అగ్రిగోల్డ్ కుంభకోణంలో మరో ట్విస్ట్.. ఇంకా 70 స్థిరాస్తులు

అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో విషయం బయటపడింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి ఆసంస్థ కోర్టుకు సమర్పించిన ఆస్తుల వివరాలు కాకుండా ఇంకా 70 స్థిరాస్తులు తమ విచారణలో వెల్లడైనట్లు ఏపీ సీఐడీ హైకోర్టుకు నివేదించింది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను కోర్టుకు తెలియజేయకుండా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం మోసం చేసిందని.. ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు అటాచ్‌ చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానానికి తెలియకుండా ఏ ఒక్క ఆస్తి కూడా ఉండరాదని, ఇప్పటికైనా స్వచ్ఛందంగా బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను ధర్మాసనానికి నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

జుకర్‌బర్గను చంపేస్తాం, ట్విట్టర్‌ను పాతేస్తాం... ISIS

  తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్లు వేలాది ఖాతాలను రద్దు చేయడంతో ISIS తీవ్రవాదులకి తెగ కోపం వచ్చేసింది. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ను, ట్విట్టర్‌ సీఈఓ జాక్‌ డార్సీనీ చంపేస్తాం అంటూ హెచ్చరికలతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది. తమను అణగదొక్కేందుకు ఈ సోషల్‌మీడియావారు అమెరికాతో కలిసి ఎన్ని కుతంత్రాలు పన్నినా, వాటిని దీటుగా ఎదుర్కొంటామంటూ వీడియోలో స్పష్టం చేసింది. వీడియో చివర్లో ‘మీరు రోజూ మా ఖాతాలను నిర్మూలించామంటూ ప్రకటిస్తుంటారు. అంతకు మించి మీరేమీ చేయలేరు. కానీ మేము మాత్రం మీ జీవితాలనే నిర్మూలించి పారేస్తాం’ అంటూ ముగించారు.

బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం..పారిపోయాడు.. ఎక్కడ..?

సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన నాయకులే తప్పులు చేస్తే.. ఇంకా ఆ ప్రజలకి ఎవరు రక్షణ కల్పిస్తారు. బీహార్ ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ప్రజల బాగు కోసం పాటుపడాల్సి ఓ ఎమ్మెల్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ వల్లభ్ యాదవ్ నలందాకు చెందిన ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసి.. ఆమెను కారులోనే అత్యచారం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను అశ్రయించారు. పోలీసులు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో  ఆసక్తికర విషయం తెలిసింది. బాలిక కిడ్నాప్ కు గురికావడానికి కొందరు మహిళలు సహకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వ్యవహారంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారని... ఎన్ని రోజులు ఎమ్మెల్యేను స్వేచ్చగా తిరగనిస్తారు అని పోలీసులపై మండిపడ్డారు.

జెఎన్ యూ విద్యార్దులపై మరోసారి నోరుజారిన అహుజా..

రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ జేఎన్ యూ విద్యార్థులపై ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని అహుజ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంతేకాదు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనను పార్టీ అధిష్టానం కూడా ఆదేశించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన నోరు పారేసుకున్నట్టు తెలుస్తోంది. జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని.. ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎంతటి దుమారం రేగుతుందో చూడాలి.

మరోసారి చెలరేగిన స్మృతీ ఇరానీ

  ఒక విద్యార్థి మరణాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలందరినీ ఏకిపారేసిన స్మృతీ ఇరానీ, ఇవాళ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జేఎన్‌యూలో రాక్షసుడైన మహిషాసురుని పూజిస్తూ అతడిని సంహరించిన దుర్గాదేవిని దూషిస్తున్నారంటూ నిన్న స్మృతీ ఇరానీ  ఒక కరపత్రాన్ని ఉట్టంకించిన విషయం తెలిసిందే. అలాంటి కరపత్రాలను బహిరంగంగా చదవాల్సిన అవసరం లేదంటూ విపక్షాలు ఆమెను అడ్డుతగులుతూనే ఉన్నాయి. పైగా స్మృతీ ఇరానీ దుర్గాదేవికి సంబంధించి అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. దానికి జవాబుగా స్మృతీ తాను చెప్పిన విషయాలన్నీ విశ్వవిద్యాలయంలో పంపిణీ అవుతున్న కరపత్రాలలోవేననీ అంతేకానీ తన ప్రభుత్వమేమీ వాటిని ముద్రించలేదని పేర్కొన్నారు. తాను స్వయంగా దుర్గాదేవి భక్తురాలిననీ, కరపత్రంలో ఆమెకు సంబంధించి ఉన్న వివాదాస్పద విషయాలను పైకి చదవడం తనకేమీ సరదా కాదనీ పేర్కొన్నారు.

