాత ఇక తెలంగాణాలో తెదేపా ఉనికి ఉండబోదని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేకమార్లు అన్నారు. కానీ ఇప్పుడు అదే తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు అదే తెదేపా కాంగ్రెస్, తెరాసలకు దీటుగా గట్టి పోటీ ఇచ్చింది. అందుకు కారణం చంద్రబాబు అనుసరించిన వ్యూహాలు, ఎత్తులు, కృషేనని చెప్పక తప్పదు.   ఎన్నికల ప్రకటన వెలువడగానే, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బీసీ మంత్రం జపించి ప్రత్యర్ధులకు పరీక్ష పెట్టారు. ఆ వెనువెంటనే బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసి, కాంగ్రెస్, తెరాసలు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి కల్పించారు. ఆ తరువాత, మంచి ప్రజాధారణ గల పవన్ కళ్యాన్ని ముందుకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో వేడి పుట్టించారు. తెలంగాణా వ్యాప్తంగా తన పార్టీ నేతలను, వారి అనుచరులకు మద్దతుగా వరుసపెట్టి ప్రజాగర్జన సభలు నిర్వహిస్తూ, కాంగ్రెస్, తెరాసలపై, ముఖ్యంగా తెలంగాణాలో తనకి ఎదురేలేదనుకొంటున్న కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీ శ్రేణులలో సమరోత్సాహం కలిగించి కేసీఆర్ సైతం నివ్వెరపోయేలా చేయగలిగారు.   అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన హైదరాబాదు నగరాన్నిచూపుతూ అది తన కృషి, సమర్ధత, దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనమని చెప్పుకొని, తమ పార్టీ మాత్రమే తెలంగాణా అభివృద్ధికి కృషి చేసిందని, చేయగలదని గట్టిగా నొక్కి చెపుతూ ప్రజలను ఆకట్టుకొన్నారు. ఇక ప్రచారం కీలక దశకు చేరుకోగానే బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిష్ణయ్యే మా పార్టీ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చంద్రబాబు స్వయంగా విస్పష్టంగా ప్రకటించడంతో, కాంగ్రెస్, తెరాసలు అంతే దీటుగా ఆయనకు సవాలు విసరలేకపోయాయి. కారణాలు అందరికీ తెలిసినవే!   నిన్నటితో తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఇప్పుడు పార్టీల బలాబలాలు ఒకసారి చూసుకొంటే, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ కానీ, తెచ్చిన తెరాస గానీ గుండెల మీద చెయ్యేసుకొని మాకే పూర్తి మెజార్టీ వస్తుందని చెప్పలేని పరిస్థితి. కారణం తెదేపా-బీజేపీ కూటమి అనూహ్యంగా పుంజుకొని ఆ రెండు పార్టీలకు గట్టి పోటీనీయడమే. కేసీఆర్ దురాశకు పోకుండా ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే బహుశః ఇటువంటి దుస్థితి వచ్చేదే కాదేమో. అప్పుడు ఎన్నికలు కాంగ్రెస్-తెరాసలకు పూర్తి అనుకూలంగా ఏకపక్షంగా జరిగి ఉండేవేమో!   కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొన్నట్లు, ఇంతకాలం సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిన నోటితోనే కేసీఆర్ ఇప్పుడు ఆమె వలననే తెలంగాణా ఏర్పడిందని, థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామన్న నోటితోనే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు యూపీఏ కూటమికి మద్దతు ఇస్తామని ఒక టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లేనని అర్ధమవుతోంది. మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరడానికి సిద్దం అవుతున్నారని అర్ధమవుతోంది. ఇదే విషయాన్నీ జైపాల్ రెడ్డి కూడా దృవీకరించారు.   ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఇంతకాలం తమదే విజయమని చాలా ధీమా ప్రదర్శించిన కాంగ్రెస్, తెరాసలు మాత్రం విజయం సాధించే అవకాశం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. తమకే ఏక పక్షంగా ఓట్లు పడిపోతాయని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్, కాంగ్రెస్ నేతలు, తెదేపా ఇచ్చిన గట్టి పోటీ వలన విజయానికి ఆమడ దూరంలో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. తెదేపా-బీజేపీలది అనైతిక బందమని ఇంతకాలంగా విమర్శిస్తున్న కాంగ్రెస్, తెరాసలు ఎన్నికల తరువాత అధికారం కైవసం చేసుకొనేందుకు మళ్ళీ నిసిగ్గుగా చేతులు కలిపేందుకు సిద్దపడుతున్నారు.

