SMS చేస్తే రైలు శుభ్రం చేస్తారు

  రైల్వేలలో అపరిశుభ్రత ఇప్పటివరకూ ప్రయాణికులకు పెను అడ్డంకిగా ఉండేది. రైలు ఎక్కిన తరువాత బాత్రూంల నుంచి దుర్వాసన వస్తుంటే ముక్కుమూసుకుని ప్రయాణాన్ని కొనసాగించవలసిన పరిస్థితి. ఇక నుంచి రైళ్లలో పరిశుభ్రతను పెంపొందించడమే తమ ముఖ్య కర్తవ్యం అంటున్నారు రైల్వే మంత్రి! ఇందులో భాగంగా ఎవరన్నా ప్రయాణికులు తమ కోచ్‌ అపరిశుభ్రంగా ఉంటే రైల్వేలకు వెంటనే ఒక సందేశాన్ని పంపిస్తే సరిపోతుందట. తదుపరి స్టేషన్లో కోచ్‌ను శుభ్రం చేసేస్తామంటున్నారు మంత్రివర్యులు. రైల్వేస్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు 17,000 బయోటాయిలెట్ల నిర్మాణాన్ని కూడా చేపట్టినట్లు చెబుతున్నారు.

హమ్ సఫర్ పేరుతో థర్డ్ ఏసీ..

* హమ్ సఫర్ పేరుతో థర్డ్ ఏసీ సౌకర్యం.. 408 స్టేషన్లలో ఈ క్యాటరింగ్.. చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆహారం * వచ్చే ఏడాది 2800 కి.మీ రైల్వే లైన్ల నిర్మాణం * పాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కి.మీ.. ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం 80 కి.మీ * 5300 కి.మీ.. 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూలు * ఈ ఏడాది 820 రైల్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పూర్తి.. రూ. 1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు * వడోదరలో రైల్వే యూనివర్శిటీ * 2017-18 లో తొమ్మిది వేల ఉద్యోగాల కల్పన * 2020 నాటికి గూడ్స్ రైళ్లకు కూడా టైమ్ టేబుల్.. * రద్దీ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల సౌకర్యం * మహిళల భద్రతకు 24x7 కాల్ సెంటర్లు * బుకింగ్ సమయంలోనే ప్రయాణ భీమా * ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ట్రైన్ * తక్కువ శబ్దం, ఎక్కువ సౌకర్యం ఉండేలా కొత్తకోచ్లు * నాగుపూర్- విజయవాడ ట్రేడ్ కారిడర్ * 44 కొత్త ప్రాజెక్టులు, 65 వేల అదనపు బెర్త్ లు * 100 స్టేషన్లలో వైఫై, ఎస్కలేటర్ల సౌకర్యం * అన్ని ప్రధాన స్టేషన్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు * జర్నలిస్ట్ లుక ఆన్ లైన్లోనే టికెట్ రాయితీ * వెయ్యి రైళ్లలో బయోటాయిలెట్స్

ప్రతి పౌరుడు గర్వపడేలా రైలు ప్రయాణం..

  కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన పలు రైల్వేలో పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రసంగంలో అంశాలు..   * ప్రతి పౌరుడు గర్వపడేలా రైలు ప్రయాణం తీర్చి దిద్దాలన్నదే లక్ష్యం * 2016-17 వ్యయం 1.21కోట్లు.. 2016-17 ఆదాయం 1.87 కోట్లు * రైల్వేలో 1.5 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎల్ఐసీ అంగీకరించింది. * సగటు వేగం 50 కి.మీ నుండి 80 కి.మీ వరకూ పెంపు * ఈ ఏడాదికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు విద్యుదీకరణ.. వచ్చే ఏడాదికి 50 శాతం రైల్వే లైన్లను విద్యుదీకరిస్తాం * రక్షణ లేని లెవల్ క్రాసింగ్ లు తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం * రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్ట్ విటీని పెంచుతాం * అన్ని స్టేషన్లో డిస్పోసబుల్ బెడ్ సౌకర్యం * మహిళల భద్రత, వైద్య సౌకర్యాల పెంపునకు ప్రాధాన్యత * సమయ పాలన వసతులకు ప్రాధన్యం * మేకింగ్ ఇండియాలో భాగంగా రెండు కొత్తం లోకో ఫ్యాక్టరీలు * రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రిక్వెన్సీని పెంచుతున్నాం * సీనియర్ సిటిజన్స్ కోటా 50 శాతం పెంపు.. వారికోసం లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం * పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలో పూర్తి * రైల్వే టెండరింగ్లో పేపర్ రహిత పద్దతి.. ఎలక్ట్రానికి పద్దతిలో రైల్వే టెండరింగ్ పద్దతి

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు..

  రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటుకు చేరుకున్నారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రైల్వే వెన్నుముకలా ఉండేలా బడ్జెట్ తయారు చేశా అని చెప్పారు. ఇంకా * సామాన్యుల ఆశలు ప్రతిఫలించేలా రైల్వే బడ్జెట్ రూపొందించాం. * అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే పనితీరును మెరుగుపరుస్తాం * రైల్వేలో కొత్త ఆలోచనలు, కొత్త ఆదాయ మార్గాల ప్రాతిపదికన రూపొందించాం * రెవిన్యూ లోటును ఈ ఏడాది తగ్గించుకోగలిగాం * వచ్చే ఏడాది పది శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నా * పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాం * మౌలిక వసతుల కల్పనలో ముందున్నాం

చిరంజీవిని నెత్తిన ఎక్కించుకోను..

  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెలలో తన నియోజకవర్గంలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన నిన్న విజయవాడ సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుని ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీల్లో హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నానని.. పలువురు ప్రముఖులను ఈ ఉత్సవాలకి ఆహ్వానిస్తున్నాని తెలిపారు. అయితే చిరంజీవి ఆహ్వానంపై అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ స్పందిస్తూ లేపాక్షి ఉత్సవాల నిర్వహణ తన కష్టార్జితమని, ఎవరినీ పిలువాలో.. పిలువకూడదో తనకు తెలుసునని.. చిరంజీవిని ఉత్సవాలకు పిలువలేదు. నేను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోను. నా నెత్తిమీద ఎక్కేవారిని పిలువాల్సిన అవసరం నాకు లేదు.. నాది డిక్టేటర్ తరహా పంథా అని సమాధానమిచ్చారు. ఇంకా వైసీపీ నేతలు టీడీపీ పార్టీలోకి చేరడంపై మాట్లాడుతూ.. తాము ఎవ్వరినీ పార్టీలోకి బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు.. ఏపీలో అభివృద్ధిని చూసే వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తున్నారని అన్నారు.

అఫ్జల్‌గురు నిర్దోషి- చిదంబరం

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అఫ్జల్‌గురు ఉరితీత గురించి కాంగ్రెస్‌ నేత చిదంబరం వివాదాస్పద ప్రకటన చేశారు. 2001లో పార్లమెంటు మీద జరిగిన దాడిలో అఫ్జల్‌గురు దోషి అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవన్నారు చిదంబరం. ఒకవేళ ఆనాటి దాడిలో ఆఫ్జల్‌గురు పాత్ర ఉన్నా, అది ఏ స్థాయిలో ఉందో చెప్పలేమని అన్నారు. వెరసి అఫ్జల్‌గురుని ఉరి తీసేటన్ని సాక్ష్యాలు లేవంటూ పెదవి విరిచారు. మరి మీరు ఆ సమయంలో అధికారంలోనే ఉన్నారు కదా అన్న ప్రశ్నకు, తాను అధికారంలో ఉన్నప్పటికీ హోంశాఖ తన పరిధిలో లేదంటూ మాట దాటవేశారు. అంతేకాదు! జేఎన్‌యూలో జాతివ్యతిరేక నినాదాల గురించి కూడా ఇంతే భిన్నంగా స్పందించారు చిదంబరం- ఈ రోజుల్లో పిల్లలకి తప్పుగా మాట్లాడే అధికారం ఉందనీ, అంతమాత్రాన దాన్ని జాతి విద్రోహంగా భావించకూడదనీ పేర్కొన్నారు. హతవిధీ! ఇంతకీ చిదరంబరం వ్యాఖ్యల వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏమిటో! సున్నితమైన అంశాన్ని మరింత రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిని పొందటమేనా!

సంజయ్ దత్ విడుదల.. అప్పుడే హైకోర్టులో పిటిషన్

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎరవాడ జైలు నుండి విడుదలయ్యారు. అక్రమాయుధాల కేసులో ఐదేళ్లు జైలు జీవితం గడిపిన ఆయన ఈరోజు  విడుదలయ్యారు. అయితే ఆయన అలా విడుదలయ్యాడో లేదే అప్పుడే అతని విడుదలపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  మహారాష్ట్ర సామాజిక ఉద్యమాకారుడు ప్రదీప్ బలేకర్ మున్నాభాయ్ విడుదలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో చాలామంది పేద నేరస్థులు ఉన్నారు.. వాళ్లు కూడా సత్ప్రవర్తనతోనే ఉంటున్నారు.. అయినా కాని వారిని విడుదల చేయడంలేదు.. సంజయ్ దత్ ఒక వీఐపీ అన్న కారణంగానే అతనిని సకల మర్యాతలతో విడుదల చేశారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ పిటిషన్ కూడా ఈరోజే విచారణకు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ బలేకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసే అవకాశం ఉందని మహారాష్ట్ర న్యాయవాదులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కడప జిల్లాలో లోకేశ్ రెండో రోజు పర్యటన.. మకాం వేసిన జగన్..

  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్  కడప జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన జిల్లాలోని పలు నియోజక వర్గాల వారితో  సమన్వయ సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతేకాదు లోకేష్‌ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్న్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఊరు పులివెందులలో మకాం వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కీలకమైన నేతలు పార్టీ నుండి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన నేతలను కాపాడుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి,  అంజాద్‌ బాషాలు టీడీపీలో చేరతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే జగన్ వారితో చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సంజయ్ దత్ విడుదల.. జైలుకి సెల్యూట్..

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు శిక్ష ముగియడంతో ఈ రోజు విడుదలయ్యారు. ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్ విడుదలయ్యారు.అక్రమాయుధాల కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించంగా..42 నెలలపాటు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. సత్ర్పవర్తన కారణంగా కేంద్రంప్రభుత్వం సంజయ్ దత్ శిక్షా కాలాన్ని తగ్గించగా.. 8 నెలల ముందే సంజయ్ దత్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు నుండి బయటకు వచ్చిన ఆయన కారాగారానికి సెల్యూట్ చేశాడు. భుజానికి బ్యాగు, చేతిలో ఫైలుతో 'ఖల్ నాయక్ బయటకు రాగానే  అభిమానులకు అభివాదం చేసి వెంటనే కారులో పుణే ఎయిర్ పోర్టులో చేరుకున్నాడు.

తగలబెడుతుంటే చూస్తూ ఊరుకోం- సుప్రీం ఆగ్రహం

  మన దేశంలో ఏ వర్గంవారికి ఏ విషయంలో కోపం వచ్చినా, తక్షణం తమ ఆగ్రహాన్ని ప్రభుత్వ ఆస్తుల మీద చూపిస్తుంటారు. మొన్నటికి మొన్న తునిలో తగలబడిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ అయినా, ఈ వారంలో హర్యానాలో తగలబడుతున్న ప్రభుత్వ భవనాలైనా దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ తతంగం అంతా చూసిన సుప్రీంకోర్టుకి ఒళ్లు మండినట్లుంది. ‘ఇక మీదట అలాంటి చర్యలకు పాల్పడేవారి మీద తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. దీని కొసం కొన్ని నిబంధనలను రూపొందించాలి’ అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.   గుజరాత్‌లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లను కల్పించాలంటూ గత ఏడాది హార్ధిక్‌ పటేల్ అనే నాయకుడి ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ధ్వంసం చేశారు. ఆ కేసుని ఇవాళ విచారించే సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. ‘ప్రభుత్వానికి లేదా పౌరులకు సంబంధించిన ఆస్తులను మీరు ఇలా ధ్వంసం చేస్తూ పోలేరు. ఆందోళనలు చెలరేగినప్పుడు ఇలాంటి విధ్వంసానికి పాల్పడేవారిని మనం తప్పకుండా వారి చర్యలకు బాధ్యులను చేయవలసి ఉంటుంది’ అంటూ సుప్రీం పేర్కొంది. సుప్రీం అన్న మాటలు బాగానే ఉన్నాయి. కానీ తమ మీద కేసులు ఎత్తేయాలంటూ నేతలు మళ్లీ నిరాహారదీక్షకు దిగితే ప్రభుత్వాలు ఏం చేసేది!

రాజ్యసభ రేపటికి వాయిదా..

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన దగ్గర నుండి రోహిత్ ఆత్మహత్యపై ఇరు పక్షాల మధ్య వాదనలు జరగుతూనే ఉన్నాయి. రోహిత్ ఆత్మహత్యపై విపక్ష నేతలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఒకపక్క రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం కూడా విపక్షాలపై మండిపడ్డాయి. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఎస్పీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో సభను రేపటికి వాయిదా పడింది.

దిల్లీ విమానాశ్రయానికి వీధికుక్కల బెడద

  దిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఆషామాషీ కాదు. దేశవిదేశాల ప్రముఖులంతా అక్కడి నుంచే తన ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. అలాంటి ఎయిర్‌పోర్టుకి ఇప్పుడు ఊహించని బెడద వచ్చింది. లెక్కకు మిక్కలిగా ఎయిర్‌పోర్టు రన్‌వే దగ్గర తిరుగుతున్న ఊరకుక్కలే ఆ బెడద! విమానం దిగి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికుల వెంట కుక్కలు పడటంతో విమానాశ్రయం పరువు పోతోందని అధికారులు వాపోతున్నారు.   అంతేకాదు! మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తీవ్రవాదులు బాంబులని పేల్చేందుకు ఈ కుక్కలని కూడా వాడుకునే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఈ విషయమై దిల్లీ నగరపాలిక సంస్థకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందట. మారిన జంతురక్షణ చట్టాల ప్రకారం ఒకప్పటిలా కుక్కలను పట్టుకుని వేరేచోటకి తరలించడం సాధ్యం కాదని చేతులెత్తేశారట నగరపాలక అధికారులు. కాకపోతే మరీ తీవ్రవాదులూ, బాంబులూ అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా ఆలోచిస్తామని భరోసా ఇచ్చారట!

నాటకంలో కత్తి... నటుడినే చంపేసింది!

  నాటకంలో అపశృతులు దొర్లడం సహజం. కానీ అది నటుల ప్రాణాల మీదకే రావడం చాలా అరుదుగా జరుగుతుంది. దురదృష్టవశాత్తూ ఒకే నెలలో ఇలాంటి సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఈ నెల మొదటివారంలో ఇటలీలోని రాఫెల్ అనే నటుడు ఉరికి వేలాడుతున్నట్లు నటించబోయి తాడు బిగుసుకుపోవడంతో మరణించాడు. తాజాగా జపాన్‌లో ‘డియాగో కసీనో’ అనే నటుడు ఒక నాటకం కోసం జరుగుతున్న రిహార్సల్స్‌లో కత్తిపోటుకు గురై చనిపోయాడు. టోక్యోలోని ఓ స్టుడియోలో జరిగిన ఈ సంఘటనలో ఓ సంప్రదాయ కథకి సంబంధించిన నాటకం కోసం అభినయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డియోగో తన సహనటుడితో కలిసి కత్తియుద్ధానికి సంబంధించిన సన్నివేశంలో నటిస్తుండగా, ఎదుటి వ్యక్తి చేతిలో ఉన్న కత్తి కాస్తా డియోగో పొట్టని చీల్చుకుపోయింది. దాంతో అతను మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా, లేకపోతే దీని వెనుక ఏదన్నా కుట్ర ఉందా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గవర్నమెంటుకి నేనంటే దడ- రాహుల్‌గాంధి!

  పార్లమెంటులోని ఉభయసభలూ రోహిత్‌ వేముల ఆత్మహత్య గురించీ, కన్నయా కుమార్‌ అరెస్టు గురించీ దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే ఈసారి సభలో ఎలాగైనా మాట్లాడి తీరేందుకు రాహుల్‌గాంధి మహా ఉత్సాహంగా ఉన్నారు. ఒకవేళ అధికార పార్టీ తనని మాట్లాడనిస్తుందా అన్న అనుమానం కూడా రాహుల్‌గారి మనసులో బయల్దేరినట్లుంది. ‘నేను తప్పకుండా మాట్లాడి తీరతాను. కానీ నేను చెప్పబోయే విషయాల గురించి ప్రభుత్వం చాలా భయపడుతోంది.   అందుకని వాళ్లు నన్ను మాట్లాడనిస్తారని అనుకోను’ అంటూ ముందుగానే ఓ సూచనను విలేఖరులకు అందించారు. రోహిత్‌ వేముల చనిపోయిన తరువాత హుటాహుటిన రాహుల్ గాంధి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకి చేరకుని, రోహిత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. జేఎన్‌యూలో వివాదం మొదలైనప్పుడు కూడా రాహుల్ అక్కడికి చేరకుని విద్యార్థులకి తన నైతిక మద్దతుని అందించారు. తాను కూడా అవసరమైనప్పుడు చురుకుగా పాల్గొనగలననీ, నేర్పుగా వ్యవహరించగలననీ రాహుల్‌ ఈ సందర్భంగా తెలియచేసేందుకు ప్రయత్నించారు. ఈసారి నేరుగా పార్లమెంటులోనే తన తడాఖాని చూపించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. చూడాలి మరి!

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

  రేపు తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 నుండి మార్చి 28 వరకూ అభ్యర్ధులు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మార్చి 28 వరకూ ఎలాంటి తరువాత ధరఖాస్తు చేసుకుంటే ఫైన్ కట్టాల్సి ఉంది. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 3 వరకు, రూ. 1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 13 వరకు, రూ. 5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 10000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 3 నుంచి అదే నెల 13 వరకు అవకాశం హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 24 నుంచి 30 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మే 2న ఎంసెట్ పరీక్ష మే 3న ప్రాథమిక కీ విడుదల మే 12 ర్యాంకుల ప్రకటన