yanamala ramakrishnudu

అలా విమర్శిస్తే దైవ ద్రోహం.. ప్రతిపక్షాలపై యనమల ఫైర్

ఏపీ ప్రతిపక్షాల తీరుపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో.. దానిని వ్యతిరేకిస్తూ  నిన్న వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టడాన్ని యనమల తప్పుబట్టారు. మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటికి చెందిన పక్షులని అన్నారు. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ ఎంతో గౌరవంగా మట్టిని, పవిత్రమైన గంగా నది జలాన్ని తీసుకొస్తే దాన్ని విమర్సిస్తారా.. భూదేవిని, గంగను విమర్శించడం దైవ ద్రోహమని మండిపడ్డారు. శంకుస్థాపనకు మొత్తం పదమూడు వేల గ్రామాల నుండి మట్టి తీసుకొచ్చారని వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కించపరచకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలతో గొడవ పడటం వల్ల సాధించేది ఏదీ లేదని వ్యాఖ్యానించారు.

ysrcp ambati rambabu

ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తారా? ధర్నా చేయమంటారా?.. అంబటి

ఆర్టీసీ చార్జీల పెంపుదలపై వైకాపా నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆర్టీసీ చార్జీలను 10 శాతం పెంచినట్టు గత రాత్రి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. దానివల్ల డీజిల్ ధరలు తగ్గుతున్నా ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతుందో అర్ధంకావట్లేదు అని అన్నారు. ఆర్టీసీని నడిపే సామర్ధ్యం ఏపీ ప్రభుత్వానికి లేకపోవడంవల్లే ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. అంతేకాదు రేపటి కల్లా ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తున్నామని నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే ఎల్లుండి అంటే 26 వ తేదీన జగన్ చెప్పినట్టు అన్ని ఆర్టీసీ డిపోల ముందు ధర్నాలు చేస్తామని చెప్పారు. కావాలనే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని.. ఆర్టీసీ చార్జీలు పెంచడం వల్ల ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఎక్కుతారని.. ప్రైవేటు సంస్థలన్నీ చంద్రబాబు, ఇతర నాయకులకు బినామీ సంస్థలేనని ఆరోపించారు.

pawan kalyan

పవన్ రాకపోవడానికి కారణం అదా..!

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రాకపోవడంపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ లు ఇద్దరు స్వయంగా వెళ్లి పవన్ ను ఆహ్వానించగా.. ఆయన అప్పుడే తాను వస్తానో? రానో? అని చెప్పారు. తాను వచ్చేది.. రానిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే ఇప్పుడు నిజంగానే షూటింగ్ బిజీలో ఉండి రాలేదా.. లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న దానిపై పలువురు పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. అసలు కేసీఆర్ ను, రామోజీ రావును చంద్రబాబు స్వయంగా పిలిచారని.. తమ నాయకుడిని స్వయంగా పిలవలేదని అప్పుడే పవన్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మరీ రావాలని ఆహ్వానించారు.. ఈ విషయంపై చంద్రబాబు కూడా పవన్ తప్పకుండా వస్తారు.. ఫోన్ చేసి మరీ చెప్పాను.. విబేధాలు ఎన్ని ఉన్నా వాటిని కలిపి చూడకూడదు.. పవన్ వస్తారు అని ఖచ్చితంగా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. అయితే పవన్ తాను చెప్పినట్టు నిజంగానే షూటింగ్ లో బిజీగా ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఒక్కరోజు షూటింగ్ ఆపేసి రావడం పెద్ద విషయం కాదు.. ఒక్కరోజు కాదు అంతకన్నా ఎక్కువ రోజులు తీసుకున్నా డైరెక్టర్ ఒక్కమాట కూడా మాట్లాడడు. మరి ఎందుకు రాలేదు? మరోవైపు పవన్ రాకపోవడానికి మరో కారణం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. భూసేకరణ వివాదంలో టీడీపీకి పవన్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. తానే భూసేకరణకు వ్యతిరేకమని.. రైతుల కోసం పోరాడతానని చెప్పి.. ఇప్పుడు ఆభూముల్లో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ఎలా వెళతాను అని ఆలోచించి తాను హాజరుకాలేదని అంటున్నారు. అందుకే ఇవన్నీ ముందే గ్రహించే పవన్ కళ్యాణ్ తాను వస్తానో? రానో? అని చెప్పారని అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో ఆయనకే తెలియాలి.