కాంగ్రెస్ ఎత్తుకి బీజేపీ చిత్తు కాబోతోందా?

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోక మునుపే, అవసరమయితే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్వీరాజ్ చవాన్ ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరిస్తున్నట్లేనని బీజేపీ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రకటన వెనుక బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే దురాలోచన కూడా ఉందని, అందుకే ఆ పార్టీతో రహస్య ఒప్పందం ఉన్న తెరాస వంటి పార్టీలు ఎన్నికల తరువాత థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని కొత్త పాట అందుకొన్నాయని, అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల తరువాత ఏ కూటమికి మద్దతు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కొన్ని రోజుల క్రితం వరకు థర్డ్ ఫ్రంట్ ని చాలా తేలికగా తీసుకొన్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ వేస్తున్న కొత్త ఎత్తుతో చాలా కంగారు పడుతోందని వెంకయ్య మాటలు స్పష్టం చేస్తున్నాయి.

సినిమాల కంటే దేశసేవే ముఖ్యం: పవన్ కళ్యాణ్

      తనకు ఇప్పుడు సినిమాల కంటే దేశసేవే ముఖ్యమని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తాను సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని లేదని, అయితే సినిమాల కంటే తనకు దేశసేవే ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణలోని కామారెడ్డిలో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మనసులో అనుకుంటున్న మాటని బయటపెట్టారు. పవన్ దేశసేవే ముఖ్యమని అన్నప్పుడు సభలో వున్నవారు ‘‘సినిమాలు’’ అని అరిచారు. దానికి పవన్ స్పందిస్తూ, సినిమాలలో నటిస్తూనే వుంటానని చెప్పారు. ఇంతకీ పవన్ దేశసేవ ఏ రూపంలో చేయబోతున్నారనేది మాత్రం చెప్పలేదు.

ఆత్మహత్యలకు టీఆర్ఎస్సే కారణం: జైరాం రమేష్

      టీఆర్ఎస్ మీద కొంతకాలంగా విరుచుకుపడుతున్న జైరాం రమేష్ సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్‌ని నమ్ముకుని దగ్గరుండి తెలంగాణ క్రతువు జరిపించిన జైరాం రమేష్ కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ప్లేటు ఫిరాయించడంతో బాగా హర్టయ్యాడు. తెలంగాణలో టీఆర్ఎస్‌కి ఎంత ఎక్కువ డ్యామేజ్ చేయగలిగితే అంత మంచిదన్న అభిప్రాయంలో ఆయన వున్నట్టున్నారు. అందుకే టీఆర్ఎస్ మీద సోమవారం భారీ కామెంట్ చేశారు. తెలంగాణలో యువకుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్సే కారణమని జైరాం రమేష్ ఆరోపించారు. యువకులు ఆత్మహత్యలు చేసుకునేలా టీఆర్ఎస్ నాయకులు ప్రేరేపించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల మీద స్పందించడానికి టీఆర్ఎస్‌కి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం చేయడానికి, ఎదుటి పార్టీలని తిట్టడానికి టీఆర్ఎస్‌కి టైమైపోయింది.

