దొంగబ్బాయ్ అంటూ లోకేష్ పంచ్ డైలాగ్ లు
posted on Sep 12, 2015 @ 3:34PM
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్...పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. దొంగబ్బాయ్ అంటూ జగన్ ను, మా అక్క అంటూ షర్మిలపై సెటైర్లేశారు. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని బతకడం కాదన్న లోకేష్, వాళ్ల స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలంటూ, వారసత్వ రాజకీయాలపై కామెంట్ చేశారు. తండ్రి పేరు చెప్పుకుని, సానుభూతి పొందాలని చూస్తున్న దొంగబ్బాయ్ జగన్ ఆటలు ఇంకా ఎంతోకాలం సాగవన్న చినబాబు... మాయమాటలు, అబద్దాలతో టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికీ తండ్రి పేరు చెప్పుకుని బతుకుతూ, రాజకీయాలు చేస్తున్న జగన్...తన కార్యకర్తలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తామైతే ఎన్టీఆర్ స్ఫూర్తితో కార్యకర్తల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, జగన్ లాగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేలకోట్ల దొంగ డబ్బు సంపాదించడం లేదంటూ విపక్ష నేతను చెడుగుడు ఆడుకున్నారు.