ఆస్ట్రేలియాను చిత్తు చేసిన విండీస్
posted on Oct 6, 2012 @ 11:03AM
టి-20 ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు కరీబియన్ జట్టు వెస్టిండీస్ షాకిచ్చింది. విధ్వంసక వీరులు క్రిస్ గేల్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్, కీరన్ పొలార్డ్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38, డ్వెన్ బ్రావో 31 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37 ధాటికి శుక్రవారమిక్కడ ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో వెస్టిండీస్ 74 పరుగులతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక టోర్నీలో సూపర్ ఫామ్‌లో అదరగొడుతూ వచ్చిన కంగారూలు. ఫైనల్ రేసులో బోల్తా పడ్డారు.
206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 16.4 ఓవర్లలో 131 పరుగులకే చేతులెత్తేశారు. కెప్టెన్ జార్జి బెయిలీ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 మినహా ఎవరూ రాణించలేదు. రవి రాంపాల్ 3/16, పొలార్డ్ 2/6, సునీల్ నరైన్ 2/17, శామ్యూల్ బద్రీ 2/27 ఆసీస్ పతనాన్ని శాసించారు. అంతకు ముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ పూర్తి ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో బౌండ్రీలు 13, సిక్స్‌ల 14 రూపంలో విండీస్‌కు 136 పరుగులొచ్చాయి. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో విండీస్ శ్రీలంకతో తలపడనుంది.