వైఎస్ జగన్ ఐదు సంతకాల గుట్టు ఇదే

      వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాను సీమాంధ్రకి ముఖ్యమంత్రి అయిపోతానని, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు సంతకాలు చేస్తానని చెబుతూ వస్తున్నారు. ఆ ఐదు సంతకాలు గుట్టును తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు బయటపెట్టారు. ఒకవేళ జగన్ పొరపాటుగా సీఎం అయితే ఆయన సంతకాలు చేయాలనుకుంటున్న ఫైళ్ళేమిటో యనమల చెప్పారు.   సంతకం నంబర్ 1 :  తనకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి  థాంక్స్ చెప్పడంలో భాగంగా కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యే ఒప్పందం మీద. సంతకం నంబర్ 2: సీబీఐ దాఖలు చేసిన కేసులు, చార్జిషీట్లు తదితరాలను టాంపరింగ్ చేసే ఆదేశాల మీద. సంతకం నంబర్ 3: తాను స్థాపించిన బినామీ కంపెనీలు, సాక్షి మీడియాకు అదనపు రాయితీలు ఇచ్చే ఫైలు మీద. సంతకం నంబర్ 4:  తన తండ్రి లాక్కున్న 89 వేల ఎకరాల దళిత భూములతోపాటు, ఇంకా లక్షా 50 వేల ఎకరాల అసైన్డ్ భూమిని తన బినామీలకు కట్టబట్టే ఫైల్. సంతకం నంబర్ 5: తండ్రిని అడ్డు పెట్టుకుని సంపాదించిన లక్షల కోట్లు, భవంతులను క్రమబద్ధీకరించే ఆదేశాల మీద.  

స్వర్గీయ శోభా నాగిరెడ్డికి ఓట్లు వేస్తే చెల్లుతాయిట

  వైకాపా సీనియర్ నేత శోభా నాగిరెడ్డి కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదంలో మరణించడంతో, ఆమె పోటీ చేస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పాడుతాయని అందరూ భావించారు. కానీ వైకాపా ఎన్నికల సంఘం వద్ద తన పేరు రిజిస్టర్ చేయించుకొన్న ప్పటికీ దానికి ఇంకా గుర్తింపు ఇవ్వనందున, షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఈవీయంలలో ఆమె పేరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ తొలగొంచలేని పక్షంలో ఆమెకు వేసే ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ బన్వర్ లాల్ ప్రకటించారు. నిజానికి ఎక్కడయినా ఇదే పద్ధతి అనుసరిస్తారు. కానీ మళ్ళీ ఆయన తాజాగా మరో విచిత్రమయిన ప్రకటన చేసారు. శోభ నాగిరెడ్డి చనిపోయినప్పటికీ, ఈవీయంలలో ఆమె పేరు తొలగించడం వీలుపడలేదు కనుక, ఒకవేళ ఆమె పోటీ చేస్తున్న వైకాపాకు కేటాయించిన ఫ్యాన్ గుర్తుకే అత్యధికంగా ఓట్లు వచ్చినట్లయితే, ఆళ్లగడ్డలో మళ్ళీ ఉపఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.   శోభా నాగిరెడ్డి హటాన్మరణంతో ఏమిచేయాలో పాలుపోనే స్థితిలో ఉన్న వైకాపా, తమకు అనుకూలంగా ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇద్దామని ఆలోచించింది. కానీ ఇప్పుడు ఎన్నికల కమీషన్ స్వయంగా ఉపేన్నికలకి మార్గం సుగమం చేసింది గనుక, ఆమె మరణంతో ప్రజల ఏర్పడిన సానుభూతిని తమ పార్టీకే అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నంలో ఆమెకే ఓటువేసేలా ప్రజలను ప్రోత్సహించవచ్చును. ఒకవేళ ఈ ఎన్నికలలో వైకాపాయే విజయం సాధించి అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు ఉపఎన్నికలలో నెగ్గడం పెద్ద సమస్య కాబోదు.

తెలంగాణలో ష్ గప్ చుప్

    ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరుగనున్న తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సాయత్రానికి ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీ కూడా ఎన్నికలకు సంబంధించిన మేటర్స్ మాట్లాడకూడదు. ఇతర పార్టీల మీద విమర్శలు చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎన్నికల కమిషన్ నిషేధించింది. టీవీ ఛానళ్ళలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇక ప్రదర్శించరాదు. సీమాంధ్రకు సంబంధించిన ప్రకటనలు కూడా తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ టీవీ ఛానళ్ళలో ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రదర్శించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే పైచేయి

      ఎప్పటి లాగానే ఈసారి కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళలో బాలుర శాతం 51.37. బాలికల ఉత్తీర్ణత శాతం 60.52. బాలుర కంటే బాలికలే దాదాపు తొమ్మది శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 8.68 లక్షల మంది. వీరిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 4.55 లక్షలు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్స్ లో 42.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.24 శాతం పెరిగింది.