ke krishnamurthy

విపక్షాలు అందుకే తట్టుకోలేకపోతున్నాయి.. కేఈ

  ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రతిపక్షాలతీరుపై మండిపడ్డారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని.. ఈ కార్యక్రమం అంతలా విజయవంతం అయిందనే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని అన్నారు. అందుకే అనవసరమైన విమర్శుల చేస్తూ.. నిరసనలు చేస్తూ కొంతమంది నేతలు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు శక్తి, సామర్ధ్యాలు ఏంటో అందరికి తెలిసిందని అన్నారు. అందుకే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని విమర్శించారు. అంతేకాదు త్వరలోనే మీ ఇంటికి - మీ భూమి రెండో విడుత కార్యక్రమం చేపడుతున్నామని.. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాస్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

amaravathi stone foundation

చంద్రబాబు బుజ్జగించారా?క్లాస్ తీసుకున్నారా?

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమంది నేతల పేర్లుతో శిలాఫలకం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ శిలాఫలకంపై ఉన్న పేర్లతోనే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శిలాఫలకంపై ప్రధాన మంత్రి మోడీ, ఇతర ప్రముఖుల పేర్లు ఆఖరికి పక్క రాష్ట్రమైన కేసీఆర్ పేరును కూడా ఉండేట్టు చూసుకున్నారు.. కానీ పార్టీ నేతల పేర్లు ఉన్నాయే లేదో అంతగా పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏపీ శంకుస్థాపనకు సంబంధించిన వ్యవహారాలలో గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. కానీ వారిపేర్లు మాత్రం శిలాఫలకంపై లేకపోవడాన్ని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు వారిద్దరిని పిలిచి బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంత మంది వారిని బుజ్జగించారు అని అనుకుంటుంటే.. కొంతమంది మాత్రం క్లాస్ తీసుకున్నారు అని అనుకుంటున్నారు. అంతేకాదు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరిగిన సందర్బంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో వీరిద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టుకున్నారు.

APCC president Raghuveera Reddy

మట్టి తెచ్చిన మోడీపై "మట్టి సత్యాగ్రహం"

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఢీల్లీలోని పార్లమెంట్ ఆవరణం నుండి మట్టిని, యమునా నది నుండి నీటిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోడీ తీసుకొచ్చిన మట్టిపై పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయకుండా అక్కడినుండి మట్టి తీసుకొచ్చి ఇక్కడి ప్రజల నోట్లో కొట్టారని విమర్సిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి మోడీ ఎటువంటి ప్రకటన చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని.. ఏపీ ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాడతామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన మట్టి రాజకీయానికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని.. ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం 'మట్టి సత్యాగ్రహం' పేరుతో వినూత్న నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. తన సొంత నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మహిళా సర్పంచ్‌లు సేకరించిన మట్టిన ప్రధాని మోడీకి పంపిస్తున్నామని.. ఈరకంగా తెలుగు ప్రజల ఘోష మోడీకి తెలుస్తుందని అన్నారు.

Nawaz Sharif

నువ్వు లాడెన్ ఫ్రెండ్ వి.. నవాజ్ షరీఫ్ ని తిట్టిన నిరసనకారుడు

  పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అతనికి ఓ చేదు అనుభవం ఏదురైంది. అందేంటంటే.. నవాజ్ షరీఫ్ వాషింగ్టన్ లో ప్రముఖ మేధో సంస్థ అయిన యూఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఉండగా మధ్యలో ఒక వ్యక్తి లేచి నిలబడి బలూచిస్థాన్ కు విముక్తి కలిగించండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. దీంతో నవాజ్ షరీఫ్ ఒక్కసారిగా షాకయ్యి.. కొద్ది సేపు ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడ్ని బయటకు తీసుకెళ్లగా.. అయినా అతను ఆగకుండా నువ్వు లాడెన్ స్నేహితుడివి అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన నవాజ్ షరీప్.. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా పాక్ లోని బలూచిస్థాన్ కు స్వేచ్ఛను ప్రసాదించాలన్న గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ys jagan

ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ రాజీనామా?

