అందరివాడు ఆ మన్మోహనుడు
posted on Apr 15, 2014 @ 12:11PM
రోజుకో సర్వే చొప్పున వెలువడుతున్న నివేదికలన్నీ కూడా కాస్త అటూ ఇటుగా ‘కాంగ్రెస్ ఓటమి, బీజేపీ గెలుపు తధ్యం’ అని ఘోషిస్తుంటే కాంగ్రెస్ అధిష్టాన దేవతల సున్నితమయిన మనసులు ఎంతగా నొచ్చుకొంటాయో ఎవరికీ పట్టదు. వాటినయితే బోగస్ నివేదికలని ఎలాగో కొట్టిపారేయోచ్చును, కానీ కాంగ్రెస్ ఉప్పు తిని బ్రతికిన సంజయ్ బారు లాంటి వాళ్ళు కూడా “మా మన్మోహన్ ఒట్టి డమ్మీ క్యాండిడేట్..అంతా అమ్మగారి పెత్తనమే” అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాన్ని సమయం కాని ఇటువంటి సమయంలో బహిరంగంగా ప్రకటిస్తే అధిష్టాన దేవతలు ఇంకెవరికి మోర పెట్టుకోవాలి?
పోనీ సంజయ్ బారు ఏదో పొరపాటున నోరుజారాడని సర్ది చెప్పుకొన్నా, ఆ వెనకనే కాంగ్రెస్ మీద పగబట్టినట్లు మాజీ బొగ్గుల శాఖ కార్యదర్శి పీసీ ఫారెక్, రిటైర్ అయ్యాక మరేమీ ఊసుపోక మసిపట్టిన బొగ్గు ఫైల్స్ అన్నీ దులిపి అందులో దాగి ఉన్నకుంభకోణాల కధలన్నిటినీ ముచ్చటగా ఒక పుస్తకం రూపంలో అచ్చేసి, దానికి ‘కృసేడర్ ఆర్ కాన్స్పిరిటర్’ అనే ఆసక్తికరమయిన పేరు కూడా తగిలించేసి, సరిగ్గా ఎన్నికల సమయంలో బజారులోకి వదిలేరు.
కాంగ్రెస్ తో తిరిగితే మసిపూసుకొన్నా నాలుగు రాళ్లో, బొగ్గులో ఎలా వెనకేసుకోవాలో తెలుసుకోవాలి. అంతే కానీ ఇలా “అసలు ప్రధానికి వెన్నెముక లేదు, నోట్లో నాలుక లేదు, చేతిలో బలం లేదు” అంటూ ఏవేవో అవాకులు చవాకులు పుస్తకం నిండా వ్రాసి పడేయడం బ్రతక నేర్చినవాడి లక్షణం కాదని ప్రజలే అనేస్తున్నారు. అంతకంటే ఆయన సీమంద్రాలో కాంగ్రెస్ టికెట్ ఇమ్మని అడిగినా బాగుండేది లేకుంటే తనకీ ఓ రెండు బొగ్గు గనులు వ్రాసిమ్మని అడిగినా బాగుండేది,” అని ఉచిత అభిప్రాయాలు వ్యక్తం చేసారు.
కానీ, ఫారెక్ సాబ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా “అసలు ఆయన (మన్మోహనుల వారు) చెప్పిన మాటని కాంగ్రెస్ పార్టీలో కానీ, ఆయన మంత్రి వర్గంలో మంత్రులు గానీ, అధికారులు గానీ విననే వినరు. అంతా యంపీలది, దాసరి నారాయణ రావు వంటి బొగ్గు మంత్రులదే బొగ్గు పెత్తనమంతా...అటువంటి వారందరూ కలిసి నాబోటి నిజాయితీ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నా ఆ మన్మోహనుడు మాత్రం మా మొర వినిపించుకోకపోగా “వాసుదేవుడంతటి వాడిని నాకే తప్పలేదు ఇక మీరేపాటి?” అని నిట్టూర్పులు విడిచేవారు.
ఇక చేసేదేమీ లేక మేమూ చేతులు కట్టుకొని తరలిపోతున్న బొగ్గు లారీలను, వేగన్లను లెక్కపెట్టుకొంటూ కాలక్షేపం చేస్తూ రిటైర్ అయిపోయాము,” అని మీడియా ముందుకు వచ్చి లబలబలాడుతుంటే, ఆయననే ఓదార్చాలో, లేక కాంగ్రెస్ పార్టీనే ఓదార్చాలో లేకపోతే ఈ హాలహలం అంతా మింగి కూడా ఇంకా చిర్నవ్వులు చిందిస్తున్న ఆ మన్మోహనులవారినే ఓదార్చాలో ప్రజలు కూడా తెలియడం లేదు. మోడీ మాత్రం ‘మీరు నాకే ఓటేసి గెలిపిస్తే ఈ కాంగ్రెస్ జనాలందరినీ ఓదార్చే భాద్యత నాదే’నని హామీ ఇస్తున్నారు. ఇక ప్రజలే దేనికోడానికి డిసైడ్ అయిపోవాలి మరి.