వద్దనుకొన్నవారికే ఓటేయాల్సివస్తే...
posted on Apr 11, 2014 @ 10:20PM
ఈసారి రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో అభ్యర్దులను బట్టి కాక పార్టీలు వాటి అధినేతలను చూసే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది. కొందరు బలమయిన అభ్యర్ధులకు ఈ విషయంలో మినహాయింపు ఉన్నపటికీ, అధిక శాతం ఓట్లు ఆయా పార్టీల పరంగానే పడే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్ధుల గుణగణాలు తదితర అంశాలు మరుగునపడి, పార్టీ పరంగా మాత్రమే చూడబడవచ్చును. ఈ కారణంగా అన్ని పార్టీలలోకి అవినీతిపరులు, అవకాశవాదులు, కేవలం ధనార్జన కోసమే రాజకీయాలలోకి వచ్చే వ్యాపారులు చొరబడే అవకాశం ఏర్పడుతుంది. అస్తవ్యస్తమయి అదుపు తప్పుతున్న రాష్ట్ర పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్న ప్రజలు, కనీసం ఈసారయినా ఒక సుస్థిరమయిన ప్రభుత్వాన్ని అందించగల పార్టీకే పట్టం కట్టడం మేలని భావిస్తున్న కారణంగానే ఇటువంటి ఆవాంచనీయమయిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అలా కాదని ప్రజలు అభ్యర్ధులను చూసి ఓట్లు వేసినట్లయితే, ఏ పార్టీకి మెజార్టీ రాక రాష్ట్రంలో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి రాజకీయాలు మరింత భ్రష్టు పట్టే అవకాశం ఉంది.
అయితే పార్టీలను, అధినేతలను చూసి ఓటేయాలని ప్రజలు గనుక భావిస్తే, అందరి కంటే ఎక్కువగా లాభపడేది వేర్వేరు పార్టీలలో చేరిపోయి మారు వేషాలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలేనని చెప్పక తప్పదు. ఈ ఎన్నికలలో సీమాంధ్ర ప్రజలు ఎవరికయితే గట్టిగా గుణపాటం చెప్పాలనుకొన్నారో వారికే ఓట్లు వేయవలసి రావడం నిజంగా దురదృష్టకరమే. అయితే ఇది అనివార్యమని ఇప్పటికే స్పష్టమయింది. వారిలో కొంతమంది తెదేపాలో, మరికొంతమంది వైకాపాలో ఇంకొంతమంది తెరాస పంచన చేరిపోవడంతో, ఆయా పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకొనే ప్రజలు, అయిష్టంగానయినా ఆ పార్టీలలో చేరిన కాంగ్రెస్ నేతలకే ఓట్లు వేయవలసి వస్తుంది.
కానీ వారందరూ ఎన్నికల తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకోదలిస్తే సదరు పార్టీల అధినేతలు వారిని ఆపగలరా? ఆపలేన్నపుడు అటువంటి వారిని తెచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దడం ఎందుకు? అనే ప్రశ్నకు జవాబు ఆశించడం అత్యాసే అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు గనుక, ప్రస్తుతం అటువంటి ప్రమాదం ఉండదని ఆశించవచ్చును.
రెండు మూడు నెలల క్రితం కాంగ్రెస్ నుండి బహిష్కరింపబడిన రాజంపేట యంపీ సాయి ప్రతాప్, వేరే పార్టీ ద్వారా తన నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు టికెట్ దొరకకపోవడంతో, దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయగానే మళ్ళీ పరుగున కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతే గాక కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వెనక్కి వచ్చేయమని కోరారు. ఒకవేళ ఈ కాంగ్రెస్ నేతలు చేరిన పార్టీ ఎన్నికలలో ఓడిపోయి రాష్ట్రంలో అధికారం చెప్పట్టలేక చతికిలబడినట్లయితే, అదే సమయంలో కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే, సదరు నేతలుందరూ ఒకరొకరుగా (అధికారాన్ని వెతుకొంటూ) మళ్ళీ కాంగ్రెస్ గూటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. అప్పుడు వారికి ఓటేసిన ప్రజలు ఎలాగు పశ్చాత్తాప పడకతప్పదు. అదేవిధంగా పార్టీ జెండాలు మోసిన స్వంత పార్టీ వారిని కాదని అటువంటి అవకాశవాదులకు టికెట్స్ ఇచ్చి మోసపోయినందుకు ఆయా పార్టీల అధినేతలు కూడా అక్రోశించకమానరు.
ఈ దుస్థితిని నివారించాలంటే అన్ని రాజకీయ పార్టీలు తమ స్వంత పార్టీ నేతలకే టికెట్స్ కేటాయించవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు గనుక, చివరికి ఈ దుస్థితి కూడా అనివార్యం కావచ్చును.