ఫ్రీగా వడాపావ్ ఇవ్వలేదని చితకొట్టిన శివసేన ఎమ్మెల్యే..

శివసేన.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేది. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ నేతలు నోటికి కాకుండా చేతికి పనులు చెబుతున్నారు. అధికారం ఉంది కదా అని సామాన్య ప్రజలపై తమ రౌడీయిజాన్ని చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే శివసేన నేత లేడి కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ఆ ఉదంతం అయిందో లేదో.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే షాపు యజమానిపై తన ప్రతాపాన్ని చూపించాడు. వివరాల ప్రకారం శివసేన ఎమ్మెల్యే పాటిల్ 100 వడాపావ్ లు ఫ్రీగా పార్శిల్ చేసి ఇంటికి పంపించమన్నాడు. అయితే షాపు యజమాని దీనికి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే కర్రతో అతనిపై దాడి చేశాడు. విచక్షణ లేకుండా చితకబాదుడు బాదాడు. అయితే సదరు ఎమ్మెల్యే గారు చేసిన నిర్వాకం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అసలు విషయం బయటపడింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియా హల్ చేస్తుంది. ఇది చూసిన స్థానికులు ఎమ్మెల్యే పై.. పార్టీ పై మండిపడుతున్నారు. దీంతో చేసేది లేక పార్టీ ఆఎమ్మెల్యేను సస్పెండ్ చేసింది.

ఎర్రబెల్లి ఆ విషయంలో హర్ట్ అయ్యారా..? అందుకే పార్టీ వీడారా..?

తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి.. అనేక సంవత్సరాలు పార్టీకి నమ్మిన బంటులా ఉన్న ఎర్రబెల్లి ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే దశాబ్దాల తరబడి పార్టీని వెన్నంటి ఉన్న ఎర్రబెల్లి అంత సడెన్ గా పార్టీ మారడానికి కారణాలేంటి.. అంటే ఇప్పుడో కొత్త వాదన వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో.   ఒకేపార్టీ అయినప్పటీకీ రేవంత్ రెడ్డికి, ఎర్రబెల్లికి అనేక విషయాల్లో విబేధాలు ఉండేవి. వీరిద్దరి మధ్య తరుచూ ఏవో గొడవలు వస్తూనే ఉండేవి. అలా వారు గొడవ ప్రతిసారీ పార్టీ అధినేత చంద్రబాబు వారిని బుజ్జగించడం కామన్.. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఒక పని వలన ఎర్రబెల్లి బాగా హర్ట్ అయ్యారంట. అదేంటంటే.. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధుల ఖర్చు నిమిత్తం ఎన్నికల వ్యవహారానికి సుమారు రూ.60 కోట్లు నిధులు వచ్చాయంట. అయితే ఈ డబ్బుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకోమని చంద్రబాబు రేవంత్ రెడ్డిని పురమాయించారట. అంతే దీంతో ఎర్రబెల్లి దీన్ని అవమానంగా భావించి.. సైకిల్ దిగి కారెక్కారంట. మరి ఇది వాదన మాత్రమే.. నిజంగా అదే జరిగిందా.. ఎంత వరకూ నిజమో ఎర్రబెల్లికే తెలియాలి.

నేను ఏ తప్పు చేయలేదు.. రోహిత్ పేరు రాయలేదు.. దత్తాత్రేయ

లోక్ సభలో రోహిత్ ఆత్మహత్యపై దుమారం రేగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. మాయవతి మధ్య మాటలయుద్ధమే జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మొదటిసారిగా లోక్ సభలోనోరు విప్పారు. అయితే ఆయన తన ప్రసంగం ప్రారంభించారో లేదో..  విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. అనంతరం  ఆయనమాట్లాడుతూ.. నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. ఈ 40 ఏళ్లలో నేను ఏ తప్పు చేయలేదని అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. రోహిత్ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు.. అసలు హెచ్ఆర్డీకి రాసిన లేఖలో రోహిత్‌ పేరు ప్రస్తావించలేదని చెప్పారు. విపక్షాలు అనవసరంగా నాపై విమర్శలు చేస్తున్నారని.. నాపై దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

ఆత్మహుతి బాంబుదాడులతో అట్టుడుకుతున్న ఇరాక్..

