ఇండియాను ఓడించడం కష్టం.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్

ప్రస్తుతం టీ20 మ్యాచ్ లో ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ పై ఇండియా గెలిచి మంచి జోష్ మీద ఉంది. ఇప్పుడు ఇండియా ఫాంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీ20లో మంచి ఫాంలో ఉన్న టీమ్ ఇండియాపై విజయం సాధించడం కష్టమే అని.. జట్టులో టాపార్డర్, మిడిలార్డర్ సూపర్‌ఫాంలో ఉండడంతో బాటు పేస్ బౌలింగ్‌లో నెహ్రా , బుమ్రా, పాండ్యాలతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించేలా కనిపిస్తుందన్నాడు. అంతేకాదు.. ఫీల్డింగ్‌లోనూ కొత్త దూకుడుతో ఉంది అన్నాడు. త్వరలో భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. భారత్‌ను ఓడిస్తేనే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ గెలుచుకుంటుందని, ఇది తమకు కఠిన సవాల్ అని స్మిత్ తెలిపాడు. కాగా టీమ్ ఇండియా టీ20 సిరిసీలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే 3-0 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి స్మిత్ ఆ విషయం ఇంకా మరిచపోనట్టున్నాడు.

మురుగుకాల్వలోకి సీఎం కారు.. తప్పిన ప్రమాదం..

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీకి తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. ఊమెన్‌చాందీ కోజికోడ్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పాల్గొన్న ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆయన తిరిగి వస్తుండగా కారు  అదుపుతప్పి మురుగుకాల్వలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న సీఎం గన్‌మెన్‌కు స్వల్ప గాయాలవ్వగా.. ముఖ్యమంత్రి గారికి ఎలాంటి గాయాలు కాలేదు. తనకు ఎలాంటి గాయాలూ కాలేదని, తాను క్షేమంగా ఉన్నాని.. సీటు బెల్ట్ ధరించడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదని సీఎం పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న అరుణ్ జైట్లీ

ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 11 గంటలకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతులతో కేంద్రమంత్రి పార్లమెంట్ చేరుకున్నారు. అయితే ఈసారి బడ్జెట్‌ని రూపొందించడంలో రెవెన్యూ కార్యదర్శి డాక్టర్ హస్‌ముఖ్ అదియా, ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ పి వటల్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్, పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి నీరజ్ కుమార్ గుప్తా, ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, బడ్జెట్ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ గోయల్, ముఖ్య సలహాదారు (కాస్ట్) అరుణా సేథిలు ముఖ్యపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

మరోసారి భారత్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ భారత్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. భారత్‌లాంటి దేశాలు అమెరికాలోని యువతకు ఉద్యోగాలను దక్కనీయకుండా చేస్తున్నాయని, దేశ యువతకు ఎలాగైనా ఉపాధి కల్పిస్తామంటూ వ్యాఖ్యానించారు. ‘అమెరికాను మళ్లీ అత్యున్నత స్థానానికి తీసుకెళ్తా. దేశంలో ఉన్న ఉద్యోగాల్లో అత్యధిక శాతం భారత్‌, చైనా, జపాన్‌, మెక్సికో లాంటి దేశాలు సొంతం చేసుకుంటున్నాయి. ఆ ఉద్యోగాలను అమెరికా యువతకు దక్కేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తాం’ అని అన్నారు.

సినిమాలకి పవన్ ఫుల్ స్టాప్..! 2018 లాస్ట్..!

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా.. అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. రెండేళ్లలో సినిమాలకు స్వస్తి చెప్పి, ఇక పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారంట. ఈ క్రమంలో 2018 సంక్రాంతికి తన ఆఖరి చిత్రాన్ని విడుదల చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నరని తెలిసింది. ఆపై 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి అంతా సిద్ధం చేసుకుంటారని సమాచారం. ఈ రెండేళ్లలోపు రాజకీయాలకు కావాల్సిన రూ.100 కోట్లను సంపాదించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు అమీర్ ఖాన్ తరహాలో ఈటీవీలో పవన్ కల్యాణ్ సత్యమేవ జయతే తరహాలో మరో  ప్రోగ్రామ్‌ను నిర్వహించాలనుకుంటున్నారట. ప్రస్తుతం పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

జెఎన్ యూ.. మరో వివాదాస్పద పోస్టర్..

