కర్నాటకలో ఘోర రైలు ప్రమాదం
posted on Sep 12, 2015 @ 1:10PM
కర్నాటకలో రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఎల్టీటీ దురంతో ఏసీ ఎక్స్ ప్రెస్(ట్రైన్ నెంబర్ 12990)... తెల్లవారుజామున రెండున్నర గంటలకు షాహబాద్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది, ఈ ప్రమాదంలో బీ8 కోచ్ పూర్తిగా దెబ్బతినడంతో, 8మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు, మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, ప్రమాద కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం కూడా ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాత్రిపూట ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, చిమ్మచీకట్లో క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయినట్లు రెస్క్యూ టీమ్స్ తెలిపాయి. దాంతో మతుల సంఖ్య పెరిగే అవకాశముందని రైల్వే అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రమాదం కారణంగా సికింద్రాబాద్-ముంబై, చెన్నై ప్రధాన మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించగా, మరికొన్ని రైళ్లను రద్దుచేశారు. రైలు ప్రమాదంపై విచారం వ్యక్తంచేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.