నేను దుర్గ భక్తురాలిని.. స్మృతీ క్షమాపణ చెప్పాల్సిందే..

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రోహిత్ ఆత్మహత్మపై, జెఎన్ యూ ఘటనలపై దాదాపు గంటసేపు భావోద్వేగమైన ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె వారికి ఘాటుగానే సమాధానమిచ్చింది. అయితే ఇప్పుడు స్మృతీ చేసిన వ్యాఖ్యలపై  ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్మృతీ సభకు వచ్చి, క్షమాపణ చెప్పాల్సిందే అని.. దుర్గా దేవిపై స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  స్మృతీ క్షమాపణ చెప్పనంతవరకు సభ జరగదని ప్రతిపక్షాలు తీర్మానించాయి.   మరోవైపు  స్మృతీ ఇరానీ కూడా దీనిపై స్పందించి.. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను.. నేను ఎవరికి క్షమాపణలు చెప్పను.. అని తేల్చిచెప్పారు. కాగా జేఎన్‌యూలో విద్యార్థులు మహిషాసురుడి సంబరాలు చేసుకోవడం దారుణమని.. విద్యార్థులు దుర్గా దేవిని అవమానించారని ఆమె తన ప్రసంగంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను దుర్గామాత భక్తురాలినని.. జేఎన్‌యూలో దుర్గామాతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, కరపత్రాలు పంచారని అంటూ.. వాటిని చూపించారు. అక్కడ మహిషాసురుడి ప్రాణత్యాగ దినం చేశారని కూడా ఆమె అన్నారు.

పసిపాపను పన్నెండుసార్లు కత్తితో పొడిచి.. కానీ..!

థాయ్‌లాండులో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పసిపాపను కత్తితో పొడిచి పాతి పెట్టారు. అదృష్టం ఏంటంటే పాప బతికే ఉండటం. పెద్దవాళ్లను కత్తితో పొడిస్తేనే బతకడం కష్టం.. అందునా పలుసార్లు కత్తితో పొడిస్తే ఇంక కష్టం. అలాంటిది ఒకటి కాదు రెండుకాదు పన్నెండుసార్లు కత్తితో పొడిచినా కానీ ఆపసిపాప సజీవంగా బతికి అందరినీ అశ్యర్యపరిచింది. వివరాల ప్రకారం.. థాయ్‌లాండులోని ఖాన్ కేన్ అనే ప్రావిన్సులో ఒక మహిళకు అక్కడి పొలాల్లో పనిచేస్తుండగా ఒక పసిపాప ఏడుపు వినిపించింది. అయితే ఆమె వెళ్లి చూడగా  పాప ఒళ్లంతా కత్తితో పొడిటిన గాయాలతో కనిపించింది. దీంతో ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందిచింది. పోలీసులు అక్కడికి చేరుకొని పాపను ఆస్పత్రికి తరలించి పాప ప్రాణాలు కాపాడారు. కాగా పోలీసులు పాప తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.

చంద్రబాబుకి జగన్ సవాల్..

తాజాగా వైసీపీ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకుంటున్నారన్నారు అని ఆయన అన్నారు. మేం పార్టీ స్థాపించినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలం మాత్రమే ఉన్నాం.. ఆ తరువాత 18కి చేరాం.. ఇప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు.. ఇప్పుడు పార్టీ మారిన వారి వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు.. అని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకోవాలని.. ఆయన చంద్రబాబుకి సవాల్ విసిరారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.

దుర్గావతారం ఎత్తిన స్మృతీ ఇరానీ.. ప్రతిపక్షాలకి చుక్కలు

హెచ్ సియూ విద్యార్థి ఆత్మహత్యపై రాజ్యసభలో పలువురు నేతలు పలు రకాలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రతి పక్షాలు అయితే రోహిత్ చావుకి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ దుయ్యబట్టారు. దీనికి ప్రభుత్వం కూడా ఘాటుగానే సమాధానం చెప్పింది. అయితే కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ మాత్రం తన ఉగ్ర స్వరూపాన్ని చూపించారు. రాజ్యసభలో దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగిచిన ఆమె ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. "నా పేరు స్మృతీ ఇరానీ. నా కులమేంటని ఎవరైనా అడగగలరా?  అంటూ విపక్ష సభ్యులను చాలెంజ్ చేసిన ఆమె, రోహిత్ దళితుడు కాబట్టే సస్పెండ్ చేశారని చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఢిల్లీ కూడా దాటి కాలు బయటపెట్టని రాహుల్ గాంధీ హెచ్సీయూ ఘటన తరువాత పలుమార్లు హైదరాబాద్ వెళ్లి రాజకీయాలు చేసి వచ్చారని విరుచుకుపడ్డారు. ఇంకా ప్రతిపక్షాలు ఈ ఘటనలను కేవలం రాజకీయ లబ్దికోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు.