జెఎన్ యూ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయపడుతోంది. ఇప్పటికే ఈ విషయంపై రాజ్యసభలో దుమారం రేగుతోంది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఇప్పటికే జెఎన్ యూకి సంబంధించి తన ప్రసంగంలో చెప్పిన విషయాలు విన్నవారు ఆశ్ఛర్యపోతున్నారు. దుర్గాదేవి మీద విద్యార్దులు చేసిన వ్యాఖ్యలు.. దుర్గాదేవిని ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారన్న విషయాన్ని ఆమె చెప్పారు. దీంతో విన్న సగటు భారతీయుల గుండె మండిపోయింది. దీనికి తోడు మరో విషయం బయటపడింది. దుర్గాదేవి మీద వేసిన పోస్టర్ తరహాలోనే.. మరో బరితెగింపు పోస్టర్ ను జేఎన్ యూ విద్యార్థులు వేశారు. ‘‘ఇండియా ఓ జైలు’’ అంటూ మరో బరితెగింపు పోస్టర్ ను వేశారు. దీంతో పోలీసులు.. పోస్టర్ వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయం మీద దృష్టి సారించారు. ఈ పోస్టర్ ను ప్రింట్ తీసిన జిరాక్స్ షాపు యజమానిని విచారిస్తున్నారు. ఈ షాపు కూడా వర్సిటీ బయటే ఉండటం గమనార్హం.

టీడీపీ పై ఆఖరికి కృష్ణంరాజు కూడా..

టీడీపీ, బీజేపీ పార్టీలు మిత్ర పక్షాలని అందరికి తెలిసిందే. అయితే మిత్రపక్షాలైనప్పటికీ అప్పుడప్పుడూ రెండు పార్టీల నేతల మధ్య విబేధాలు వస్తూనే ఉండేవి. సోము వీర్రాజు - కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరి వంటివారైతే బహిరంగంగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కృష్ణంరాజు కూడా చేరిపోయారు. టీడీపీ చర్యలను బయటకు చెప్పుకోలేక తమ పార్టీ నేతలు బాధపడుతున్నారని..  బీజేపీలోని పైస్థాయి నాయకులు మాత్రమే టీడీపీలో  కలిసి ఉండాలని కోరుకుంటున్నారని ఆయన వెంకయ్యను ఉద్దేశించి మాట్లాడారు. కాగా ఏపీలో రెండు పార్టీల మధ్య సయోధ్య లేదని... ఈ విషయంలో అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కొట్లాట.. ఫొటో కోసం

  తెలంగాణలో అధికార పార్టీ రోజు రోజుకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విస్తరించడంతో పాటు ఆ పార్టీ నేతల మధ్య విబేధాలు రావడం కూడా మొదలయ్యాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తాగాదా ఏర్పడింది. అఖరికి అది కొట్టుకునే వరకూ వెళ్లింది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిల మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు.    ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ మండల పరిధిలోని కాలూర్ గ్రామంలో మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూపతి కూడా హాజరయ్యారు. అయితే సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడ ఎర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ భూపతి ఫొటో లేకపోవడాన్ని ఆయన కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో అక్కడ వివాదం ఏర్పడింది. ఈ సమయంలోనే ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రశ్నించిన నాయకుడిపై చేయి చేసుకోవడంతో అది కాస్త ముదిరి ఇద్దరు నేతలు కొట్టుకనే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరువురు నేతలకు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్లు అడ్డుకొని విడదీయటంతో పెద్ద కొట్లాట తప్పిందని చెబుతున్నారు. ఇక.. ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ కేసు పెడితే.. ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే వర్గీయులు కేసు పెట్టేశారు.

గోల్డెన్ టెంపుల్ లో ఐశ్వర్య రాయ్ వంట..