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకూ ఎన్నో నిరసనలు, దీక్షలు చేశారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటి వరకూ చేసిన దీక్షలకు ఎలాంటి ఫలితం రాలేదు.. అఖరికి నిరాహార దీక్ష చేసిన కూడా పెద్దగా ఎవరూ పట్టించుకున్న పాపాన లేదు. అయితే ఇప్పుడు జగన్ కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. తను రాజీనామా చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోడీ ఏపీకి ఎటువంటి వరాలు ప్రకటించలేదని చెప్పి కాంగ్రెస్, సీపీఐ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఆ పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో  భాగంగానే కాంగ్రెస్ పార్టీకి, వైకాపా పార్టీకి మధ్య కేవీపీ రాయబారాలు కూడా నడుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ జగన్ కనుక రాజీనామా చేస్తే అతని వెంట ఎంతమంది వస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. వైకాపా పార్టీ నుండి 67 మంది ఎమ్మెల్యేలు.. ఆరుగురు ఎంపీలు గెలవగా వారు అందరూ కూడా రాజీనామా చేస్తారా? చేయరా అన్నది ప్రశ్న.. ఒకవేళ చేస్తే అది స్పీకర్ ఆమోదిస్తే మొత్తానికే మోసం వస్తుంది. దీంతో ఏ చేయాలనేదానిపై జగన్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారట. మరి జగన్ ఎంత వరకూ రాజీనామా చేస్తారో చూడాలి.

amravathi stone  foundation

ఏపీ శంకుస్థాపన.. దివంగత ఎన్టీఆర్ ఎక్కడ?

ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అంతా బాగానే జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా.. ఏ లోటు రాకుండా చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది ప్రముఖులు, విదేశీ ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వగా ఇప్పుడు అందరూ చర్చించుకునే విషయం ఒకటే. అది దివంగత ఎన్టీఆర్ గురించి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు ఎక్కడా కనిపించకపోవడం.. వినిపించకపోవడం గురించి. శంకుస్థాపన కార్యక్రమం పనులు చేపట్టిన దగ్గర నుండి ఎంతో ప్రచారం చేసినా.. ఈ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన ప్రకటనల్లో చంద్రబాబు, లోకేశ్, మోడీ ఉన్నారే తప్ప ఎన్టీఆర్ ది చిన్న ఫొటో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో చాలామంది చంద్రబాబు, లోకేశ్ తో పాటు ఎన్టీఆర్ ఫొటో కూడా ఉండి ఉంటే బావుండేదని.. ప్రకటనకే నిండుదనం వచ్చేదని అనుకుంటున్నారు. అంతేకాదు ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు చేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అయితే ఆఖరికి మనువడు దేవాన్ష్ తో కూడా ప్రచారం చేయించారు.. అలాంటిది తెలుగు జాతి కోసం పార్టీ పెట్టి.. ఎన్నో ఏళ్ల నుండి పాలిస్తున్న కాంగ్రెస్ ను సైతం మట్టి కరిపించి విజయం సాధించిన ఎన్టీఆర్ ను మరిచిపోయారా అంటూ విమర్సిస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ స్థాపించిన నాయకుడినే మరిచిపోవడం బాధాకరమైన అంశమే.

APS RTC

శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏ.పి.ఎస్.ఆర్టీసీ చార్జీల పెంపు

  ఏ.పి.యస్.ఆర్టీసీ చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 10 శాతం పెంచుతున్నట్లు ఆర్టీసీఎం.డి. సాంభశివరావు తెలిపారు. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర మరియు గరుడ సర్వీసులపై ఒకేసారి చార్జీలు పెరిగాయి. దాని వలన ప్రతీ కిలోమీటరుకి 8-9 పైసలు చొప్పున, పల్లె వెలుగు బస్సు సర్వీసులపై 5శాతం చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే విద్యార్ధుల బస్ పాసుల చార్జీలు పెంచలేదు. ఇటీవల ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంటును పెంచడంతో ఆర్టీసీపై ఏడాదికి రూ.660 కోట్ల అదనపు భారం పడుతోంది. అదీగాక సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. కనుక తప్పనిసరి పరిస్థితులో చార్జీలు పెంచవలసి వచ్చిందని ఆయన తెలిపారు. తాము 20శాతం పెంపుకి ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 శాతం పెంపుకు మాత్రమే అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో సంస్థకున్న ఆస్తులను వాణిజ్యపరమయిన కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం ద్వారా సంస్థ ఆదాయం పెంచుకొని నష్టాలను అదుపు చేసుకోమని ముఖ్యమంత్రి సలహా ఇచ్చేరని ఆయన తెలిపారు. పెరిగిన ఈ కొత్త చార్జీల ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్ కి రూ.213 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.235 అవుతుంది.

AP Telangana

ఏపీ విద్యుత్ ఉద్యోగులు వెంటనే విధుల్లోకి.. టీ సర్కార్

ఎప్పటినుండో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తరువాత స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో రోజుల నుండి హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు రిలీవ్ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రిలీవ్ చేసిన  ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నామని.. 1,252 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వీరికి చెల్లించాల్సిన వేతనాలను కూడా  ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వాలు కలిసి చెల్లించనున్నాయి.

chandrababu kcr

చంద్రబాబు, కేసీఆర్ల మధ్య రాయబారి.. మాకు తెలుసు.. షబ్బీర్ అలీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శంకుస్థాపనకు పిలవడం.. ఆయన కూడా ఇచ్చిన మాట తప్పకుండా శంకుస్థాపనకు రావడం జరిగింది. అయితే వీరిద్దరి మనసులో ఏమున్నా కానీ.. కలిసి సన్నిహితంగా ఉండటం మాత్రం తెలుగు ప్రజలకు ఆనందాన్నిచ్చే విషయమే. కానీ వీరిద్దరి కలయికపై తెలంగాణ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు మధ్య ఒప్పందం కుదరడానికి మధ్యవర్తిగా వ్యవహరించిందో ఎవరో తమకు తెలుసునని అన్నారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు మధ్యవర్తి పేరు బయటపెడుతామని ట్విస్ట్ కూడా ఇచ్చారు. కాగా.. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర విభజనప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర విభజనను తప్పుబట్టారని.. అలాంటి మోడీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు, కేసీఆరే అని విమర్శించారు. విభజన హామీలను మోడియే కాదు ఎవరు ప్రధానిగా వచ్చినా అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

nayani narasinha reddy

అలాంటి వాటిపై వివరణ అడిగితే కేసు పెడతాం.. నాయిని

  తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చంచల్ గూడ జైలులో రూ 10 కోట్లతో నిర్మించిన కొత్త కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కొత్త కాంప్లెక్స్ ప్రారంభించడానికి వచ్చిన నాయినితో ఓ విలేకరి.. కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న వార్తలపై మీ వివరణ ఏంటీ అని అడిగాడు. అంతే నాయిని కోపం ఒక్కసారిగా నషాళానికి అంటి మీడియా విలేకరులపై మండిపడ్డారు. ఇలాంటి గాలి వార్తలపై వివరణ అడిగితే కేసులు పెడతామంటూ హెచ్చరించారు. దీంతో షాకవ్వడం విలేకరుల వంతయింది. అనంతరం మాట్లాడుతూ ఖైదీల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. జనవరి 26న మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తామని.. ఖైదీల్లో సత్ర్పవర్తన వచ్చేలా జైళ్ల శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.

pattipatii pulla rao

మోడీ ప్రకటన చేస్తారని ఎవరన్నా చెప్పారా? విపక్షాలపై ప్రత్తిపాటి ఫైర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలు చేస్తున్న నిరసనలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన రోజు మోడీ ప్రత్యేక హోదా గురించి కానీ.. ప్రత్యేక ప్యాకేజీ గురించి కాని ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా.. ఇప్పుడు ఎందుకు మోడీ ప్రత్యేక హోదా గురించి ప్రకటించలేదని అనవసరమైన ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని.. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టడానికే చూస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ మోడీ నెరవేరుస్తామని చెప్పారు.. అసలు అప్పుడు  విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు పొందుపరచలేదని కాంగ్రెస్ పార్టీని.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ప్రత్తిపాటి నిలదీశారు. అంతేకాదు తగలబెట్టాల్సింది మోడీ దిష్టిబొమ్మలు కాదు.. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మలను అని విమర్శించారు. జగన్ కు ముఖం చెల్లక శంకుస్థాపన కార్యక్రమానికి రాలేదని అన్నారు.

Chandrababu Naidu KCR

చంద్రబాబు, కేసీఆర్.. ఈసారైనా మాట్లాడుకుంటారా?

ఎప్పుడూ గిల్లి కజ్జాలాడుకునే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు ఏదో ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పుణ్యమా అని కలిశారు. అయితే ఈ కార్యక్రమం ఆద్యాంతం చంద్రబాబు, కేసీఆర్ లు ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం కలగలేదు. ఏదో ఒకటీ రెండు సందర్భాల్లో..మోడీకి స్వాగతం పలికే నేపథ్యంలో వెనుక ఉన్నకేసీఆర్ ను చంద్రబాబు ముందుకు లాగడం.. అర్చకులు ఇచ్చే ఆశీర్వాచనాల్లో చంద్రబాబు కేసీఆర్ వైపు చూపించడం లాంటి సందర్భాల్లో తప్ప పెద్దగా మాట్లాడుకున్న దాఖలాలు లేవు. ఇక శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఎవరి దారి వారిది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులు మళ్లీ ఎప్పుడు కలుస్తారో.. మళ్లీ వారిద్దరిని ఒకే వేదికపై ఎప్పుడూ చూస్తామో అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఇద్దరు చంద్రులు మళ్లీ కలిసే సమయం కొద్ది గంటల్లోనే ఉందని తెలుస్తోంది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు సందర్బంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఆయన రాజకీయ నేతలందరినీ పిలుస్తారు. ఈసారీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. దీంతో మరోసారి ఇద్దరూ కలవనున్నారు. మరి ఈసారైనా ఇద్దరూ మాట్లాడుకుంటారో లేదో చూడాలి.

కేసీఆర్ ను చాలా జాగ్రత్తగా చూసుకున్న చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ను స్వయంగా శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచిన సంగతి అందరికి తెలిసిందే. కేసీఆర్ కూడా తాను వస్తానని చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపనకు వెళ్లారు. అయితే ఏదో పిలిచాం కదా మన పని అయిపోయిందిలే అని వ్యవహరించకుండా.. కేసీఆర్ వచ్చిన దగ్గర నుండి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే మంత్రులకు ఆదేశించడం జరిగిందట. అంతేకాదు చంద్రబాబు చెప్పినట్టు మంత్రులు కూడా కేసీఆర్ ను అదే రీతిలో ఆహ్వానించడం.. ఆయనకు కావలసినవి చూసుకోవడం చేశారంట. దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి చంద్రబాబుతో పాటు కేసీఆర్ కూడా వెళ్లారు. అయితే కేసీఆర్ కొంచెం వెనుక ఉండగా.. చంద్రబాబు కేసీఆర్ ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అదొక్కటే కాదు ఇంకా ఇతర అంశాల్లో కూడా చంద్రబాబు కేసీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడానికే ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఒక్క చంద్రబాబే కాదు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి ఎవరో ఒకరు కేసీఆర్ తో మాటలు కలుపుతూ కేసీఆర్ ఎక్కడా నొచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నాలు చేశారు. అంతేనా అమరావతి శిలాఫలకంపై కూడా కేసీఆర్ పేరు చేర్చి అత్యంత గౌరవం దక్కించారు చంద్రబాబు.

మోడీ ప్రసంగంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ

  ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తెదేపా-ప్రతిపక్ష పార్టీల మధ్య అప్పుడే ఈ విషయం గురించి విమర్శలు ప్రతివిమర్శలు మొదలయిపోయాయి. ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చిస్తారని సమాచారం.   ప్రధాని నరేంద్ర మోడీ నిన్న తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం తనకు చాలా నిరాశ కలిగించిందని గల్లా జయదేవ్ అన్నారు. కేంద్రంతో కలిసి కొనసాగుతున్నంత కాలం ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కోసం దానితో పోరాటం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాని ఏవిధంగా సాధించుకోవచ్చనే దానిపై సరయిన అవగాహన ఉండాలని కనుక దీనిపై ఏవిధంగా ముందుకు సాగాలనే దాని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని గల్లా జయదేవ్ తెలిపారు.

అమరావతి శిలాఫలకంపై గల్లా అసంతృప్తి

  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల పరిధిలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగగా, కనీసం వీరిద్దరికీ సరైన ప్రాధాన్యతే దక్కలేదు, ప్రోటోకాల్ ప్రకారం చూసినా, అ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకి వేదికపై చోటు ఇవ్వాల్సి ఉండగా... వీళ్లిద్దరినీ పట్టించుకున్న పాపానపోలేదు, అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆటలో అరటిపండులా మారగా, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. కనీసం శంకుస్థాపన చేస్తున్న సమయంలోనైనా స్థానిక ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కి అవకాశం కల్పించాల్సి ఉంది, పైగా అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పేర్లు లేకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి, దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసిన గల్లా జయదేవ్... స్థానిక ప్రజాప్రతినిధులను ఇలా అవమానించడం సరికాదన్నారు.

కేంద్ర, రాష్ట్ర సర్కారులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ధర్నా

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రత్యేక హోదాపైన కాని.. ప్రత్యేక ప్యాకేజీ పైన కాని ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన రోజున ఏదో ప్రకటన చేస్తారని చూసిన తెలుగు ప్రజల ఆశలపై మోడీ నీరు జల్లారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని.. ఈనేపథ్యంలో ఆందోళనలు చేపడతామని చెప్పారు. దీనిలో భాగంగానే వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, విజయనగరం, కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.