దేశం కోసం, పార్టీ కోసం త్యాగం చేసే నేతలు కావలెను
posted on Apr 7, 2014 @ 9:33AM
తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటున్నట్లు ప్రకటించినప్పటికీ, ఏ ఏ స్థానాలు ఏ పార్టీ తీసుకోబోతోందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఒకటి రెండు రోజుల్లో నియోజకవర్గాలను ప్రకటిస్తామని మాత్రమే చంద్రబాబు చెప్పారు.
పొత్తుల కారణంగా పార్టీలో టికెట్స్ ఆశిస్తున్న అభ్యర్ధులకు టికెట్స్ దక్కపోతే వారు తీవ్ర నిరాశ చెందడం సహజమేనని, అటువంటి వారిని తాను అనునయించి మళ్ళీ ఉభయ పార్టీల తరపున నిలబడుతున్న అభ్యర్ధులకు మద్దతు, సహకారం అందించేలా చూస్తానని బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా బీజేపీ-ఆంధ్ర రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు కూడా పొత్తుల విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని,పార్టీలో మిగిలినవారు కూడా కట్టుబడి ఉండాలని అన్నారు.
తెదేపాకు కూడా ఇదే సమస్య ఉంది. దానికీ అక్షరాల ఇదే పరిష్కారం వర్తిస్తుంది. అయితే ఇంతవరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తప్ప మరే ఇతర నాయకుడు ఈవిధమయిన భరోసా ఇవ్వకపోవడం గమనిస్తే, ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుకొంటున్నాయని అర్ధమవుతోంది.
ఒకవేళ రెండు పార్టీలు పొత్తుల ప్రకటనతో బాటు వారికి దక్కిన నియోజక వర్గాలను కూడా ప్రకటించేసి ఉంటే ఈ పాటికి ఆయా నియోజక వర్గాలలో (మిత్రపక్షం కోసం) టికెట్స్ పోగొట్టుకొంటున్న అభ్యర్ధులందరూ తమ పార్టీలపై తిరుగుబాటు జెండాలు ఎగురవేసి, వెంటనే వేరే పార్టీలలోకి మారిపోవడమో లేకపోతే స్వతంత్ర (తిరుగుబాటు) అభ్యర్ధులుగా నామినేషన్లు వేయడమో చేసేవారు. అయితే, నియోజక వర్గాలను ప్రకటించనంత మాత్రాన్న అభ్యర్ధులకు ఆ సంగతి తెలియదనుకోలేము. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్ల బేరసారాలు జరుగుతున్న దశలోనే ఏ పార్టీలో ఎవరి టికెట్స్ కి ఎసరు రాబోతోందో దాదాపు స్పష్టమయిపోయింది. అందుకే కోడెల శివప్రసాద రావు, వంటివారు ఆవేదన వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు కూడా వెనుకాడబోమని ప్రకటించేశారు. నాలుగేళ్ల క్రితమే మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు టికెట్ కు హామీ పొందిన మెదక్ యం.యల్యే. మైనంపల్లి హన్మంత రావు, ఇప్పుడు తన స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో తీవ్ర ఆగ్రహం చెంది, తేదేపాకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇటువంటి సమస్యలు రెండు పార్టీలకు చాలా తీవ్రంగా ఉన్నందునే వ్యూహాత్మకంగా నియోజకవర్గాలను ప్రకటించకుండా కేవలం పొత్తులు కుదుర్చుకొన్నట్లు మాత్రమే ప్రకటించాయి. నామినేషన్లు వేసే ఆఖరి రోజు (ఏప్రిల్ 9) వరకు కూడా తాత్సారం చేస్తూ, ఆఖరి నిమిషంలో ప్రకటించడం ద్వారా తిరుగుబాటు అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా నివారించాలనే ఆలోచన కూడా ఉంది. ఈలోగా ‘బుజ్జగింపుల ప్రక్రియ’ పూర్తి చేసి అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
అటువంటి వారికి కనీసం వేరే ఏదో నియోజక వర్గం నుండి టికెట్స్ కేటాయించి నచ్చజెప్పుకోగలిగితే పరువలేదు. కానీ, దేశం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం త్యాగాలు చేయమని కోరితే అందుకు ఎవరూ అంగీకరించబోరు. ఇప్పుడు ఈ అవకాశం వదులుకొంటే మళ్ళీ మరో ఐదేళ్ళ తరువాత కానీ ఇటువంటి అవకాశం రాదు. పదవులు, అధికారం లేనిదే క్షణం కూడా బ్రతకలేని నేతలను దేశం కోసం, పార్టీ కోసం త్యాగం చేయమంటే, వారు పార్టీలనే త్యాగం చేస్తారు తప్ప తమ టికెట్స్ ని కాదని హన్మంత రావు అప్పుడే నిరూపించారు. ఇక ఆ రెండు పార్టీలు ఈ సమస్య నుండి ఎలా బయటపడతాయో, ఆ పార్టీలలో నుండి ఎంతమంది బయటపడటారో మరొక రెండు రోజుల్లోనే తేలిపోనుంది.