అయ్యో గవర్నర్.. ఇదీ లాగేసుకున్నారు
posted on Sep 12, 2015 @ 3:23PM
రెండు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ మొదటి నుండి ఏదో గవర్నర్ గా ఉన్నారు అంటే ఉన్నారు అనే ధోరణిలోనే కొనసాగారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు పెద్దగా గవర్నర్ గారికి అంత ఇబ్బందికర సమస్యలు ఏం రాలేదు కాని ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటినుండి ఆయనకు చిక్కులు పోయి మొదలయ్యాయని మాత్రం అందరికి స్పష్టంగా తెలిసిన విషయమే. చిటికీ మాటికీ రెండు రాష్ట్రాలు గిల్జికజ్జాలు పెట్టుకోవడం దాని పరిష్కారానికి గవర్నర్ దగ్గరకి వెళ్లడం ఆయన ఎటూ తేల్చుకోలేక పోవడం దీనివల్ల రెండు రాష్ట్రాలు ఆయనపై విమర్శలు చేయడం ఇదే తంతూ. అయితే నోటు ఓటు కేసు తరువాత గవర్నర్ గారి పరిస్థితి మరీ అయోమయ స్థితిలో పడింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండు రాష్ట్ర సీఎంల మధ్య పోరు కాబట్టి ఏం నిర్ణయం తీసకుంటే ఏం సమస్య వచ్చిపడుతుందో అని తను సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు కూడా కేంద్రాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. పాపం ఈవిషయంలో కేంద్రం కూడా గవర్నర్ గారి పనితీరుపై కాస్తంత అసంతృప్తి వెల్లబుచ్చింది కూడా. అన్ని సమస్యలకు కేంద్రం దగ్గరకి వస్తే కాదు మీరే ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కూడా సూచించారు.
ఇవన్నీ తట్టుకోలేక ఒకానొక దశలో గవర్నర్ నరసింహన్ రాజీనామా చేద్దామనుకున్నారు. కానీ అప్పుడు కేంద్రం బుజ్జగించింది. కానీ ఎప్పుడైతే తను ఆగష్టు 15న ఇచ్చిన విందుకు ఇరు సీఎంలు డుమ్మాకొట్టారో దానికి గవర్నర్ బాగా మనస్తాపం చెంది తానే స్వచ్చందగా పదవి నుండి తొలిగిపోవాలనుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈసారి మాత్రం కేంద్రం బుజ్జగించకుండా తను తీసుకున్న నిర్ణయానికి అంగీకరించి ఆయన స్థానంలో ప్రస్తుతం కేరళ గవర్నర్ గా వ్యవహరిస్తున్నసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంను నియమించాలని కేంద్రం బలంగా భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరోసారి గవర్నర్ ను చులకన చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే తనకు గుర్తింపు లేదని భావించి రాజీనామాకు సిద్దపడిన గవర్నర్ కు తెలంగాణ సర్కార్ మరో విషయంలో కూడా గవర్నర్ కు గుర్తింపు లేకుండా చేస్తుంది. అందేంటంటే సాధారణంగా యూనివర్శిటీలకు గవర్నరే చాన్స్ లర్ గా ఉంటారు. అయితే కేసీఆర్ మాత్రం యూనివర్శిటీలకు చాన్స్ లర్లను నియమించే బాధ్యత రాష్ట్ర అధికార ప్రభుత్వానికే ఉంటుందని.. ఇక నుండి వారిని ప్రభుత్వమే నియమిస్తుందంటూ తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య జారీ చేశారు. అయితే గవర్నర్ కు కాకుండా ఈ బాధ్యతలు వేరేవారికి ఇస్తే కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ద్వారా విశ్వ విద్యాలయాలకు నిధులు రావడం కష్టసాధ్యమని అధికారులు చెప్పినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవసరమైతే ఈ విషయంపై కేంద్రంతో కూడా మాట్లాడతానని చాలా పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు చాన్స్ లర్ గా గవర్నరే ఉండాలని ఎక్కడా నిబందనలు ఉన్నాయా అని తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ గవర్నర్ కు ఈ అధికారం కూడా లేకుండా లాగేసుకున్నారు.