కేన్సర్‌ను ఎదుర్కొనే టీకాలు మొదలయ్యాయి!
ఎంతటి ఆరోగ్యవంతుడైన మనిషినైనా నిర్వీర్యం చేసి, విషమ స్థితిలోకి నెట్టివేసే రోగం కేన్సర్. ప్రాథమిక దశలో ఉన్న కేన్సర్‌ను నిర్మూలించడం సాధ్యమైన విషయమే అయినా, అందుకోసం చేసే చికిత్స, శరీరాన్ని నిస్సత్తువకు గురిచేస్తుంది. పైగా కొన్ని రకాల కేన్సర్ మళ్లీ మళ్లీ తిరగబెట్టే ప్రమాదమూ ఉంది. ఒకవేళ కేన్సర్‌ను కనుక ఆఖరి దశలో గుర్తిస్తే, దాని నుంచి కోలుకోవడం కష్టం కావచ్చు. అందుకనే ఎలాంటి ప్రతిచర్యలూ లేని కేన్సర్ చికిత్స కోసం సుదీర్ఘకాలంగా ప్రపంచం వేచి చూస్తోంది. ఇప్పుడు ఆ శుభసమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. లండన్‌లోని గయ్స్ ఆసుపత్రి, మనిషిలోని కేన్సర్ కణతుల మీద దాడి చేసే విధంగా ఒక టీకాను అమలుచేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టీకాను, ఎంపిక చేసిన కొందరు రోగులకు అందించడం మొదలుపెట్టారు. ట్రాన్స్‌స్క్రిప్టేస్ అనే ఒక ఎంజైము ఆధారంగా రూపొందించిన ఈ టీకాను రోగికి ఇచ్చినప్పుడు, అది విచ్చలవిడిగా పెరిగిపోతున్న కేన్సర్ కణాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేస్తుంది. భారతీయ సంతతికి చెందిన కేన్సర్ నిపుణుడు, హర్‌దేవ్ పండా కూడా ఈ ప్రయోగంలో ముఖ్యపాత్రను పోషించడం గమనార్హం.