రాహుల్ కోరితే యుపిఏకి మద్దతిస్తా: కేసీఆర్

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాలుక మళ్ళీ మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని, పొన్నాల లక్ష్మయ్యని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పేరు పేరునా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోయి, పోలింగ్ మాత్రమే బ్యాలన్స్ వున్న సమయంలో ట్విస్ట్ ఇచ్చాడు. ఒక జాతీయ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. ఈ ఎన్నికల తర్వాత మోడీ నాయకత్వంలోని ఎన్డీయేకి తాను మద్దతు ఇవ్వనని చెప్పాడు. ఇది సంచలన ప్రకటన కాదు.. మోడీ ప్రస్తావన అయిపోయిన తర్వాత అసలు సంచలన ప్రకటన కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. రాహుల్ గాంధీ తనని కోరిన పక్షంలో యు.పి.ఎ.కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. దీంతోపాటు తెలంగాణ రావడానికి సోనియాగాంధీనే కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చేరువ కావడానికి కేసీఆర్ ఈ మాటలు మాట్లాడి వుండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలు నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అంటున్నారు.

టీఆర్ఎస్‌కి వీఆర్ఎస్సే: గజ్వేల్‌లో చంద్రబాబు గర్జన

      టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో ఇంతకాలం సంయమనం పాటించిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల ప్రచార వేళ ముగుస్తున్న సమయంలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా గర్జించారు. ఆ గర్జన కూడా అక్కడో ఎక్కడో కాకుండా, కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే గర్జించారు. ఆ గర్జనలివిగో... తెలంగాణలో దొరలరాజ్యం పోవాలి. కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా. గజ్వేల్ నీ జాగీర్ అనుకుంటున్నావా కేసీఆర్? గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ఊదితే గోదావరిలో పడతావ్. కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో అవినీతి పంట పండిస్తున్నాడు. తెలంగాణకి ద్రోహం చేస్తున్న ప్రధాన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అంతు చూస్తా. మోడీనీ, నన్ను తిడతావా.. ఖబడ్డార్.  

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల

      ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫలితాను విడుదల చేశారు. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఫలితాల రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 8.68 లక్షల మంది. వీరిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 4.55 లక్షలు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళలో బాలుర శాతం 51.37. బాలికల ఉత్తీర్ణత శాతం 60.52. మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్స్ లో 42.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.24 శాతం పెరిగింది. 74 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మే 6 లోపు విద్యార్థులు రీ కౌంటింగ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.   To know results from the websites: * http://examresults.ap.nic.in * http://results.cgg.gov.in * www.apit.ap.gov.in * www.results.educationandhra.com * www.resumedropbox.com, * www.indiaresults.com * www.vidyavision.com * www.ExamResults.net * www. nettlinxresults.net * www.manabadi.com * www.manabadi.co.in * www.results.manabadi.co.in * www.schools9.com * www.exametc.com * http://results.webdunia.com * www.bharatstudent.com * www.kabconsultants.com * www.educationgateway.com * www.AndhraEducation.net * www.results.andhraeducation.net * www.educationandhra.com * www.betechs.com * www.koshercomm.in * www.resultsindia.in * www.educationplus.co * www.PsddOrFail.in * www.asmalldream.org * www.manachaduvu.com * www.vidyavision.co.in * www.vnssolutions.in * www.iitjeeforum.com

కేసీఆర్, పొన్నాలకు విద్యార్థుల షాక్‌!

