తెదేపా-బీజేపీ పొత్తులు పెటాకులు కానున్నాయా?
posted on Apr 17, 2014 @ 9:41AM
తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులయితే పెట్టుకొన్నాయి గానీ, అవి బలవంతపు కాపురం చేస్తున్నాయి. నేటికీ వాటి నేతల మధ్య అవసరమయిన సఖ్యత ఏర్పడలేదు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు బీజేపీ పంతం పట్టి అనేక కీలకమయిన సీట్లు దక్కించుకొంది, కానీ చాలా చోట్ల పార్టీ తరపున పోటీలో నిలబెట్టేందుకు దానికి బలమయిన, ప్రజలకు సుపరిచితులయిన అభ్యర్ధులు కూడా లేరు. అదే సమయంలో తెదేపాలో టికెట్స్ కోసం సీమాంధ్రలో నేటికీ పెద్ద యుద్దమే జరుగుతోంది.
ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొన్న తమను కాదని బీజేపీకి, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నేతలకీ టికెట్స్ కేటాయించడంపై తెలుగు తమ్ముళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో గెలుపు గుర్రాలను పక్కనబెట్టి బీజేపీకి సీట్లు కేటాయిస్తే అది అనామకులయిన అభ్యర్దులను పోటీలో దింపడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము గెలవగలమనుకొంటున్న సీట్లను త్యాగం చేసి బీజేపీకి ఇస్తే అది వృధా అవుతోందని తెలుగు తమ్ముళ్ళ ఆక్రోశిస్తున్నారు. అందువల్ల బీజేపీతో పొత్తుల విషయం పునరాలోచించుకొని, మళ్ళీ తమకే ఆస్థానాలలో టికెట్స్ కేటాయించాలని వారు ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ ఆయన అందుకు అంగీకరించకకపోతే, స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేయడానికి కూడా వెనుకాడబోమని చెపుతున్నారు.
బీజేపీ నిలబెడుతున్న బలహీనమయిన అభ్యర్ధుల వలన బీజేపీకే కాక తేదేపాకు తీవ్ర నష్టం కలగవచ్చునని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అయితే ఇటువంటి కీలక సమయంలో బీజేపీతో పొత్తులు తెగతెంపులు చేసుకొంటే అది పార్టీపై తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన వెనుకంజ వేస్తున్నారు. కానీ ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది.
ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయబోదని, తెదేపా, బీజేపీలకు మద్దతు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు విజయవాడతో సహా మరో ఆరు స్థానాలలో తమ పార్టీ తరపున అభ్యర్ధులను నిలబెట్టేందుకు, కీలకమయిన మల్కాజ్ గిరి స్థానం నుండి తెదేపా అభ్యర్ధి మల్లారెడ్డితో పోటీ చేస్తున్నలోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. అందువల్ల చంద్రబాబు కూడా తన ఎన్నికల వ్యూహాన్ని మార్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
అందువలన చంద్రబాబు కూడా ఇప్పుడు బీజేపీతో పొత్తులపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు తన పార్టీ ముఖ్య నేతలందరితో మాట్లాడిన తరువాత ఈవిషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ వారందరూ కూడా ఒంటరిపోరుకే మొగ్గు చూపినట్లయితే, ఈరోజు రాత్రిలోగా సీమాంధ్రలో బీజేపీకి కేటాయించిన అన్ని స్థానాలలో తమ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.
అదే జరిగితే, మొదటి నుండి తెదేపాతో పొత్తులు వ్యతిరేఖిస్తున్న తెలంగాణా బీజేపీ నేతలు కూడా వెంటనే తెదేపాతో పొత్తులు తెంచుకోమని తమ అధిష్టానంపై ఒత్తిడి తేవడం తధ్యం. కానీ అక్కడ నామినేషన్లు దాఖలు చేయడానికి ఇప్పటికే గడువు ముగిసినందున, బీజేపీ తన అభ్యర్ధులను నిలబెట్టలేదు. కనుక అందుకు అంగీకరించక పోవచ్చును. అయితే సీమాంధ్రలో మాత్రం నామినేషన్లు వేయడానికి ఇంకా రేపు మధ్యాహ్నం వరకు గడువు మిగిలి ఉన్నందున, ఒకవేళ తెదేపా తమతో పొత్తులకు రామ్ రామ్ చెప్పేసినట్లయితే, బీజేపీ కూడా మిగిలిన స్థానాలలో తన అభ్యర్ధులను పోటీలో దింపినా ఆశ్చర్యం లేదు.
అయితే ఇరుపార్టీల అధిష్టానాలు పరిస్థితిని ఇంతవరకు రానిస్తారా లేక షరా మామూలుగానే ఇదంతా మీడియా ఊహాగానమేనని కొట్టి పారేస్తారా? అనే సంగతి ఈరోజు రాత్రిలోగానే ఖచ్చితంగా తేలిపోతుంది. ఎందుకంటే నామినేషన్లు వేయడానికి రేపే ఆఖరి రోజు గనుక. ఏమయినప్పటికీ తెదేపా-బీజేపీల పొత్తులు పెటాకులయితే మళ్ళీ రెండు ప్రాంతాలలో అన్ని పార్టీల బలబలాలు కూడా మారవచ్చును.