ఇంకా భ్రమల్లోనే బ్రతుకుదామంటున్న కిరణ్
posted on Apr 5, 2014 @ 9:39AM
కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని స్థాపించడంలో ఆలస్యం చేయడం, అందుకు ఆయన ఎంచుకొన్న సమయం ఒక పెద్ద తప్పు అయితే, అధికారికంగా రాష్ట్ర విభజన జరిగిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్న తరుణంలో కూడా తన పార్టీకి జై సమైక్యాంధ్ర పార్టీ అని పెట్టుకోవడం మరో పెద్ద తప్పు. కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలంటే ప్రజలలో సమైక్య సెంటిమెంటుని రెచ్చగొట్టడమే అందుకు మార్గమని ఆయన దృడంగా విశ్వసించబట్టే ఆయన తన పార్టీకి ఆ పేరు పెట్టుకొన్నారు. ఆయన సమైక్యవాదమనే పునాదిపై తన పార్టీని స్థాపించుకొన్న కారణంగా నేడు సరిగ్గా అదే ఆయన పార్టీకి పెద్ద ప్రతిబందంగా మారింది.
సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే మనస్పూర్తిగా కోరుకొన్న మాట నిజం. కానీ, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత నేటికీ వారు ఆ భ్రమలలో కొనసాగేందుకు సిద్దంగా లేరు. వారి అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని శిక్షించేదుకు వారు సిద్దంగా ఉన్నారు. కానీ, అదే సమయంలో ప్రజలందరూ కూడా ఒక సానుకూల యదార్ధ, దృక్పదంతో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆలోచిస్తున్నారు. అయితే మూడేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి, ఆయన పార్టీలో ఉన్న ఉండవల్లి, హర్షకుమార్ వంటి రాజకీయ అనుభవజ్ఞులకు ఈ విషయం తెలియదని భావించలేము. కానీ, పార్టీ తీసుకొన్న స్టాండ్ కారణంగానే వారందరూ నేటికీ రాష్ట్రం విడిపోలేదని, తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే విడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి కలుపుతామని వితండ వాదనలు చేయవలసి వస్తోంది. ఆవిధంగా నేటికీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రజలలో తాము నవ్వుల పాలవుతున్నామనే సంగతిని కూడా విస్మరించవలసి రావడం నిజంగా దయనీయమే.
రాష్ట్ర విభజన వ్యవహారం సజావుగా పూర్తి కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ యంపీలు, సీమాంధ్ర కేంద్రమంత్రులు పోషించిన పాత్రల గురించి ప్రజలకు బాగానే జ్ఞాపకం ఉంది. అందుకే జైసపాకు, కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో ఆదరణ కరువయింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు అధికారం కైవసం చేసుకోవడానికి తమ ప్రయత్నాలు తాము చేయాలి గనుక తాము చెప్పదలచుకొన్నవి ప్రజలకు చెప్పుకొంటున్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ లక్షలమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమాలు చేసినప్పుడు వారి అభిప్రాయాలు గుర్తించడానికి కాంగ్రెస్ అధిష్టానికి కళ్ళు చెవులు లేవా? ఉంటే అవి మూడుకు పోయాయా? అని ప్రశ్నించిన అదే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారో గ్రహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆయన తీసుకొన్న సమైక్య స్టాండ్ ఆయన నోటికి తాళాలు వేస్తోందనుకొన్నా, ఇప్పుడు తనకు, ప్రజలకు కూడా శత్రువుగా మారిన కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టానాన్ని నోరు తెరిచి విమర్శించేందుకు నేటికీ జంకడం చూస్తే, మళ్ళీ ఏదో ఒకరోజు కాంగ్రెస్ గూటికే చేరే ఉద్దేశ్యం ఉంది గనుకనే ఆయన నోటికి తాళం బిగించుకొని పొదుపుగా విమర్శించవలసి వస్తోందని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లను నొల్లుకోవాలని పార్టీ పెట్టుకొన్న ఆయన కనీసం కాంగ్రెస్ పార్టీని నోరారా చీల్చిచెండాడి ఉంటే, దెబ్బ తిన్న సీమాంధ్ర ప్రజల మనసులకు స్వాంతన లభించి ఆయన పార్టీకి ఎంతో కొంత జనాధారణ పెంచి ఉండేది. కానీ, నేటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ, దాని అధిష్టాన దేవతల పట్ల అదే వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నందున ప్రజలను ఆకట్టుకోలేక పోవడమే గాక వారిలో తన పార్టీ పట్ల మరింత అనుమానాలు పెరిగేలా వ్యవహరిస్తున్నారు. దానికి తోడు పార్టీ స్టాండ్ కారణంగా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతానని ప్రజలనుమభ్యపెట్టవలసి వస్తోంది.
ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడలేని ఆయన ఇప్పుడు ఏవిధంగా కలుపగలరు? అని ఆలోచిస్తే ఆయన చేస్తున్న వాదనలకు అర్ధం లేదని తెలుస్తుంది. ఒకవేళ ఆయన ఇప్పుడు నిజంగానే రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కలిపేందుకు సిద్దపడినా మానసికంగా విడిపోయి, తమ రాష్ట్రాలను పునర్నిర్మించుకొని ఇకనయినా సుఖంగా బ్రతకాలనుకొంటున్న రెండు రాష్ట్రాల ప్రజలు అందుకు అంగీకరించరు. ఆయన ప్రజలను మభ్యపెట్టేందుకు చెపుతున్న ఇటువంటి మాటల వలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ లేకపోయినా, ఆయనలాగే సెంటిమెంటుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకొంటున్న కేసీఆర్ వంటి వారికి ముఖ్యమంత్రి అయ్యేందుకు మంచి సాకుని అందజేయగలుగుతున్నాయి.
అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఎన్నికలలో కనీసం తనొక్కడయినా ఖచ్చితంగా గెలవాలనే కోరిక ఉండి ఉంటే కనీసం ఇప్పటి నుండయినా తన పందా మార్చుకొని ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే ఏమయినా ఫలితం ఉంటుంది. అలా కాక ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే చివరికి ఆయనే ప్రజలలో నవ్వులపాలవుతారు.