అనంత రాజకీయాల్లోకి యువనేత పరిటాల శ్రీరామ్
posted on Oct 7, 2012 @ 12:08PM
అనంతపురం జిల్లాలోమళ్లీ తెలుగుదేశానికి ఈ జిల్లాలో మంచిరోజులు వచ్చాయి. కొత్తనాయకుడు తయారవుతున్నాడు. దివంగత నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాములు తరచూ తెలుగుదేశం కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. అతను పార్టీ పరంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా అప్పుడప్పుడు తల్లి వెంట కనబడుతూ, పర్యటనలు చేస్తున్నాడు. దీంతో అతడు తరచూ వార్తల్లో కనిపించడం మొదలుపెట్టాడు. తాజాగా చంద్రబాబు అనంతపుం జిల్లా నుంచి మొదలుపెట్టిన “వస్తున్నా మీకోసం” పాదయాత్రతో ఊపుమీదున్న తెలుగుదేశం కొత్త ఉత్సాహాన్ని పొందింది. శనివారం పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో పర్యటించిన చంద్రబాబు పరిటాల కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడారు. ఈ పర్యటనలో పరిటాల సునీతతో పాటు పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. పైగా, యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు ఆహ్వానం కూడా అందుతోంది. ఈ విషయమై చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్ రాజకీయ ప్రవేశం గురించి సునీత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల ప్రకారం, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, ప్రస్తుతం పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె స్పస్టంచేశారు.