రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ ఫైర్
posted on Oct 6, 2012 @ 6:04PM
రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్న సామాజిక కార్యకర్త, మాజీ ఐఏఎస్ అరవింద్ కేజ్రీవాల్ కదన రంగంలోకి దిగారు. ప్రధాన ప్రత్యర్థిపై పోరాటానికి మిగిలిన వారికి భిన్నమైన ఎత్తుగడను ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఆయన గురి పడింది. వాద్రా అక్రమాస్తుల్ని ఎలా కూడబెట్టిందీ కేజ్రివాల్ సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరు మోసిన డీఎల్ఎఫ్ సంస్థ వాద్రాకు అతి తక్కువ ధరకు అత్యంత ప్రధానమైన భూమిని ఇవ్వడమే కాకుండా వడ్డీ లేని రుణం ఇచ్చిందని, ఆ ఆస్తి విలువ 300 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. వాద్రాకు ఆ సంస్థ 50 లక్షల రూపాయలకే ఈ ఆస్తులన్నీ సమకూర్చి పెట్టిందని కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. వాద్రా సంపద విలువ మూడేళ్లలో 600 రెట్లు పెరిగిందని వారు చెప్పారు. కేజ్రివాల్ మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. దేశంలోని అత్యంత అవినీతిపరులైన ఇద్దరు రాజకీయ నాయకుల గుట్టును శనివారం విప్పుతామని ఇటీవల కేజ్రీవాల్ చెప్పారు. అయితే, ఒక రాజకీయ నాయకుడిని గుట్టును ఒక రోజు ముందే శుక్రవారం విప్పేశారు. మరో రాజకీయ నాయకుడి ఆస్తుల వివరాలను అక్టోబర్ 10వ తేదీన వెల్లడించే అవకాశాలున్నట్లు ప్రకటించారు.