ప్రపంచ సుందరి, బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ వంట చేసారంట. అది కూడా గోల్డెన్ టెంపుల్ లో. ఐశ్వర్యరాయ్ ఏంటీ వంట చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? ఐశ్వర్య రాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్య పాత్రలకే ఓటు వేస్తున్నారు.  ‘జజ్బా' చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఐష్.....తాజా నటిస్తున్న ‘సరబ్జీత్' చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగానే.. ఆమె స్వర్ణ దేవాలయంలో వంట చేయడం, దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, పాత్రలు క్లీన్ చేయడం లాంటివి చేశారంట. కాగా పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) 'సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నేనే దేవుడిని.. వర్మ సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ తరువాతే ఎవరైన. అప్పుడప్పుడు దైవుడి మీదే కామెంట్లు చేసే వర్మ ఈసారి ఏకంగా నేనే దేవుడిని అని వ్యాఖ్యలు చేసి అందరికి షాకిచ్చాడు. వంగవీటి సినిమాలో  భాగంగా వర్మ విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లాలోను విద్యార్థులతో మాట్లాడాడు. అక్కడ వర్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో కన్నా బెజవాడలోనే ఎక్కువగా హింస జరిగిందన్నాడు. తాను దేవుడిని నమ్మనని, అలాగే దేవుడి పైన సినిమాలు తీయనని చెప్పాడు.  స్వయంగా యముడు వచ్చి తన మెడ మీద కత్తి పెట్టినా తాను పురాణాలు, దేవుళ్ల సినిమాలు తీయనని చెప్పాడు. అంతేకాదు, నా సినిమాల్లో హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకే ఎక్కువ ఖర్చు పెడతానని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడట.

ఆసియా కప్ మ్యాచ్.. పాకిస్థాన్ పై భారత్ గెలుపు..

ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన పాక్, భారత్ ఆసియా కప్ మ్యాచ్ జరిగిపోయింది. ఎంతో ఉత్కంఠ బరితంగా జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 83 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ముందు తడబడ్డా అనంతరం కుదురుకొని  15.3 ఓవర్లలో విజయం సాధించింది. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‍‌కు యువరాజ్ సింగ్ తోడు కావడంతో గెలుపు తీరం చేరింది. కాగా, ఒకే ఒక్క పరుగుతో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. పేసర్లు ఆరంభం నుంచే చెలరేగిపోగా ఫీల్డర్లు కూడా పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓ సమయంలో పాక్ 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 14 పరుగుల వ్యవధిలోనే.. అంటే 42 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

కత్తితో గొంతు కోసి 14 మందిని హత్య.. అందరూ కుటుంబసభ్యులే..

మహారాష్ట్రలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని థానే నగరంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.. థానే నగరంకు సమీపంలోని కాసర్ వాది ప్రాంతంలో  ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో గొంతులు కోసి తన కుటుంబంలోని 14 మందిని హత్య చేశాడు. అనంతరం తాను కూడా  ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా థానే సంయుక్త పోలీసు కమిషనర్ అశుతోష్ డుమ్రీ మాట్లాడుతూ.. చేతిలో కత్తి ఉండడంతో అతడే ఈ హత్యలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా  ఘటన నుంచి ఓ మహిళ ప్రాణాలతో బయటపడగా ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఇంకా షాక్ నుండి తేరుకోనందున ఆమెను ఇంకా ప్రశ్నించలేదని పోలీసు అధికారులు తెలిపారు.

