తెదేపా-బీజేపీ పొత్తులపై అదే సందిగ్ధం
posted on Apr 1, 2014 7:54AM
తెదేపా-బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన చర్చలు విఫలం అవడంతో సీను మళ్ళీ డిల్లీకి మారింది. టీ-బీజేపీ నేతలు తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న సంగతిని పసిగట్టిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇదే అదునుగా తాము బీజేపీతో జత కట్టేందుకే సిద్దంగా ఉన్నామని సంకేతాలు పంపడంతో, తెదేపా వెంటనే అప్రమత్తమయ్యి ఎర్రబెల్లి, రమణ, మోత్కుపల్లి తదితర నేతలను హుటాహుటిన డిల్లీకి పంపి నేరుగా బీజేపీ అగ్రనేతలతోనే చర్చలకు దిగింది. అదే సమయంలో తెదేపా సీనియర్ నేత ఒకరు బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వైకాపాతో ఉన్న అనుబంధం వల్లనే తెదేపాతో పొత్తులను కుదరనీయకుండా అడ్డుపడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేయడం, అందుకు ఆయన కూడా అంతే ధీటుగా జవాబీయడం జరిగింది. అయితే తెదేపా-బీజేపీ అధిష్టానాలు పొత్తులకు సానుకూలంగా ఉన్నపటికీ, కేవలం కిషన్ రెడ్డి మరి కొందరు నేతల అభ్యంతరాల కారణంగానే ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరడం లేదనే సంగతి సుస్పష్టం. అందువల్ల వారిమధ్య సీట్ల సర్దుబాటు అనేది కేవలం రెండో అంశమేనని చెప్పవచ్చును.
ఇక, బీజేపీ సీమాంద్రాలో చాలా బలహీనంగా ఉంది గనుకనే అక్కడ బలంగా ఉన్న తెదేపాతో పొత్తుల కోసం ఇంకా ఆలోచిస్తోంది. లేకుంటే దానితో ఎప్పుడో తెగతెంపులు చేసుకొని తెలంగాణాలో తెరాసతో, సీమాంద్రాలో వైకాపాతో జత కట్టేది. కానీ మాట నిలకడలేని కేసీఆర్ వంటి వ్యక్తిని, కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే బీజేపీకే నష్టం. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి, దళితులకీ హ్యాండిచ్చిన్నట్లే, రేపు ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంటే బీజేపీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ తో చేతులు కలపవచ్చును. అదేవిధంగా ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీవైపే మ్రొగ్గు చూపవచ్చును. కనుక అటువంటివారిని నమ్ముకోవడం కంటే ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలవని తెదేపాతో జత కట్టడమే శ్రేయస్కరమని బీజేపీ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. కానీ కిషన్ రెడ్డి వంటి వారి భరోసాతో వాపును చూసి బలుపు అనుకొని, తెదేపాను కాదని తెరాస, వైకాపాలో పొత్తులు పెట్టుకొన్నా, అసలు ఎవరితోను పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికల బరిలోకి దిగినా బీజేపీయే ఎక్కువ నష్టపోవచ్చును.
తమతో చాలా సానుకూలంగా ఉన్న తెదేపాతోనే సీట్ల సర్దుబాటు చేసుకోలేనప్పుడు, ఎలాగయినా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడిపోతూ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చిన కేసీఆర్ తో పొత్తులు కుదుర్చుకోవడం అంత సులువేమీ కాదు. కానీ వైకాపాకు తెలంగాణపై పెద్దగా ఆసక్తి లేదు గనుక ఆ పార్టీతో పొత్తులు సాధ్యపడొచ్చేమో గానీ, తెలంగాణాను తీవ్రంగా వ్యతిరేకించిన ఆపార్టీతో కేవలం సీమాంధ్రలోనే పొత్తులు పెట్టుకొన్నప్పటికీ, ఆ ప్రభావం తెలంగాణలో బీజేపీపై తప్పకుండా చూపినట్లయితే అప్పుడు బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలాగే రెంటికీ చెడిన రేవడిలా తయారవుతుంది.
ఇక తెదేపా వైపు నుండి చూసినట్లయితే, బీజేపీతో పొత్తుల వలన ఆపార్టీకి ప్రస్తుతం పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా, కాంగ్రెస్, తెరాస, వైకాపాలను మరింత సమర్ధంగా ఎదుర్కొనేందుకే బీజేపీతో పొత్తుల కోసం ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరక పోయినట్లయితే రెండు ప్రాంతాలలో బహుముఖపోటీలు జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా ఎంతో కొంతమేర నష్టపోవడం తధ్యం. (తెలంగాణాలో) ఎన్నికలకి ఇంకా కేవలం 29రోజులు మాత్రమే మిగిలాయి. అయినా నేటికీ ఇంకా పొత్తులు ఖరారు చేసుకోలేకపోతే వాటికే నష్టం. బహుశః ఈరోజు సాయంత్రంలోగా వారి పొత్తుల కధ ఒక కొలిక్కివస్తుందేమో. రాకుంటే ఇక ఆ సంగతి ఆలోచించడానికి కూడా సమయం సరిపోదు.