చిరంజీవి శల్యసారధ్యంలో యుద్దానికి బయలుదేరిన రఘువీరుడు
posted on Apr 9, 2014 8:22AM
సీమాంధ్రలో నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం 4రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రజలు గుర్తుపట్టగల మొహాలు పార్టీలో ఒక్కటీ కనబడకపోవడంతో కాంగ్రెస్ చాలా ఆందోళనగా ఉంది. అందుకే ఇంతవరకు పార్టీ తరపున పోటీ చేయబోతున్నఅభ్యర్ధుల పేర్లను చూచాయగా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పరువు పూర్తిగా గోదాట్లో కలిసిపోక ముందే ఏదో ఒకటి చేయాలని గ్రహించిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తమ పార్టీలో ప్రజలందరూ ఖచ్చితంగా గుర్తుపట్టగల చిరంజీవినే మళ్ళీ ముందుంచుకొని ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్దపడ్డారు.
అభ్యర్ధుల టికెట్స్ ఖరారు చేసి బీ-ఫార్మ్స్ పంచవలసిన ఈ దశలో చిరంజీవి అభిమానులందరినీ కూడగట్టి వారికి పార్టీ కండువాలు కప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమం చెప్పట్టడం చూస్తే ప్రజలు కూడా ‘పాపం కాంగ్రెస్!’ అని దాని పరిస్థితికి జాలిపడుతున్నారు. అభిమానులకు పార్టీ కండువాలు కప్పే ఈ కార్యక్రమంలో మోడీ గురించి మాట్లాడవలసిన నాలుగు ముక్కలను రఘువీరారెడ్డి తన చెవిలో చెప్పినప్పటికీ, చిరంజీవి వాటిని సరిగ్గా వల్లె వేయలేక తడబడటం చూస్తే ఇంకా జాలి కలుగుతుంది. మోడీ ‘లేనిది ఉన్నట్లుగా’ సోషల్ నెట్ వర్క్, మీడియాలో ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొంటున్నారని చిరంజీవి స్పష్టం చేసారు. సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజానికెత్తుకొన్న ఆయన తన పార్టీ గురించి అభిమానులకు గట్టిగా చెప్పుకోకుండా మోడీ గురించి చెప్పడం విశేషమే. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి మొదలు సోనియా, రాహుల్ వరకు అందరికీ కూడా నరేంద్ర మోడీ సింహసప్నంలా తయ్యరయ్యారని చిరంజీవి ఆయన ప్రస్తావన తెచ్చి మరో మారు స్పష్టం చేసారు.
ఇక ఇటువంటి దైన్యస్థితిలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టవలసి వచ్చిన రఘువీరారెడ్డి బాధ పైకి చెప్పుకోలేనిది. తనకు ఇటువంటి దుస్థితిలో ఇటువంటి కీలక బాధ్యత కట్టబెట్టి, అగ్నిపరీక్ష పెడుతున్న అధిష్టానాన్ని ఏమీ అనలేక ఆ అక్కసు ప్రత్యర్ధులైన తెదేపా, వైకాపాల మీద వెళ్ళగక్కారు. గత 60 సం.లుగా తమ కాంగ్రెస్ పార్టీ నెహ్రు కుటుంబ సభ్యుల మోచేతి నీళ్ళే తాగుతోందన్న సంగతి మరిచిపోయిన ఆయన తెదేపా, వైకాపాలు రెండూ కుటుంబ పార్టీలని ఎద్దేవా చేసారు. “వైకాపా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి, తెదేపా వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రులు అవుతారు తప్ప వేరెవరో కాలేరు కదా!” అని అయన ఎద్దేవా చేసారు.
తెలంగాణాలో దళితులని, బీసీలను ముఖ్యమంత్రి చేయమని కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్న ఆ రెండు పార్టీలు దమ్ముంటే సీమాంధ్రలో ఆపని చేసి చూపించాలని ఆయన సవాలు విసిరారు. ఆయన సవాలు బాగానే ఉంది. కానీ, అదే సలహా (సవాలు) ఆయన తన అధిష్టానానికి కూడా చేసి ఉండి ఉంటే బాగుండేది. ఈ ఎన్నికలలో గెలిస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సోనియాగాంధీ ఎంత తహతహలాడిపోతున్నారో అందరికీ తెలుసు. కేవలం రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్ర విభజన చేసి తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలని చూసి కాంగ్రెస్ భంగపడి, ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధుల కూడా లేని దుస్థితిని ఎదుర్కొంటోంది. నెహ్రూ నుండి రాహుల్ వరకు సాగుతున్న కుటుంబ పాలనను, రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కూడా మరిచిపోయిన రఘువీరుడు ప్రత్యర్ధ పార్టీలకు ఇటువంటి సవాళ్ళు విసిరి తమ పార్టీని ఎందుకు మరింత నవ్వులు పాలుజేసుకొంటున్నారో ఆయనకే తెలియాలి.
ఈ మిగిలిన నాలుగు వారాల పుణ్యకాలం ముగిసిపోక ముందే కాంగ్రెస్ రధాన్ని శల్యసారధ్యం చేస్తున్నచిరంజీవి, ఆయనను ముందుంచుకొని ఎన్నికల యుద్ధంలో దిగే దుస్సాహసం చేస్తున్న రఘువీరుడు ఇద్దరూ కూడా శత్రుసేనల బలహీనతల గురించి మాట్లాడేముందు, ఈ యుద్దంలో పాల్గొనేందుకు అసలు తమ వెనుక ఎవరయినా వస్తున్నారో లేదో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, లేకుంటే ఎవరినయినా ఏర్పాటు చేసుకోవడం మేలేమో ఆలోచించాలి.