భారత్,పాకిస్థాన్.. ఆసియా కప్‌ పోరు నేడే

  టీమిండియా జట్టు అన్ని జట్లతో ఆడటం వేరు.. ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ తో ఆడటం వేరు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈనేపథ్యంలోనే ఆసియా కప్‌ భాగంగా ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్‌ అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.  ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో ఉంది కాబట్టి పాకిస్థాన్ పై గెలుపు ఖాయమని భావిస్తున్నారు. రోహిత్‌ శర్మ, కోహ్లి, సురేష్‌ రైనాలతో ఇప్పటి అత్యంత బలంగా ఉన్న భారత్‌ బ్యాటింగ్‌కు..  హర్థిక్‌ పాండ్య బ్యాటింగ్ కూడా తోడవడం కూడా భారత్ కు ఫ్లస్ పాయింట్ అయింది. ఇంకా.. శిఖర్‌ ధావన్‌, ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ కూడా బ్యాటింగ్‌లో రాణిస్తే పాకిస్థాన్‌ను చిత్తు చేయడం అత్యంత సులభమని అభిమానులు ధీమాగా ఉన్నారు. అలాగే పాకిస్థాన్ తక్కువ అంచనా వేయడానికి మించిన పోరపాటు లేదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ మంచి హోరా హోరీగా ఉంటుందని భావిస్తున్నారు.

సుబ్రమణ్యం స్వామికి చేదు అనుభవం.. కోడిగుడ్లు, టమోటాలతో దాడి..

బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామికి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. వివరాల ప్రకారం.. సుబ్రమణ్యం స్వామి కాన్పూర్‌లో స్థానికంగా నవాబ్ గంజ్‌లోని వీఎస్ఎస్డీ కాలేజీలో 'ప్రపంచ తీవ్రవాదం' పై ఏర్పాటు చేసిన సెమినార్ కార్యక్రమానికి హాజరవడానికి వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాదు ఆయన కారుపై కోడిగుడ్లు.. టమోటాలు విసిరి.. నల్లజెండాలు ప్రదర్శించారు. అక్కడితో ఆగకుండా  నల్ల ఇంకుని సైతం చల్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలక మధ్య తీవ్ర తోపులాట జరిగి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆఖరికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి నెమ్మెదించింది.

జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారా..?ఎన్నిక‌ల‌కు దిగుతారా..?

  వైసీపీ ఎమ్మెల్యేలు ఆపార్టీని వీడి టీడీపీ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీడీ అధినేత అయిన చంద్రబాబుపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.  డ‌బ్బులిచ్చి.. ప్ర‌లోభాల‌కు గురిచేసి త‌మ ఎమ్మెల్యేల‌ను లాక్కుంటున్నార‌ని.. దమ్ముంటే వారి చేత రాజీనామా చేయించి.. గెలిపించుకోవాల‌ని చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు. అయితే ఇప్పుడు అందరూ అనుమానం ఏంటంటే.. జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారా లేదా అని. ఎందుకంటే.. టీడీపీ లోని ఇంతకు ముందు నేతలు వేరే పార్టీలోకి వెళ్లినప్పుడు వారు కూడా ఇలానే ఆరోపించారు. వాళ్లు వెళ్లినప్పుడు రాజీనామా చేయించి గెలిపించుకోవాలని.. సవాళ్లు విసిరారు. మరి ఇప్పుడు జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారా.. వారి చేత రాజీనామా చేయిస్తారా.. ఎన్నిక‌ల‌కు దిగుతారో లేక ప్ర‌త్యామ్నాయ మార్గం చూస్తారో అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఏం జరుగుతందో చూడాలి..

రెండేళ్ల పాపకు వివాహం

  బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్తాన్‌లోని నలుగురు బాలికలకు ఇలా వివాహం జరిగిన వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా 2 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలే! వీరిని వివాహం చేసుకున్నవారు కూడా మైనర్లు కావడం విశేషం. రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ వివాహం గురించి తెలిసి కూడా అధికార యంత్రాంగం కానీ పోలీసులు కానీ సత్వరం స్పందించకపోవడం ఆశ్చర్యం. స్థానికంగా ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకి ఆదేశించిన తరువాత కానీ, అధికారులలో చలనం కలుగలేదు. 2001 గణాంకా ప్రకారం ఏటా 15లక్షలమంది బాలికలకి, వారికి 15 ఏళ్ల వయసులోపుగానే వివాహం చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ‘బాల్యవివాహ వ్యతిరేక చట్టం- 2006’ని అమలులోకి తీసుకు వచ్చింది. అయినా అధికారుల అలసత్వం వల్ల అడపాదడపా ఇలాంటి వార్తలు వినవస్తూనే ఉన్నాయి.