తెదేపా-బీజేపీ పొత్తులపై తెరాస ఆక్రోశం ఎందుకు
posted on Apr 8, 2014 @ 10:19AM
తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటే ఏదో ఘోర అనర్ధం జరిగిపోయినట్లు, ఏదో ప్రళయం రాబోతున్నట్లు అన్ని పార్టీలు వాటిపై తీవ్రంగా విరుచుకుపడటం చూస్తే, అవి వాటి పొత్తులను చూసి ఎంతగా భయపడుతున్నాయో అర్ధమవుతోంది. వాటి పొత్తుల వలన రాష్ట్రంలో పార్టీల బలాబలాలు మారడం తధ్యం. అది ఎన్నికల ఫలితాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపడం కూడా అంతే ఖాయం గనుకనే అన్ని పార్టీలు వాటి పొత్తులు చూసి గగ్గోలు పెడుతున్నాయి.
ఇంతవరకు తెలంగాణాలో తనకు ఎదురేలేదని భావిస్తున్న కేసీఆర్ ఆ ధీమాతోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కాలదన్నుకొన్నారు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్, తెరాసలు ఒకదానితో మరొకటి పోటీ పడవలసి రావడమే కాకుండా మిగిలిన ఇతర పార్టీలతో, తెదేపా-బీజేపీ కూటమితో కూడా యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా రాష్ట్రం సాధించామనే కారణంగా కాంగ్రెస్, తెరాసలు తామే అధికారంలోకి రావడం ఖాయమని ఇంతవరకు గట్టి నమ్మకంతో ఉన్నాయి. కానీ ఇప్పుడు తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొని మరింత బలపడటంతో, ఈ బహుముఖ పోటీలో ఓట్లు చీలితే కాంగ్రెస్, తెరాసలు చెప్పుకొంటున్నట్లు మెజార్టీ సాధించి అధికారం చెప్పటడం సంగతి దేవుడెరుగు, కనీసం గౌరవప్రదమయిన ఓట్ల శాతం దక్కించుకొంటే చాలనుకొనే పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ నేతలందరూ ఎప్పుడో ఒకప్పుడు పదవులు, అధికారం అనుభవించినవారే. అదేవిధంగా చాలా ఎన్నికలలో జయాపజయాలు చవిచూసినవారే. అందువల్ల వారిపై ఈ ఎన్నికలు, దాని ఫలితాలు పెద్దగా ప్రభావం చూపబోవనే చెప్పవచ్చును. అలాగని హేమాహేమీలయిన కాంగ్రెస్ నేతలందరూ ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డి పోరాడకమానరు. అయినప్పటికీ ఒకవేళ ఓడిపోయినా వారు ఓటమిని చాలా తేలికగానే జీర్ణించుకోగలరు.
కానీ మొట్టమొదటిసారిగా అధికారం చెప్పట్టాలని తహతహలాడిపోతున్న తెరాస నేతలు మాత్రం ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమవుతుంది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకొని రంగంలోకి దిగడంతో వారి కలలు పగటి కలలుగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే అందరి కంటే తెరాస నేతలు తెదేపా-బీజేపీల పొత్తులపై కోపంతో చిందులు వేస్తున్నారు. కానీ, కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అవ్వాలనే అధికార కాంక్షతో, తమ కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే దురాశతో, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే అధికారంలో వాటా పంచి ఈయవలసి వస్తుందనే భయంతో ఆపార్టీతో పొత్తులు పెట్టుకోకుండా పెద్ద పొరపాటు చేసారు.
ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ పొత్తులు పెట్టుకోవచ్చని కేసీఆర్ కి తెలియకపోదు. అవి పొత్తులు పెట్టుకొంటే బలపడతాయని కూడా ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన అధికార దాహంతో ఒంటరిపోరుకే సిద్దమయ్యారు. నిజానికి తమకంటే ఎన్నోరెట్లు బలమయిన కాంగ్రెస్ పార్టీతో ఆయన పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమయినా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమయిన క్యాడర్, బలమయిన నాయకులు, వారి ఆర్ధిక, అంగ బలం, తెరాసకున్న ఉద్యమ కీర్తి, ప్రజాధారణ అన్ని కలిస్తే కాంగ్రెస్-తెరాస కూటమి తెలంగాణాలో ఒక తిరుగులేని శక్తిగా అవతరించి ఉండేది. కానీ, కేసీఆర్ దురాశకు పోయి, బలమయిన కాంగ్రెస్ పార్టీని కాలదన్నుకొని చేజేతులా ఈ పరిస్థితి కల్పించుకొన్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస ఓడిపోయినట్లయితే అందుకు ఆయనే పూర్తి బాద్యత వహించాల్సి ఉంటుంది. ఆయన తన శక్తిని, పరపతిని చాలా అతిగా ఊహించుకొంటున్నందున ఆయనలో ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారి చివరికి పార్టీకి కూడా చేటు తెచ్చే పరిస్థితి కల్పిస్తోంది. కనుక తెరాస తను చేసిన పొరపాటుకి చింతించడం మాని తెదేపా-బీజేపీ పొత్తులని చూసి అక్రోశించడం అవివేకం, హాస్యాస్పదం.