రహస్యాలు తెలుసుకోవడానికి విజయవాడ వెళ్తున్నా.. వర్మ

రాంగోపాల్ వర్మ వంగవీటి సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వంగవీటి లోగో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.  అయితే ఈ సినిమాకి సంబంధించి రాంగోపాల్ వర్మ మరిన్ని రహస్యమైన విషయాలు తెలుసుకోవడానికి విజయవాడ వెళుతున్నారట. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన.. అలనాటి జ్ఞాపకాలు తలుచుకుంటుంటే.. విజయవాడ నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా దైవమని.. నాకు ఇప్పుడు అనిపిస్తుంది.. నేను ఏది నేర్చుకున్నా అది విజయవాడనుండే అని అన్నారు. అంతేకాదు వంగవీటి’కి సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాను. ఈ పాటను సిరాశ్రీ రాయగా.. సుశర్ల రాజశేఖర్ సంగీతం అందించాడని తెలిపారు.

రైల్వే బడ్జెట్ పై పలువురి స్పందనలు..

  కేంద్రమంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బడ్జెట్ గురించి పలువురు పలు రకాలుగా స్పందించారు. ప్రధాని మోడీ స్పందిస్తూ.. సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని.. భారత ఆర్థిక అభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతేకాదు సురేశ్ ప్రభుతో పాటు యావత్ రైల్వే కుటుంబానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు: ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సురేశ్ ప్రభు ప్రయాణికుల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. రైల్వే బడ్జెట్‌ ప్రయాణికుల సంతృప్తిపై దృష్టిసారించేలా ఉందన్నారు. ప్రకాశ్ జావదేకర్.. ఇది అన్ని విధాలుగా మంచి రైల్వే బడ్జెట్ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ అన్నారు. సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కు తాను పదికి తొమ్మిది మార్కులు ఇస్తానని ప్రకాశ్ జావదేకర్ ట్వీట్ చేశారు. సిపిఎం బివి.రాఘవులు.. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు రైల్వే బడ్జెట్ పై స్పందించారు.  రైల్వే బడ్జెట్‌లో వాగ్దానాలే కనిపిస్తున్నాయి తప్పించి కొత్తదనమేదీ లేదని.. రాబోయే రోజుల్లో పేదలకు రైలు సౌకర్యం దూరం కాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్.. రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని.. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధుల సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని పొన్నం విమర్శించారు. ఇంద్రకరణ్‌రెడ్డి.. కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సప్లమెంటరీ బడ్జెట్‌లో అయినా రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించాలని కోరారు. కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా.. రైల్వేలు భారత ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ చక్కటి సమన్వయంతో కూడిన రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టారని మంత్రి సురేశ్ ప్రభుని కొనియాడారు.

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడుతోంది..!

టి 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడబోతోంది. ఇప్పటి వరకూ తమ ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో, పాకిస్థాన్ టి 20 టోర్నీలో ఆడేది లేనిది అనుమానంగా మారింది. ఇండియాలో పాక్ టీం కు భద్రత లేదన్న నెపంతో, ఇప్పటి వరకూ అనుమతి నిరాకరించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఎట్టకేలకు అనుమతినిచ్చింది. కానీ పాక్ టీం కు స్పెషల్ సెక్యూరిటీ ఎరేంజ్ చేయాలని ఐసీసీని కోరింది.  ఒకవేళ పాక్ ఈ టోర్నీలో ఆడకపోతే, ఐసీసీకి పెనాల్టీ చెల్లించాల్సి వచ్చేది. పాకిస్థాన్ క్వాలిఫైర్ మ్యాచ్ ను మార్చి 16 న ఆడుతుంది. మార్చి 20న ధర్మశాలలో భారత్ తో ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ చూడటం కోసం, వందలాది పాకిస్థాన్ పౌరులు పౌరులు ఇండియా రావాలనుకుంటున్నారని, వారందరికీ భారత ప్రభుత్వం వీసాలు ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నామని పిసీబీ అంటోంది.

టిఆర్‌ఎస్లో చేరిన ఎర్రబెల్లి.. కేసీఆర్ ను తిట్టినందుకు బాధ పడుతున్నా

తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు  టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలవాలన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరికలను రాజకీయ కోణంలో చూడవద్దని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితనే టీఆర్ఎస్ లో చేరాల్సింది.. కేసీఆర్ ను తిట్టినందుకు బాధ పడుతున్నా.. తెలంగాణలో టీడీపీ లేనే లేదు... అది ఆపార్టీ నేతలు గుర్తించాలి.. తెలంగాణలో చంద్రబాబు చేతులెత్తేశారని అన్నారు.

నేను ఉగ్రవాదిని కాదు.. కంటతడి పెట్టిన సంజయ్ దత్

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎరవాడ జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుండి బయటకు వచ్చిన ఆయన ముందుగా సిద్ది వినాయన ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వోగానికి గురైనట్టు తెలుస్తోంది. నేను భారతీయుడిని అయినందుకు గర్వపడుతున్నానని.. ఈ రోజు కోసం తాను 23 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. అంతేకాదు జైలునుండి విడుదలవుతన్నందుకు నాలుగు రోజులుగా ఏం తినలేదు.. గత రాత్రి నిద్రపోలేదు.. జైలు నుండి బయటపడుతున్నా.. కుటుంబంతో కులుస్తున్నా.. ఆ ఆలోచనలే వెంటాడాయి.. బహుశా ఖైదీలకు ఇలాగే ఉంటుందేమో అని అన్నారు. నేను విడుదలైనందుకు మానాన్న ఉంటే చాలా ఆనందించేవారని.. నాన్నా నేను బయటకు వచ్చేశాను అని పైకి చూస్తూ చెప్పారు. ఇంకా నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చనిపోతాను.. జాతీయ పతాకం నా జీవితం నేను ఉగ్రవాదిని కాదు అంటూ సంజయ్ దత్ కంటతడి పెట్టుకున్నారు.

వడోదరకు రైల్వే యూనివర్సిటీ.. చంద్రబాబు అడిగినా..!

  కేంద్రమంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నర ప్రసంగించిన ఆయన రైల్వేలో పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసినట్టు తెలుస్తోంది. దీనిలో ఆయన దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే యూనివర్సిటీని వడోదరకు కేటాయించారు. అయితే ఈ యూనివర్శిటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు కేటాయించడం ఆశ్చర్యకరం. అసలు ఈ యూనివర్శిటీని ఏపీ నూతన రాజధాని అయిన అమరావతికి కేటాయించాలని ముందుగానే రాష్ట్ర సీఎం చంద్రబాబు మంత్రిగారిని కోరారట. ఈ విషయంపై ప్రధాని మోడీతో కూడా చంద్రబాబు చర్చించారట. అయితే పరిశీలిస్తామని చెప్పిన మంత్రిగారు ఆఖరికి మోడీ సొంత రాష్ట్రానికే ఇచ్చేశారు.

ఉన్నతాధికారి మీద కాల్పులు, ఆపై ఆత్మహత్య!

  రక్షణ దళాలలో సైనికులు ఉన్నతాధికారుల మీదకి కత్తులు దూస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఒక ఘటనలో మహిపాల్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ జవాను తన సీనియర్‌తో ఏదో విషయంలో తగవు పడ్డాడు. కొట్లాట తారస్థాయికి చేరుకోవడంతో తనదగ్గర ఉన్న తుపాకీని తీసి సీనియర్‌ని కాస్తా కాల్చిపారేశాడు. అపై తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఉదంతంలో సీనియర్ అధికారిబయటపడగా మహిపాల్ మాత్రం అక్కడికక్కడే మరణించాడు. రక్షణ రంగంలో పనిచేసేవారు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. ఒక పక్క గంటలతరబడి కాపలా కాయాలి. మరోపక్క ఏ వైపు నుంచి శత్రువు విరుచుకుపడతాడో తెలియని ఉద్విగ్నత. అన్నింటికీ మించి నెలల తరబడిఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండాలి. దాంతో ఒకోసారి జవాన్లలోని అసహనం హద్దులు దాటిపోతుంటుంది. అదిగో! అలాంటి సమయాలలోనేఇలాంటి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి. ఉన్నతాధికారి సెలవుని మంజూరు చేయలేదనో, పదేపదే పనులను చెబుతున్నాడనో...విసిగిపోయిన జవాన్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు.