అందుకే కిరణ్ విభజనను వ్యతిరేఖించారా?
posted on Mar 29, 2014 @ 6:02PM
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీలో ఉన్న తన ప్రత్యర్ధులను బలంగా అణచివేశారు. అంతేగాక చాలా నిరంకుశ పోకడలు ప్రదర్శిస్తూ తన క్యాబినెట్ సహచరులతో కూడా సంప్రదించకుండా అనేక కీలక నిర్ణయాలు తీసుకొనేవారు. తన నిర్ణయాలను ప్రశ్నించిన శంకర్ రావు, డా.డీయల్.రవీంద్ర రెడ్డి వంటి వారిని నిర్దాక్షిణ్యంగా పదవుల నుండి తప్పించి వారిని పార్టీలో ఏకాకులుగా చేసి పగ తీర్చుకొన్నారు. ఆయన అధికారంలో ఉన్నంత వరకు పార్టీలో ఆయన ప్రత్యర్దులెవరూ ఆయనకు వ్యతిరేఖంగా మాట్లాడే సాహసించలేకపోయారు. బహుశః అందువల్లే ఆయన పార్టీ వీడే సమయానికి ఆయన వెనుక పదిమంది కాంగ్రెస్ నేతలు కూడా కనబడలేదు. ఆయన పార్టీ నుండి బయటపడి స్వంత కుంపటి పెట్టుకొన్న తరువాత, అంతవరకు ఆయనపై రగిలిపోతున్న కాంగ్రెస్ లో మిగిలిన నేతలందరూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించే మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే మరొక అడుగు ముందుకు వేసి, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ప్రజల కోసం కాక పార్టీలో తమవంటి బీసీ వ్యక్తులు ఉన్నత పదవులు పొందకుండా ఉండేందుకే ఆయన విభజనను వ్యతిరేఖించారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులవంటి కీలక పదవులను ఆశిస్తున్న బీసీ నేతలు రఘువీర, బొత్స తదితరులకు దక్కే అవకాశం ఉంది గనుకనే ఆయన విభజనను అంత తీవ్రంగా వ్యతిరేఖించారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై కోపంతో రగిలిపోతున్న డొక్కా ఇటువంటి ఆరోపణలు చేయడం పెద్ద విచిత్రం కాకపోయినా, ఆయన చేసిన ఆరోపణలతో కిరణ్ పోరాటంలో మరో కొత్త కోణాన్ని బయటపెట్టారు.
ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో అధికారమంతా రెడ్డి కులస్థుల చేతిలోనే ఎక్కువగా ఉంది. కనుక అదే కులానికి చెందిన కిరణ్ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు అయిష్థత చూపడం అసహజమేమీ కాదు. కానీ అది కూడా ఒక కారణమయితే కావచ్చునేమో కానీ అందుకోసమే ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖించారనే డొక్కా వాదనలలో పసలేదు. ఒకవేళ ఆయన ఎవరికయినా పదవులు దక్కకుండా అడ్డుపడదలిస్తే అందుకు ఇంత పోరాటం అవసరం లేదు. నేరుగా డిల్లీ వెళ్లి అధిష్టానం దగ్గిర తనపలుకుబడిని ఉపయోగించి దామోదర రాజనరసింహకు హోంమంత్రి పదవి దక్కకుండా ఏవిధంగా అడ్డుపడ్డారో అదేవిధంగా విభజన తరువాత కూడా చేయగలిగేవారు.
కానీ, ఆయన చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలలో పనిచేస్తూ, రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తూనే, పార్టీ వ్యూహంలో భాగంగానే దానిని వ్యతిరేఖిస్తున్నట్లు నటిస్తూ పార్టీ వ్యతిరేఖ ఓట్లను కూడా కాంగ్రెస్ ఖాతాలో జామా చేసేందుకే ఆయన అధిష్టానం ఆదేశాల మేరకే పార్టీ పెట్టారు. ఆయన రాష్ట్ర విభజనలో అధిష్టానానికి పూర్తిగా సహకరించారని చిరంజీవే స్వయంగా చెపుతున్నారు. కానీ కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టడమనేది వేరే సంగతి.
అందువలన డొక్కా వంటివారు కిరణ్ గురించి నోరు జారేముందు కొంత ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన పార్టీ ఆదేశాలమేరకే వేరు కుంపటి పెట్టుకొన్నారు గనుక ఎన్నికల తరువాత మళ్ళీ దానిని కాంగ్రెస్ లో విలీనం చేసేక అధిష్టానం మళ్ళీ ఆయనకీ కీలక పదవి ఏదో కట్టబెడితే అప్పుడు ఆయన డొక్కా వంటి వారిని కూడా ఆయన శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం.