ఎఎస్పీని చంపాలని చూసిన ఎస్పీ?
posted on Aug 28, 2012 @ 9:39AM
తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు పోలీస్ బాసులు బాహాటంగా కొట్టుకుంటున్నారు. ఎస్పీ త్రివిక్రమవర్మకు ఎఎస్పీ నవీన్ కుమార్ కి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఎస్పీ తనను చంపడానికి ప్రయత్నించారని అడిషనల్ ఎస్పీ నవీన్ కుమార్ ఆరోపించారు. జీపు స్టీరింగ్ బోల్డ్ ని ఊడదీయించి తనను హత్యచేసేందుకు కుట్రచేశారని ఆరోపించారు. అదృష్టం బాగుండి బతికి బైటపడ్డానని
చెబుతున్నారు. గంజాయి స్మగ్లర్లనుంచి ఒత్తిడి ఎక్కువకావడంవల్లే త్రివిక్రమవర్మ తనను వేధిస్తున్నారని ఎఎస్పీ ఆరోపిస్తున్నారు. తను చార్జ్ తీసుకున్న దగ్గర్నుంచి గంజాయి స్మగ్లర్లను ఏరేస్తున్నానని, లంచాలకోసం పాకులాడే ఎస్పీ.. ఆ కారణంగా తనపై కక్షకట్టి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఎస్పీకి వ్యతిరేకంగా కేసు నమోదుచేసేందుకు రంపచోడవరం పోలీస్టేషన్ అధికారులు సహకరించకపోవడంతో నవీన్ కుమార్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గోపాలకృష్ణను కలిసి ప్రైవేట్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డ్రైవర్ బసవ దగ్గరుండి గంజాయి స్మగ్లింగ్ మామూళ్లను వసూలు చేస్తాడని, ఎస్పీకి వాటాని పంపిస్తాడని ఎఎస్పీ నవీన్ కుమార్ చెబుతున్నారు.