ఇరాక్ లో ఆత్మహుతి బాంబుల దాడులు ఎక్కువయ్యాయి. రెండు రోజుల క్రితమే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో రెండు బాంబు పేలుళ్లు.. ఒక ఆత్మహుతి బాంబు దాడి జరిగాయి. మరోప్రాంతమైన ముగ్దాడియా పట్టణంలో కూడా ఆత్మహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో  34 మందికి పైగా మరణించారు. అయితే ఈ దాడులకు పాల్పడింది తామే అని ఇస్లామిక్ మిలిటెంట్లు అంగీకరించారు. దీంతో ఇప్పుడు బాగ్దాద్, ముగ్దాడియా ఘటనలపై ఐక్యరాజ్యసమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏడుగురు షియా మిలిటెంట్లు ఈ ఉగ్ర ఘాతుకాలకు పాల్పడి ఉండొచ్చునని అధికారిక ప్రకటనలో ఐరాస పేర్కొంది. కాగా బాగ్ధాద్ లో, ముగ్దాడియా ఆత్మహుతి బాంబు దాడివలన మొత్తం 87 మంది చనిపోగా మరో 117 మందికి గాయాలైనట్టు తెలుపుతున్నారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగన్ కంప్లైట్..

వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరుతున్నారు. భూమా నాగిరెడ్డి తో ప్రారంభమైన ఈ వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీ పార్టీలోకి చేరగా.. ఇప్పుడు మరో వైసీపీ నేత.. పాతపట్నం ఎమ్మెల్యే వెంకట రమణ టీడీపీలోకి చేరబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ వరుస పార్టీ ఫిరాయింపులపై జగన్ సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తన పార్టీ నుంచి టిడిపిలో చేరిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగన్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఫిర్యాదు చేయనున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పెద్దలు.

జగన్ ఆస్తి 6 లక్షల కోట్లు.. చిట్టా విప్పుతా..

కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సి.ఆదినారాయణ ఇటీవలే టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఎన్నో నెలల నుండి పార్టీని వీడి టీడీపీలోకి చేరదామనుకున్న ఈయనకు రామసుబ్బారెడ్డి అడ్డుకోవడంతో లేట్ అయింది. ఎట్టకేలకు చంద్రబాబు రామసుబ్బారెడ్డిని బుజ్జగించడం.. ఆది నారాయణ రెడ్డి టీడీపీ లోకి రావడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన వైసీపీ అధినేత అయిన జగన్ పై విమర్శల బాణాలు వదిలారు. జగన్ కు సంబంధించి అక్రమాస్తుల గురించి చిట్టా విప్పుతా అని అంటున్నారు. ఆదినారాయణ నియోజక వర్గం జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్ అక్రమాస్తులు విలువ రూ.6 లక్షల కోట్లని..  జగన్ లక్ష కోట్లు సంపాదించాడని, రూపాయి వడ్డీ వేసినా నేడు రూ.6 లక్షల కోట్లు అవుతుందన్నారు. జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల చిట్టాను ఆయన ఇలాకా పులివెందులలోని అంగళ్ళ ముందే విప్పుతానని వ్యాఖ్యానించారు. జగన్‌ కుళ్లు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకే తాను చంద్రబాబు చెంతకు చేరినట్టు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు తనకు టీడీపీలో ఎవరితో బేధాలు లేవని.. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.

ఇకనుండి ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని వాడటంలో ఎప్పుడూ ముందుంటారు. ఇది చాలా విషయాల్లో రుజువైంది కూడా. తాజాగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈరోజు విజయవాడలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పద్దతి ద్వారా సులభంగా వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని.. ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండా.. గంటల తరబడి క్యూలో నిలబడకుండా సలభమైన పద్దతిలో వాహనాల రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు ఈ పద్దతి ద్వారా..  రిజిస్టేషన్ వ్యవహారంలో దళారుల జోక్యం ఉండదని.. అందరూ ఆన్‌లైన్‌లో వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా ఇది దేశంలోనే మొదటిసారి కావడం విశేషం..

మావోయిస్ట్ ల ఎన్‌కౌంటర్‌.. ముఖ్య నేతలు హతం..

  ఛత్తీస్‌గడ్‌లో భారీ  ఎన్‌కౌంటర్‌ జరిగింది. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా గొల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం రాత్రి మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం అందుకున్న పోలీసు భాలగాలు కూంబింగ్‌ నిర్వహించారు. రాత్రి నుంచి ఉదయం వరకు మూడు సార్లు మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు.. మావోయిస్టు ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి లచ్చన్న ఉన్నారు. తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్‌ కూడా మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు వీరి దగ్గర నుండి ఏకే-47, మూడు ఎస్ఎల్ఆర్, మూడు రైఫిల్ స్వాదీనం చేసుకున్నారు.

గొల్లపూడి మారుతీరావు గారికి "జీవన సాఫల్య పురస్కారం"

 ప్రఖ్యాత సినీ నటులు, రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు గారిని "జీవన సాఫల్య పురస్కారం" తో  డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ మార్చి 12 వ తేది సాయంత్రం 6 గం. లకు పాలకొల్లు లో జరిగే జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస చౌదరి, కార్యదర్శి శ్రీ మానాపురం సత్యన్నారాయణ లు తెలిపారు.   ఈ సభకు ముఖ్య అతిధి గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప , విశిష్ట అతిధులుగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి  శ్రీ బొజ్జల  గోపాలకృష్ణా రెడ్డి, ఎస్. సి కార్పోరేషన్  చైర్మన్ శ్రీ జూపూడి ప్రభాకరరావు, డా. గజల్ శ్రీనివాస్,  కేంద్ర మాజీ మంత్రివర్యులు  శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు,  ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. ముర్రు  ముత్యాల నాయుడు, శాసన మండలి సభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్,  శాసన మండలి సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,   చలనచిత్ర ప్రముఖులు శ్రీ కోడి రామకృష్ణ,  శ్రీ ఆర్. పి . పట్నాయక్, హీరో శ్రీ  నిఖిల్ , శ్రీ భాస్కర భట్ల, శ్రీమతి అనితా చౌదరి లు పాల్గొంటారని తెలిపారు.   మేడికొండ శ్రీనివాస చౌదరి అధ్యక్షులు

లైసెన్స్ లేకపోతే.. 2వేలు, హెల్మెట్ లేకపోతే రూ. 100..

తెలంగాణ రవాణా, పోలీసు శాఖలు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు శాఖలు కలిపి రూల్స్ ను అతిక్రమించే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని..నిబంధనలు పాటించని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఎందుకంటే హెల్మెట్, లైసెన్స్ లేకండా బయటకు వస్తే జరిమానా విధించనున్నారు.  లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు హెల్మెట్ లేకపోతే రూ. 100 కట్టాల్సిందే. ఇక లెసెన్స్ లేనివారు.. ఉండి సస్పెండ్ అయినవారు వాహనాలను నడిపినా శిక్ష అనుభవించాల్సిందే. అంతేకాదు డ్రంకన్ డ్రైవ్‌లో మూడు సార్లకు మించి పట్టుబడిన వారు మళ్లీ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. హెల్మెట్, లైసెన్స్‌తో పాటు ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ జంపింగ్, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై రెండు శాఖల అధికారులు కఠినంగా వ్యవహారిస్తామన్నారు. మార్చి 1 నుంచి ఈ చర్యలు అమలుకానున్నాయి. మరి ఇక మీద వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే..

మోడీ జీ.. వాట్ అబౌట్ అమరావతి జీ..

ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగేదేం కనిపించడంలేదు. మొన్నటికి మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిరాశే మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు మొండిచేయి చూపించింది.  అసులు విభజన హామీలో ఉన్న విశాఖ రైల్వే జోన్ గురించి ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు చూస్తుంటే కూడా అలానే కనిపిస్తుంది.   ఒక పక్క ఏపీ సీఎం చంద్రాబబు.. అసలే ఆర్దిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. అలాంటి అమరావతికి ఎలాంటి నిధులు కేటాయించలేదు సరికదా.. దాని గురించిన ఊసు కూడా ఎక్కడా ఎత్తలేదు జైట్లీ. ఏపీ అభివృద్దికి పాటుపడుతా.. ఏపీ అభివృద్దికి ఆర్ధికంగా సహాయపడతా అన్న మోడీ ప్రజలకు ఊరించి ఆఖరికి ఏం చేయకుండానే ఈ ఏడాది బడ్జెట్ ను ముగించారు. ఇక ఏదో ఏపీలోని ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా నిధులు ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు ..విజయవాడకు 100 కోట్లు కేటాయించింది.   మరి అసలు ప్రధాని మోడీకి ఏపీ అనే ఒక రాష్ట్రం ఉంది.. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రజలకు రాజధానికి ఏర్పాటు కావాలి.. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలి అన్న విషయం అసలు గుర్తుందా అని అనుకుంటున్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ కనీసం ఒక్క వరం కూడా ప్రజలకు ఇవ్వలేదు.. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కూడా అమరావతికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఇక ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీల గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణం జరిగేదెప్పుడూ.. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరాతి విశ్వనగరంగా మారేదెప్పుడూ..తెలుగు ప్రజల కల తీరేదెప్పుడూ..