  తెలంగాణ ఉద్యమం పేరుతో హడావిడి చేస్తున్న రాజకీయ నాయకులకు కరెక్ట్ మొగుళ్ళు ఎవరయ్యా అంటే.. ఇంకెవరూ.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఎంత పుడింగి లాంటి రాజకీయ నాయకుడైనా భంగపడాల్సిందే. ఇలా గతంలో అనేకమంది నాయకులు భంగపడ్డారు. పేర్లెందుకు గానీ, కొంతమంది నాయకులైతే పాపం ఉస్మానియా విద్యార్థుల చేతుల్లో తన్నులు కూడా తిన్నారు. అప్పుడెప్పుడో కేసీఆర్ ఉత్తుత్తి నిరాహారదీక్ష చేసి పళ్ళరసం తాగి విరమించగానే ఉస్మానియా విద్యార్థులు రంగంలోకి దిగారు. దాంతో భయపడిపోయిన కేసీఆర్‌ చచ్చినట్టు ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని మరీ వెరైటీ నిరాహారదీక్ష చేశాడు. అలాంటి ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్‌కి మరోసారి షాక్ ఇచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లో ప్రచారం చేయడానికి హెలికాప్టర్లో వెళ్ళాడు. హెలికాప్టర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దిగగానే విద్యార్థులు కేసీఆర్‌కి చెప్పులు చూపిస్తూ ‘గో బ్యాక్’ అని అరిచారు. తెలంగాణ విద్యార్థులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో బెదిరిపోయిన కేసీఆర్ అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కి తుర్రుమని పారిపోయే వరకూ విద్యార్థులు వెనకడుగు వేయలేదు. అలాగే టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి కూడా ఒక తెలంగాణ విద్యార్థి షాకిచ్చాడు. సొంత నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పొన్నాల మీద ఒక విద్యార్థి చెప్పు విసరడానికి ప్రయత్నించాడు. అది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ విద్యార్థిని పట్టుకుని చావబాదారు. తనకు చెప్పుతో స్వాగతం లభించడంతో బిత్తరపోయిన పొన్నాల అక్కడ ప్రచారం చేయకుండానే వెళ్ళిపోయాడు. మొత్తమ్మీద ఏంటంటే, కేసీఆర్, పొన్నాల.. వీళ్ళిద్దరూ ఒకరికొకరు భయపడరు. కానీ ఇద్దరూ స్టూడెంట్స్ అంటే భయపడతారు.

రామ్‌దేవ్ మీద ఇ.సి. నిషేధం: కేసీఆర్ తిట్లపై వుండదా?

      ఎన్నికల కమిషన్ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వుంటుంది. కొంతమంది మీద చిన్న చిన్న పాయింట్లను కూడా పట్టించుకుని కొరడా ఝుళిపిస్తుంది. మరికొంతమంది ఏం చేసినా అసలు ఎంతమాత్రం పట్టించుకోకుండా ఊరుకుంటుంది. ఈమధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు బీజేపీ నాయకులు, నిన్నగాక మొన్న రామ్ దేవ్ బాబా కాస్తంత నోరు జారి మాట్లాడినందుకు వాళ్ళు ఎక్కడా, ఏ ఎన్నికల మీటింగ్‌లో మాట్లాడకూడదని నిషేధం విధించింది. నరేంద్రమోడీ, రాహుల్ గాంధీలకు కూడా ఎక్కువగా మట్లాడొద్దని వార్నింగ్స్ ఇచ్చింది. అయితే కేసీఆర్ ఎవర్ని ఎన్ని రకాలుగా తిట్టినా, ప్రాంతీయ విభేదాలు పెరిగేలా ఎంత మాట్లాడినా, ఇతర పార్టీలవాళ్ళని సన్నాసులు, దద్దమ్మలు అన్నా, పవన్ కళ్యాణ్‌ని ‘వాడు’ అన్నా ఎన్నికల సంఘానికి వినిపించలేదు. కేసీఆర్ ఎన్నో రకాలుగా అదృష్టవంతుడని నిరూపణ అయింది. ఇప్పుడు ఎన్నికల సంఘం వైపు నుంచి కూడా ఆయనకి అదృష్టం కలిసొస్తుందని అనుకోవాలా?

కావూరి బీజేపీలో చేరడం ఖాయం: మే 1న పార్టీ తీర్థం

      పాపం కావూరికి ఎట్టకేలకి బీజేపీలో ఎంట్రీ దొరుకుతోంది. చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఆ తర్వాత ఎప్పుడో తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కావూరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే బీజేపీలో చేరిపోయి ఎన్నికలలో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ బీజేపీ నుంచి ఆయనకి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడ మా పార్టీలో చేరితో తమరికి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి. అలా ఇస్తే తమరి పుణ్యమా అని సీమాంధ్రలో మా పార్టీ గల్లంతయిపోయే ప్రమాదం వుంది. అంచేత మీకు ఇప్పుడే పార్టీ తీర్థం ఇవ్వబోమని బీజేపీ నాయకత్వం క్లియర్‌గా చెప్పేసింది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ పరిశీలిస్తామని చెప్పింది. ఆ ప్రకారంగా కావూరి బీజేపీలో చేరడానికి బీజేపీ ఇపుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఓకే అనడంతో బతుకుజీవుడా అనుకున్న కావూరి బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మే 1న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్డీయే మిత్రపక్షాల సభలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పుడు కృష్ణ, మహేష్ అభిమానుల వంతు

      చిరంజీవి కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని తన అభిమానులను కోరుతుంటే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్’ అంటూ బీజేపీకే ఓటేయమని కోరుతూ గట్టిగా ప్రచారం చేస్తుండటంతో మెగా అభిమానులకు ఎవరి మాట వినాలో తెలియని ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు కూడా అటువంటి పరిస్థితే ఎదురయింది. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు తన బావగారయిన (తెదేపా గుంటూర్ లోక్ సభ అభ్యర్ధి) గల్లా జయదేవ్ కే తాను మద్దతు ఇస్తున్నానని, తన అభిమానులు కూడా ఆయనకే మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాని ట్వీటర్ మేసేజ్ పెట్టారు.   నేడో రేపో మహేష్ బాబు స్వయంగా బావగారు జయదేవ్ కోసం గుంటూరులో ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానుల సంఘాల గౌరవాధ్యక్షుడు మరియు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు మీడియాతో మాట్లాడుతూ తమ అభిమాన సంఘాలన్నీ వైకాపాకే మద్దతు ఇవ్వాలని నిశ్చయించుకొన్నాయని ప్రకటించారు. అంతే కాక అవసరమయితే తన సోదరుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని విస్పష్టంగా ప్రకటించారు. అందుకు బలమయిన కారణమే ఉంది. ఆయన తెదేపా టికెట్ ఆశించి భంగపడిన తరువాత వైకాపాలో చేరి టికెట్ సాధించి తెనాలి నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కనుక అభిమానులు వైకాపాకే మద్దతు ఈయలని కోరుతున్నారు. మహేష్ బాబు తేదేపాకు మద్దతు ఇవ్వమని కోరుతుంటే, ఆయన వైకాపాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, కృష్ణ కూడా వైకాపా తరపున ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించడంతో, ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా మెగా డైలెమాలో పడ్డారు. గల్లా జయదేవ్ గుంటూరు నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నందున, ఆయనకు మద్దతు ప్రకటించిన మహేష్ బాబు, నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే, తప్పనిసరిగా ఆ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్ధులకు ప్రచారం చేయవలసి ఉంటుంది. అటువంటప్పుడు ఆయన తండ్రి కృష్ణ వైకాపా తరపున ప్రచారం చేస్తారా? చేస్తే అప్పుడు తాము ఎవరిని అనుసరించాలి? అనే సందిగ్దత అభిమానులలో నెలకొంది.            

తెలంగాణలో ఎన్నికల సందడి సమాప్తం!

      రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరగనున్న తెలంగాణ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. 30వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల ఇళ్లకు వెళ్లి పలుకరించడం.. ర్యాలీలు..రోడ్‌షోలు.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు అన్నిటినీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయపార్టీలను ఆదేశించింది. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్2న ఆవిర్భవించనున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఈసారి ప్రత్యేకంగా దృష్టిసారించాయి. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి అతిరథ మహారథులను రంగంలోకి దించాయి. మొత్తంమీద మూడు వారాల ప్రచార సంరంభానికి తెరపడనుంది.